ఆయా కాఫీ తెచ్చిస్తే తాగేసి పేపరు చూస్తూ వుండిపోయాడు రవి. నిమిషాలు గడిచి పోతున్నాయి.
పదినిమిషాలు గడిచేసరికి స్వప్న మేడమేట్లు దిగి వచ్చింది.
స్వప్న ని చూసిన రవి చప్పున కళ్ళు తిప్పుకోలేకపోయాడు. అయస్కాంతానికి అతుక్కుపోయిన యినుము లాగా ఆమెకి అతుక్కుపోయాయి రవి కళ్ళు.
చిలాకాకు పచ్చ కంచి పట్టుచీర కట్టుకుని, దానికి తగ్గట్టు అదే రంగు పట్టు రవిక తొడుక్కుని అమనిలా వచ్చింది స్వప్న.
స్వప్న నిజంగా సహజంగా చాలా అందమైంది.
చక్కని ముక్కూ, విశాలమైన కళ్ళు, చదునైన నుదురు, గులాబీ రంగు చెక్కిళ్ళు, మొనదేలిన గడ్డం, చిన్న పెదాలు , ఆ పెదాలు , విప్పితే పగడాల వెనుక దాగిన రత్నాలలాంటి పలువరుస,కురుచైన కంఠం -----నీళ్ళు తాగుతున్నా స్పష్టంగా కన్పించేట్టున్న పలుచని కంఠం. కళ్ళు తిప్పలేని సౌందర్యం అమెది.
మెడలో ఒంటిపోర తాళి బొట్టు గొలుసుతో, ఓ చేతికి గడియారం, మరో చేతికి బంగారు గాజులు - చాలా సింపుల్ గా వుంది ఆమె. ఆమె అలంకరించుకోవాలంటే అమ్మమ్మగారి ఏడు వారాల నగలున్నాయి. కానీ వాటినేన్నడూ ధరించదు స్వప్న.
"ఏమిటా చూస్తున్నారు!"
"ఆహా ఏం లేదు! ఏం లేదు!" తడబడ్డాడు రవి. లేచి నుంచుంటూ "వెళదామా?" అని అడిగేడు.
తలూపింది స్వప్న.
రవి కదిలాడు. అతని వెనకే నడిచింది స్వప్న.
హాలు దాటి , కారిడారు దాటి వెళ్ళి కార్లో కూచుని హారన్ మ్రోగించి ప్రంట్ డోర్ తెరిచాడు రవి. స్వప్న వచ్చి అతని పక్కనే కూర్చుంది. ఇద్దరి మధ్యా కాస్తంత ఎడం.
కారు హారన్ వింటూనే ఆయా, తోటమాలి పరుగెత్తుకుని వచ్చారు.
"మేం ఊరెళ్ళి వస్తాం. రాత్రి పదింటికయినా తిరిగొస్తాం. పదార్ధాలు వేడిగా వుంచండి. ఇల్లు జాగ్రత్త."
పై మాటలు రవి మనస్సులో మెదిలాయి. అయినా అతను నోరు విప్పకుండానే అవే మాటల్ని స్వప్న ఆజ్ఞాపించింది. తన మదిలో మెదిలిన ఊహ, ఆచరణలో పెట్టి నందుకు కృతజ్ఞతగా చూశాడు రవి.
"అలగేనమ్మా" అన్నట్టు తలూపారు ఇద్దరూ.
స్వప్న వైపు చూశాడు రవి. తర్వాత కారు కదిలింది. గేటు దాటుతూ వుండగా గూర్ఖాని పిలిచి ":జాగ్రత్త" అన్నాడు రవి.
"అచ్చా సాబ్!" అన్న మాటలు కారు హొరులో మునిగిపోయాయి. హైదరాబాద్ సిటీ వీధులన్నీ దాటు కుంటూ వేగంగా వెళుతోంది కారు. స్వప్న నిశ్శబ్దంగా కూర్చుంది.
సిటీ లిమిట్స్ దాటి ఆ వూరి రోడ్డు పట్టింది కారు. చల్లగాలి రివ్వున వీస్తోంది. ఆహ్లాదకరంగా వుంది ప్రయాణం......
38
ఊరి ముందుకి రాగానే కారుని తోటవైపు తిప్పేడు రవి. ఆ రోజు పిక్నిక్ కి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాలేదు. స్వప్న - అమ్మమ్మ మరణం , బాధ్యతలూ, పెళ్ళి గొడవలు, హనీమూన్ వీటీతో గడిచిపోయింది.
ఆ తోట వద్దకి రాగానే స్వప్న మనస్సు ఒక్కసారిగా పంజరం నుంచి బయటపడిన చిలుక రెక్కలలార్చిబట్టబయలులోకి ఎగిరి పోయినట్టుగా అయింది. ముఖం నిండా అనందం రెక్కలు విప్పింది.
కారు ఆగగానే చప్పున డోర్ తెరిచి క్రిందికి దిగింది . కారు హారన్ విని తోటమాలి వచ్చేశాడు అక్కడికి.
ఇద్దరికీ దండాలు పెట్టేశాడు.
"పని చురుగ్గా నడుస్తోందా?"
"అయ్ పోవచింది బాబూ! రేపో ఎల్లుండో మంచిరోజు చూసి కప్పు వేస్తారు."
"ఊ"
"ఆ సమాధానం విని ఆశ్చర్యపోయింది స్వప్న. ఇంత త్వరగా తయారయిపోయిందా అనుకుందామె. అభినందన పూర్వకంగా రవి వైపు చూసింది.
"థాంక్స్! ఆ చూపుల్ని చదివేసిన రవి నవ్వుతూ అన్నాడు.
స్వప్న మాట్లాడలేదు, పెదాలు బిగించింది.
ఇద్దరూ తోటలోకి నడిచారు.
రెండు గుమ్మాల నిర్మాణం అది. ఒకటి బెడ్ రూం! మరొకటి డ్రాయింగ్ రూం. బెడ్ రూంకే అటాచ్డ్ బాత్ కూడా వుంది. ఆ గదులు దాటి బయటికి రాగానే వరండా , వరండా ముందు గజం వెడల్పులో బాట! ఆ బాటకి అటూ యిటూ రకరకాల పూల మొక్కలు. గేటు చుట్టూ కాంపౌండ్. ఇంటికి అన్ని వైపులా మొక్కలూ. చెట్లు, గేటుకి బోగస్ విల్లా అల్లించారు. ఓ వైపు నైట్ క్వీన్ పెంచి అది బెడ్ రూం వైపు ప్రాకేట్టు చేశారు.
గేటు దాటి నాలుగడుగులు వేయగానే బావి! ఆ బావి చుట్టూ బయలులో కనకాంబరాలు, నేల మొగ్గ, మల్లెలు, గులాబీలు, రకరకాల, సెంట్ జాజి పెంచారు. చుట్టూ అరటి చెట్లు, ఓ వైపు బారుగా కొబ్బరి చెట్లు.
అన్నట్టు ఆ యింటికి చుట్టూ కాంపౌండ్ నానుకుని గజానికో కొబ్బరిచెట్టు. వాటి మధ్య అశోకాలు!
అతని డిజైనింగ్ ని, అతని శ్రద్దని మెచ్చుకోకుండా వుండలేకపోయింది స్వప్న "సుబర్బ్!" అంది వినిపించి వినిపించనంత మెల్లగా.
