"ఇంకో సీసా వుంది లెండి!" భర్తను కుర్చీలో కూర్చోపెడుతూ అన్నది వరూధిని.
"అయితే తే మరి! ఈరోజు ఆ ముసలాడి పని తేల్చకపోతే నా పేరు వెంకటపతికాదు. నేను ఆయన కొడుకునేకాదు! సాంబయ్యకు కొడుకులేడు." పెద్దగా అరవటం మొదలుపెట్టాడు వెంకటపతి. ఆ మాటలు గదిలో బంధించబడ్డ సాంబయ్య గుండెల్లో బరిసె పోటుల్లా నాటాయి.
బయట కారాగిన చప్పుడయింది. వెంకటపతికి నచ్చచెప్పి వరూధిని హాల్లోకి వచ్చింది.
కనకయ్య మరో ఇద్దర్ని వెంటబెట్టుకొని లోపలకు వచ్చాడు. రామనాథబాబు ముగ్గుర్నీ ఆప్యాయంగా ఆహ్వానించాడు.
"ఏమిటి కనకయ్యగారూ, మీరుకూడా ఇంత ఆలస్యంగా వస్తే ఎలాగండీ?" రాగం తీస్తూ అన్నది వరూధిని.
"నాది ఆలస్యం ఎక్కడా! అనుకున్న టైంకే వచ్చాగా? మీ ఆదుర్దాకొద్దీ మీకు అలా అనిపిస్తుంది మరి! ఆఁ ఏమంటున్నారు మీ మామగారు? సాంబయ్య గారు? తోవకు లాక్కొచ్చారా? ఎక్కడా?" అంటూ కనకయ్య లేవబోయాడు.
"మీరు కూర్చోండి! ఆ పనేదో వెంకటపతీ, ఆమెగారూ చూసుకుంటారు. మధ్యలో మనం కల్పించుకోవడం మంచిదికాదు" అన్నాడు రామనాథబాబు.
తన పక్కనవున్న మిగతా ఇద్దర్నీ చూసి, కనకయ్య తన తెలివితక్కువకు నాలుక కరచుకుని, మాట్లాడకుండా కూర్చున్నాడు.
"రాత కోతలు పూర్తిచేశారా?" అడిగాడు రామనాథబాబు కనకయ్యను.
"ఆహాఁ! దస్తావేజులు పూర్తిగా రాయించాను. ఎవరిది వారికి వివరంగా రాయించి సాక్షి సంతకాలతో సహా సిద్దంగా వున్నాయి" అంటూ కనకయ్య తోలుసంచిలోనుంచి, స్టాంపుకాగితాలమీద రాసిన పత్రాలను బయటికి తీశాడు.
దస్తావేజులను చూసిన వరూధిని కళ్ళు మెరిశాయి.
"ఇదిగో డబ్బు! శేషావతారమూ, రామచంద్రయ్యగారు కూడా అణాపైసలతో సహా, అనుకున్న ప్రకారం సిద్దంగా వున్నారు. మా పని అయిపోయింది. ఇహ మిగిలింది మీరు చెయ్యవలసిందే!" డబ్బు మూట ఆడిస్తూ అన్నాడు కనకయ్య.
రామచంద్రయ్య, శేషావతారం డబ్బు సంచులమీద వేళ్ళు ఆడిస్తూ "అవునవును!" అంటూ తలలూపారు.
డబ్బు సంచుల్ని చూసిన వరూధిని ముఖం వెలిగిపోయింది. అంతలోనే చీకటి తెరలు కమ్మాయి.
వెంకటపతి గదిలో రెండో బ్రాందీ బాటిల్ కోసం వెతుకుతున్నాడు.
సాంబయ్య చీకట్లో, తలుపుప్రక్కన చేరబడి గుండెలు చిక్కపట్టుకుని, అస్పష్టంగా సగం సగం వినబడుతున్న మాటలు వింటూ, ఆ గొంతుల్ని పోల్చుకోటానికి ప్రయత్నిస్తూ వశం తప్పిపోతున్న మనస్సును కూడదీసుకోలేక యాతన పడుతున్నాడు.
"పత్రాలమీద తండ్రీ కొడుకుల సంతకాలు, నిశాని పద్దులు తీసుకొని రిజిష్టరు చేయించి దస్తావేజులు మా ముందు పారేయండి. ఇంతే ఇక జరగాల్సింది." కనకయ్య గొంతు సకిలించుకొని, మూడు ముక్కల్లో విషయాన్ని తేల్చి చెప్పానన్నట్టు పక్కనున్న ఇద్దరి ముఖాల్లోకీ తెలివిగా చూశాడు.
అంతలోనే హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినవాడిలా ముఖంపెట్టి కనకయ్య రామనాథబాబు కేసి తిరిగి అన్నాడు-
"ఇంతకీ రిజిష్ట్రారు గారు ఏరండీ?"
"వస్తారు, వచ్చే టైం అయింది. కాస్త ఓపిక పట్టండి కనకయ్యగారూ!" కనకయ్యతో చెప్పి వరూధిని ముఖంకేసి చూసి, గతుక్కుమన్నాడు రామనాథబాబు.
వరూధిని ఖంగారు పడసాగింది. ఇంతకీ ఆ రిజిష్ట్రారు ఎప్పుడొస్తాడో ఏమిటో? ఆయన వచ్చేసరికి ఈయన ఏ స్థితిలో వుంటాడో? ఇప్పటికే మనిషి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. తండ్రిని ఆదరించి, బెదిరించి సంతకం చేయించే స్థితిలో అప్పటికి భర్త వుంటాడా? మెదడు కుమ్మరిపురుగు తొలుస్తున్నట్లు అయిపోయింది వరూథినికి.
రామనాథబాబు వరూధినికి ధైర్యం చెబుతూ అన్నాడు, "ముందు నువ్వు వెంకటపతి సంగతి చూడు. రిజిష్ట్రారు రాక ఎక్కడికిపోతాడు?"
"ఎందుకైనా మంచిది, మీరువెళ్ళి తీసుకొస్తేనో?" అన్నది వరూధిని.
"మనకోసం వస్తాడా ఏం? ముందే రెండువేలు పుచ్చుకొన్నాడు. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే మిగతా మూడువేలూ ఇస్తానన్నాను. డబ్బు చేదా ఏం? ఎందుకు రాడు? పదీ ఐదూ పుచ్చుకొనేవాడు ఐదువేలు వదులుకుంటాడా?"
"పనికకముందే రెండువేలిచ్చారా? చేతిలో పడిందేచాలని ఎగనాం పెడ్తే ఏం చేస్తారూ? ఆ రిజిష్ట్రారు అంతటివాడు. నాకు తెలుసు?" తన అనుమానాన్ని చల్లగా జారవిడిచాడు కనకయ్య.
రామనాథబాబు తేలిగ్గా నవ్వేశాడు. "ఆ నోట్లనంబర్లూ, వాటిమీద గుర్తులూ పెట్టే ఇచ్చాను. అంత నమ్మకద్రోహం చేస్తే వాడే జైలుకుపోతాడు!" అన్నాడు.
కనకయ్య గుడ్లు తేలేశాడు. రామనాథబాబు ఎత్తుకు కనకయ్య చిత్తెపోయాడు. మనిషి అఖండుడు! తనకు మించిన చెయ్యి. తన బుర్ర అంత దూరం పోదు. అంత సమర్ధతా, ధైర్యమూకూడాలేదు.
కనకయ్యతోపాటు వచ్చిన పెద్దమనుషులు ఖంగారుపడ్డారు. శేషావతారం వంట్లో వణుకు పుట్టినట్టయి "ఆ రిజిష్ట్రారు గారు కూడా ఇదే ఆలోచనలో వుండి తిరుగుదెబ్బ తీస్తేనో?" అన్నాడు.
"ఏం చేస్తాడంటావ్?" విసురుగా, చిరాగ్గా అన్నాడు రామనాథబాబు.
"పోలీసుల్ని తీసుకొచ్చి మనందర్నీ ఇక్కడికిక్కడే మూయిస్తే!" ఆ తర్వాత మాట అతని గొంతునుంచి పెగల్లేదు.
వరూధిని గుండెలు చిక్కపట్టినై. కనకయ్యకు కాళ్ళు వణికాయి. చేతులోని కాగితాలూ, డబ్బూ బల్లమీదపెట్టి చేతులకు పట్టిన చెమట తుడుచుకున్నాడు. అతని కళ్ళు అప్రయత్నంగానే ఆ యింట్లోనుండి బయటపడే మార్గాలు ఎన్ని వున్నాయోనని వెతకసాగాయి.
"ఏమిటయ్యా, మీ మాటలూ మీరూ? ఇష్టంలేకపోతే వెళ్ళండి. మీ తాతల్లాంటి వాళ్ళున్నారు కొనటానికి. ఎకరం ఐదువేలు చేసేది, మూడున్నర వేలకు, ఏ ఇబ్బందీ లేకుండా ఎలా వస్తుందేమిటి?" అంటూ రామనాథబాబు కనకయ్య పక్కగా పెట్టివున్న డబ్బు సంచిని తీసుకుని వరూధినికి ఇచ్చాడు.
అది చూసి కనకయ్య జావకారిపోయాడు. తన పక్కనే వున్నవాళ్ళను మందలిస్తూ "రామచంద్రయ్యా, నువ్వూరుకోవయ్యా బాబూ! రామనాథబాబుగారికి మనం చెప్పేటంతటి వాళ్ళమా? బరువూ, భారమూ ఆయనమీద వదిలేయ్! అంతా వారు చూసుకుంటారు. ఏదీ? నీ డబ్బు కూడా లెక్కపెట్టి వారికిచ్చేయ్! మళ్ళీ ఆలస్యం ఎందుకు? ఈపాటికి సబ్ రిజిష్ట్రారుగారు వస్తూ వుండాలి." అన్నాడు.
కనకయ్య తెలివికి రామనాథబాబు తనలో తనే నవ్వుకొని "అలా రా దారికి" అనుకొన్నాడు.
వరూధిని డబ్బు సంచి దాచి తిరిగి హాల్లోకి వచ్చి "కనకయ్యగారూ, ఎంతా?" అని అడిగింది.
"లక్షా ఇరవై ఇంకా లెక్కపెట్టలా?" కొంచెం గాబరాగా అన్నాడు.
"లేదు మీ డబ్బు సంచి అలాగే వుంచా ఊరికే అడుగుతున్నా!" అన్నది.
"పోలీసులు మన చేతిలోవాళ్ళని మీకూ తెలుసుగా కనకయ్యగారూ?" సాలోచనగా అన్నాడు రామనాథబాబు.
"తెలియకేమండీ? డియస్పీగారు మీ చేతిలో మనిషి ఆ సంగతి ఈ టౌనంతా తెలుసు" అంటూ కనకయ్య తన పక్కన ముఖం బిగించుకొని కూర్చొని వున్న రామచంద్రయ్యకేసి చూశాడు.
బయట కారాగిన చప్పుడయింది.
హాల్లో వున్న రామచంద్రయ్యా, శేషావతారమూ, కనకయ్యా, రామనాథబాబూ లేచి నిలబడ్డారు.
వరూథిని భర్త వున్న గదిలోకి వేగంగా వెళ్ళిపోయింది.
గదిలో తలుపు ప్రక్కగా గోడకు జారగిలబడి వున్న సాంబయ్యకు కొన్ని క్షణాలు ఏమీ వినిపించలేదు. ఊపిరి బిగబట్టి, తలుపుసందులోనుంచి హాల్లోకి కళ్ళు చించుకొని చూడసాగాడు.

