Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 56

 

    "థాంక్స్ వదినా. ఈసారి రామేశ్వరిని నీకు పరిచయం చేస్తాలే!" గర్వంగా అన్నాడు సత్తిపండు.


    "తప్పకుండా! ఈసారి నుండి నలుగురం తిరగాలి తెలిసిందా!"


    "ఓకె వదినా"


    ఈలోగా బెరర్ మీల్స్ తెచ్చి పెట్టాడు. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ తినసాగారు.


    గంట తర్వాత నింపాదిగా లేచారు.


    బెరర్ కు  పదిరూపాయల టిప్పు ఇచ్చాడు శ్రీచంద్ర..


    "గురూ! నాకాస్తా పని వుంది మీరెళ్ళండి" అన్నాడు సత్తిపండు. ఆ బెరర్ దగ్గరికి వెళ్లి ఆ టిప్పులో సగం తను వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన అతనిది.


    "చంపేస్తాన్రోయ్! నీకెందుకు కక్కుర్తి? ఇదిగో ఓ వంద జేబులో వుంచుకో" అంటూ ఓ వంద నోటు సత్తిపండు జేబులో పెట్టాడు.


    "గురూ! ఎవడో నా జేబులో చేయి పెట్టి వంద కాజేస్తున్నాడు" సత్తిపండు అరిచాడు.


    "గుడ్డివెధవా! వందరూపాయలు పెడుతున్నాన్రా" అన్నాడు.


    అక్కడ్నుంచి షాప్ కి వెళ్లి సమీరకు ఓ చీర కొన్నాడు.


    "రేయ్ చందూ!" అంటూ అరిచేసింది షోరూమ్ లోనే సమీర.


    జనమంతా విచిత్రంగా చూసారు.


    సమీర అనందం పట్టలేక చీర విప్పేయబోయింది.


    "ఏయ్! ఏం చేస్తున్నావు సమ్మీ!" కంగారుగా అరిచాడు శ్రీచంద్ర.


    "నాకు నీ వ్యవహారం చూస్తుంటే మెంటలేక్కిపోతుందిరా. నామీదెంత ప్రేమరా" అంది.


    "చూస్తుండు సమీ....నేను కొన్న ఈ చీర కట్టుకుని నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే...."


    "అప్పటిగ్గాని జనం క్యూ కట్టి నా అర్ధనగ్న విశ్వరూపాన్ని చూసి జడుసుకుని చస్టారు" అంది సమీర.


    "అర్ధనగ్న విశ్వరూపమేంటి సమ్మీ....."


     "లేకపోతే నువ్వు తెచ్చిన చీర కట్టుకుని రోడ్డుమీద నడవాలా? మరి పెటికోట్, బ్లౌజ్ ఎవడు తెచ్చిస్తాడు? అసిస్టెంట్ డైరెక్టర్ తబలా కృష్ణా, పాలుపోసే గన్నాయ్ గాడా, రోజు బస్టాప్ లో నాకు సైటు కొట్టే కౌన్ కిస్కాగాడా?" కోపంగా అడిగింది సమీర వళ్ళు మండి.


    "అదా సంగతి కొంటాను. అన్నీ కొంటాను" అన్నాడు బుద్దిగా శ్రీచంద్ర.


    తర్వాత నటరాజ్ లో సినిమా చూసారు. ఆ రోజు ముగ్గురూ బాగా ఎంజాయ్ చేసారు మొదటిసారిగా.

 

                                                      * * *

    
    పూజ గదిలో వుంది భువన.


    హారతి అరచేతిలో పెట్టుకుంది. చేయి వణుకుతోంది. ఉదయం ఓ దొంగ సాధువు ఆ ఇంటికి వచ్చాడు. భువన మెంటాల్టి అర్ధమైంది అతనికి.


    "నీలో పతివ్రతా లక్షణాలు కనిపిస్తున్నాయి" అంటూ పోగిడేసాడు. దాంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది.


    "అరచేతిలో దేవుడికి హారతి ఇవ్వు. నీ పాతివ్రత్యానికి ఇప్పటికే దేవుడు తెగ మేచ్చేసుకున్నాడు. అరచేత్తో దేవుడికి హారతి ఇస్తే నీ పాతివ్రత్యం గురించి ముల్లోకాలకు తెలిసిపోవడమే కాక వచ్చే జన్మలో గొప్ప మొగుడు దొరుకుతాడు" అంటూ చెప్పాడు.


    ఆ మాటలు ఆమె చెవిలో గింగురుమంటున్నాయి. వణుకుతున్న చేతులతో కర్పూరం అరచేతిలో పెట్టుకుని క్యాండిల్ తో కర్పూరం వెలిగించింది.


    వెంటనే చేయి భగ్గుమంది. భయంతో హారతి కిందకి గిరాటేసింది. ఆ కంగారులో కర్పూరం ఆమె చీర మీద పడి అంటుకుంది.


    పెద్దగా కేకవేసింది.


    హాలులో పేపర్ చదువుకుంటున్న త్రిలోకం కంగారుగా పూజ గదిలోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి వెంటనే అంటుకుంటున్న ఆమె చీరను తన చేత్తో ఆర్పే ప్రయత్నం చేసాడు.


    అప్పుడప్పుడే మంటలు వస్తున్నందున ప్రమదం తప్పింది. ఆ ప్రయత్నంలో త్రిలోకం చేతులు కాలాయి కొద్దిగా.

 

                                                           * * *


    త్రిలోకం మంచం మీద పడుకున్నాడు. రెండు చేతులకు బొబ్బలు వచ్చాయి. భువన ఇంకా ఆ షాక్ లో నుంచి కోలుకోలేదు.


    "నీకు.....నీకసలు బుద్ది వుందా అమ్మా. ఏంటమ్మా నువ్వు చేసిన పని? నాన్న మంచివాడు కాబట్టి నిన్ను భరిస్తూ వచ్చాడు. పతివ్రతా వ్రతం అని పిచ్చిపిచ్చిగా వేడినీళ్ళు, ఫినాయిల్ నీళ్ళు, కాఫీ నీళ్ళు, .....ఇలా అన్నీ రకాల ప్రయోగాలు చేసావు. అది ఎందుకు? వచ్చే జన్మలో మంచి మొగుడు దొరకాలనా? కళ్ళ ముందు ఈ జన్మలో నీకు దొరికిన మంచి మొగుడ్ని వదిలేసి వచ్చే జన్మలో మంచి మొగుడి కోసం వ్రతం చెయడమేమిటమ్మా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే చాలామంది సాధువులు బోల్తా కొట్టించి మహిమలని, పూజలని, అరిస్టాలని డబ్బులు దోచుకుంటూ మరిన్ని ఎత్తులు వేస్తున్నారు. చూసావా అమ్మా! నీకోసం నాన్న తన చేతులు కాల్చుకున్నాడు. ఆదమ్మా ప్రేమంటే? భార్య అమాయకత్వాన్ని కూడా ప్రేమించాడు నీ భర్త" అంది తల్లి వైపు చూస్తూ సమీర.


    ఒక చిన్న సంఘటన.


    ఒక చిన్న సన్నివేశం.


    ఒక చిన్న ఆలోచన......చాలు మనిషిలో వున్న మరో మనిషిని స్పందింపజేయడానికి.


    ఓ మనిషికి పరివర్తన కలగడానికి సంవత్సరాల పశ్చాతాపం అక్కర్లేదు అది భువన విషయంలో రుజువైంది.


    ఇక ఆమె ఎప్పుడూ ఇలాంటి పతివ్రతా వ్రతాలూ చేయకపోవచ్చు. ఆమె ముడత్వం పటాపంచలయింది.


    
                                                         * * *


    ఆ రాత్రంతా శ్రీచంద్రకు కంటిమీద కునుకులేదు.


    తెల్లారాక యమధర్మరాజు ప్రత్యక్షమవుతాడు. అతను "ఎప్పుడూ చస్తావని అడుగుతాడు. తనేమని చెప్పి తప్పించుకోవాలి. ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి. తన తెలివికి పదను పెట్టాలి.


    ఈలోగా తన కోరికలన్నీ తీర్చుకోవాలి.


    "కుమారా....."


    ఈ మాటలు విని ఉలిక్కిపడి లేచాడు శ్రీచంద్ర. ఆరోజు తను ఆత్మహత్య చేసుకోబోతుంటే సరిగ్గా ఇలాంటి.....ఛ..ఛ....ఇదే వాయిస్ వినిపించి తనని కాపాడింది.


    "ఎవరు....ఆకాశవాణినా?" అడిగాడు చుట్టూ చూస్తూ శ్రీచంద్ర.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS