"ఏమిటిది? ఎందుకిక్కడకు తీసుకొచ్చారు? మా వాడేడీ? వాడికెలా ఉందీ?" సాంబయ్య వూపిరిపీల్చుకోటానికికూడా వీలులేనంతగా ఉక్కిరిబిక్కిరి అయిపోతూ, మంచంమీదనుంచి లేవడానికి ప్రయత్నం చేశాడు.
"మీరేం గాబరా పడొద్దు! మీ అబ్బాయి కొచ్చిన జబ్బేమీలేదు. కులాసాగానే ఉన్నాడు." రామనాథబాబు తన గాబరాను అణచుకుంటూ అన్నాడు.
"మామయ్యగారు భోజనం చేసినట్టులేదు. ముందువార్ని భోజనం చేయనీయండి. తర్వాత మాట్లాడుకోవచ్చు!"
సాంబయ్య తలెత్తి వాకిలికేసి చూశాడు. వరూధిని ఓ చేత్తో క్యారియర్, మరోచేత్తో మంచినీళ్ళ గ్లాసూ పట్టుకుని వుంది.
"ఏం? విషం పెట్టి చంపుదామనుకున్నావా?" సాంబయ్య ఆలోచించకుండానే అనేశాడు.
"మధ్యలో ఆ పాపం నాకెందుకూ? అదేదో అయ్యా కొడుకులే తేల్చుకోండి!" అని క్యారియరూ, గ్లాసూ కిందపెట్టి రివ్వున వెనక్కు తిరిగింది వరూధిని.
"విన్నారా? ముసలాడు నన్నెలా మాట్లాడుతున్నాడో?" వరూధిని గొంతు సాంబయ్యకు వినిపించింది.
ఆ మాటలు ఎవర్ని ఉద్దేశించి అన్నదో అర్ధం అయింది సాంబయ్యకు.
అంటే? వెంకటపతి ఇక్కడే వున్నాడన్నమాట? వాడికే జబ్బూలేదు. వీళ్ళంతా కుట్రపన్ని తనను ఇక్కడకు తీసుకొచ్చారన్నమాట! వెంకటపతికూడా ఈ కుట్రలో భాగస్తుడే!
"సాంబయ్యగారూ! మీ వెంకటపతి ఒక ప్రమాదంలో పడ్డాడు. రేపోమాపో పోలీసులు పట్టుకుంటారు. ఈలోపల మీవాడ్ని రక్షించుకోవాలి. లేకపోతే జైలుకెళ్ళడం ఖాయం!" అని సౌమ్యంగా చెప్పాడు రామనాథబాబు.
"అంతా మోసం! మీ మాట ఒక్కటి నమ్మడానికి వీల్లేదు." సాంబయ్య దూకుడుగా అన్నాడు.
"అవును మీరు నమ్మరనే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇందులో బయటివాళ్ళు చేసిందేమీలేదు. ఏమన్నావుంటే మీ కొడుకును ఈ ఆపదలోనుంచి బయటపడేయడానికే! వెంకటపతి తనకు జబ్బుగా వుందని మీకు కబురుపెట్టి కారు పంపించి తెప్పించాడు. నలభై వేలకు ఒకటీ, ముఫ్ఫైఐదువేలకు ఇంకొకటీ నోట్లు రాశాడు. అవి వడ్డీతో చేరి తొంభయ్ కి పైగా అయింది. ఇంతకాలంగా అప్పులాళ్ళకు ఏదో సర్దిచెప్పి వుంచాము. ఇహ వాళ్ళు ఆగం అంటున్నారు. రేపే దావా పడేస్తామంటూ....." సాంబయ్యలేచి గదిలోనుంచి బయటికి వెళ్ళిపోతూండటం చూసిన రామనాథబాబు ధోరణి ఆగిపోయింది. సాంబయ్యను దాటుకొని రామనాథబాబు ముందుగా గదిలోనుంచి బయటకు వచ్చాడు. కసిగా వుసిగా ముందు కొస్తూ గది ముందు ద్వారానికి అడ్డంగా నిలబడి వున్న వెంకటపతిని చూసిన సాంబయ్యకు కాలు ముందుకు పడలేదు.
వెంకటపతి కళ్ళు జ్యోతుల్లా మండుతున్నాయి. ఏదో మత్తు వాసన వుండి వుండీ, గుప్పుమని వస్తోంది.
సశరీరంగా, సజీవుడుగా తన ముందు నిలబడ్డ కొడుకుని చూసుకొన్న ఆనందం సాంబయ్య మనసులో ఎంతోకాలం నిలవలేదు. కొద్ది నిముషాల క్రితం వెంకటపతిని తనివితీరా చూసుకొని, తన బాహువుల్లో పొదువుకోవాలనీ, తనయుడి శరీరాన్ని మమకారంతో స్పృశించాలనీ సాంబయ్య నరనరాన పెల్లుబికిన వాంఛలూ - కాంక్షలూ - అదృశ్యమై, కొడుకు మీద ద్వేషం, కసీ, తృణీకారభావం సాంబయ్యలో ముప్పేటగా పేరుకుపోసాగినై.
"అది ఆడదా? వాడు నా కొడుకా? నువ్వు పెద్దమనిషివా? మీరంతా కుట్ర చేసి, నా ప్రాణాలు తీసి, నా ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మీరు మనుషులు కాదు. రాక్షసులు. దొంగలు" అంటూ సాంబయ్య బెణికిన పాదం పట్టిపట్టివేస్తూ, తలుపు రెక్కపట్టుకొని నిలబడ్డ వెంకటపతిని నెట్టుకొని బయటికి రావటానికి ప్రయత్నం చేశాడు.
"లేరా అడ్డం! తాగుబోతు వెధవా! మైకం తలకెక్కి - పెద్దా చిన్నా, మంచీ చెడూ తెలియక చస్తున్నావ్! ఇదిరా నాకు నువ్వు చేసేది? ఛండాలుడా!" సాంబయ్య రక్తం ఉడికిపోతూంది. ఉద్రేకంతో మనిషి నిలువెల్లా వణికిపోసాగాడు.
తనను తోసేసుకొస్తున్న తండ్రిని వెంకటపతి రెక్కపట్టుకొని లాక్కెళ్ళి మంచం మీదకు విసిరాడు.
"పోతాడంట పోతాడు? ఎక్కడికి పోతాడో చూస్తా?" అంటూ వెంకటపతి ధడేల్న తలుపులు మూసి బయట గడిపెట్టాడు. భయం తెలియని సాంబయ్య గుండెలు చెదిరిపోయినై!
వళ్ళు తడిసి ముద్దయింది. మంచం మీద కుప్పగా కూలిపోయిన సాంబయ్య చాప చుట్టలా ముడుచుకుపోసాగాడు.
జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూశాడు. ఎన్నో అవమానాలూ, తిరస్కారాలూ భరించాడు. అయినా ఏనాడూ తను దైర్యాన్ని కోల్పోలేదు. తను నీరు కారిపోలేదు. ప్రతీకారం తీర్చుకోవటానికి ఏళ్ల తరబడి ఎదురు చూశాడు. ఓపికా పట్టుదలతో, తలవంచి, పొంచి వున్నాడు. అవకాశం వచ్చినప్పుడు తిరిగి దెబ్బ తీశాడు. తనను అవమానించినవాళ్ళను తన కాళ్ళదగ్గర తిప్పుకున్నాడు. మహా సముద్రాలను యీదిన తను చివరకు పిల్లకాలవలో పడి చావాల్సి వుందా?
"ఓరి! భగవంతుడా! నా నొసటి రాత ఇలా రాసి పెట్టావా? నా కొడుకు..... నా రక్తంలోని రక్తం.... నాకు బద్దశత్రువైనాడా?"
సాంబయ్య మెదడూ, మనసూ పెళ పెళ కాగే నూనె కళాయిలో వేసినట్టు అయిపోయింది.
ఆ గదిలో తనెంతకాలం వున్నాడో కూడా తెలియని స్థితిలో పడిపోయాడు. గది బయట హాల్లో మాటలు అస్పష్టంగా వినబడసాగినై. సాంబయ్య మెల్లగా లేచి తలుపు వారగా వెళ్ళి నిలబడ్డాడు. చెవులు తలుపు కానించి వినడానికి ప్రయత్నించాడు.
"ఏమిటండీ? ఇంకా రిజిష్టారు రాలేదూ?" వరూధిని గొంతు ఆదుర్దాగా పలికింది.
"వస్తాడు! రావాలి మరి! ఈపాటికి రావాల్సిందే!" గడియారం చూసుకొంటూ అన్నాడు రామనాథబాబు.
"ఆయన సరే! వీళ్ళేమయినట్టూ?" మళ్ళీ వరూధిని వత్తి వత్తి అన్నది.
రామనాథబాబు వెంకటపతి కేసి చూశాడు.
"కనకయ్యే వాళ్ళనుకూడా తీసుకొని వస్తానంటే, నే వచ్చేశాను. వెళ్ళి చూసొస్తా ఏమయారో?" అని వెంకటపతి తూలిపోతూ బయటికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు.
"మీరెక్కడికండీ వెళ్ళేది? మీకెందుకు, మీరెళ్ళి గదిలో కూర్చోండి! అంతా మేం చూసుకొంటాంగా?" అన్నది వరూధిని. భర్త చెయ్యిపట్టుకొని హాల్లోనుంచి మరోగదిలోకి తీసుకెళ్ళింది.
"అంతా అయిపోయినట్టుంది, ఇంకా ఎందుకూ?" అన్నాడు భార్యముఖంలోకి చూస్తూ వెంకటపతి.
"ఏమిటయిపోయింది అంతా? మీ మాటలూ మీరూను!" విసుక్కొంది వరూధిని.
"ఇంకా వుందా?" కళ్ళెగరేస్తూ అన్నాడు భర్త.
"ఏమిటి నా తలకాయా?" అంది భార్య.
"కాదు సీసాకాయ!" అన్నాడు భర్త.
వరూధినికి వల్లమాలిన నవ్వు వచ్చింది. "సీసా అంతా ఖాళీ చేశారుగా! ఇంకా ఎందుకూ?"
"అసలుందా? మా నాయన..."
"ఏమిటీ? మీ నాయనక్కూడా ఇస్తారా ఏమిటి?"
"కాదు ఆయన తాగడు. నేను తాగినా చంపేస్తాడు."
"సరేలే! మీరు నోరు మూసుకొని కాసేపు కూర్చోండి." అన్నది భార్య.
"మరి మా నాయన భోజనం చెయ్యలేదు. ఆయనకు వడ్డించు."
"అన్నం తినడట! అందులో నేను విషం పెట్టానట!"
"నిజంగా పెట్టావా?"
"ఏమిటి?"
"విషం... కాదు.... అన్నం." వెంకటపతికి నాలుక ముడతపడిపోతున్నట్టు గ్రహించింది వరూధిని.
తండ్రి ఎదటపడటానికి ధైర్యం చాలక, గదిలోపెట్టి బాధించటానికి గుండెలు లేక వెంకటపతి బ్రాందీ సీసా అమాంతం ఎత్తి తాగేశాడు. ఆ ఊపున వెళ్ళి సాంబయ్యను గదిలోనుంచి బయటికి పోనీయకుండా, మంచం మీదకు తోసి తలుపు గడియపెట్టి వచ్చాడు. అమాంతంగా, ఒక్కసారిగా లోపలకు పోయిన బ్రాందీ, ఇప్పుడు వెంకటపతి రక్తంలోకి ఎక్కి తలలోకి చిమ్ముతూంది. మనిషి తబ్బిబ్బయిపోసాగాడు.

