Previous Page Next Page 
తుపాన్ పేజి 55

                                                                         36
   
    ఉదయమే  చమోలీ  చేరి, అక్కడ  బసచేసి  చీకటిపడేవేళకు  మత్ చట్టీ చేరాము. మత్ చట్టీ పరిసరాలన్నీ తోటలే. ఇక్కడ నుంచి  హిమాలయాలని పిలువచ్చును.  అక్కడ  ఆ  రాత్రి మకాంచేసి,  తెల్లవారగట్లకు  సియాసీన్ చేరాము. అచ్చట  హిమవత్పర్వత  సౌందర్యం  కొంచెం  రుచి చూడ ప్రారంభించాను.  అలకనంద  రెండు  ఎత్తయిన పర్వతాల మధ్య  నుండి  అత్యంతాశ్చర్యకరంగా ప్రవహిస్తూంది.

    నేను   ఈ   స్వాములతో, ఈ   రాజపుత్ర  జమీందారుతో  కలిసి  హిమాలయాలలో   ప్రయాణం  చేస్తూవుండడం  నాకే  ఆశ్చర్యం  కలుగజేసింది. ఎందుకు  ఈలా  ప్రయాణమైనాను? ఎట్లా తీసుకురాగలిగారు  ఈ  స్వామీజీ?  మా  అమ్మ  ఏదీ?  ఈలాటి  ఆలోచనలు  ఎక్కువయ్యాయి. నేను  హిమాలయ  పర్వత శ్రేణిలో కరిగిపోతే? నా  కేదైనా  జబ్బుచేస్తే?  పీడ విరగడై పోతుందికదా!  ఈలా   పరిణమించిందేమిటి  నా  చరిత్ర?  నా  ఆస్తినంతా  అమ్ముకున్నాను, మా  ఊళ్లో  శకుంతల  పేరిట  విద్యాలయం కట్టమన్నాను. తాడూ, బొంగరం  లేనివాణ్ణయ్యాను. నాకూ, లోకానికీ సంబంధం శకుంతలే. నాకూ, జీవితానికి  నా  శకుంతలాదేవే  పెనవేసిన  బంగారుత్రాడు. ఆ  త్రాడు  తెగిపోయిది.  నేను  త్రాడుతెగిన  గాలిపటంలా  ఆకాశాన  ఎగురుతున్నాను. ఏ  గాలి కొడితే  ఆ  గాలికి  ఎగిరాను.  ఇప్పుడీ  కొండల్లో  ఏ  గాలికో కొట్టుకు వెడుతున్నాను.

    హల్ చట్టీ, గరూల్ గంగా, పాతాళగంగా, గులాబ్ కోటీ, కుంబార్ చట్టీ చేరాము. హరిద్వారం  దాటి   55 మైళ్ళు  వచ్చాము. ఎదురుగుండా  మంచు కప్పిన పర్వత  శిఖరాలు, చలీ. ఎంత  చక్కని  దృశ్యం!  కన్నుల  పండువ  చేస్తున్నది. నాకేమి  బుద్దిపుట్టిందో  నా పెట్టెలో ఉన్న  బొమ్మలు  వేసే  స్కెచ్చి పుస్తకము, రబ్బరుముక్క, పెన్సిలు  తీశాను.  అయిదారు  బొమ్మలు  వేశాను. చమరీ  మృగాలను  తోలుకువెళ్ళే   మనుష్యులు, ఆ  సన్నని  ఇరుకు  దారి, క్రింద అలకనంద  మహావేగంతో  ప్రవహించడం? రాళ్ళు, మంచు, హిమానీజలాలు, స్వాచ్ఛ నీలాకాశం, ఏలాగు వేగవంతాలై  నావేళ్ళు ప్రసరించి పోయినవో కాని  ఎంతో  చక్కని  బొమ్మలు  ఉద్భవించాయి. మా  రాజపుత్ర  జమీందారుని, స్వాములందరినీ, కూలీలను, మా పొట్టి గుఱ్ఱాలను  అన్నీ  బొమ్మలు వేయడం  ప్రారంభించాను. లేప్చాలు, భూటియాలు, గర్ష హవాళీలు,  ఆడవారు, వారి పనులు,  నాట్యాలు  అన్నీ వేయసాగాను. మా  జట్టంతా  ముందు  వెళ్ళింది. నేను వెనకాలే  వస్తానని, బొమ్మలు  గీసుకుంటూ  నెమ్మదిగా   వెళ్ళాను.  యాత్రికుల  జట్టు లెన్నో  జ్యోతిర్దర్శనం  చేసుకొని  వస్తూన్నావట, ఏమిటో  ఆ  జ్యోతి? 
   
    బదరీనారాయణస్వామి  గుడి  పదివేల   అడుగులపై చిల్లర  ఎత్తు  ఉండడం  చేత  శీతాకాలంలో   ఆ  ప్రదేశం  అంతా  తెల్లటి  వెన్నలాంటి  మంచుతో కప్పబడి  పోతుంది. అందువల్ల  ఆ ప్రదేశంలో  ఎవ్వరూ  ఉండలేరు.  దేవుళ్ళ  ఉత్సవవిగ్రహాలు  తీసికొని, పూజారులు  జోషీమఠంలో వచ్చి ఉంటారట. కొందరు  నందప్రయాగ వెళ్ళి  ఉంటారట. దీపావళి  అమావాస్య  వెళ్ళగానే  స్వామి దేవాలయంలో  ఒక  అంగడిలో   ఆవునెయ్యి  అయిదు శేర్లు పోసి, వత్తి  ఉంచి, జ్యోతి  వెలిగించి,  తలుపులుమూసి,  తాళంవేసి, సీళ్ళు వేస్తారట.  మళ్ళీ  ఏప్రియల్   నెలలో  సుభదినంనాడు  ద్వారాలసీళ్ళు తెరచి, తలుపులు  తెరిస్తే   బదరీనారాయణజ్యోతి  వెలుగుతూ  వుంటుందట. అనేకులు  పెద్దలూ, పిన్నలూ  ఆ  జ్యోతిని  సందర్శించడానికే  ఆ  రోజున  వస్తారట. '' బదరీ  విశాలలాల్  జీకి జై''యని  పరవశత్వంతో  జ్యోతిని  దర్శనం  చేసుకొని  నమస్కరిస్తారట.  ఈ   జ్యోతి  ఆరునెలలు  మంచుచేత  కప్పబడి  పూడిపోయిన  గుళ్ళో  ఎల్లా  వుంటుంది?  శాస్త్రదృష్యా  అది  అసంగతము. ,మంచుచేత  కప్పబడిన  బొగ్గుపులుసు  గాలిని  వదలుతూ ప్రాణవాయువు  అంతా  అయిపోవడం చేత  ఆరిపోవాలి.  అదీగాక  అయిదు శేర్లు నేయి దీపం  రెండు  రోజులలో  వెలిగి  దీపం  కైలాసం  అంటుతుంది.  అలాంటిది   దీపం ఆరదు, నెయి యింకా శేరు  మిగులుతుందట!

    ఇది  దేవతల  మహత్తు  అంటారు! మంచుచే  కప్పబడిన  అతిశీతల  వల్ల  కర్చుచేసే  ప్రాణవాయువూ,  నెయ్యికూడా  తక్కువేమో! ఈ  విచిత్రం  కూడా తప్పక  శాస్త్రాని  కందుతుందనే  నా  ఉద్దేశం.  హిమాలయ ప్రయాణం  ఆరోగ్యదాయకమని  మన  పూర్వులు  బడరీకేదారాది  యాత్రలు  చేశారని  నా  ఉద్దేశం. ఈ  మాత్రం  ఆలోచించడం  ప్రారంభమైంది  నాలో,  ఇంతలో  మాజట్టు  వెనకాలే   జోషీమఠం  చేరాను.  ఎన్నో  దేశాలవారు  యాత్రకు  వస్తున్నారు. బిడ్డలు, యవ్వనులు,  పెద్దలు,  ముసలివారు నిర్భయంగా  భక్తితో  ఈ  కష్ట  మార్గాల  వేలకొలదీ  సంవత్సరాలనుండి  ఈ   యాత్రలు  చేస్తున్నారు. పాండవులు  ఈ దారిని  వెళ్ళారు.  మహాఋషులనేకులు  ఇక్కడే వాసం చేశారు.  ఈనాటికీ  ఈ  జనం  వస్తూనే  ఉన్నారు.  పండాలు,  గర్హవాల్  సంస్తానోద్యోగులు, బ్రిటీషు  ప్రభుత్వోద్యోగులు  ఇక్కడ  వాసం    చేస్తున్నారు. భోజన పదార్థాలు  సంపాదిస్తున్నారు,  వంటలు  చేసుకుంటుంన్నారు.  ప్రేమించుకుంటుంన్నారు. ఆనందిస్తున్నారు,  కష్టాలుపడుతున్నారు, ధుఃఖిస్తున్నారు, స్త్రీ  పురుషులు   కామించుకొంటున్నారు, బిడ్డలను  కంటున్నారు.

    ఓహో! ఈ  హిమాలయ  ప్రపంచానికీ,  క్రింద  భారతీయ  విశాలసమ  ప్రదేశాలకూ ఎంత  తేడా!  హృదయాలు  దోషకళంకపూరితాలై  ఉంటాయి అక్కడ. జీవితం  కర్కశమై, చెడుదారులనే  ఆశిస్తుంది.  ఈ  హిమాలయాలలో,  ఈ   ఎత్తయిన కొండలలో, ఈ  రాళ్ళలో, మంచుగడ్డలలో, అతిశీతలపు  నదులలో, హెచ్చుతగ్గులలో  జీవనం  ఎంత  ఆర్ద్రం?  ప్రేమమయం.  ఈ   అతి  కర్కశభూములలో  ఎంత  నిధానమైన, కల్మషరహితమైన  జీవితాలివి అనుకున్నామ.
   
                                                37
   
    అడవులనిండా  తెల్లగులాభీపూలు, పర్వత  గ్రామాలలో  బంగారు  గులాభీపూలైన యవ్వనవతులు.  ఆ  అడవులలో,  ఆ  లోయలో, ఒకప్రక్క  మహోన్నత  పర్వతాలు, ఒకప్రక్క  పాతాళ   ప్రదేశంలో  మహావేగంతో,  సంతతగంభీరాగ  హృదయంతో  ప్రవహించి పోతున్న  అలకనంద.

    జోషీమఠం  చేరాము.  జోషీమఠం  పెద్దబస్తీ.  ఊరంతా తిరిగి, చమరీ  మృగపుతోళ్ళు,  పెద్దపులితోలు  ఒకటికొన్నాను. తెల్లచిరుతపులి  తోలు సంపాదించాలని  కోర్కెకలిగింది.  అక్కడ    ఆ    గాంధర్వశిల్పులు  రచించినచిత్రాలు, దారుశిల్పాలు కొందామనుకుంటే, స్వామీజీ తిరుగుదారిలో కాని,  మా  అమ్మను  తీసుకుని  రెండవసారి  ప్రయాణం  చేసినప్పుడు  కాని  కొనవచ్చునన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS