డియర్ గ్రేటాగార్బో
(అవకాశాలు)
నువ్వు నన్ను చూశావనుకుంటా ఇటీవల డెట్రాయిట్ లో
జరిగిన దొమ్మి సందర్భంలో తీసిన న్యూస్ రీల్ చిత్రంలో
ఆ కుమ్ములాటలో నా తల బద్దలయిందిలే. నేను
ఫోర్డుకంపెనీలో పనిచెయ్యడంలేదు గాని సమ్మె సంగతి
నా స్నేహితుడొకడు చెప్పాడు. ఆరోజు నాకు వేరే ఏ పనీ
లేనందున దొమ్మి జరిగినచోటికి ఇద్దరం వెళ్లాం చిన్నచిన్న
గుంపులుగా నిల్చుని అదీ యిదీ చెప్పుకుంటూ వార్తా
పత్రికలు నెమరు వేస్తున్నాం. విప్లవభావాలు గాలిలో జోరుగా
తేలుతున్నాయి. అయితే నేనేమీ లక్ష్యపెట్టలేదు.
విశేషం ఏదీ జరుగుతుందని నేననుకోలేదుగాని యింతట్లోనే న్యూస్ రీల్ మోటారుకార్లు అటు రావడంతో నాకు గొప్ప ఊహ తట్టింది. భేష్ ఎన్నాళ్ళనించో సినిమాలో నటించాలనుకుంటూవుంటే యిప్పుడు గొప్ప ఛాన్సు వొచ్చింది. కాబట్టి ఈ అవకాశం పోనివ్వకూడదని అక్కడే కనిపెట్టుకుని ఉండిపోయాను. తెరమీద చక్కగా కనిపించే మొగం నాకు వుందని ఎప్పుడూ నా గట్టి నమ్మకమే. ఆ రోజు నా నటన కూడా నాకు సంతసం కలిగించింది. అయితే నాకు సంభవించిన అల్ప ప్రమాదంవల్ల ఓ వారంరోజులు ఆసుపత్రిలో వుండిపోవలసి వచ్చింది.
దానికేంగాని ఆసుపత్రిలోంచి యివతలపడ్డ తక్షణమే మా దగ్గర్లో ఉన్న ఒక సినిమా భవనంలో నేను నటించిన ఫిల్ము చూపిస్తున్నట్టు తెలిసి తెరమీద నన్ను చూదామని వెళ్ళాను. ఎంత అమోఘంగా వుందని! నువ్వా న్యూస్ రీల్ జాగ్రత్తగా చూస్తే నన్ను తప్పకుండా కనిపెట్టి ఉంటావు. ఎందువల్లనంటే అందులో నీలి సెర్జిసూటు వేసుకున్న కుర్రాణ్ణి నేనే. అందరూ పరుగెత్తడం ప్రారంభించినప్పుడు నా హాట్ క్రింద పడిపోలేదూ? నా మొగం కనబడడానికిగాను రెండుమూడు మార్లు కావాలని తిరిగి చూశాను. నేను చిన్న నవ్వు నవ్వడం కూడా చూశావుకదూ? చలన చిత్రాలలో నా చిరునవ్వు ఎలా కనబడుతుందో చూడాలని నా కెంతో అనిపించేది. నేనంటున్నానని కాదు గాని ఎంతో బాగుందనే చెప్పాలి కాదూ?
నాపేరు ఫెలిక్స్ ఓట్రియా నేను యిటాలియన్ జాతికి చెందినవాణ్ణి. హైస్కూలు గ్రాడ్యుయేటుని, ఈ దేశపు యాసతోనూ ఇటాలియన్లలాగా కూడా ఇంగ్లీషు మాట్లాడగలను. ఇంచుమించు రుడాల్ఫ్ వాలెంటీనోలాగ, రోనాల్ద్ కోల్మన్ లాగా వుంటాను నేను బి.డీ మిల్ గాని తతిమ్మా పెద్ద పద్దులవాళ్ళుగాని నన్ను చూసివుంటారనీ, సినీమాలకి నేను బాగా పనికొస్తానని కనిపెట్టగలిగారనీ వినాలని నాకు చెడ్డ ఇదిగా వుంది.
నా నెత్తి బద్దలయిపోయి కిందపడడంవల్ల చూడలేకపోయిన దొమ్ములాటని న్యూస్ రీల్ లో పూర్తిగా చూశాను. అరే, అది నిజంగా పెద్ద దెబ్బలాటే పోలీసులూ, నీటిగొట్టాలూ బాష్పవాయువుల బాంబులూ అన్ని హంగులూ సరిపోయాయి. కాని నమ్ముతావా ఆ న్యూస్ రీల్ ను మూడురోజుల్లో పదకొండుమార్లు నేను చూశాను. సివిలియన్ కాని పోలీసుగాని ఇంకోడు ఎవ్వడూ అంత జనంలో నాకన్న ధీమాగా తట్టుకున్నవాడు లేనేలేడని ఘంటాపధంగా చెప్పగలను. నువ్వు పనిచేస్తున్న కంపెనీతో నా సంగతి సిఫారసు చేదూ నీకు పుణ్యముంటుంది. ఎలాగయినా వాళ్ళు నాకు కబురు పెట్టి, ఒక ట్రయిల్ ఇచ్చేటట్టు చూద్దూ! తప్పకుండా ముందుకొస్తానని నాకు తెలుసును. చచ్చేరోజుదాకా నిన్ను థాంక్ చేస్తాను మిస్ గార్బో! ఇది ఖంగుమనే గాత్రం, ప్రేమికునిపాత్ర అమోఘంగా నటించగలను. అంచేత నువ్వు నాకీ చిన్న ఉపకారం చేస్తావని ఆశిస్తున్నాను. ఏమో ఎవరికి తెలుసు? త్వరలోనే ఒకానొకరోజున నీతోనే కలిసి ఒక చిత్రంలో నేను కథానాయకుడి పాత్ర ధరిస్తానేమో. యువర్స్ వెరీట్రూలీ, ఫెలిక్స్ ఓట్రియా.

---౦౦౦---
