నామీద ఎవరెంత ప్రాపగండా చేసినా - నాది పన్నెండు సంవత్సరాల డబ్బింగ్ స్టార్! నన్నెవరూ కదపలేరు. ఇవన్నీ లక్ష్యపెడితే బతకలేం. శ్రీశ్రీ కావాలనుకున్న వాళ్ళు శ్రీశ్రీ దగ్గరకి వస్తారు. రాకుంటే పోనీయ్. నేనేమీ ఈ డబ్బింగుల మీద ఆధారపడి బతకలేడు. వస్తున్నాయి కనుక రాస్తున్నాను.
శ్రీశ్రీ ఫీల్డుకి అంకితమయిపోయాడని నామీద ఓ వదంతి కూడా వుంది. నేను మూడుసార్లు మృత్యువుతో పోట్లాడి గెలిచినవాడ్ని ఆ వివరాలు తర్వాత చెప్తాను.
రెండేసి రోజులు తిండి కూడా లేకుండా బ్రతికాను. ఎక్కడా వున్నచోట వుండకుండా, చేసిన ఉద్యోగం చెయ్యకుండా, దేశదిమ్మరిలా తిరిగి, దారుణ జీవితం గడిపాను. 1950 నుండీ మళ్ళీ నా జీవితం మారింది.
ఇలాంటి వాటికన్నిటికీ శ్రీశ్రీ అతీతుడు. ఈ పాడు విషయాలన్నీ మనసులో పెట్టుకొని అనవసరంగా మనసు పాడు చేసుకోకు" అని నాకు సమాధానం చెప్పారు. పాపం! తాను మాత్రం ఇంట్లో రంపపు కోత అనుభవించేవారు.
కొంతమంది రమణమ్మగారి దగ్గరికి వెళ్ళి, అదేపనిగా నా గురించి లేని పోనివి చెప్పడమే కాకుండా, ఆవిడకి కావలసినవాళ్ళూ, బందువర్గం అందరూ కలిసి -
"ఏమే అమ్మడూ! (ఆవిడ్ని బాగా తెలిసిన వాళ్ళు అమ్మడూ అని పిలిచేవారు) నీకు బుద్ధుందా లేదా? శ్రీశ్రీని ఎందుకలా వదిలేశావ్? ఆ పిల్ల వెనకాల పడ్డాడు. అది దేవాంతకురాలు. ఎప్పటికయినా నీ కొంప ముంచుతుంది. దాన్ని ఎలాగయినా వదిలించుకో. దాన్ని వెనకేసుకొని అలా ఇరవై నాలుగ్గంటలూ స్టూడియోల వెంటబడి తిరుగుతూంటే, ఎలాంటివాడయినా బోల్తాపడతాడు.
అందులో మనవాడి సంగతి చెప్పాలా? దానికితోడు ఆ అమ్మాయివచ్చాకే తనకి అదృష్టం పట్టిందనే నమ్మకం ఒకటి బాబాయికి బాగా ఒంటపట్టేసింది. (శ్రీశ్రీ గారిని వాళ్ళ బంధువర్గం వాళ్ళు 'బాబాయి' అని పిలిచేవారు.)
చూడు అమ్మడూ! నీ మొగుడ్ని నువ్వు అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలి. అశ్రద్ద చేశావంటే అధోగతి పాలవుతావు" అని ఉపదేశించి, ఆవిడ మనసు పూర్తిగా పాడుచేశారు. శ్రీశ్రీగారు పగలంతా కష్టపడి ఇంటికి వెళ్ళగానే ఆవిడ రాత్రంతా తెగ నస పెట్టేవారు. ఒకరోజు ఆవిడ శ్రీశ్రీగారితో.
"ఆ అమ్మాయి వచ్చాకనే బాగుపడ్డామని మీరెందుకనుకుంటున్నారు? పోనీ మీ మాటే అనుకున్న ఈ బాగుపడింది చాలు. ఇంకా ధాన్ని వెనకాల వేసుకొని ఎందుకలా స్టూడియోల వెంట తిరుగుతారు? ఊరిలో ఎక్కడ చూసినా మీ ఇద్దరి గొడవే" అని ఆవిడంటే.....
"ఏమిటీ.... ఊరా? మనం వున్నది మద్రాసులో - నేను పని చేస్తున్నది సినిమా ఫీల్డులో. ఈ సినిమా ప్రపంచంలో ఏం జరిగినా మనకన్నా ముందు వాళ్ళకే తెలుస్తుంది. ఈ అపరదేశంలో నాలుగు గోడల మధ్యా కూర్చొని, ఎంతమంది మా గురించే అనుకోగా విన్నావు. ఇది అనుకోవడం కాదే, ఎవరో పని కట్టుకొని నీ దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు. సరోజ కేవలం "శ్రీశ్రీ అసిస్టెంట్' అనే పేరే తెచ్చుకుంది. ఇంట్లో కూర్చున్న నీకేం తెలుసు?" అన్నారు ఆవిడతో.
"మీ వెనకాల తిరగడనికి అది ఉందిగా? నేను కూడా ఎందుకు?" అన్నారావిడ.
"సరోజ నాతో పని చెయ్యడం కోసం తిరుగుతోంది. నిన్ను తీసుకువెళ్ళినా నువ్వేం చెయ్యగలవు? అయినా నీకీ గొడవలన్నీ ఎందుకు' నీ పని నువ్వు చూసుకో" అన్నారు.
"ఇది కూడా నా పనేనండి. దానికి ఉద్వాసన ఇస్తకానీ నేను ఊరుకోను" అన్నారావిడ.
"నాకిప్పుడు పది పిక్చర్లున్నాయి. ఆ పనంతా ఎవరు చేస్తారు?" అనడిగారు. మందిని పెట్టుకోండి. నేనేమీ అనను. కానీ అది మాత్రం వుండడానికి నేను ఒప్పుకోను" అన్నారావిడ.
"అరడజను మందేం ఖర్మ! కావాలనుకుంటే ఆరు డజన్లమందిని పెట్టుకోవచ్చు. కానీ నేనెవర్నీ పెట్టుకోను" అన్నారు.
"అయితే ఆ పనంతా మీరు చూసుకోండి" అన్నారావిడ.
వెంటనే ఆయన "నీకేమయినా బుద్ధుండే మాట్లాడుతున్నావా? నేనొక్కడ్నీ పది పిక్చర్లు చేసుకోనా?" అన్నారు.
"బుద్ది వుంది గనకే మాట్లాడుతున్నాను".
దాంతో శ్రీశ్రీగారికి విపరీతమైన కోపం వచ్చేసింది.
"ఎందుకే అడ్డమైన వాళ్ళ మాటలూ విని అనవసరంగా ఇంట్లో లేనిపోని గొడవలతో మనశ్శాంతి లేకుండా చేస్తావు? సరోజా నీకు చేసిన అన్యాయం ఏమిటి? ఇప్పుడిప్పుడే అన్ని విధాలా కష్టాలు గట్టెక్కి హాయిగా వున్నాం.
దాన్నెందుకు అనుమానిస్తావు? అది వచ్చాకనే మనకి అదృష్టం కలిసొచ్చి బాగుపడ్దాం. ఆ విషయం మాత్రం మరచిపోకు" అని కోపంలో పొరపాటున అనేశారు.
ఇంకేముంది? ఉల్లి నూరే భరించలేం, తాగేం భరిస్తాం చెప్పండి.
రవణమ్మగారి కోపం తారస్థాయి నందుకొంది.
"ఈ అదృష్టం అంతా దానిదంటారా? ఇన్నాళ్ళూ మనం అడుక్కుతిన్నామా? ఊళ్ళో వాళ్ళన్నమాటలు అక్షరాలా నిజం అన్నమాట! నేనుండగా దాని మీద నమ్మకాలూ, మమకారాలూ పెంచుకుంటున్నారంటే దానికి అర్ధం ఏమిటి చెప్పండి" అని కూర్చున్నారావిడ.
"నేనేమీ మమకారం పెంచుకోలేదు. నమ్మకం అంటావా? కళ్ళముందు కనిపిస్తున్న సత్యం అది. పైకి అనుకున్నా నీ మనసుకి తెలుసన్న విషయం నాకూ తెలుసు. ఇంతవరకూ మా ఇద్దరిలో ఏ విధమైన దురభిప్రాయాలూ లేవు. అందరికీ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఇక నీ సంగతంటావా? నీ ఖర్మ అనుకో! నేను బాధ్యుడ్ని కాను. ఇద్దరం కష్టపడుతున్నాం. సంపాదిస్తున్నాం. ఇవన్నీ నీకు చెప్పినా అర్ధం కావు. అర్ధం చేసుకోవాలని ప్రయత్నించవు. లేనిపోని మాటలతో నీ మనస్సు ఎవరో పాడు చేస్తున్నారు. నువ్విలా రోజూ గొడవ చేస్తూంటే నేను ఇంటికి కూడా రాను. ఈ మాత్రం తిండి స్టూడియోలో దొరక్కపోదు. ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీమోత" అని అన్నారు.
ఇలా ఇంట్లో గొడవలవుతున్నా స్టూడియోకి వస్తే మాత్రం ఏమీ జరగనట్టే వుండేవారు. ఎర్రబడ్డ వారి కళ్ళు చూసి ఉండబట్టలేక అడిగితే, "ఇంటి విషయాలు చర్చించడానికి ఇదా స్థలం?" అని కోపమంతా నా మీద చూపేవారు. నా కర్ధమయి పోయేది.
ఓ రోజు - చీవాట్లు తింటే తిన్నాంలే అని స్టూడియోకి వెళుతూ దారిలో శ్రీశ్రీగారింటికి వెళ్ళాను.
రవణమ్మగారు నా రాక తెలిసి కిందకి వచ్చారు.
"ఎందుకొచ్చావు' అనట్టుగా ముఖం పెట్టారు.
ఆవిడకి నమస్కారం చేశాను.
"చూడండి. మీతో మాట్లాడాలనే వచ్చాను. ఇక్కడే నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతాను. నేను చెప్పేది నెమ్మదిగా వినండి! మనం బాగుపడుతున్నామని చాలామందికి కన్నెర్రగా వుంది....." అని అంటూండగా....
"ఎవరా మనం?" అని అడిగింది.
"పోనీ మీరే! మీరు బాగుపడుతున్నారని చాలామందికి కన్నెర్రగా వుంది. శ్రీశ్రీగారు తాగుతారని, సరిగ్గా పని చెయ్యరని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు లేనిపోనివి కల్పించి ప్రచారం చేస్తున్నార"న్నాను.
ఆవిడ వెంటనే "వాళ్ళు ప్రచారం చెయ్యడంలో తప్పేం వుంది? పిక్చర్లు రాకపోతే పోనీ! ప్రాణం హాయిగా వుంటుంది. ఆయన వెంట స్టూడియోలమ్మటపడి తిరుగుతోంది చాలక ఇంటికి కూడా రావడం ప్రారంభించావన్నమాట"
"వాళ్ళ సంగతి వదిలెయ్యండి. మీరేమిటి వింతగా మాట్లాడుతున్నారు? నేను వారివెంట పడడం ఏమిటి? వారికి అసిస్టెంట్ గా పని చేస్తున్నాను. ఆయన దయ వున్నంతకాలం పని చేస్తాను. ఆయన ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతాను"
"అంటే ఆయన పొమ్మన్నవరకూ కదలవన్నమాట" అన్నారావిడ.
"ఎందుకు పొమ్మంటారండీ? నేనేం తప్పుచేశానని నన్ను పొమ్మనడానికి?".
"ఇంకా ఏం చెయ్యాలి? నా నెత్తిమీదెక్కి నాట్యమాడదామనుకుంటున్నావు".
"ఛఛ! అలా మాట్లాడకండి. ఎవరైనా వింటే నవ్వుతారుకూడా, నేను మీ వారి దగ్గర పని చేస్తున్నాను. మీ మీద నాకు చాలా గౌరవం వుంది. పైగా నేను మీ కూతురులాంటిదాన్ని ,లోకులు కాకులండీ. చివరి సారిగా ఒక్కమాట చెపుతున్నాను. నేటిదాకా మీ కుటుంబ విషయంలో, శ్రీశ్రీగారి విషయంలో నాకేవిధమైన దురభిప్రాయమూ లేదు. ముఖ్యంగా నా వల్ల మీకు ఏవిధమైన హానీ జరగదు. నన్ను నమ్మండి. లేనిపోని ఆలోచనలతో మనస్సు పాడుచేసుకోకండి" అన్నాను.
"నువ్వేనాడు వారి దగ్గర ప్రవేశించావో ఆనాడే నా మనస్సు పాడాయిపోయింది. ఎంతమందో వారి జీవితంలో తారసపడ్డారు. కానీ నీలాగా ఎవ్వరూ పాతుకు పోలేదు. 'మమ్మల్ని వదిలెయ్యి బాబో అంటే వినవేం" అన్నారావిడ.
"తొందరపడి నోరు పారేసుకోకండి" అన్నాను.
"తొందరపడలేదు. నీకీ సంగతి చెప్పడానికి ఇప్పటికే ఆలస్యం చేశానని బాధపడుతున్నాను. మరోచోట ఎక్కడయినా పని చూసుకో. మమ్మల్ని వదిలేయి" అన్నారు.
ఎంత కంట్రోల్ చేసుకున్నా దుఃఖంతో వచ్చే కోపం ఆగడం లేదు.
