అప్పుడే వాడికి బుద్ది చెప్పి దారిలోకి తేవాలని చూశాను. నా వల్ల కాలేదు. కాని, ఎంత చెడ్డవాడైనా కొడుకు కొడుకే. ఆ కడుపు శోకం ఎలాగూ వుంటుందనుకో. ఇందులో నీ తప్పేమీ లేనప్పుడు నీ మీదెందుకు కోపం?"
"నాకు తెలుసు, అత్తయ్యా! తండ్రీ కొడుకు లిద్దరూ మంచి మనసుతో నన్ను చేసుకోలేదని నన్ను సర్వనాశనం చేయ్యాలన్న ఆలోచన తోటే నన్ను బలవంత పెట్టి, బెదిరించి చేసుకున్నారని నాకు తెలుసు. పెళ్లయ్యాక నన్ను కాల్చుకు తింటారని కూడా నాకు తెలుసు. తెలిసీ ఈ ఇంట్లో కోడలిగా అడగుపెట్టాను. సాధ్యమైనంత వరకు పృద్వీని మార్చాలనుకున్నాను. నా కెందుకో ఆయన్ని మార్చగలనన్న ఆశ చివురించింది.
అంతలోనే నేను ఊహించనిది జరిగిపోయింది. అలా ఉన్మాదంగా తండ్రిని కాల్చి తనను కాల్చుకుంటాడని కొద్దిగా ఊహకందినా మామగారి విషయం ఆయనకి చెప్పకుండా నేనే సెటిల్ చేసేదాన్ని. నాకిదినిజంగా ఎంత షాకయ్యిందో చెప్పలేను. మీ కడుపులో చిచ్చు పెట్టి, మీ నుదుటి కుంకుమ చెరిపింది నేనే ననిపించినప్పుడల్లా నన్ను నేను క్షమించుకోలేక పోతున్నాను."
"నువ్వు కావాలని చేసింది ఏమీ లేదుకదమ్మా? నిన్ను నీవు ఎందుకు నిందించుకుంటావు? తండ్రీ కొడుకులు వాళ్ల పాపానికి వాళ్లు బలి అయ్యారు. దయచేసి నువ్వు మాత్రం నన్ను విడిచిపోవద్దు. నీలాంటి దైర్యస్తురాలు నాకు తోడుగా వుంటేనే నేను కృష్ణా రామా అనుకుంటూ నిశ్చింతగా వుంటాను. ఈ ఆస్తి వ్యవహారాలవీ నాకు తెలియవు. భర్తచాటున కాపురం చేసిన మనిషిని. ఆయన అక్రమంగానో, సక్రమంగానో చాలానే సంపాదించి నా పేరు మీదు పెట్టారు. ఆయన పోగానే పెద్దభార్య కొడుకు లేచి కూర్చొన్నాడు. నా పుట్టింటి వాళ్లు సరేసరి. బెల్లంచుట్టు ఈగల్లా చేరిపోదామని చూశారు. లేచిపోయి వచ్చాననీ, ఇంటికి మచ్చ తెచ్చాననీ నానా తిట్లు తిట్టి ఆ కోపంతో ముప్పై ఏళ్ళుగా నా ముఖమైనా చూడని నా తోబుట్టువులకి ఇప్పుడు నా మంచి చెడ్డలు కావలసి వచ్చాయంటే నా మీద వాళ్ల కెంత ప్రేమో నేనర్దం చేసుకోగలను. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని వాళ్లను మొదట్లోనే దూరంగా వుంచాను."
"మరి నన్నెలా నమ్ముతున్నారు మీరు?"
"నీ ధైర్యం, నీ ఆత్మ విశ్వాసం నా కెంతగానో నచ్చాయి. ఏదైనా విషమ పరిస్థితి ఎదురైతే ఆడపిల్లగా ఆలోచించవు. ధైర్యమే నువ్వవుతావు. నిన్ను చూడకముందు నువ్వంటే నాకు చెప్పలేనంత కోపంగా వుండేది. అందమైన నా కొడుకు ముఖాన్ని అందవికారంగా మార్చావని. కాని, నిన్ను చూశాక, నిన్ను అర్దం చేసుకొన్నాక నువ్వు చేసింది న్యాయమే ననిపించింది."
"ఈ ఆస్తి వ్యవహారాలు నా స్వేచ్చకు చిక్కుముళ్లు అవుతాయేమో!"
"ఈ ఆస్తి నా ఒక్కదానిదే కాదు. నీది కూడా. ఈ ఆస్తిపాస్తుల మీద నీకు వ్యామోహం లేదని నాకు తెలుసు. నువ్వు డబ్బు మనిషి కాదు. నీకు దురాశలేదు. కాని, ఈ ఇంటికోడలిగా ఈ ఆస్తి మీద హక్కుంది. ఈ హక్కును కాదని వెళ్లిపోతే ఇది కుక్కలపాలూ, నక్కలపాలూ అవుతుంది."
"అవనీయండి. దీనిమీద నాకు ఆశలేదు."
"ఆశలేనిమనిషివి కనుకే నువ్వు నాకు తోడుగా వుండమంటున్నాను. ఇంక కాదనకు. నువ్వు వుండిపోక తప్పదు" అంటూ సూట్ కేస్ లోని బట్టలవీ తీసి బయట పారేసింది కాంతం. "వెళ్లు! వెళ్లి యధావిధిగా బీరువాలో పెట్టు. నువ్విక్కడ ఏ స్వేచ్చనూ కోల్పోనక్కరలేదు. నువ్వేం చేయాలన్నా స్వేచ్చగా చేయొచ్చు. పృద్వీతో జరిగిన పెళ్లి ఒక స్వప్నంగా భావించి మర్చిపో. తిరిగి కొత్త జీవితం ప్రారంభించు. ముందు నీ ఆగిపోయిన చదువు పూర్తిచేసుకో. ఇంత ఆస్తి కట్టుకుపోతానా? ఒక అనాధాశ్రమం పెట్టాలని వుంది. డబ్బునాది, ఆచరణ నీది నీ ఆద్వర్యంలో ఆ శరణాలయం నడవాలి."
"పెద్దగా చదువకోలేదు మీరు! కాని మీలో ఎంతో ఔన్నత్యం వుంది" మనస్పూర్తిగా మెచ్చుకొంది విశిష్ట.
"కొత్త జీవితం మీ అబ్బాయితోనే ప్రారంభించాలనుకున్నాను. కాని అనుకోనివిధంగా జరిగిపోయింది" విషాదంగా అంది విశిష్ట.
రేడియోలో పాట వస్తోంది...
"అనుకొన్నవి జరగవు అన్నీ..... అనుకోలేదని ఆగవు కొన్ని......."
----: శుభం :----
