Previous Page Next Page 
తుపాన్ పేజి 56

    జోషీమఠం  నుంచి  విష్ణుప్రయాగ చేరాము.  తర్వాత  పాండుకేశ్వరము,  లంబర్  ఘట్టీ,  హనుమాన్ చట్టీలలో  మకాములు  చేసుకుంటూ  బదరీ దర్శన ప్రదేశం  చేరాము. అందరికీ తన్మయత్వాలు కలిగి ''విశాల్  బదరీ లాల్ జీకి జై'' అని  పర్వతశిఖరాలు  మారుమ్రోగుతూ  ఉండగా  నాట్యం చేసినంత పనిచేశారు.  మా  స్వామీజీకి  ఒడలు తెలియలేదు.   ఆయన ఒక  రాతి బండమీద  పద్మాసనం  వేసుకొని, బదరివైపు  తిరిగి   సమాధిలోనికి  పోయినారు.  అందరూ  నిశ్శబ్ధం  వహించారు.  నేను  జాగ్రత్తగా  ప్రక్కనున్న  ఒక  సానువును  కొంతవరకు  నా  ఇనుపమొనకఱ్ఱ  సహాయంతో  ఎక్కి,  అక్కడ  కూర్చుని  బదరీనాథ్  వైపు  దృష్టిపరచి,  ఆదృశ్యం గమనిస్తున్నాను.

    ఈలా  క్షేత్రాలని పేరుపెట్టి, భారతీయులు తిరిగే దేశాలు  ఈ  నాగరికత  ఏమిటి? ఏమిటీ  బదరీనాథం? ఇక్కడ  నరనారాయణులు  తపస్సు చేశారా?  ఏమో?  శకుంతలా!  నన్ను వదలి  ఎందుకు వెళ్ళావు?  ఈ  నరనారాయణులు  నిన్ను  బ్రతికి  ఉండునట్లు చేయలేకపోయారా?  మంగళగౌరి,  శ్రావణలక్ష్మి,  ఎన్ని పూజలు చేశావు!  నా  శకుంతలా! నా  దివ్యసుందరీ, నా  ఆత్మేశ్వరీ, నా  జీవిత  సింహాసనరాజ్ఞీ!  ఏమయిపోయావు దేవీ!  నాకు   కనబడవా........?   

    ఇలా  అనుకున్నానో  లేదో, నాకు దిగువగా రోడ్డు ప్రక్క తపస్సు  చేసుకునే  స్వామి  శకుంతలగా  మారిపోయారు. శకుంతలదేవి చటుక్కున లేచింది. ఇటూ అటూ  చూడకుండా బదరివైపు  ప్రయాణం  సాగించింది.  నాకా  అతిశీతల  ప్రదేశంలో  చెమటలు పట్టాయి.  ఆమె  అతివేగంతో  నడిచింది.  ఆకాశంలోకి తేలిపోయింది.  అలా  తేలుకుంటూ  బదరీనారాయణ  విశాలలాల్ జీ మందిర  శిఖరంలో  కలిసి  మాయమైపోయింది.  నాకు కళ్ళనీళ్ళు  జల జల  ప్రవహించి పోయినాయి.

    బదరీనాథా! నువ్వేనా  నా  శకుంతలవు?  నువ్వేనా?  అది ఎలా  సంభవించిందీ?  తండ్రీ  నువ్వున్నావా?  నా  శకుంతల  ఉన్నదా? నేనున్నానా?  నా స్వామీజీ,  నా శకుంతలా, నా బదరీ  అన్నీ ఒకటేనా?  ఇది  ఏమివెఱ్ఱి? నాకీ  విచిత్ర  పర్వత  ప్రదేశాలలో  మతి  తిరిగిపోతున్నదా? క్రిందకు  దిగివచ్చాను.  స్వామీజీ  లేచి  బదరీనాథ్ వెళ్ళారని  అక్కడి  వారందరూ  చెప్పారు.  నాకు   గుండె  గతి  తప్పి  పోయింది.  కన్నుల నీరు  కారిపోయింది.

    అందరమూ  బయలుదేరాము.  బదరికి  ఒక్కొక్క  అడుగు  ముందర  బడుతూన్నది.  బదరికి   ఈవలావల  నరనారాయణ పర్వతాలున్నవి.  దిగువ   మహావేగంతో  అలకనంద  ప్రవహిస్తున్నది. ''విశాల బదరీలాల్జీకీ  జై'' అని కేకలు  ఆ  ఉదయకాలంలో   ఏవో  మహారాగాలతో  వినిపించాయి.  ఆ  శ్రుతులలో  ఏవో  దివ్యసంగీతాలు, ఆ  సంగీతాలు  స్వరాలై, ఆ స్వరాలలో  కలిసి  శకుంతల కంఠం  తీయతీయని  పాటపాడుతూ నాకు  వినబడింది.  నరనారాయణ పర్వతాలూ,  బదరీనారాయణ దేవాలయమూ  కళ్ళారా చూస్తూ  నిలుచుండి పోయాను. సంగీతం వినబడుతూనే వున్నది.  తక్కిన వారు  జయజయధ్వానాలు  పలుకుతూ  నడిచి పోతున్నారు.  నేను మాత్రం  అదృశ్యయై ఉన్న  ఆ  దేవి  సంగీతం వింటూ నిలిచిపోయాను. ఆ  సంగీతం  అతిమధురమైనది.  గాఢతమవేదనా  భరితమైనది.  ఆ  గాంధర్వమును,  కిన్నెరలతో  కలిసి  పాడుతూ  గంధర్వాంగనలతో  నృత్యంచేస్తూ  శకుంతలాదేవి  అమృత  ప్రవాహాలు  దెసల నింపుతున్నది కాబోలు? ఆ  పాట  ఇదియని చెప్పలేను.  ఆ  రాగమిట్టిదని  గ్రహించలేకపోయాను. ఆ  తాళ మేదియో  హృదయమునకు  వ్యక్తంకాలేదు.

    ఎంత  ఆనందరూపమైనది  ఆ పాట! ఆ  పాటలో మంచుగడ్డలు  కరిగిపోయినవి.  ఆ  స్వరకల్పనలో  నదులు ఉద్భవించి  ప్రవహించినవి. ఆ రాగారోహణలో  హిమాలయ శిఖరాలు  ఆకాశంలోకి  చొచ్చుకుపోయాయి. అవరోహణలో  పుష్పవన  వాటికలు  ఆ లోయలలో వికసించి  సురభిళాలైనవి.  నేనో మంచుకొండనైతిని. ఎన్ని  కల్పాలనుండో  నాలో  పేరుకొనియున్న  హిమపర్వతాలు, వేడినే ఎరక్క ఇంకనూ పేరుకుపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. నా  హృదయంలోని  చైతన్యం  గడ్డకట్టుకుపోయినది.  ఆనాటి  నా మంచుగడ్డ  బ్రతుకుపై  ఒక్క సూర్యకిరణం  పడి,  ఆ  మంచుగడ్డ  శకలాలలో ఏడు  వర్ణాలుగా  రూపం పొందింది. లోకం  వర్ణమయమైంది.  నా బ్రతుకు  ఆ కిరణకాంతి  ప్రసరింపువల్ల  నెమ్మదిగా కరగడం  ప్రారంభించింది. గజగజ  వణికిపోయాను. నాకు మెలకువవచ్చి  తొందర  తొందరగా బదరి చేరాను. జనుల కోలాహలం  ఆ  పర్వతాలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది.

    నేను  వెళ్ళీవెళ్ళగానే బదరీనాథ ఉష్ణకుండంలో  స్నానంచేసి వేయి  ఏనుగుల బలంతో  వచ్చి,  ఉన్నిదుస్తులు  ధరించి  బదరీనాథ స్వామి  దర్శనానికి  వెళ్ళాను. ఆ  దేవాలయంలో  జరిగే  తంతంతా చూచి  ఇంటికి తిరిగి  వచ్చి  నిద్రపోయాను. ఏమిటి నాకీ హిమాలయ ప్రయాణం?  ఈ  బదరీనాథ  యాత్ర  ఎంత విచిత్రంగా  పరిణమించింది. ఈలాంటి  మహా  విచిత్ర  స్థలాల్లో  మనుష్యుడు ఎన్ని  దేవుళ్ళనైనా కల్పించుకోగలడు! నాకు మాత్రం  బదరీనాథుడు  మనుష్యుడు చెక్కిన విగ్రహంలాగే  కనిపించాడు.  కాని మనుష్యుడు  ఎంతో  కష్టపడితేనే  గాని,  తన  మనస్సులోపుట్టిన ప్రపత్తి భావాన్ని  నిర్మలమూ, నిశ్చయమూ, చేసుకోలేడు. ఎన్ని  యుగాలనుంచి  ఈ బడరీనాథుడు  ఈ  మంచుకొండల  ప్రదేశంలో  వెలసివున్నాడో!  పాండవులీ  శీతల ప్రదేశానికి వచ్చారట!  క్రీస్తు పూర్వం కొన్ని  వేల  ఏళ్ళ  క్రింద  ఆర్యులు  ఉత్తర  భూములలో  బదరికాశ్రమాన్ని  నిర్మించుకొన్నారు.  ప్రపంచానికి  పదివేల  అడుగులపై చిల్లర  యెత్తున, ఎక్కడో  అలకనందానదీ  జనన ప్రదేశాలలో  ఈ  మహాక్షేత్రం, మణిపూసలా పొదగబడివుంది.
   
       
                         38
   
    మరునాడు  స్వామీజీ బ్రహ్మకపాలంలో  నాచేత  మా  తండ్రిగారి శ్రాద్ధం  పెట్టించారు.  బ్రహ్మకపాలంలో  శ్రాద్ధం  పెడితే  మళ్ళీ  ఆ పితరులకు  శ్రాద్ధాలు పెట్టకూడదట. ఎందుకంటే  బ్రహ్మకపాల  శ్రాద్దంవల్ల  పితరులకు మోక్షం  వస్తుందట.  ఒకసారి  మోక్షంవస్తే  మళ్ళీ  పితరులను  ఎలా  ఆహ్వానిస్తాము?  ఏది  ఏమయితేనేమి  ఒక  గొడవ  వదలిపోతుంది. అందుకనే నేను  ఒప్పుకున్నా.  స్వామీజీ  కూడా '' నీకిష్టమైతేనే పెట్టు,  యిష్టం  లేకపోతే మానెయ్యి! అన్నారు. అందులో వుండే  లాభాలాభాలు చూసే  నేను ఒప్పుకున్నాను. స్వామి దర్శనము, పూజలు  అన్నీ  ఏదో గౌరవంకోసం  చేయించాను. నాకు  దేవుళ్ళమీద  గౌరవము  కంటే  ఆ  ప్రదేశాలమీద  ప్రేమ యెక్కువైంది. నా  వెనకాల  ప్రసరించి వున్న  వెలుగు  నీడల్ని  మరచిపోయాను.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS