Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 56

 

    అందరినీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించాడు విష్ణు.
    అందుకే ఏదో విశేషం వుండి వుంటుందని విలేకర్లు తమలో తామే గుసగుసలాడుకుంటున్నారు. ఆశ్రమంలోని శిష్యులు సయితం గురువుగారి వింత ప్రవర్తనను ఆకళింపు చేసుకోలేకపోతున్నారు. విష్ణు తన మందిరంలో నుంచి బయటకు వచ్చాడు.
    "మై డియర్ ఫ్రెండ్స్........హిందూ ధర్మం ఎంతో ఉత్తమమైనది సర్వమతాల సారం హిందూ ధర్మంలోనే ఇమిడి వున్నది. మన సంస్కృతీ సభ్యత, కట్టుబాట్లు విదేశాలలో సయితం ఎంతో గొప్పగా చెప్పుకునే విషయం మీ అందరకూ తెలిసిందే! అంతటి మహోత్క్రుష్టమైన హిందూ ధర్మ ప్రచారం చేసి చేసి అలసిపోయాను.
    'అందుకే నేను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ఆశ్రమ నిర్వహణ బాధ్యతను నా శిష్యులకు అప్పగించి ఈ జనారణ్యం నుంచి హిమాలయ పర్వతాలలోకి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇంతకాలం నా వెనుక విమర్చించిన వాళ్ళు కూడా వున్నారు. నేను ఒక దొంగ సాధువుననీ, దొంగ యోగిననీ అన్నవాళ్ళు వున్నారు.
    "నేను ఎలాంటి శక్తులూ లేని ఒక అల్పున్ని మాత్రమే నని, ఆశ్రమము పేరుతొ వచ్చిన ధనాన్ని నా స్వార్ధానికి వినియోగించుకుంటున్నానని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే! అలా అని ఇదేదో నా శక్తి యుక్తులను ప్రదర్శించడానికి ప్రయత్నం కాదు. అసలు నాలో నిజంగానే మానవాతీత శక్తులు వున్నాయో లేదో నాకు నేనే నిరూపించుకోవడానికి ఒక ప్రయోగం చేయబోతున్నాను.
    "అందుకే మీరందరూ చూస్తుండగా జీవసమాధి ప్రవేశం చేయాలనీ సంకల్పిస్తున్నాను. నాలో నిజంగానే అద్భుత శక్తులు నిబిడీకృతమై వుంటే సజీవుడిగా మీ ముందుకు వస్తాను. లేదంటే నేను సమాధి అయి పోతాను."
    గంబీరంగా చెప్పిన ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటాలా అందరి హృదయాలను తూట్లు పోదిచినంత పనిచేశాయి.
    కొందరు విష్ణు గొప్పదనాన్ని పొగిడితే, మరికొందరు ఏం జరుగుతుందో చూద్దాం అని విమర్శించే వాళ్ళతో పాటు అంత గొప్ప వ్యక్తికీ అలాంటి సజీవ సమాధి ఒక లెక్కా అని ప్రక్కవాళ్ళతో వాదించే వాళ్ళు అధికంగానే వున్నారు.
    విలేఖరులు మాత్రం తమ అనుమానాలన్నీ తరచి తరచి ప్రశించి మరీ తెలుసుకున్నారు.
    విష్ణు వాళ్ళ ప్రశ్నలన్నింటికీ ఓర్పుగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు.
    "రేపు మహత్తరమైన రోజు. అందుకే జీవసమదిలోకి రేపే ప్రవేశించదల్చుకుంటున్నాను. భవానీ ద్వీపంలో తూర్పు వైపుగా పది అడుగుల మేర శుభ్రం చేసి సమాధి కోసం త్రవ్వండి........రేపు సూర్యోదయం కావడంతోనే అందులోకి ప్రవేశిస్తాను. తిరిగి నాలుగు గంటలు తరువాత సమాధి తెరచి చూడండి." అని చెప్పి తన మందిరంలోకి నడిచి వెళ్ళిపోయాడు విష్ణు.
    ఆ నిర్ణయం విన్న ఆశ్రమవాసులందరూ నిర్విణులయ్యారు.
    కానీ, విష్ణుకు అత్యంత అంతరంగికునిగా మెలిగే శిష్యుడు రమేష్ మాత్రం దీర్ఘాలోచనలో మునిగిపోయాడు.
    తనను ఎవరూ గమనించడం లేదని నిర్ధారించుకున్న తరువాత తన గదిలో నుంచి ఎయిర్ బాగ్ తో బయట పడ్డాడతను.
    ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ దగ్గర ఆగి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడి తిరిగి బయటకు వచ్చేశాడు రమేష్.
    ఐదు నిమిషాల తరువాత ఆ బూత్ దగ్గరకు వచ్చి ఆగిన పోలీస్ జీప్ లో నుంచి ఇన్ స్పెక్టర్ వినయ్ క్రిందకు దిగాడు.
    టెలిఫోన్ బూత్ లోకి వెళ్ళినంత వేగంగా వెనుతిరిగి జీప్ ను స్టార్ట్ చేశాడతను.
    ఇన్ స్పెక్టర్ వినయ్ ప్రక్కనే రమేష్ దగ్గర వుండవలసిన ఎయిర్ బాగ్ వున్నది. జిప్ తెరచి లోపలున్న వీడియో క్యాసెట్స్ ను తీసుకున్నాడు.
    అంతవరకూ దృశ్యాన్నంత దూరం నుంచి గమనిస్తున్న రమేష్ అప్పుడు ఆశ్రమం వైపు కదిలాడు.

                                                        *    *    *    *

    పోలీస్ కమీహనర్ కార్యాలయం......
    కమీషనర్ పృద్విరాజ్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
    ఆ సమావేశంలో ఏ.సి.పి కిరణ్మయి, కలెక్టర్ ధీరజ, ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ లు పాల్గొన్నారు.
    అందరిలోకి ముందుగా పెదవి విప్పింది ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
    "సర్.......రోజురోజుకు విష్ణు పట్ల భక్తీ భావం పెరిగిపోయింది. అతను ఏది చెబితే అది జనం ఆచరిస్తారనీ, తనమాట వేదవాక్కులా భావిస్తారని విష్ణుకు అహంభావం ముదిరిపోయింది. డానికి పరాకాష్టే విష్ణు ఆడబోతున్న ఈ 'జీవసమాధి' అనే మరొక నాటకం అని నాకనిపిస్తుంది" ఆవేశంగా చెప్పుకుపోతున్నాడతను.
    "ఇన్ స్పెక్టర్ ప్లీజ్ స్టాప్......స్టాపిట్ యువర్ కామెంట్స్" ధీరజ అసహనంగా అన్నది.
    "వై?" అంతే షార్ప్ గా ప్రశ్నించాడు కమీషనర్.
    "కమీషనర్ గారూ ....విష్ణు స్వార్ధపరుడు కాదు.'
    "ఐసి......మీకు ఆయనపట్ల అచంచలమయిన విశ్వాసం, నమ్మకం వుంది కాబట్టి అయన ద్వైవస్వరుపంలోనే కనిపించవచ్చు. కానీ అతని గురించి మా పరిశోధనలో మరొకలా వుంది. అతని నిజస్వరూపాన్ని తొందరలోనే బయట పెడతాము. అతనొక దొంగ స్వామి.....ఎలాంటి శక్తి లేని సాధారణమైన సన్యాసి........మతం పేరుతొ అమాయకులను వంచిస్తున్న బూటకపు స్వామి....
    "సారీ సర్........ఉన్నత పదవిలో వున్న మీరు అనవలసిన మాటల్యు కావని......." ధీరజ గొంతు గద్గాదికమయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS