Previous Page Next Page 
విశిష్ట పేజి 55

     తండ్రీ కొడుకులు ఆస్తి కోసం తగాదా పడ్డారని, ఇద్దరూ ఆవేశపడ్డారని, అదే ఈ దుర్ఘటనకు కారణమని చెబుదాం. పోలీసుల ముందు మన ఇద్దరి మాటా ఒకటే కావాలి" చెప్పింది కాంతం.

     "అలాగే అత్తయ్యా! మీరు ఎలా చెప్పమంటే ఇలా చెబుతాను" పోలీసులు వచ్చారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి  అయ్యాయి.

     "తండ్రిని చంపి తనను కాల్చుకొన్న కొడుకు" అంటూ మరునాటి పత్రికల్లో వచ్చేసింది.

     హత్య ఆత్మహత్యలకి కారణం ఆస్తి తగాదానే అని కూడా వ్రాశాయి.

    మాజీ మంత్రిగా మాధవరావు గుణగణాలు కీర్తించాయి. ఆయన అంచెలంచెలుగా రాజకీయాల్లో ఎలా ఎదిగిందీ, లేబర్ కాంట్రాక్టరుగా వుండి ఈ స్థితికి ఎలా చేరుకొందీ - ఆ చరిత్ర అంతా తిరగేసింది.

    కొందరు రాజకీయ ప్రముఖులు చిన్న సంతాపసభ నిర్వహించి ఆయన చేసిన ప్రజాసేవను పొగిడి, దివంగత మాజీమంత్రికి నివాళులర్పించారు.      

    ఇదంతా సర్వసాధారణంగానే జరిగినా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి జరిగింది.

     ఇంతకాలం ఎక్కడున్నారో, ఎవరు ఎవరో కూడా తెలియని బంధువులు  దశదినకర్మకు దిగారు.

     లేచిపోయిందన్న కోపంతో ముప్పయ్యేళ్లుగా ముఖమైన చూడని కాంతం అన్నదమ్ములు వచ్చారు. వచ్చి పరామర్శించడమేకాదు - విధవ రాలైన సోదరికి తెల్లచీరా, వెండి గాజులు తెచ్చారు.

    కాంతానికి మండిపోయింది.

     "ముప్పయ్యేళ్లుగా మా ఇంట జరిగిన ఏ శుభకార్యానికీ రానిమీరు ఇవాళ సంతోషంగా నన్ను ముండమొయించడానికి వచ్చారా? మీముఖాలు కాల్చా! అంటూ శాపనార్దాలు పెట్టింది.

     "ఇన్నాళ్లూ నువ్వు సుఖంగా వున్నావు. లేచిపోయావన్న మచ్చ తెచ్చినా నీ పాటికి నువ్వు సుఖం గా వున్నావు కదా అనుకున్నాం. నీ గురించి ఏ బెంగా  వుండేదికాదు.  ఇప్పుడు భర్తనూ, కొడుకునూ ఒకేసారి పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో  వున్నావు. బొత్తిగా ఒంటరిదానివై పోయావు.  నీ సవతి కొడుకూ, నీ దాయాదులూ నీ ఆస్తికోసం డేగల్లా లేచి కూర్చున్నారు. ఈ సమయంలో పెద్దదిక్కుగా మోముండడం మా ధర్మమనిపించింది. వచ్చాం....!" అంటూ సమర్దించుకున్నారు తమ రాకను.

     ఆ మాట నిజమే.

     మాధవరావు ఇన్నాళ్లు దూరంగా వుంచిన ఆయన అన్నదమ్ములూ మొదటి భార్య పుట్టింటి వాళ్లు దినవారాల సాకుతో దిగబడ్డారు.
     
     మొదటి భార్య కొడుకు వల్ల గొడవలొస్తాయన్న ఆలోచనతో మాధవరావు స్వార్జితమైన ఇళ్లు, పొలాలు, తోటలు చాలావరకు కాంతం పేరుమీద పెట్టాడు.

     తన పేరు మీదున్నవి తన తదనంతరం తన పెద్దభార్య కొడుక్కి చెందాలని వ్రాశాడు. పదేళ్ల క్రిందటే  వ్రాసి పెట్టిన వీలునామాలో.

     "నీకింక ఎవరున్నారు కాంతమ్మా....? మహేష్ నీ కడుపున పుట్టక పోయినా నీ భర్త రక్తం పంచుకు పుట్టిన వాడే కదా? వాడినీ, వాడి పిల్లల్నీ నీ దగ్గరే వుంచుకో నీ మంచి చెడ్డలు చూసి నీ అంత్య సమయంలో ఆదుకొంటాడు."

     దినవారాలు అయిపోయాక కాంతం దగ్గరికి వచ్చి చెప్పాడు మాధవరావు పెద్ద బార్య అన్న.

    "నా కెవరి అవసరమూ లేదండీ. నా కొడుకు పోయినా కోడలుందిగా? నేను ఒంటరిదాన్ని ఎలా అవుతాను? మా వారి వీలునామా ప్రకారం ఏం వస్తే అది తీసుకుపొమ్మనండి. మహేష్ ను. నా అభ్యంతరం ఏం లేదు. దయచేసి నా జోలికి మాత్రం ఎవరూ రాకండి."

    "కోడలు కాని కోడలు కాంతమ్మ కోడలన్నట్టు నీ కోడలి సంగతంతా మాకు తెలుసులేమ్మా....!పోలీసులు ఏం చెప్పినా అసలు జరిగిన  వ్యవహారమేమిటో మాకు తెలుసు.  ఆ పిల్లను  పృద్వీకి చేసుకోవడమే ఒక డ్రామా! మా పిల్ల నీ కొడుకుమీద పెట్టిన కేసుల నుండి బయటపడటం కోసం ఆ పిల్లనూ, ఆమె కుటుంబాన్నీ బెదిరించి బలవంతంగా నీ కొడుక్కి  చేసిన వైనం మాకు తెలీదనుకున్నావా?

    ఈ హత్యా, ఆత్మహత్యల వెనుక ఆమె హస్తం వుందనే మా అనుమానం. అవన్నీ పోలీసు ఇన్వెష్టిగేషన్ లో బయటపడతాయిలే. మొగుడు చస్తే బొట్టు గాజులు తీయడానికి ఇష్టపడని కోడలు ఓ కోడలేనా?"

     అందరినీ  సాగనంపే సరికి తల ప్రాణం తోకకి వచ్చింది కాంతానికి.

     అందరూ వెళ్లిపోయాక   విశిష్ట కూడా వెళ్లడానికి  తయారై, "అత్తయ్యా.....! మీరొకసారి నా సూట్ కేసు చూస్తే లాక్ చేస్తాను..." అంది.

    " ఏమిటిదంతా! ఎక్కడికి వెడుతున్నావు...?" ఖిన్నురాలైనట్టుగా అడిగింది కాంతం.

    "నేను వెళ్లిపోతున్నాను. ఎక్కడికో నాకే తెలియదు. పుట్టింటి తలుపులు నేనే మూసుకు వచ్చాను కాబట్టి అక్కడికి వెళ్లలేను. ఎక్కడయినా మహిళా శ్రమంలో చోటు దొరుకుతుందేమో చూడాలి."

    "నువ్వు ఎక్కడికీ వెళ్లేపనిలేదు. ఇక్కడే వుండాలి. ఇది నీ ఇల్లు. నా కొడుకు వున్నంత వరకు నువ్వు నా కోడలివి. ఇప్పుడు కూతురివి. నీకు పెళ్లి చేస్తాను. నిన్ను నా దగ్గరే పెట్టుకొంటాను. నన్ను బంధువులనే ఈ డేగల నుండి కాపాడే సమర్దురాలివి నువ్వొక్కదానివే. దయచేసి నన్ను ఒంటరిదాన్ని, దిక్కులేనిదాన్నీ చేసిపోకు...." ప్రాధేయ పడ్డట్టుగా అంది కాంతం.    
       
     "మీ భర్తా మీ కొడుకు చావులకు కారణంనేను . నన్ను మీరు క్షమించడమే కష్టం. అలాంటిది  నన్ను మీ దగ్గరుంచుకొని.... పెళ్లి చేసి -" నమ్మలేక పోతున్నట్టుగా చూసింది విశిష్ట.

     కాంతం నిర్వేదంగా అంది....

    "భర్తా, కొడుకూ అన్న అభిమానాన్ని ప్రక్కకి పెట్టి పక్షపాతం లేకుండా చూస్తే వాళ్ల పాపమే వాళ్లను హతమార్చిందనిపిస్తుంది. లేకపోతే, ఆయన ఈ వయసు కోడలిని కామించడం ఏమిటి...? అది ఎంత నీచం? చచ్చిన మనిషిక్రిందే లెక్క అయ్యేవాడు. ఇహ నా కొడుకు!వాడు పదిహేను పదహారేళ్ల వయసులోనే పనిమనిషితో ఆటలు మొదలు పెట్టాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS