"అయినచో సరే! నడువుము."
ఇద్దరూ గేటు దగ్గర టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళబోయారు.
గేట్ కీపర్ ఆ టికెట్ చించి , సీట్ నెంబర్ వేసి వున్న టికెట్ ముక్కని నారదుడి చేతిలో పెట్టాడతను మాములుగా!
"అది యేమి? మేము నలుబది రూపాయలు పెట్టి, కొన్న ఆ టికెట్ ని సగానికి చించేసినావు. బుద్దిలేదు" అన్నాడు యముడు పెద్ద గొంతుకతో.
అతను యముడివైపు, నారదుడి వైపు మార్చి మార్చి చూసి....."జావో.....జావో" అన్నాడు.
"ఏమిటి?" యముడు అర్ధంగాక అడిగాడు.
"వెళ్ళమంటున్నాడు స్వామీ! పదండి లోపలికి!"
"ఆగుము! అతను మన టికెట్ ను చించినాడు. అంత కండకావరమేమి? కనుగోనేదను"
"ఇప్పుడే కదయ్యా కొన్నాము. ఐదు నిముషములు కూడా కాలేదు. ఎందులకటుల చించుతున్నావు.....బుద్దిమందగించినదా?"
యముడు గేట్ దగ్గర నిలబడి వరుసగా టికెట్స్ చిపుతున్న అతన్ని పట్టుకుని మళ్ళీ అడిగాడు.
"ఏందిబే! సిటికి కొత్తా. పాగల్ హై క్యా? చలో...చలో....గావ్ లోగ్ అయితే హమారా సర్ కాలేతే......" అతను పాన్ నములుతూ విసుగ్గా అన్నాడు.
ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు యమధర్మరాజుకు. కానీ అతను మాత్రం తమని ఏదో కోపంగా అంటున్నాడని అర్ధం అయింది.
"ఇదేమి బాష నారదా?"
"ఇది హైదరాబాద్ ఉర్దూ మిక్సయిన హిందీ భాష ప్రభూ! మనకు రాదు...." నారదుడు వివరించాడు.
"ఔరా! మానవులు మితిమిరుచున్నారు. వీరికేన్ని భాషలోచ్చును. మనకు మాత్రం సంస్కృతం తప్ప మరేమియు రాదు" అన్నాడు యముడు చేసేది లేక.
"టైటానిక్' సినిమాలో చూడడంలో మునిగిపోయారిద్దరూ.
కేట్ విన్స్ లేట్ అందానికి ముగ్దుడయిపోయాడు యముడు.
"నారదా! ఆ అమ్మాయి ఎవరో గానీ మహా కసక్కులా ఉంది. నాకెలా అయినా ఆ అమ్మాయిని చూడాలని, తాకాలని మహా తపనగా వుంది. మనం రేపే ఆ అమ్మాయిని చూద్దాం నారదా!"
"అది కుదరని పని సమవర్తి."
"ఎందులకు?" కాస్త అసహనంగా అన్నాడు యమధర్మరాజు.
"ఆమె స్టేట్స్ లో ఉండును స్వామీ! మనమక్కడకు వెళ్ళలేము" అన్నాడు నారదుడు.
"ఎందుకు వెళ్ళలేము నారదా! ఎంత డబ్బు ఖర్చయిననూ ఫర్వాలేదులే. ఆ మగువను మాత్రం చూడనిదే నేను బ్రతకలేను నారదా!"
"ఆమె ఉన్న దేశమునకు వెళ్ళవలెనన్న మనకు వీసా పాస్ పోర్టు అన్నియును కావలెను. అవి లేనిచో మానని వెళ్ళనీయారు ఈ భారతీయులు.
"అయినచో ఆ వీసా , పాస్ పోర్ట్ తిసుకోనుడు" దానిదేముంది అన్నట్టు చూశాడు నారదుని వైపు.
"అవంత తొందరగా రావు స్వామీ! కనీసం నలభై అయిదు రోజులు పట్టును. అవి రావలేనన్న. పైగా రేషను కార్డు, టెన్త్ క్లాస్ సర్టిఫికేట్, డేటాఫ్ బర్త్ సర్టిఫికేట్ అన్నీ అడిగెదరు......బహు కష్టము. అవన్నీ మనకు లేవు కదా!"
"అయినచో....ఆమె మన లోకమునకు వచ్చిన యెడల వదలొద్దు......బసు రంజుగా వున్నది. మన లోకమున ఉన్న రంభా, ఊర్వశులు దండుగ సుమీ! ఈమె పేరేమంటివి?"
"కేట్ విన్ సలేట్"
"మరి ఆమెతో అంత దగ్గరగా మెదులుతూ, ఆమె పెదవుల మీద ముద్దు ఇచ్చిన వాడి పేరేమి?"
"లియోర్నాడో డికాఫ్రియో".
"అమ్మో! బహు చిత్రంగా వున్నది ఇతని పేరు. నా లోకమునకు రానీ ఇతని పని చెప్తాను. నేను మనసు పడ్డ నా సుందరిని అలా ముద్దిడునా? హమ్మ! చెప్తా వీడి పని...." కసిగా అన్నాడు యమధర్మరాజు.
"వార్ని! ఈ లోకమునకు రాగానే సమవర్తి గారి బుద్దులు ఇలా మారుచున్నవేమి?" అనుకున్నాడు ఆశ్చర్యంగా మనసులో నారదుడు.
* * *
శ్రీచంద్ర , సమీర, సత్తిపండు ఇందూ డీలక్స్ రెస్టారెంట్ లో కూచున్నారు.
శ్రీచంద్ర మూడు పుల్ మీల్స్, మటన్ బోన్ లెస్ కర్రీ, ఎగ్ కర్రీ చెప్పాడు.
"గురూ.....ఒక్కసారి ఇంత పెద్ద షాకిచ్చావేంటి? నాకు తెలిసి ఇవాళ ఏ బ్యాంకు దోపిడీకి గురి కాలేదు. మరి మాకు ఈ హొటల్ లో ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావు ఎందుకంటావు గురూ?"
"పిచ్చి పోట్టిలాగూ.....ఇవ్వాళ్టి నుంచి మనకే ప్రాబ్లము లేదు. అడ్డమైన ఇంటర్ వ్యూలకు వెళ్ళాల్సిన పని లేదు. ప్యాట్ని సెంటర్ దగ్గర స్కూటర్లు తుడవాల్సిన పని లేదు. నో వర్రిస్......అల్ హ్యపీస్" అన్నాడు శ్రీచంద్ర.
"ఏరా చందూ! మందు ఎప్పట్నించి అలవాటు చేసుకున్నవ్రా?"
"ఏయ్ సమ్మీ! తిక్కతిక్కగా వుందా? నేను మందు తాగడమేమిటి?" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.
"మరి లేకపోతే నీలో ఈ మార్పేమిటి?"
"చూస్తూ వుండవే సమ్మీ, ఏమన్నావ్? ఎవడో ఓ గన్నాయ్ గాడిని చేసుకుంటావా? నాలాంటి హ్యాండ్ సమ్, నాలాంటి హీరో నీకు ఎక్కడ దొరుకుతాడు?"
"అవునవును వెంటనే రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి 'సార్! నేనూ , మా చందూ గాడూ డ్యుయెట్టెసుకోవాలి. డైరెక్ట్ చేయమని రిక్వెస్ట్ చేయాలా?"
"మంచి ఆలోచన వదినా" అన్నాడు సత్తిపండు.
"రేయ్ పోట్టిలాగూ" అంటూ సత్తిపండు వైపు కోపంగా చూసాడు.
"సారీ గురూ! ఇకనుండి నన్ను పోట్టిలాగు అంటే నేనూరుకోను" రోషంగా అన్నాడు సత్తిపండు తన ప్యాంట్ వైపు చూసుకుంటూ.
"ఎందుకంటావ్?" వెక్కిరిస్తూ అడిగాడు ఈసారి శ్రీచంద్ర రివర్స్ గా.
"రామేశ్వరి నాకు ప్యాంటు కుట్టించింది తెలుసా? ఇకనుండి పోట్టిలాగులు వేసుకోవద్దని కూడా చెప్పింది."
"రామేశ్వరేవరు?" కుతూహలంగా అడిగింది సమీర.
"నీకు చెప్పలేదు కదూ! మన పోట్టిలాగు సత్తిపండు సారీ...సారీ.....మన పొడుగు ప్యాంటు సత్తిపండు లవ్వులో పడ్డాడు తెల్సా?" సమీర చేతిమీద తట్టి మరి చెప్పాడు శ్రీచంద్ర.
"అవునా పండూ?" కన్ ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది.
"అవునొదినా , నిజమే" అన్నాడు సత్తిపండు కావాలని సిగ్గుపడుతూ.
"మరి నాకు పరిచయం చేయవా నీ లవర్ని" కుతూహలంగా అడిగింది సమీర.
"మరి నువ్వు వెక్కిరించకూడదస్సలు."
"నేనెందుకు వెక్కిరిస్తాను" ఆశ్చర్యంగా అడిగింది సమీర.
"మరి....మరి రామేశ్వరికి 'ర' పలకడం రాదు. 'ర' బదులుగా 'ల' పలుకుతుంది. నువ్వెక్కిరిస్తావేమోనని నా భయమొదినా?"
"పిచ్చి పండూ! ప్రేమలో వత్తులు, రోగాలు, చుండ్రూ వేదకరేవరు? ప్రేమంటే అదో గమ్మత్తయిన ఫీలింగ్. అన్నీ లోపాల్ని పక్కకు నెట్టేసి మనస్పూర్తిగా ఒక వ్యక్టంటే ఇష్టపడటమే ప్రేమంటే? కేవలం నత్తి ఉందని, రేచీకటి ఉందని వెక్కిరిస్తే ఎలా? ఎనీవే కంగ్రాట్స్! నువ్వూ ఓ ఇంటివాడివి అవుతున్నందుకు" మనస్పూర్తిగా అంది సమీర.
