ఆమె అందం చూస్తూనే గుడ్లప్పగించింది ధీరజ.
ఇంకా ఆశ్చర్యంలో నుంచి తెరుకోలేదామే.
"మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఫోన్ లో విన్నప్పుడు నేనెలా వుంటానో ఊహించుకుని వుంటారు. అందుకు భిన్నంగా కనిపిస్తున్నాను కదూ......ఒకప్పటి విష్ణును మనసా వాచా ఆరాధించిన భవానిని నేనే మేడమ్........వయసులో ఇంత చిన్నదానినని నేను చెప్పిన విషయాన్ని మీరు నమ్మకపోవచ్చు. కానీ ఇది పచ్చి నిజం. అంతేకాదు ......ఈ సుకుమారి ఆయుష్షు ఎంతో కాలం లేదన్న మాట నిజమే....' వేదాంతిలా చెప్పుకుపోతుందామె.
"మిస్ భవానీ......నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కావడము లేదు. ముక్కుపచ్చలారని నువ్వేమిటి, నువ్వు మరణానికి చేరువలో ఉండడమేమిటి? సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందింది . వైద్య శాస్త్రం పురోగమించింది. పోతున్న ప్రాణాలను తిరిగి పోయగల డాక్టర్లున్నారు. అయినా నీకు నువ్వు అలా ఏదేదో ఊహించుకుంటున్నవేమో"
"నా మీద జాలితో మీరు అలా అంటున్నారు కలెక్టర్........కానీ నేనేమిటో నాకు తెలుసు......మీరన్నట్టు వైద్యులు సయితం ప్రాణాలను తిరిగి పోయలేని స్థితిలో వున్నాను నేను. నా శరీరంలోని అణువణువునూ మెలమెల్లగా మృత్యువు తినేస్తుంది. నేను ఇంకెన్నాళ్ళు బ్రతుకుతానో నాకే తెలియదు.
"అందుకే మీకు ఫోన్ చేశాను. అదిగో అటు చూడండి........అక్కడ వున్నాయి విష్ణు ఆశ్రమంలో నుంచి దొంగిలించబడిన విగ్రహాలు, వాటిపైన వున్న నగలయితే ఖర్చు చేశాను తప్ప అ విగ్రహాలను కరిగించడానికి నా మనసు అంగీకరించలేదు. అవి చూసినప్పుడల్లా విష్ణు కళ్ళల్లో మెదిలేవాడు. అందుకే విష్ణుని ఆ రూపాల్లో చూసుకుంటూ ఇంతకాలం గడిపాను. కానీ నా అవసాన దశలో అయినా త్రిమూర్తులను విష్ణు దగ్గరకు చేర్చాలనే తపనతోనే మీకు ఫోన్ చేశాను.
భవాని నిర్లిప్తంగా చెప్పుకుపోతున్నది.
కొద్దిసేపటి క్రితం భవాని తనతో ఫోన్ లో చెప్పిన మాటలే ధీరజ చెవులలో ఇంకా మెదులుతూనే వున్నాయి.
"నేనూ విష్ణూ కలిసి పెరిగినా ఒకరినొకరం కాలేక విడిపోయాము. చివరకు నాపై నేనే కసితో అన్నహరాలు మానివేశాను. అప్పుడు తెలిసింది డాక్టర్లకు కూడా అంతుబట్టని ఏదో వ్యాధి నా శరీరంలో చోటు చేసుకున్నదని......చేతిలో డబ్బు వుండి వుంటే సకాలంలో వైద్యం చేయించుకున్నట్లయితే నేనూ ఆరోగ్యవంతురాలిగా మిగిలి వుండేదానినెమో!
"కానీ నాకు ఎవరున్నారు? అందుకే కసికొద్దీ ఈ సమాజంపై తిరగబడి దొంగలా మారాను. నాలాగ మరొక అభాగ్యురాలు వీధిన పడకూడదనే సంకల్పంతో ఉద్యమించాను. అమాయకులను ఎప్పుడూ కొల్లగోట్టలేదు నేను. అలా దొంగతనాలతో వచ్చిన డబ్బుతోనే ఈ మహిళా సంక్షేమ నిలయం నిర్మాణాన్ని ప్రారంభించాను.
"విష్ణు ఆశ్రమంలో దొంగతనానికి వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నా విష్ణు ఒక మహా యోగిలా అవతారం ఎత్తాడని.......అతని సచ్చీలత ముందు నేను కుంచించుకుపోవడం వలన అతని కంట పడడం ఇష్టం లేక విగ్రహాలతో మాయమైపోయాను. నాకు ఇప్పుడు ఎంతో తృప్తిగా వుంది.
"నా ప్రియమయిన విష్ణు వలన ఎందరో ఉద్దరించబడుతున్నారు. నేను ఎన్నుకున్నది తప్పుడు మార్గమే అయినప్పటికీ నేను నెలకొల్పిన ఈ ఆశ్రమం పుణ్యమా అని ఈ రోజూ ఎందరో అభాగ్యలకు నిలువనీడ కల్పించగలిగాను. సమాజంలో దగా చేయబడ్డ స్త్రీలకు ఈ ఆశ్రమంలో నీడ దొరుకుతుంది.
"ఏ అనాదా నాలా జీవనం గడవకూడదనే నా కల ఫలించింది. ఇక ముందు ఎప్పుడూ ఏ అనాధ స్త్రీ నెరవేరింది. వాళ్ళ కాళ్ళపై వాళ్ళే నిలిచేలా ప్రోత్సహమిచ్చి ఆర్ధికంగా నిలబెట్టడమే ఈ ఆశ్రమ లక్ష్యం.....విష్ణు ముందు నిలిచి ఇదంతా ధైర్యంగా చెప్పలేను.......అదీగాక నాకు మృత్యు ఘడియలు సమీపిస్తున్నాయి. అందుకే కనీసం మీతోనయినా చెప్పి నా హృదయ భారాన్ని తగ్గించుకోవాలనుకున్నాను.
భవాని, విష్ణు చిన్ననాటి స్నేహాన్ని తెలుసుకున్న ధీరజ హృదయం కదిలింది.
"ఏమిటి మేడమ్ అలా మౌనంగా వున్నారు.
భవాని రెట్టించి ప్రశ్నించడంతో ధీరజ ఉలిక్కిపడి వాస్తవానికి వచ్చింది.
'అవును భవాని......నీలాంటి మంచి నేస్తాన్ని విష్ణు మూర్ఖంగా చేజార్చుకున్నాడేమో అని అనిపిస్తుంది.
"మీరు పొరబడుతున్నారు......విష్ణు ఎన్నుకున్నదే సరియైన మార్గం. అప్పుడంటే ఏదో ఆవేశంతో విరుచుకుపడ్డానే తప్ప తరువాత నిజం తెలిసింది. తనవాళ్ళ కోసం తనే బలైపోయి నన్ను దూరం చేసుకున్నాడు కానీ విధి లిఖితాన్ని ఎవరూ తప్పించులేనట్టు ఆ వివాహ బంధాన్ని సయితం కాలదన్నుకుని వెళ్ళిపోయిన విష్ణు మహాయోగి కాగలిగాడు.....
"ఆ రోజే కనుక అలా జరగకుండా వుంటే విష్ణు కేవలం నావాడు గానే మిగిలి ఉండిపోయేవాడు తప్ప ఇలా మహాయోగి కాగలిగేవాడు కాదు.......అందుకే నాలో ఇప్పుడు ఎలాంటి స్వార్ధం లేదు. నా విష్ణు వలన ఎందరో పాపకర్మలు పవిత్రులు కాగలుగుతున్నారు. నాకదే తృప్తి........."
భవాని మాటలోని సత్యాన్ని గ్రహించింది ధీరజ.
"చెప్పండి మేడమ్. నా చివరి కోరిక మీ వాళ్ళ తీరుతుందనే నమ్మకంతో వున్నాను...."
"తప్పకుండా భవాని........నీ ప్రియమయిన విష్ణు చెంతకు ఈ త్రిమూర్తుల విగ్రహాలను చేర్చీ పూచీ నాది...." అన్నది ధీరజ స్థిర నిశ్చయంతో.
భవాని హృదయం అప్పుడు శాంతించింది.
త్రిమూర్తుల విగ్రహాలు తీసుకుని కారు ఎక్కింది ధీరజ.
* * * *
విష్ణు ఆశ్రమం ఆ రోజు సందడిగా వున్నది.
ప్రేక్షకులతో, భక్తులతో, పత్రికా విలేకరులతో క్రిక్కిరిసి పోతున్నది.
విష్ణు కావాలనే ప్రత్యేకంగా ఆశ్రమ ప్రాంగణంలో అందరి ఎదుటా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాడు.
