"వస్తానన్నయ్యా! అంటూ మాధవరావుకు చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సరోజ.
"నువ్విక మరవా? పాపం అ అమ్మాయి కోసమైనా గుడికెళ్ళాచ్చు కదరా! భగవంతుడంటే నీ కేందుకంత కోపం.....?" అడిగాడు మాధవరావు.
"కోపమా! కోపం కాదురా. అసలే భావం లేదు నాకు. ఎందుకంటే ఆసలతను ఉంటేగా?" అన్నాడు నవ్వుతూ.
"సర్లే! నీతో వాదించటం కష్టం" అన్నాడు మాధవరావు నవ్వుతూ.
"పద! ఆ వరాల ఇంటిదగ్గరకు వెళ్ళివద్దాం" అన్నాడు నాగేశ్వరరావు.
30
మాధవరావు, నాగేశ్వరరావులు ఇద్దరూ వరాలు ఇంటికి వచ్చారు. మాధవరావును అక్కడ చూసిన అతని స్నేహితుడు కోటేశ్వరరావు హడావుడిగా వచ్చాడు.
"ఏంట్రా ఇటోచ్చావు? అడిగాడు మాధవరావుని.
"హత్యప్రదేశాన్ని చూడాలంటే లాయరుగార్ని తీసుకొచ్చాను" అన్నాడు మాధవరావు.
కోటేశ్వరరావుని స్నేహితుడికి పరిచయం చేశాడు మాధవరావు.
"మీరుండేది ఇక్కడేనా?" అడిగాడు నాగేశ్వరరావు.
"అవునండి. అదిగో, ఆ కనిపించే కొబ్బరిచెట్ల ఇల్లే మాది."
"ఐసీ! రండి లోపలికెళదాం" అన్నాడు నాగేశ్వరరావు.
ముగ్గురూ కలిసి లోపలికి వెళ్ళారు.
ఆ ఇల్లు పోలీసులు సీల్ చేశారు.
ఇంటిముందు మెయిన్ తలుపు దగ్గర నిల్చుని అటూ ఇటూ చూశాడు నాగేశ్వరరావు. తలుపు పక్కనే కిటికీ ఉంది. ఆ కిటికీ తీసే ఉండటంతో లోపలికి తొంగిచూశాడు నాగేశ్వరరావు.
లోపల ఒకే ఒక హాలు......పెద్ద మంచం. దానిపక్కనే ఇనుప బీరువా....మంచానికి ఎదురుగా ఒక చక్కటి టేబుల్- దాని ముందు రెండు కుర్చీలు.....మంచం పక్కనే కింద చాప పరచి ఉంది. ఆ హల్లో నించి మరో గుమ్మం కనిపిస్తోంది....అది వంటగది అయి ఉండాలి. ముందునుంచి పెరటివేపుకు దారి ఉంది. నాగేశ్వరరావు అటువేపు వెళ్ళాడు. పెరటితలుపు నెట్టి చూశాడు. అది లోపల బోల్టు వేసి ఉండటంతో రాలేదు.
వెనుక భాగమంతా సునితంగా పరిశీలించాడు. అక్కడ మట్టిలో ఉంగరం తళుక్కున మెరుస్తూ కనిపించింది. మళ్ళీ ముందుకు వచ్చాడు. కిటికీ లోపలి నుంచి చెయి పెట్టి చూశాడు. తలుపు బోల్టు చక్కగా అందుతుంది. నాగేశ్వరరావు మైండ్ లో ఫ్లాష్ వెలిగింది. మాధవరావు వేపు నవ్వుతూ చూశాడు.
"ఏంట్రా-ఏమైనా క్లూ దొరికిందా?" అడిగాడు ఆశ్చర్యంగా.
అతనేమీ మాట్లాడలేదు. తల పంకించాడు.
"సుందరం ఇక్కడకు రావటం మీ కంటపడిందా?" అడిగాడు నాగేశ్వరరావు మాధవరావు మిత్రుడ్ని.
"చాలాసార్లు చూసాను సార్! చూసే మాధవకు చెప్పాను. నేను చెప్పిన రెండురోజులకే ఈ దారుణం జరిగిపోయింది." అన్నాడు కోటేశ్వరరావు.
"వరాలను సుందరమే కాక ఇంకా ఎంతమందితో పరిచయం ఉండి ఉంటుంది?" అడిగాడు నాగేశ్వరరావు.
"చాలామంది ఉన్నారండి!" అన్నాడు నవ్వుతూ.
"ఆ చాలామందిలో మీరూ ఉన్నారనుకుంటా?" అడిగాడు నాగేశ్వరరావు వెంటనే. అతని ఉంగరం వేలుకి ఉంగరం లేదు. తెల్లమచ్చ ఉంది.
"ఎలా కనిపెట్టారు?" అడిగాడు కోటేశ్వరరావు.
"ఆమె విషయం ఇంత ఇంట్రెస్టింగా చెపుతుంటే అనుకున్నాను" అన్నాడు.
మాధవరావు కూడా ఖంగుతిన్నాడు. ఇదేంటి వీడికి కూడా పరిచయం ఉందా ఆమెతో అని ఆశ్చర్యపోసాగాడు.
"వరాలు అందగత్తేనా!" అడిగాడు నాగేశ్వరరావు.
"చాలా అందగత్తెసార్! కళ్ళు చెదిరిపోయే అందం" అన్నాడు కోటేశ్వరరావు.
"మీకెలా పరిచయం అయింది?" అడిగాడు నాగేశ్వరరావు.
"ప్రతిరోజూ ఆమె ఇంటి ముందునుంచే కదా వెళ్ళటం. సహజంగా అందగత్తే. పైగా నన్ను చూసి నవ్వుతూ వుండేది. అలా పెరిగింది పరిచయం" అన్నాడు.
"ఐసీ! మరి.....సుందరం ఇక్కడకు వస్తున్నాడు. పాడయిపోతాడు అని మీ మిత్రునికి ఎందుకు సలహా ఇచ్చారు? మీరు పాడైపోవటం లేదా?" అన్నాడు నాగేశ్వరరావు.
కోటేశ్వరరావు ఇబ్బందిగా చూశాడు మిత్రుడి వేపు.
"చెప్పండి పర్వాలెదూ" అన్నాడు నాగేశ్వరరావు సిగరెట్ వెలిగించుకుని.
"నేనంటే అనామకుడ్ని సార్! నా గూర్చి ఎవరికి తెలీదు. ఏదో దుకాణంలో గుమస్తాగా చేస్తూ కాలం గడుపుతున్నాను. సుందరం అంటే పేరు ప్రతిష్టలు గల కుటుంబం. పైగా మిత్రుని సోదరుడు, అతని భవిష్యత్తు దెబ్బ తింటుందనే ఉద్దేశంతో నేను హెచ్చరించాను" అన్నాడు కోటేశ్వరరావు.
"వెల్! మంచిపని చేశారు, మీకు పెళ్ళయిందా?" అడిగాడు నాగేశ్వరరావు.
"అయింది సార్!" చెప్పాడు మొహమాటంగా.
"మీ భార్య ఇక్కడే వుంటుందా?" అడిగాడు మళ్ళీ.
"లేదుసార్! పుట్టింట్లో వుంటుంది." చెప్పాడు.
"ఎందుకని?"
"ఏంటిసార్! మిరొచ్చింది వరాల హత్య విషయం ఎంక్వయిరీ చేయటానికా? నా గూర్చా?" అన్నాడు కోటేశ్వరరావు నవ్వుతూ.
