Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 58

 

    "యముండ" అంటూ గదతో ఆ గోచి వీపు మీద ఒక్కటిచ్చాడు.


    అంతే!


    ఫ్లోర్ కప్పును, ఆపైన ఉన్న సీలింగ్ ను చేధించుకుని ఆకాశంలోకి వెళ్లి, అక్కడి నుండి నరకంలో పడ్డాడు గోచి.


    "యముండ" అంటూ మీసం మీ దర్పంగా చేయేసుకున్నాడు. డైరెక్టర్ కట్ కూడా చెప్పడం మరచి చూస్తుండిపోయాడు స్పెషల్ ఎఫెక్ట్ లేకుండానే అలా ఆకాశంలోకి గోచి వెళ్ళడం చూసి.


    డైరెక్టర్ దగ్గరికి వచ్చి "ఆ పాపికి ఆయువు మూడినది. సమయమునకు యమపాశం లేకున్నది. అందుకే ఆ గదతో అతడి ఆయుష్షుని తీసుకొంటిని. హీరోయిన్ ని ఏడిపించడం, డైరెక్టర్లను కొట్టడం లాంటి దుష్టచేష్టలు చేసిన అతడ్ని నరకములో చిత్రవిచిత్రములగు శిక్షలు విధించి బుద్ది చెప్పేద. "సుఖీభవ" అంటూ డైరెక్టర్ తల మీద చేయెసి ఆశీర్వదించి-


    "పద నారదా" అంటూ నారదుడితో సహా బయటకు నడచి అదృశ్యమయ్యాడు యముడు.


    యూనిట్ మొత్తం కళ్ళప్పగించి చూస్తుండిపోయాడు.

 


                                                             * * *


    "ఆహా! యమధర్మరాజు! స్వామికార్యం, స్వకార్యం అనిన ఇదియే. ఓ ప్రక్క స్టూడియో చూచి, మరోపక్క వాడి ప్రాణములు తిసివేచితిరి. భళా యమా! భళా......" మెచ్చుకోలుగా అన్నాడు నారదుడు.


    
    "నీ మెచ్చుకోలుకు నా వందనం నారదా! అన్నట్టు నేనా మానవుడి దగ్గరకు వెళ్ళవలె. అతడి పేరేమి.....ఆ! శ్రీచంద్ర కదూ" అన్నాడు గుర్తు చేసుకుని.


    "అవునవును. ఆ మానవుడి కధఎంతవరకు వచ్చినది?"


    "మానవుడు చచ్చుటకు అంగికరించియున్నాడు కదా! తక్షణమే నేను అన్నిటికేగవలె. సెలవు నారదా" అంటూ మాయమయ్యాడు యముడు.


    నారదుడు చిర్నవ్వు ఒలికించాడు.

 

                                                                    * * *


    యాజిటివ్ గా సాయంత్రం ఆ పచ్చిక బయళ్ళు దగ్గరికి వచ్చి యముడి కోసం వెయిట్ చేస్తున్నాడు శ్రీచంద్ర.


    కొద్ది క్షణాల్లో యముడు ప్రత్యక్షమయ్యాడు.


    "మానవా! కుశలమేనా?" అడిగాడు శ్రీచంద్రను.


    "ఆ....కుశలం కాక ఏమున్నది? అంతయు మీదయ" అన్నాడు శ్రీచంద్ర.


    "లెస్స పలికితిని మానవా! అది సరే ఇప్పుడు చచ్చుచుంటివా" అన్నాడు మయధర్మరాజు.


    "ఇప్పుడా....." అడిగాడు శ్రీచంద్ర.


    "అదేమీ?"


    "అవును యమధర్మరాజా! మా నాన్న నన్నెప్పుడూ అప్రయోజకుడా అని తిట్టిపోస్తాడు. నా ప్రయోజకత్వం నిరూపించుకోకుండానే చస్తే చేతకాని చవటలా చచ్చాడని అడిపోసుకుంటారు. అది నాకెంత నామర్దా. అపజయంతో చచ్చుటకన్నా అబుకునది సాధించి కన్ను మూయడం మేలు అని స్వామి శ్రీచంద్ర సెలవిచ్చారు" అన్నాడు శ్రీచంద్ర అతి వినయంగా.


    "స్వామి శ్రీచంద్రా! అతనెవరు?"


    "ఇంచుమించు మీ అంత కాకపోయినా మీ స్టాండర్డ్ లో వున్నవాడు" చెప్పాడు శ్రీచంద్ర.


    తనని పొగిడేసరికి ఉబ్బిపోయి 'అటులనా!" అని ఆలోచనలో పడిపోయి "అటులైనా నీకేం కావలయును. పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చేద. నీ ప్రయోజకత్వమే అని చెప్పి ఆ డబ్బును మీ తల్లిదండ్రులకు ఇచ్చి వెంటనే చచ్చిపో....."


    "హెంత మాటన్నారు యమధర్మరాజా!"


    "అంత కానీ మాట నేనేమన్నాను మానవా?"


    "అప్పనంగా వచ్చిన డబ్బును వాళ్లకిస్తే నా ప్రయోజకత్వం ఏమున్నది నా స్వశక్తితో సంపాదించవలయును."


    "ఇది ఏమి ఇరకాటము మానవా?"


    "దీన్నే మేము ఫిట్టింగ్ పెట్టుట అంటాంలెండి" ఆన్నాడు శ్రీచంద్ర.


    "అటులైన నీకేం కావలయునో కోరుకొమ్ము. నీవు చచ్చుట తధ్యం. ఆ విషయం గుర్తించుకోనుము."


    "హబ్బ.....ఉర్కే చచ్చుట తధ్యం......తధ్యం అంటే అప్పుడే నాకు తద్దినం పెట్టిన ఫిలింగొచ్చేస్తుంది. అద్సరే గానీ నాకో ఫైవ్ థౌజండ్ కావాలి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుంటాను. నా స్వశక్తితో తొందర్లోనే డెవలప్ అయి నా ప్రయోజకత్వం నిరూపించి మీరు కోరుకున్నట్టు 'ఆత్మహత్య' చేసుకుంటాను."


    "ఆహా మానవా! చివరగా చెప్పావు చూడు. ఆత్మహత్య చేసుకుంటానని ఆ పదం నా చెవులకింపుగా వినిపించింది" అన్నాడు యముడు.


    
    "ఎందుకు అనిపించదు "మనసులో అనుకుని "మరి నా ఫైవ్ ధౌజండ్ మాటేమిటి?" అడిగాడు.


    "అవశ్యం....." అని కళ్ళు మూసుకుని "యమయమాః" అనుకుంటే ప్రత్యక్షమవుతుందా నోట్ల కట్ట" అనుకుని తను కూడా యముడిలా కళ్ళు మూసుకుని 'యమయమాః" అనుకున్నాడు.


    ఏమి అవ్వలేదు.


    యముడు నవ్వి - "అది మానవులకు అసాధ్యం.....మానవా! నువ్వు కోరిన డబ్బు ఇచ్చాను. ఒక్క మాట! నువ్వు చచ్చు వరకూ మీ ఇంట్లోనే వుంటాను. నీ స్నేహితుడినని చెప్పు" అన్నాడు యముడు.


    "నీ ఖర్మ" మనసులో అనుకుని "ఒక్కమాట....మా ముసలి బామ్మకు చాదస్తం. ఆవిడ ఏం చెప్పినా చేయాలి. ఏమన్నా పడాలి మరి!"


    "యముండా!" కోపంగా అరిచాడు.


    "అదే మరి. మీ ఇష్టం చూసుకోండి! అయినా ఆవిడ వూరేళ్ళీంది. రెండు రోజుల్లో వస్తుంది. ఆవిడ పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఉంచడం కష్టం. కనుక ఈ రెండు రోజులు ఎక్కడైనా ఉండండి."


    "కష్టమగుచున్నది మానవా! పార్క్ లోనో, టాంక్ బండ్ దగ్గరో పడుకుంటే మీ లోకపు 'దోమ' లట కుట్టి చంపుతున్నవి. అ బాదుడు భరించలేకున్నాను"

 

    "ఒక్క రెండురోజులేగా! కష్టపడండి."


    "నధింగ్ డూయింగ్.....యింకేదైనా మార్గమాలోచించుడు" బుంగమూతి పెట్టి అన్నాడు యముడు.

 

    "అలకలో బలే ముద్దోస్తున్నావు యమా" అనుకున్నాడు మనసులో శ్రీచంద్ర.


    రెండు నిమిషాలు ఆలోచించాడు.


    "ఎలాగూ నీకు మని ప్రాబ్లెం లేదు కదా యమా! 'టింగ్' మనగానే క్యాష్ నీ చేతిలో వుంటుంది. కాబట్టి హాయిగా ఫైవ్ స్టార్ హొటల్ లోనో ఉండు.....ప్రాబ్లం ఉండదు" అన్నాడు శ్రీచంద్ర.


    "మరి అక్కడ బావుంటుందా? దోమలుంటాయా?" డౌట్ గా అడిగాడు యముడు.


    "ఫైవ్ స్టార్ హొటల్ లో దోమలుంటే మా ప్రజలు మక్కేలిరగదంతారు. నీకు హాయిగా ఉంటుంది అక్కడ......నడు నేను తీసుకెళ్తాను" అన్నాడు శ్రీచంద్ర.


    తను కూడా హాయిగా ఎంజాయ్ చెయ్యవచ్చని.


    "అటులైనచో సరే....." అని వొప్పుకున్నాడు యముడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS