Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 56


                         1,2,3,4,5,6,7,8
    
    1927 లో న్యూయార్క్ లోని వుల్ వర్తు విక్రయశాలా
    భవనాల్లో తిరుగుతుండగా చూశాడతను, చాలామంది ఒక
    పెద్ద టేబిలుముందు నిలబడి ఎత్తుగా, ఫోనోగ్రాఫ్ రికార్డులు
    పేరుస్తుండడం, సంగతేమిటో కనుక్కుందామని దగ్గరగా
    వెళ్ళాడు. ప్రత్యేక విక్రయం. Victor & Brunswick కంపెనీ
    వారి కొత్త రికార్డులు. ఒక్కొక్కటి అయిదు సెంట్లు,
    కావలసినన్ని రకాలు-ఇష్టం వచ్చినవి యెంచుకోవచ్చు. ఎన్ని
    నెలలయింది తాను ఫోనోగ్రాపు వేసుకొని. ఇంకోసారి కీ
    యిచ్చి మళ్ళీ వినాలనిపించింది. చాలామట్టుకు తానూ,
    తన ఫోనోగ్రాపూ ఒకటే ఆ యంత్రంలోకి వెళ్ళి,
    అందులోంచి వచ్చి, తనే సంగీతమైపోయాడు. ఒకసారి
    విద్వాంసుల కృతి, మరోసారి జాబ్ పాటల వికృతి. ఎన్నో
    నెలలయింది ఫోనోగ్రాఫు దగ్గరకెళ్ళి, అలాగే తన గదిలో
    పడివుంది ధూళిపట్టి మౌనంగా.
    
    తానే ఈ ఫోనోగ్రాపులో చిరకాలంనుంచి మౌనంగా ఉండిపోయాననీ, ఇందులోంచి మళ్ళీ బైటికి రావడం ఎంతో బాగుంటుందనీ ఈ అయిదు సెంట్ల రికార్డులు జ్ఞాపకం చేశాయి.
    ఒక అర డజను రికార్డులు ఎంచుకొని తనగదికి తీసుకువెళ్ళాడు. వీటిలో ఏదీ గొప్ప సంగీతం కాదని నిశ్చయంగాతెలుసు. కాని ప్రశస్తమైనదే కావాలన్న పట్టింపు లేదు ఆ సంగీతం ఎంత హీనంగా వున్నా ఎంత నాసిరకానిదైనా ఏమీ ఇబ్బంది లేదు ఏదైనాసరే దాని సంగతేదో తెలుసుకోవడంలో గొప్ప మజా వుంటుంది. అమెరికన్ జాక్ సంగీతం అంతట్లోకీ అతి హీనమైనది దొరికినా దానితో ఈ పని చెయ్యగలనని అతనికి తెలుసు రాగం చెడిపోవడం, వాద్యమేళం గగ్గోలు వగైరా ఎంత చెడిపోయిందయినా సరే ఎక్కడో ఒకచోట, జాగ్రత్తగా వింటే తప్పకుండా తాను జరామరణపీడితుడైన మానవుడి అమోఘవిలాపమో, హసనమో వినితీరుతాడు. ఒకసారి అది వినివస్తుంది. హఠాత్త్తుగా మ్రోగి ఆగిపోయే ఎదురుమ్రోతలో బహుశా బాంబోతీగలన్నీ ఒక్కమాటు గజగజలాడినప్పుడు లేదా ఇంకోసారి ఏదో ఒక చెత్తపాటని అనేకమందితోకలిసి పాడుతున్న ఒక కిరాయిగాయకుడి గొంతుకలో వినిపించే విషాదం, ఏదో చాలామట్టుకు కాకతాళీయంగా కాని తప్పనిసరిగా.
    ఉత్తమ సంగీతంలో ఇది సాధ్యం కాదు ఉత్తమ సంగీతంలోని ఉన్నత గుణాలన్నీ ఉద్దేశపూర్వకాలు అవి అందరికోసం అక్కడ హత్తుకొని పోయిఉన్నాయి. దాంట్లో పొరపాటుకి తావులేదు.
    అది ఆగస్టునెల ఆరంభం అనుకుంటాను. (ఈ మాట చెబుతున్నది నేను వాడు చాలా నెలలబట్టీ ఫోనోగ్రాఫులోంచి తన్ను వినడంలేదు. ఇప్పుడే కొత్త రికార్డులని ఇంటికి తీసుకెళ్ళుతున్నాడు.)
    యువకుడైనవాడు ఆగస్టు మాసంలో చెప్పరానంత జీవనమాధుర్యం అనుభవిస్తాడు. ఆ రోజుల్లో నాకొక టెలిగ్రాఫు కంపెనీలో ఉద్యోగం. పగలంతా ఒక టేబిలుముందు కూర్చుని టెలీటైపు యంత్రంతో పని చేసేవాడిని-టెలిగ్రాములు పంపడం, అందుకోవడం సాయంత్రం అయేసరికి ఒక అనిర్వచనీయమయిన మాధుర్యం నాకు అనుభవమయేది. కాని అదే సమయంలో నాకెవరూ లేరనే ఒంటరి తనం వేధించింది వీళ్ళమధ్య నన్ను పారేసేరేమిటనే వేదన. ఈ యంత్రాల మధ్య పడిపోయాను. మీ పద్మవ్యూహంలో నన్ను తోసేశారు. ఈనాటి యంత్రాలభావంలో ఇరుక్కొని ఆఖరికి నేనూ ఈ మరల్లోనే ఒక భాగాన్నయిపోయాను. ధనార్జనకి ఇదో మార్గం - ఇలా ఒక యంత్రంముందు కూర్చోవడం ఇదంటే నాకెంతో అనిష్టం, అయితేనేం ఇదోమార్గం.
    అతనికి తెలుసు అందులో మరో దారిలేదని-వాళ్ళు తనలోపలివన్నీ తొలిచి-అక్కడ చక్రాలూ, స్ప్రింగులూ, సమ్మెటలూ, లీవర్లు అయోమయంగా అమర్చారని ఈ యంత్రం నిర్దిష్టమైన పనిని నిర్దిష్టంగా చేస్తుందని-ఒకేపని, అనేక పర్యాయాలు తప్పులేకుండా.
    రోజంతా యంత్రంముందు కూర్చునేవాణ్ని-అమెరికన్ పరిశ్రమకి అత్యంతం సహాయపడుతూ అతి ముఖ్యమైన టెలిగ్రాములు అతిముఖ్యమైన మనుష్యులకి తప్పులేకుండా పంపించేవాణ్ని నా చుట్టూ జరుగుతూన్న సంఘటనలతో నాకేదీ సంబంధమంటూ లేకపోయినా నేను మాత్రం అక్కడ కూర్చున్నాను. అమెరికా కోసం పని చేస్తూ నాకు కావలసిందేమిటని ఆలోచించాను. బహుశా ఒక యిల్లు నేనొక చవక రకం పూటకూళ్ళ యింట్లో ఒకన్నే బతుకుతున్నాను. ఒక గదీ పై కప్పూ అరడజను పుస్తకాలూ ఇవే నాకున్నవి. ఆ పుస్తకాలు, వాటిని నేను చదవలేదు.
    అవన్నీ గొప్పగొప్ప రచయితల గ్రంథాలు. వాటిని చదవలేను; రోజంతా టేబిలు ముందు కూర్చుంటాను. నా దేశం ప్రపంచ మంతటికీ ఐశ్వర్యవంతమైన దేశం కావడానికి తోడ్పడుతూ నాకో మంచం వుంది. ఒక్కొక్కప్పుడు కేవలం అలసి పోవడంవల్ల నిద్రపట్టేది. రాత్రి చాలాభాగం కడచినతర్వాతగాని, తెల్లారుతున్న సమయానికిగాని, ఎక్కడైనా పడుకున్నంత మాత్రాన నిద్ర పోలేము. నీ గది నీది కాకపోతే, నువ్వు దానిలో ఒకభాగం కాలేకపోతే నువ్వందులో నిద్రపోలేవు, నేనుంటూన్న గది నాలో ఒక భాగం కాదు. వారానికి మూడు డాలర్లు అద్దె ఎవడిచ్చుకోగలిగితే వాడిదే ఆ గది. అక్కడ నేనున్నానంతే బతుకుతూ, నావయస్సు దాదాపు పందొమ్మిదేళ్ళు. కించిత్తు పిచ్చితనం.
    అతనికొక ఇల్లుకావాలి. అక్కడకు వెళ్ళి తన్ను తాను కలుసుకోవాలి. ఈ భూలోకంలో, ఈ సూర్యుడి కాంతిలో తనదంటూ తన్ను కాపాడగలుగుతూ ఒక యిల్లు.
    ఆరు రికార్డులనీ తనగదికి తీసుకెళ్ళాడు. తన చిన్నగదిలోని, చిన్న కిటికీలో నుంచి వెలుపలకి చూస్తే తనకు దిక్కులేనట్టు కనబడింది. ఇందుకతనికి నవ్వొచ్చింది. ఇలాంటి సంగతిమీద ఎంత తమాషాగానైనా మాట్లాడుకోవచ్చు. గదిలో అటూ ఇటూ తిరిగాడు. ఇంకా తన హాటు తలమీదనే వుంది. గదితో మాట్లాడుతున్నాడు. ఇంట్లోపడ్డాను కదూ.
    ఆ రాత్రి అతనేం తిన్నాడో నాకు జ్ఞాపకం లేదు. కాని ఇంటి యజమానురాలు కట్టించిన గ్యాస్ పొయ్యిమీద వండుకున్నానని మాత్రం తెలుసు. ఈ పొగవంటకీ పనికొస్తుంది ఆత్మహత్య చేసుకోవడానికీ పనికొస్తుంది. ఏదోతిన్నాడు. చెయ్యి కడుక్కున్నాడు తిన్న ప్లేటు కడుక్కున్నాడు. తర్వాత ఫోనోగ్రాఫు వైపు తిరిగాడు.
    ఈ హంగామా అంతా ఎందుకనే సంగతి తెలుసుకోవడానికి ఏదో కొంచెం అవకాశంవుంది.    తనకి కావలసిన భోగట్టా ఈ జాబ్ సంగీతంలో దాగుందనడానికి కొంచెం అవకాశం వుంది. ఇదో ఊహ జాబ్ సంగీతం మూలకంగా తనకి యంత్రాలనిగురించి అమెరికన్ యంత్రాలు పనిచెయ్యడాన్ని గురించి కొంచెం అవగతమయింది. పది వేలమంది న్యూయార్కు స్త్రీలు బ్రహ్మాండమైన హాలులో వీపులు వంగిపోయి కుట్టుయంత్రాలముందు పనిచేస్తున్న దృశ్యం కళ్ళుగట్టింది. పర్వతాలకన్నా బ్రహ్మాండమైన యంత్రాలను, బ్రహ్మాండమైన పనులు నిర్వహించే యంత్రాలను, శక్తిని సృష్టించెవీ, శ్రమతగ్గించేవీ, విధ్యుద్దీపాలూ రైలింజన్లూ, టిన్ను డబ్బాలూ, బాకాలు తయారుచేసేవీ రకరకాల యంత్రాలను చూడగలిగాడు.
    అదో చిన్న ఫోనోగ్రాపు. మడిచిపెట్టడానికి వీల్లేనిది. విక్టర్ కంపెనీ వారి చిన్నరకం ఫోను. ఎన్నేళ్ళనుంచో అతనిదగ్గర వుంది. ఎక్కడికి మారితే అక్కడికి దీన్ని మోసుకెళ్ళాడు అలా దీన్ని మొయ్యడంలో సులువు లేనేలేదు. లేదనీ తనకు తెలుసు. కాని మారిన గదులన్నిట్లోకీ, మారిన నగరాలన్నిట్లోకీ మోసుకెళ్ళాడు. నెలల తరబడి ఫోనోగ్రాఫుని ఉపయోగించకపోయినా తనతో తీసుకపోతూనే వుండేవాడు. ఎప్పుడూ ఇది తనదగ్గరే వుందంటే అదేదో నిండు. ఎప్పుడు కావలసినా వినవచ్చుకదా అని ధీమా బ్యాంకులో ఒక పెద్ద మొత్తం నిలవచేసినట్టు ముట్టుకోడానికి భయం వేసేటంత పెద్దమొత్తం. తనకి కావలసిన పాట ఏదయినా దీనిమీద పాడించుకొని వినవచ్చు. రుమేనియా దేశపు జానపదగేయాలూ, నీగ్రో ఆధ్యాత్మిక గానం, అమెరికన్ పడమటి పాటలు, అమెరికన్ జాబ్ ఈ రికార్డులన్నీ ఉన్నాయి. అతనివద్ద. ఇంత సంగీతమూ ఇంట్లోనే. ఈ రికార్డులలోనే వుంది. ఆ సంగీతంలోనే తానున్నాడు. అయినా నెలల తరబడి ఫోనోగ్రాపుని వినలేదు తననీ, ఫోనోగ్రాపునీ నిశ్శబ్దం ఆవరించింది. కాలం గడిచినకొద్దీ ఈ నిశ్శబ్దాన్ని భంగం చెయ్యడం కష్టమవుతూ వచ్చింది.
    చాలా నెలల క్రితమే ప్రారంభం అయింది తాను దిక్కుమాలిన వాడినవే భావం ఒక సాయంత్రం కదుల్తూన్న బస్సులోంచి అకస్మాత్తుగా చూచాడు ఆకాశాన్ని ఎంత భయంకరమైన సత్యం ఇది. ఆకాశమనేది ఉండడం, ఆకాశం ఉందని తెలుసుకొని, తలెత్తి అందులోకి చూసి చీకటిపడిపోతూ వుండగా అప్పుడు గ్రహించాడు తానెంత దిక్కుమాలిన వాడయిపోయాడో.
    అయితే అందువిషయమై అతనేమీ దఖలు పుచ్చుకోలేదు. నాకొక యిల్లు కావాలి అనే కోరిక అతనిలో ప్రారంభమయిందంతే, దాన్ని తెచ్చుకోవడానికి మాత్రం ఏమీ చెయ్యలేదు.
    ఫోనోగ్రాపు పక్కని నిలుచున్నాడు. దాని నిశ్శబ్ధాన్నీ, తన నిశ్శబ్దాన్నీ తలుచుకుంటూ ఈ చప్పుడు చెయ్యడానికి తను బ్రతికివున్నట్టుగా ప్రకటించుకోవడానికి భయం వేసింది.
    ఫోనోగ్రాఫుకి నేలమీంచి ఎత్తి తాను భోజనంచేసి చిన్న టేబిలుమీద వుంచాడు బాగా దుమ్ముపట్టిపోయిన ఫోనోగ్రాఫును తీరుబాటుగా తుడుస్తూ పది నిముషాలు గడిపాడు తుడవడం అయిపోగానే అదివరకటికన్నా ఎక్కువ  భయంవేసి మళ్ళీ దీన్ని కిందపెట్టేద్దాం. పాడకుండా మౌనంగానే ఉండిపోనిద్దాం అనిపించిందతని కొక్కక్షణం తర్వాత కొంతసేపటికి మెల్లిగా కీ ఇవ్వడం ప్ర్రారంభించాడు. రహస్యంగా తనలో తాను ఇందులోపలి తీగ ఏదయినా తెగిపోకూడదా అని ఆశిస్తూ అలాగ అది పాడయిపోయి పాట పలక్కపోతే తనకి ఈ ప్రపంచంలో చప్పుడు చెయ్యవలసిన అవసరం తప్పుతుందికదా అని ఆశ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS