"మీతో గొడవ పెట్టుకోడానికి మనస్కరించడంలేదు. దయచేసి నన్నేకాదు. ఎవర్నయినా, మీరేకాదు నేనయినా రెచ్చగొట్టడానికి ప్రయత్నించకూడదు. దానివల్ల మనకే ముప్పు" అన్నాను.
"నీ ఉపదేశాలు నాకేమీ అవసరంలేదు. వారి దగ్గర నువ్వెలా పనిచేస్తావో నేనూ చూస్తాను కానీ ముందు ఇక్కడ్నుంచి వెళ్ళు" అన్నారావిడ.
* * *
ఆవిడ కట్టుబాట్లు
ఆవిడన్న మాటలకి ఆవేశం కట్టలు తెంచుకువచ్చేస్తోంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.
అంటే... వారి దగ్గిర నా పని విషయంలో బెట్ కడుతున్నారా?" అన్నాను.
"ఏమయినా అనుకో! నేను ఆయన భార్యనన్న మాట మాత్రం తెలుసుకో".
"మీరు ఆయన భార్య కాబట్టే, ఇంతసేపూ మీరు నన్ను దులపరించేస్తున్నా, అవమానిస్తున్నా, మీ మీదుండే అభిమానంతో సహించి, ఇంతవరకు మీ గుమ్మంలో వున్నాను మీతో ఇప్పుడు ఏం మాట్లాడినా లాభంలేదు!"
"ఇప్పుడు కాదు ఎప్పుడూ లాభంలేదు...." అన్నా ఇంకా ఏదో అనబోయారావిడ.
"ఛీఛీ..... మీలో సంస్కారం అసలు లేదు" అంటూ విసురుగా వెళ్ళి కార్లో కూర్చున్నాను.
తరువాత శ్రీశ్రీగారితో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పాను.
"నువ్వు ఇంటికెందుకు వెళ్ళావు?".
"వెళ్ళాలనిపించింది".
"చివాట్లు తినాలనిపించించలేదూ?".
"అనిపించాకున్నా, అనుకోకుండా తినాల్సి వచ్చింది".
"బాగా తిన్నావా?".
"చిత్తుగా తినేసి వచ్చానండీ" అన్నాను.
చిన్నగా నవ్వారు, ఏమీ మాట్లాడలేదు.
సముద్రం లోతయినా తెలుసుకోవచ్చుగానీ, ఈయన మనసులోని మాట మాత్రం తెలుసుకోలేం అనుకుంటూండగా.
"ఏమిటాలోచిస్తున్నావు?" అనడిగారు.
"మీ గురించే" అన్నాను.
"నా గురించి ఆలోచించడానికేముందిలే. ఆవిడ గురించే ఆలోచిస్తున్నావు" కదూ.
అది కూడా కొంతవరకూ నిజమే.
ఆయన దగ్గరికి పనికివచ్చి కొన్ని నెలలయినా మా ఇంట్లో కాఫీ తప్పిస్తే భోజనం కానీ, ఫలహారం కానీ చేసేవారు కారు.
రవణమ్మ గారు భర్తను చాలా కట్టుబాటలలో వుంచారు. ఇంట్లోనే భోజనం చెయ్యాలి. వీధిలోకి వెళితే ఆయన మనీ పర్సులో ఆమె ఫోటో తప్పని సరిగా వుండాలి. బయలుదేరే ముందు భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలు తెలిపే ఫార్మాలిటీస్ కొన్ని నెరవేర్చాలి.
ఎన్ని గొడవలున్నా ఏమీ లేనట్టు హాయిగా వచ్చి తన పనేదో చేసుకుంటూ వెళ్ళిపోయేవారు శ్రీశ్రీగారు.
మా ఇంట్లో సరేసరి.... మరీ కట్టుబాట్లు.
శ్రీశ్రీ గారు తాగి ఎప్పుడైనా సాయంకాలం ఏడు గంటల తరువాత వస్తే ఇంట్లోకి రానిచ్చే దాన్ని కాను. పాపం, అలాగే గేటు దగ్గరకొచ్చి, "తలుపు తియ్యవన్నమాట. సరే.....వెళుతున్నాన"ని చెప్పి వెళ్ళిపోయేవారు. మనసులో ఎంత బాధగా వున్నా జాలివేసినా కంట్రోల్ చేసుకునేదాన్ని.
ఒకసారి చలపతిరావుగారి రికార్డింగ్ (శ్రీశ్రీగారు రాసిన పాటే) అయిన తర్వాత కారులోనే ఆయన (చలపతన్నయ్య) ఇంటికి వెళ్ళాం.
రాత్రి పన్నెండు గంటలవరకూ ఇద్దరూ తాగుతూ కూర్చున్నారు. చలపతి అన్నయ్య మీద నాకు చాలా కోపం వచ్చింది.
"ఇప్పుడు పనీపాటా ఏమీలేదు కదమ్మా! ఇంటికి వెళ్ళిహాయిగా నిద్రపోవడమేగా? నేను వచ్చి దిగపెడతా ఇంకెప్పుడూ ఇలా చెయ్యనులే" - అన్నారు.
ఒంటిగంట అయ్యింది. మమ్మల్ని దిగపెట్టడానికి చలపతిరావుగారు కారు తీశారు.
శ్రీశ్రీగారి మోతాదు మించిపోయింది. వెనుక సీట్లో పడుకోపెట్టాం. కారు స్టార్ట్ అయింది.
అంత మత్తులోనూ, "చలపతిరావుగారూ! ఎక్కడికి తీసుకువెళుతున్నార?"ని అడిగారు.
"ఇంటిక'న్నారు అన్నయ్య.
"ఏ ఇంటికి? సరోజ ఇంటికా? మా ఇంటికా?" సరోజ ఇంటికెందుకయ్యా బాబూ! మీ ఇంటికే" అన్నారు చలపతిరావుగారు.
"నేను ఏ ఇంటికి వెళ్ళను" అంటూ కారు తలుపులు తీసేసి, గెంతేస్తానని కూర్చున్నారు శ్రీశ్రీగారు.
మా అమ్మ బిక్కచచ్చిపోయింది. అసలే ఇరుకుగా కూర్చున్నాం.
ఒక చేత్తో స్టీరింగ్ నీ, రెండో చేత్తో శ్రీశ్రీగారినీ కంట్రోల్ చేస్తున్నారు చలపతన్నయ్య. తలుపు గట్టిగా పట్టుకొని లాగుతూ నేను కూర్చున్నాను.
ఈ విధంగా ఆరోజు వారిని వారి ఇంటికి చేర్చేసరికి మాకు తలప్రాణం తోకకి వచ్చింది.
తలుపులు బాదిన అరగంటకి ఆవిడ వచ్చి తీశారు. నాకు ఒళ్ళు కుతకుత వుడికిపోయింది.
"అర్ధరాత్రయినా వారు ఇంటికి రాలేదని తెలిసీ ఇంత హాయిగా ఎలా నిద్రపోయారండీ? పైగా అరగంట నుండీ అరుస్తూ తలుపులు బాదుతున్నాం" అన్నాను.
రాకపోకలకి, "తిండీ తిప్పలకీ మీకు వేళాపాళా లేదు. మీలాగే మేమూ వుండాలా? అదీ గాక, తగుదునమ్మా అని నువ్వు వేరే వున్నావుగా" అన్నారావిడ.
"దేనికి? ఇలాంటి పన్లకా?" అనడిగాను.
"బాధ్యతంటూ తీసుకుంటే అన్నీ భరించాల్సిందే" అన్నారావిడ.
"అలాగా? ఎంత పొరపాటు చేశానండీ! వారిని మా ఇంటికి తీసుకెళ్ళి వుండాల్సింది. అప్పటికి నా బాధ్యత పూర్తిగా నెరవేర్చినట్టూ అయ్యేది. ఈ అర్ధరాత్రప్పుడు మీచేత చీవాట్లు తప్పేవి". అన్నాను.
"తీసుకెళ్ళి చూడలేకపోయావూ?" అన్నారావిడ.
"చూడండి. నిర్నూచీగా నిద్రపోతున్నా మీరు అట్టే మాట్లాడకండి. మాట్లాడడం నాకూ తెలుసు. వారిని మా ఇంటికే కాదు ఎక్కడికి తీసుకు వెళ్ళాలన్నా అది నా చేతిలో పని. పెద్ద సమస్యేమీ కాదు, కానీ న్యాయానికి పోతున్నాను. మీకు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. శ్రీశ్రీగారి మంచి చెడ్డలకి మీరూ బాధ్యులన్నమాట మరచిపోకండి. కట్టుకున్న భార్యమీరు. అయినా వారి గురించి మీకు చెప్పాల్సిన దుర్గతి నాకు పట్టింది. మీ వారు కారులో వున్నారు. తీసుకువెళ్ళండి" అన్నాను.
ఆవిడ ఏదో అనబోతూ వుంటే "అర్ధరాత్రప్పుడు మీ వాధన్క బాగుంది కానీ ముందు శ్రీశ్రీగారిని లోపలికి తీసుకువెళ్ళండి. నేనింటికి వెళ్ళాలి. నా పెళ్ళాం నా కోసం గుమ్మంలోనే కాచుక్కూర్చుంటుంద"ని చలపతిరావుగారు అన్నారు.
"లేపండి వారే వస్తారు" అన్నారావిడ.
"అతను లేచే స్థితిలో లేడమ్మా" అన్నారు చలపతన్నయ్య.
"అంతవరకూ ఎందుకూరుకున్నారు? మీరుకూడా వున్నారుగా" అనడిగారావిడ.
"ఏవమ్మా - ఈ ప్రశ్న ఈ రోజు నన్ను అడుగుతున్నారా? ఈ జాగ్రత్త, ఈ అడగడం ముందే వుండి వుంటే అసలు శ్రీశ్రీకి తాగుడు అలవాటే వుండేది కాదేమో" అని వారిని ఇంట్లో పడుకోబెట్టేసి, మమ్మల్ని మా ఇంట్లో దింపేసి చలపతిరావుగారు వెళ్ళిపోయారు.
* * *
మర్నాడు ఇంకా సరిగ్గా తెల్లవారనేలేదు. తలుపు చప్పుడయ్యింది. తీసి చూసేసరికి ఎదురుగా రవణమ్మగారు!
ఆశ్చర్యపోతూ, "నమస్కారమండీ! లోపలికి రండ"న్నాను.
"మీ అమ్మా నాన్నగారూ వున్నారా?".
"ఉన్నారు రండి కూర్చోండి" అన్నాను.
"కూర్చోడానికి రాలేదు కానీ వాళ్ళని పిలువు. మళ్ళీ ఆయన లేచేలోగా నేను వెళ్ళిపోవాలి".;
అంటే ఆయనకి తెలియకుండా వచ్చారన్నమాట".
"అది నీకనవసరం" అన్నారావిడ.
ఆవిడ కూర్చోనన్నా బలవంతాన కూర్చోపెట్టాను. మా అమ్మా నాన్నగారూ వచ్చారు. అంతా కూర్చున్నాం. కాఫీ తాగనన్నా బ్రతిమాలి తాగించాను.
"చెప్పండ"న్నారు మా నాన్నగారు.
"మా వారిదగ్గర మీ అమ్మాయిచేత ఎంతకాలం పని చేయించాలను కుంటున్నారు?" అనడిగారావిడ.
మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాలో అర్ధంకాలేదు.
