Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 57

 

    "నేను కుమారా! విధాతని" అంటూ మాటలు వినిపించాయి.


    "వి.....వి....విధాతా అంటే బ్రహ్మదేవుడు. సకల చరచరా సృష్టిని గావించు....."

 

    "అవున్నాయనా....నేనే! సాక్షాత్తూ బ్రహ్మదేవుడ్ని"


    యాంగ్జయిటిగా వుంది శ్రీచంద్రకు.


    "బ్రహ్మదేవా! ఒక్కసారి కనిపించరు.....మా మానవులు మీ గురించి చెప్పుకోనుటే గానీ చూసే భాగ్యం ఎవరికి కలగలేదు."


    ఆ వెలుగులో నుంచి.....


    బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు.


    దివ్యతేజస్సుతో ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడ్ని చూసి సాష్టాంగపడిపోయాడు శ్రీచంద్ర.


    "బ్రహ్మదేవా! నిజ్జంగా మీరేనా? నేను అలవాటుగా ఏదైనా కలగాని కనడం లేదు కదా" ఆనంద పారవశ్యంతో అన్నాడు.


    "కలకాదు నాయనా.....కలలాంటి నిజం" బ్రహ్మదేవుడు అన్నాడు.


    "థాంక్యూ.......థాంక్యూ బ్రహ్మదేవా" అన్నాడు శ్రీచంద్ర.


    "నో మేన్షన్ నాయనా....."


    "అదేంటి బ్రహ్మదేవా....మీకు ఇంగ్లీషు భాష కూడా వచ్చా?"


    "పిచ్చినాయనా! మనుష్యులనే సృష్టించు నేను ఈ మనుష్యులు సృష్టించిన భాషను మాట్లాడలేనా? నాకన్ని భాషలూ వచ్చు. తమిళ, మలయాళ, చైనీస్, స్పానిష్, రష్యన్....."


    "చాలు బ్రహ్మదేవా.....మీ టాలెంట్ నాకర్ధమైంది. ఇంతకీ మీ రాకకు కారణమేమిటి? నాకెంతో హెల్ప్ చేస్తున్నారు. మీ రుణం తీర్చుకోవాలని వున్నా.....ప్చ్.....తీర్చుకోలేను" అన్నాడు శ్రీచంద్ర.


    "భక్తుడికి, భగవంతుడికి మధ్య రుణాలెందుకు?"


    "భక్తుడికి, భగవంతునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి.....పోనీ అది ఒకటి వెలిగించి రుణం తిర్చుకోనా?" ఆశగా అడిగాడు శ్రీచంద్ర.


    "అగరొత్తులు, కొబ్బరికాయలు, ముడుపులు ఆశ చూపి కోర్కెలు కోరడంలో మీ మానవులు బహు నేర్పరులు సుమీ. అవేమి అక్కర్లేదు గానీ, నువ్వు యముడ్ని తిప్పలు పెట్టవలె.....నీ కోరికలు అన్నీ తీర్చుకో....."


    "ఏమో అనుకున్నాను స్వామీ, మీ దేవతల మధ్య కూడా ఇంత జెలసియా? ఎనీవే థాంక్యూ బ్రహ్మదేవా! కానీ ఒక్క రిక్వెస్ట్. ఆ యముడసలే ముక్కోపి, మాటకు ముందు అదేదో.....ఆ గుర్తొచ్చింది యముండ అంటాడు. నన్ను కాస్త కనిపెట్టుకు వుండు" అన్నాడు శ్రీచంద్ర.


    "అటులనే....ఒక్క విషయం విస్మరించకు. నీ అంతట నువ్వు చస్తే తప్ప నిన్ను గొనిపోలేడు యముడు, అల్ ది బెస్ట్ భక్తా" అంటూ మాయమయ్యాడు బ్రహ్మ.


    స్పెషల్ ఎఫెక్ట్ ఆ రోజుల్లోనే వుండేవన్నమాట అనుకున్నాడు బ్రహ్మదేవుడు మాయమవడం చూసి శ్రీచంద్ర.

 

                                                           * * *


    నారదుడు , యమధర్మరాజు జూబ్లిహిల్స్ దగ్గరికి వచ్చారు. అన్నపూర్ణ స్టూడియో కనిపిస్తోంది.


    "నారదా ....అది యేమి? పెద్ద భవంతివలెనున్నది."


    "అది భవంతి కాదు యమా! అన్నపూర్ణా స్టూడియో ...అక్కినేని నాగేశ్వరరావు అని గొప్ప నటుడులే . అతడు కట్టించాడు."


    "అటులైన మనం ఆ భవంతిని.....అదే ఆ స్టూడియోను దర్శించుదమా?"


    "చక్కని యోచన వచ్చినది. నాకు కూడా ఆ స్టూడియోలో జరిగే షూటింగ్ లు చూడవలెనని యున్నది" అంటూ స్టూడియో దగ్గరికి వెళ్లారు.


    "ఏయ్! ఎవరు మీరు" సెక్యురిటి ఆపాడు.


    ఇంతలో ప్రొడక్షన్ మేనేజర్ పరుగున వచ్చి "సెకండ్ ఫ్లోర్ లో 'యమజోరు' షూటింగ్ జరుగుతోంది లేవయ్యా. యముడు, నరడులుగా వేసే పాత్రదారుల్ని ముంబాయి నుంచి పిలిపించాడు మా డైరెక్టర్" అంటూ "రండి సార్" అని యముడ్ని నారదుడ్ని ఆహ్వానించాడు.


    ఆ స్టూడియోలో సెకండ్ ప్లోర్ లో యమజోరు షూటింగ్ జరుగుతోంది. యముడి క్యారెక్టర్ కు ముంబాయికి చెందిన ఓ మోడల్ ని సెలక్ట్ చేసారు. అతను ప్లయిట్ మిస్సవడం వలన రాలేదు. ఆ విషయం తెలియని ప్రొడక్షన్ మేనేజర్ అతనే ఇతనని పొరబడ్డాడు.


    "ఏంటి సార్! కారులో రాకపోయారా? డైరెక్ట్ మేకప్ తో వచ్చేసారే! భలే సేట్టయింది సార్ మీకు? అన్నట్టు ఈయనేవరు సార్?" నారదుడ్ని చూసి అడిగాడు.


    "నారద మహర్షులవారు. అభివాదము చేయుడు" అన్నాడు ప్రొడక్షన్ మేనజర్ తో యముడు.


    ఓసారి భయంగా యముడివైపు చూసి :ఎంతయినా మంబాయి వాళ్ళు గడుసైన వాళ్ళే. డైలాగులు కూడా బట్టిపట్టారు" అనుకున్నాడు.

 

                                                             * * *


    డైరెక్టర్ కు కంగారుగా వుంది.


    హీరోయిన్ తన హైహిల్స్ కు వున్న హీల్స్ తక్కువ వున్నాయని అలిగి షూటింగ్ కు రాలేదు. యముడు విలన్ ని గదతో కొట్టే సీన్ అది. అలా గదతో కొత్తగానే పైకి ఎగురుతూ ఆకాశంలోకి వెళ్ళాలి. స్పెషల్ ఎఫెక్ట్ సీన్ అది. చాలా టెన్షన్ గా వుంది. ఆ యముడి పాత్రదారి ఎలా వుంటాడో తెలియదు. ఫోన్ లో మాట్లాడ్డం తప్ప చూడ్డాం కుదరలేదు.


    "సార్! యముడి క్యారెక్టర్ చేసే వ్యక్తీ, నారదుడు వచ్చేశారు. విలన్ గోచి గారు కూడా వచ్చారు" చెప్పాడు అసిస్టెంట్ డైరెక్టర్.


    గోచి అసలు పేరు గోడదూకే చిదంబరం విలన్ గా బాగా పేరు తెచ్చుకున్నాక గోడదూకే చిదంబరం అంటే అసహ్యంగా వుంటుందని గోచి అని మార్చుకున్నాడు. అతను విలన్ గా నటించని సినిమా లేదు. అతనికి ఎక్స్ ప్రేషన్స్ తెలియకపోయినా బాడీ బావుంటుందని తీసుకుంటారందరూ.


    హీరోయిన్స్ తో వెకిలి వేషాలు వేయడం, హిరోలను కామెంట్ చేయడం, ఫైట్ సీన్లతో కావాలనే హీరోలను కొట్టడం లాంటి వెధవ చేష్టలు చేస్తుంటాడు.


    దానికి ఫలితం ఈరోజు అనుభవించనున్నాడని తెలియదు అతనికి తెలిస్తే కధ మరోలా ఉండేది.


    కెమెరా......


    రెడి స్టార్.....లైటింగ్ అరేంజ్ మెంట్ పూర్తయింది.


    ఫీల్డ్ లోకి వచ్చారు యముడు, గోచి నారదుడు ఓ ప్రక్క నుండి చూస్తున్నాడు.


    "చూడండి యమధర్మరాజుగారూ! మీరు మీ గదతో విలన్ గోచిగారిని కొట్టాలి. అక్కడివరకు షాట్. నేను యాక్షన్ అనగానే విలన్ గారిని కొట్టడం వరకే మీ పని. మీకు తెలుగు బాగా వచ్చిన మా ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. ఓకేనా?" అన్నాడు డైరెక్టర్.


    "ఇదేదో బాగానే వున్నట్టుంది" అనుకున్నాడు యముడు. షూటింగ్ వాతావరణం, సెట్టింగ్ చూసి ఆశ్చర్యపోతున్నాడు యముడు.


    "యాక్షన్" అరిచాడు డైరెక్టర్ గొంతు నొప్పి పుట్టేలా.


    గోచి వేగంగా యముడి దగ్గరకి వచ్చాడు. నిజానికి యముడి పాత్ర వేయాలని గోచి కోరిక. ప్రొడ్యుసర్ ససేమిరా కుదర్ధన్నాడు. ఆ కోపం మనసులో పెట్టుకుని తన వేషం కొట్టేసిన యముడి పాత్రదారిని నిజంగానే కొట్టాలన్నంత కోపంగా వచ్చాడు.


    అతడి కోపం చూసి యముడికి ఎక్కడో మండింది అంతే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS