అతను వణుకుతున్న చేతులతో తీశాడు.
లోపల వరాలు నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి. కాళ్ళు, చేతులు కట్టేవేసి, ఉన్నాయి. వీళ్ళను చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మరింత పెద్దవయ్యాయి.
ఆమె కట్లు ఉడదిశాడు మాధవరావు. ఆమె ఒక్కసారిగా కాళ్ళు చేతులు విదిలించి వీళ్ళిద్దరికి దండం పెట్టింది. రెండు చేతుల్తో , వరాలు నిజంగానే అందగత్తే......నాగేశ్వరరావు మనసులోనే అభినందించాడు ఆమె అందాన్ని.
"ఇప్పుడు చెప్పు వరాలు....అసలు ఏం జరిగింది?" అడిగాడు నాగేశ్వరరావు.
వరాలు చెప్పనారంభించింది.
కోటేశ్వరరావుని కాళ్ళు, చేతులు కట్టేసి మూల పడేశాడు మాధవరావు.
* * *
నాగేశ్వరరావు ఏదైతే ఉహించి చెప్పాడో దాదాపు అదే కధని వరాలు చెప్పింది. కాకపోతే కోటేశ్వరరావుతో ఉండటానికి వరాలు ఒప్పుకోలేదు. ఆమెపై సుందరం ప్రభావం తీవ్రంగానే పడింది. అతన్ని ఆమె మనస్పూర్తిగా ప్రేమించింది, ఆరాధించింది.....అందుకే ఆమె ఆరోజు సుందరంతో చెప్పిన మాటలు నిజమైనవే....ఆ ఊరు వదిలి వెళ్లిపోవాలనే నిశ్చయించుకుంది. ఆ మాటలు విన్న కోటేశ్వరరావులో ఆవేశం కట్టలు తెంచుకుంది. వరాలను నాకు కాకుండా చేసిన ఈ సుందరాన్ని హత్యానేరం కింద ఇరికించి, దానిని కరణం పైకి నెట్టాలని భావించాడు. వరాలను తనింటికి తెచ్చి కట్టిపడేశాడు. కేసు తేలిన తరువాత వరాలును తీసుకుని అతను కూడా ఊరు వదిలి పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. వరాలను నిదానంగా తనదారికి తెచ్చుకోవచ్చని భావించాడు. తానొకటి తలిస్తే, దైవం మరొకటి తలుస్తుందని అటు కరణం.....ఇటు కోటేశ్వరరావులు ఇద్దరూ ఈ కేసులో ఇరుకున్నారు.
నాగేశ్వరరావు అదేరోజు నేరుగా కోటేశ్వరరావుని, వరాలని ఎస్ .పి. దగ్గరకు తీసుకెళ్ళి ఇద్దరిచేత స్టేట్ మెంట్ ఇప్పించాడు. ఎస్. పి. అంతా విని సుందరం నిర్దోషిగా భావించి అతన్ని విడుదల చేసి, డబ్బుకు కక్కుర్తి పడి కేసును పక్కదోవ పట్టించిన ఎస్.ఐ. ని సస్పెండ్ చేశాడు.
* * * *
"అరేయ్ నాగేశ్వరరావు నీ ఋణం ఈ జన్మకు తీర్చుకుంటానో లేదో.....ఎన్ని జన్మలేతైనా సరే నీ ఋణం తీర్చుకుంటాను" అన్నాడు మాధవరావు.
"ఏడ్చావ్! సినిమా డైలాగులు కాదు. నా ఫీజు పదివేలు. అది ఇచ్చి వెళ్ళు" అన్నాడు నవ్వుతూ.
"పదివేలా? అంతేనా? నీకు యాభై వేలు ఇస్తాన్రా" అన్నాడు సంతోషంగా స్నేహితుడ్ని వాటేసుకుని, నాగేశ్వరరావు కూడా మాధవరావు భుజం తట్టి.
"కొన్ని కేసులు ఇంతే చిన్న క్లూ ఆధారంగా మబ్బుల్ల్లా తేలిపోతాయి. నేను కూడా ఉహించలేదు. ఇది ఇంత త్వరగా విడిపోతుందని. వాడు మనకు వరాలు ఇంటి దగ్గర కనిపించటమే మనకు పెద్ద వరం" అన్నాడు నాగేశ్వరరావు.
మాధవరావు కూడా పెద్దగా నవ్వాడు.
"అరేయ్ సుందరం.....నీ వరాలు వెళ్ళిపోయింది. మరో వరాల కోసం వేటాడకుండా బుద్దిగా మీ అన్నయ్యలు చెప్పినట్లు వింటూ వాళ్ళ పరువు కాపాడు" అన్నాడు నాగేశ్వరరావు.
సుందరం రెండు చేతుల్తో అతనికి దండ్డం పెట్టాడు.
"మీవాడు పూర్తిగా మారిపోయాడు. ఇక నువ్వు తాగమన్నా తాగడు. దేనిదగ్గరకైనా వెళ్ళమన్నా వెళ్ళడు" అన్నాడు నవ్వుతూ నాగేశ్వరరావు.
స్నేహితుని మాటలకు మాధవరావు మనస్పూర్తిగా నవ్వాడు.
"మరి నా ఫీజు ఎప్పుడు పంపిస్తావోయ్?" అన్నాడు.
"రేపే నేనే స్వయంగా వచ్చి ఇస్తాన్రా. ఏది చెల్లాయిని పిలువు ఒకసారి చెప్పి వెళ్తాము" అన్నాడు మాధవరావు.
""సరోజా....సరోజ.....ఇటురాఒకసారి....మీ అన్నయ్య పిలుస్తున్నాడు" అన్నాడు నాగేశ్వరరావు.
"చేతిలో హారతి పళ్ళెంతో వచ్చింది సరోజ.
"ఇదేంటే , నికెప్పుడు పుజలేనా?!" అన్నాడు నాగేశ్వరరావు చిరాగ్గా.
"చాల్లే ఉరుకొండి. మీకా తెలివితేటలు ఎలా వచ్చాయనుకుంటున్నారు? ఇదిగో నేను చేసే ఈ వ్రతాలు, పూజల వల్లనే. బాబూ! సుందరం ఇదిగో హారతి కళ్ళకు అద్దుకొ. ఈ బొట్టు పెట్టుకో. ఇక నీ పైన ఏ దుష్టశక్తి చూపు పడదు" అంది గర్వంగా.
సుందరం , మాధవరావు ఇద్దరూ హారతి కళ్ళకు అద్దుకుని బొట్టు పెట్టుకున్నారు. భక్తీ శ్రద్దలతో . వారి చేష్టలు చూసి నాగేశ్వరరావు పెద్దగా నవ్వాడు.
"నవ్వండి...నవ్వండి....మీరు కూడా ఏదో ఒకరోజు ఈ హారతి కళ్ళకు అద్దుకొపోరు....నేను చూడకపోను" అంది సిరుయాస్ గా సరోజ.
"చూద్దాం , ఈ మాట మన పెళ్ళయినప్పటినుంచి వింటున్నా! ఇప్పటికి పదేళ్ళయింది మన పెళ్ళయి. ఒక్కరోజయినా కళ్ళకద్దుకున్నానా?" అన్నాడు నాగేశ్వరరావు నవ్వుతూ.
"అందుకే ఇంతవరకూ పిల్లా పిచూ లేకుండా కోర్టులచుట్టూ తిరుగుతున్నారు" అంది అక్కసుగా.
"హారతి కళ్ళకి అద్దుకుంటేనే పిలలు కలిగితే....ఇక పెళ్ళిళ్ళు ఎందుకే పిచ్చిదానా?" అన్నాడు నాగేశ్వరరావు.
"ఇదన్నయ్యా అయన వరస, అంతా నా ఖర్మ....వస్తాను" అంటూ లోపలికి వెళ్ళిపోయింది సరోజ.
ఆమె వెళ్ళిన వేపే చూస్తూ నాగేశ్వరరావు పెద్దగా నవ్వాడు.
"పెద్దవాళ్ళం అవుతున్నాం....ఇకనైనా నీ పంధా మార్చుకోరా.....దేవుడ్ని పూజించటం అలవాటు చేసుకో" అన్నాడు మాధవ.
"ఎందుకట?"
"మనశ్శాంతి కోసం" అన్నాడు మాధవ.
"ఏం ఇప్పుడు నాకు మనశ్శాంతిలేదా?" అన్నాడు.
"ఆయనతో వాదించటం దండగ అన్నయ్యా.....వదిలేయండి. తీసుకోండి" అంటూ మూడు కాఫీ కప్పుల్ని ట్రేలో పట్టుకొచ్చి చెప్పింది సరోజ.
ముగ్గురూ నవ్వుతూ కాఫీ కప్పులు అందుకున్నారు.
"త్వరగా బయలుదేరి వెళ్ళండిరా.....పాపం ఇంటిదగ్గర మీవాళ్ళు ఎంత అందోళన చెందుతున్నారో" అన్నాడు నాగేశ్వరరావు.
"వెళ్తాంరా" అంటూ మాధవరావు కూడా సిగరెట్ తీసి వెలిగించాడు.
31
సమయం నాలుగు గంటలు!
సర్వోత్తమరావు ఇల్లు నిశ్శబ్దంగా వుంది.
గొడ్లచావిట్లో ఎద్దుల చప్పుడు, లేగదూడల అరుపులు, రెండు రోజుల క్రితమే పొదిగి పిల్లలను వెంటబెట్టుకుని గది చిమ్ముతున్న కోడిపెట్ట అరుపు, దాని కాళ్ళ చుట్టూ తిరుగుతూ అరుస్తున్న కోడిపిల్లల అరుపులు.......దాని పక్కనే వున్న పెద్ద మునగ చెట్టు పైన కాకి అరిచే అరుపు మినహా ఆ ఇంట్లో మరే చప్పుడు వినిపించటంలేదు.
