Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 56

    "ఆఫ్ కోర్స్! వరాలు విషయమే అనుకో. మీ జవాబులు కూడా ఈ హత్య కేసుకు ఉపయోగపడతాయేమోనని అడుగుతున్నాను, అంతే.....ఏం చెప్పటం ఇబ్బందా మీకు?" అన్నాడు నవ్వుతూ.

    "అదేం లేదు!" అన్నాడు నవ్వుతూ కోటేశ్వరరావు.

    "మరికేం, మీ ఫ్రెండ్ గా భావించి చెప్పండి. క్యాజువల్ గా తప్పేముంది?" అన్నాడు నాగేశ్వరరావు.

    "చెప్పటానికి నాకేం అభ్యంతరం లేదు గానీ వరాలు కేసుకి.....నా భార్య పుట్టింటికి వెళ్ళటానికి లింకేముందా? అని ఆలోచిస్తున్నాను....." అన్నాడు నవ్వుతూ.

    "ఏంట్రా! నీ ఫ్రెండ్ అంటున్నావు, అయన ఇల్లేమో పక్కనే ఉంది. కనీసం మనల్ని అయన ఇంటికి పిలిచి మంచినీళ్ళు అయినా ఇవ్వడా?" అన్నాడు లాయర్ నాగేశ్వరరావు నవ్వుతూ.

    మాధవరావు. కోటేశ్వరరావు ఇద్దరూ ఖంగుతిన్నారు.

    ఇదేంటి వీడు కోటేశ్వరరావుని 'ఇంటరెగేట్ చేస్తున్నాడు.....' అనుకున్నాడు మాధవరావు.

    "అరె! దాన్దేముంది రండి సార్ మా ఇంటికెళ్దాం....." అన్నాడు కోటేశ్వరరావు.

    ముగ్గురూ నవ్వుతూ అతనింటి వేపు అడుగులు వేశారు.

    ఇల్లు నీట్ గా సర్ది ఉంది.......మూడు గదుల ఇల్లు......వరండా.....హాలు....హాలు పక్కనే చిన్న గది హాలుకు అనుకుని ఉంది. హల్లో నుంచే లోపలికి మరో గుమ్మం అది వంటగది. క్షణంలో ఇల్లంతా పరిశీలించాడు నాగేశ్వరరావు హాల్లోనే కూర్చుని.

    "మంచినీళ్ళు తీసుకోండి సార్...." అన్నాడు కోటేశ్వరరావు రెండు గాజు గ్లాసులతో నీళ్ళు తెచ్చి. వాటిని నవ్వుతూ అందుకుని తాగారు మిత్రులిద్దరూ.

    "అన్నట్టు మీ భార్య పుట్టింటికి ఎందుకెళ్ళింది కోటేశ్వరరావుగారూ ఏదైనా గొడవపడ్డారా?" అన్నాడు నవ్వుతూ లాయర్.

    "మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు....." అన్నాడు నవ్వుతూ.

    "ఇబ్బంది అయితే చెప్పకండి. మీ స్నేహితుడు ఉన్నాడని ఇబ్బంది పడుతున్నారేమో...." అన్నాడు నాగేశ్వరరావు నవ్వుతూ.

    "ఏదో చిన్న గొడవ పడ్డాం సార్. దానికే అలిగి వెళ్ళిపోయింది" అన్నాడు కోటేశ్వరరావు.

    "వరాలు విషయమేనా?!" అన్నాడు వెంటనే నాగేశ్వరరావు.

    కోటేశ్వరరావు నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు.

    మాధవరావు కూడా ఆశ్చర్యంగా వింటున్నాడు.

    "చెప్పండి, వరాలు విషయమే కదా! ఆమెతో మీకు అక్రమ సంబంధం ఉందనే విషయం మీ భార్యకు తెలిసిపోయింది. తెలిసి పోవటంతో వరాలుతో మీ పరిచయం మరీ పెరిగింది. దాంతో మీ భార్య తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. వరాలు అద్భుత సౌందర్యరాశి కనుక ఆమెను మీరు వివాహం చేసుకుంటానన్నారు. సుందరం ద్వారా ఆమెకు వేలకు వేల రూపాయలు అందుతున్నాయి. ఆమె మీ చెయి దాటిపోతుందేమో అన్న భయంతో సుందరం విషయం మీ స్నేహితుడయిన మాధవరావుకు చెప్పారు. అతన్ని కట్టడి చేయమని, కరెక్టేనా?" అన్నాడు నాగేశ్వరరావు.

    కోటేశ్వరరావు ముఖంలో రంగులుమారిపోయాయి. ముఖం నల్లగా మరిపోయింది. గొంతు తడుపుకుంటూ......

    "నో.....అదేంకాదు.....మీరు చెప్పిందంతా అబద్దం...." అన్నాడు పెద్దగా అరుస్తూ.

    "అరె, ఎందుకు సార్ అలా అరుస్తారు? అబద్దం అయితే మంచిదే దానికంత కంగారుపడతారెందుకు?" అన్నాడు.

    "ఆరోజు రాత్రి కరణం, సుందరం గొడవపడటం మీరు విన్నారు పరిస్థితి మీకు అర్ధమైంది.....కరణం మళ్ళా వస్తాడని మీరు ఉహించారు. ఆ ఇంటి దగ్గరే నిఘా వేశారు. ఎవరూ రాకపోయేసరికి మీరే వరాలు సొమ్ములు, నగలు అన్నింటిని దొంగిలించి, వరాలును హత్య చేసి......" హత్యానేరం సుందరం పైన మోపారు....పోలీసులకు ఫోన్ చేశారు." అన్నాడు నాగేశ్వరరావు సిగరెట్ వెలిగించుకుని, చీకట్లో బాణం వేసి,
    "నో....ఆ హత్య నేను చేయలేదు" అన్నాడు.

    "మరెవరు చేశారు? నువ్వు చేయలేదని నాకు తెలుసు, నీచేత నిజం చెప్పించాలనే అలా అన్నాను. చెప్పు ఎవరు చేశారు?" అన్నాడు నాగేశ్వరరావు సీరియస్ గా.

    "ఏమో! నాకు తెలియదు" అన్నాడు వెంటనే.

    నాగేశ్వరరావు మాధవరావు వేపు చూశాడు....అతని భావం అర్ధం చేసుకున్న మాధవరావు కోటేశ్వరరావు రెండు చెంపలు వాయించాడు.

    "చెప్పరా.....రాస్కెల్! హత్య ఎవరు చేశారు?" అన్నాడు.

    "భీమా.....అన్నాడు కోటేశ్వరరావు.

    "భీమానా వాడేవాడు?" అన్నాడు.

    "కరణం నమ్మినబంటు!" అన్నాడు కోటేశ్వరరావు.

    "నిజంగా హత్య చేసేశాడా? అసలు వరాలు చచ్చిపోయిందా? బ్రతికే వుంది కదూ....?! హత్య జరిగితే పోస్ట్ మర్టమ్ రిపోర్టు ఏది? పోలీసులు మీరు కుమ్మక్కు అయి, సుందరాన్ని భ్రష్టుపట్టించాలనే రాజకీయంతో ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుంటూ, డబ్బులు ఏవో పెట్టి కేసును సుందరం పైకి నెట్టారు అవునా?" అన్నాడు నాగేశ్వరరావు.

    "సార్!" అంటూ వాడు నాగేశ్వరరావు కాళ్ళ మీద పడ్డాడు.

    "నా అంచనా కరెక్టు అయితే, వరాలు ఆ గదిలో వుంది. తలుపు తీయి" అన్నాడు నాగేశ్వరరావు.  
    మాధవరావు, కోటేశ్వరరావులు ఇద్దరూ బిత్తరపోయారు.
    "ఏంట్రా! నువ్వనేది నిజమా! వరాలు చనిపోలేదా?!" అన్నాడు మాధవరావు.

    "చనిపోలేదురా ఫూల్! చనిపోయినట్లు వీళ్ళు నాటకం ఆడి , పోలీసులకు డబ్బు పంచి పెట్టి సుందరాన్ని దోషిగా నిలబెట్టారు. ఎందుకంటే వరాలు కోసం పెళ్ళాన్ని కూడా వదులుకున్న ప్రబుద్దుడు నీ స్నేహితుడు. ఆమె అందాల రాశి అన్నాడు....అక్కడే దొరికిపోయాడు నాకు. ఆమెని ఎలా చంపుకుంటాడు.....ఆమె దగ్గర బోల్డంతా ఆస్తి కూడా ఉంది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుని ఉంటారు. పధకం వేశారు. ఒకవిధంగా ఇప్పుడు ఈ కేసులో ఇందాకటి వరకూ దోషి కరణం....వాడు ఆమెను చంపించటానికే ఆ భీమాగాడ్ని పంపాడు. మధ్యలో వీడు ప్రియురాలిని రక్షించుకోవటానికని భీమాగాడిని డబ్బిచ్చి పంపించేసి....చంపినట్లు కరణానికి చెప్పమని ఉంటాడు. వరాలును డమ్మీ కత్తితో పొడిచినట్లు.....సృష్టించి పోలీసులను కొంతవరకు నమ్మించి, వారికీ డబ్బులు వెదజల్లి ఆమెను తరువాత తనింటికి తెచ్చుకుని ఉండి ఉంటాడు. ఏరా నిజమేనా ఆ తలుపు తీయి...." అన్నాడు నాగేశ్వరరావు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS