రుద్రప్రయాగనుంచి మందాకిని ఒడ్డునే కేదారనాథ్ కు యాత్ర చేస్తారు. అలకనందా తీరాన్నే రుద్రప్రయాగనుంచి ఆ సాయంకాలమే ప్రయాణం సాగించి, శివానంద వెళ్ళేసరికి నాకు గాడ్పు కొట్టినంత పనైంది. కాఫీ మధ్య మధ్య నాలుగు సారులు తాగాను. ఆ రాత్రి శివానందిలో మకాం వేశాం. తెల్లవారగట్లనే బయలుదేరి హరి ఆశ్రమం. ఖమెరాలలో ఆగకుండా గౌచాల్ చేరాము. ఇక్కడవరకు విమానాలు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సాయంకాలం బయలుదేరి, పిండారిగంగ అలకనందలో సంగమించే కర్ణప్రయాగ చేరాము.
నందప్రయాగ వచ్చేదారిలో హిమాలయవాసులైన లేప్చాల జట్టు ఒకటి మా కెదురైంది. వాళ్ళు రోడ్డు ప్రక్కనే చల్లటి మామిడిచెట్ల నీడలో మద్దళం వాయిస్తూ పాడుతూ నాట్యం చేస్తున్నారు. అందులో ఒక అమ్మాయి అచ్చంగా గంధర్వ బాలికలా ఉంది. బంగారు చాయ, గుండ్రటి మోము, స్పుటరేఖా సమన్వితమైన దేహమూ నన్ను పరవశుణ్ణి చేశాయి. వరూధిని కూడా ఈలాంటి బాలికే అయి ఉండాలనుకున్నాను. ఆమె బట్టలు రంగు రంగులతో ఒక చిత్రవిధానంలో వున్నాయి, తడుపుట, ఆరవేయుట ఎగరనే ఎగరవు. నగలూ లేవు. ఏమి అందము! నేనా నాట్యం చూస్తూ ఆ చెట్లనీడనే కూర్చున్నాను. నాతో రాజపుత్ర జమీందారుడును కూర్చున్నాడు. ఆ రాజపుత్ర జమీందారుని పేరు రాజగోవిందసింహకపూర్ బహదూర్, ఈయనకు నలభై అయిదేళ్ళుంటాయి. పొడుగాటి మనుష్యుడు. బంగారానికి వన్నెదిద్దే చాయ. గరుడనాసిక, కోలమోము, బవిరి గడ్డంతో ఏ ధర్మరాజునో, అర్జునుణ్ణో తలపించే అందం కలవాడు. మా ఇద్దరి సంభాషణ హిందూస్థాన్ భాషలో జరిగింది.
''బాబూజీ! ఆ అమ్మాయి ఎంత చక్కగా పాడుతోంది. కోయిల కంఠం కాదా?''
''అవును రాజబహదూర్! ఆ నాట్యం చూస్తోంటే ఊర్వశి నృత్యం ఈలాగే వుండేదేమోనని అనిపిస్తోంది.''
''ఊర్వశి నృత్యం ఎందుకు జ్ఞాపకం వచ్చింది మీకు? ''
''మనం ఊర్వశి పుట్టిన స్థలం చూడబోతున్నాం గాదా అండి? ''
''అదేక్కడండోయ్?!''
''నరనారాయణాశ్రమమైన బదరికా క్షేత్రమే కదాండి. నరనారాయణులు తపస్సు చేసుకొంటుంటే, ఆ తపస్సు చెడగొట్టడానికి ఇంద్రుడు రంబాదులను పంపిస్తే చిరునవ్వతో నారాయణుడు తొడ చరవగానే, ఊర్వశి ఉద్భవించిందట. ఆమె పరమాద్భుత దివ్య సౌందర్యాన్ని చూచి రంబాదులు పారిపోయారట. ఇంద్రు డామెకు దాసుడయ్యాడట.
35
ఆ బాలిక నాట్యం మనోహరంగా ఉంది. మమ్మల్ని మెప్పించాలని మరీ చక్కగా పాడుతూ, చేతులూ కళ్ళూ తిప్పుతూ నాట్యం చేసింది. ఆమె అలా నాట్యం చేస్తూ, చేస్తూ నాదేవి శకుంతలగా మారిపోయింది. ఎప్పుడు నేర్చుకుంది నా శకుంతల నాట్యం? నా శకుంతల ఊర్వశి కాదు గదా? ఏదైనా శాపం పొందివచ్చి, శాపం తీరగానే వెళ్ళిపోయిందేమో? పురూరవుణ్ణి, అర్జునుణ్ణి ఆమె ప్రేమించింది. పురూరవుడు ఆమెను ప్రేమించాడు. అర్జునుడు ప్రేమించలేదు. మా తెలుగు కవులలో ఉత్తముడైన దేవులపల్లి ఊర్వశీభావాన్ని అత్యంతము ప్రేమించి, సర్వకాలం విరహవేదనపడుతూ ఉంటాడు.
అప్సరోభావం అద్భుతమనినా ఉద్దేశం హేమా! అప్సరసలు అమృతంతో, లక్ష్మితో ఉద్భవించినవాళ్ళు, పాలసముద్రం అంటే విశ్వ సౌందర్యం. ఆ సౌందర్యాన్ని మధిస్తే సౌందర్యమూర్తములైన వస్తువులు ధవళమై, వెలుగుతూ ఉద్భవించాయి. శక్తి సౌందర్యం కౌమోదికి, నాద సౌందర్యం పాంచజన్యం, కాంతి సౌందర్యం కౌస్తుభం, మహాపథ దిక్సౌందర్యం ఐరావతం, జీవితాభీష్ట సౌందర్యం చింతామణి, వేగ సౌందర్యం ఉచ్చైశ్రవము, వితరణ సౌందర్యం కల్పవృక్షము, నృత్యకళా సౌందర్యమూ, కామ సౌందర్యమూ అప్సరసలు, పరమేశ్వర రూపసౌందర్యం లక్ష్మి, కాలాతీతత్వ సౌందర్యం అమృతం. ఈ భావాలు నాకు తర్వాత తర్వాత కలిగాయి. పరమ కామము, పరమ నృత్యమూ ఊర్వశిలో సౌందర్యోజ్వల రూపాయలయ్యాయి.
నాట్యం కాగానే ఆ అమ్మాయి నా దగ్గిరకు వచ్చి పైస యాచించింది.
ఆ అమ్మాయిలోని బిగువులు చూచి నే నామెను నా మనస్సులో విగతవస్త్రతను చేసి ఆ అందాలు చూశాను. నా కళ్ళలో, ఆమె దిగంబరత్వాన్ని చూచింది కాబోలు ఆ అడవిపిల్ల సిగ్గుపడుతూ, చిరునవ్వు నవ్వుతూ వాళ్ళ జట్టుకడకు పరుగెత్తింది. తక్కిన అమ్మాయిలు ఫక్కున నవ్వుతూ'' ఆ బాబుని చూచి కన్నేసినావా? '' యని వేళాకోళం చేశారు.
నాకా భాష తెలియనట్లు నటిస్తూ కొన్ని నగలు, ఇన్ని సూదులు, దారం కట్టలు ఆ అమ్మాయికి బహుమతి ఇచ్చాను. తక్కినవారికెవ్వరికీ కోపం రాకుండా సూదులు, దారపు ఉండలు పంచి ఇచ్చాను. హిమాలయ పర్వతవాసినులకు సూదులు, దారపు ఉండలూ అంటే మహా ఆనందం. రోట్టయినా మానుతారుగాని సూదులు, దారాలూ వదలరు.
ఎవడో మహాదాత బయలుదేరాడన్న వార్త ఆ పర్వత ప్రదేశాలలో మారుమ్రోగింది కాబోలు, ప్రయాణం పొడుగునా భూటియాలు, లేప్చాలు మొదలైన పర్వతవాసుల స్త్రీలు, బాలబాలికలు పైసా, నగలియ్యి, సూదియ్యి, దారమియ్యి అని నన్నే పట్టుకున్నారు. నాకు వాళ్ళు నిజమైన గంధర్వ, కిన్నెరీ, యక్షబాలికలై తోచారు.
నాలో కామవాంఛ, కాశీలో మణికర్ణికా ఘట్టంలోనే మాయమైంది. అనాచ్ఛాదిత స్త్రీమూర్తి సౌందర్య సందర్శనాకాంక్ష పూర్తిగా నన్ను నిండిపోయింది. లోయలో ప్రవహించే నదీ సౌందర్యానికీ, ఈ పర్వత వర్ధనుర సౌందర్యానికీ ఏదో విచిత్రసామ్యం కనిపించింది. స్త్రీ మూర్తివినా నాకా పర్వతంలో ఏదీ పులకరాలు కలుగజేయలేదు. స్వామిజీ ఈ మార్పు చూస్తూనే ఉన్నారని నా అభిప్రాయం. ఏమీ చూడనట్టే కనబడ్డారు. ఆ విలక్షణ సౌందర్యం విన్నా నాకా క్షేత్రాలు అర్థరహిత మయ్యాయి.
మా దారి వెంబడిలో ఎక్కువమంది బదరీనాథం నుంచి తిరిగి వచ్చినవారే కనబడ్డారు. కొందరు గంగోత్రి వెళ్ళ సంకల్పించుకొన్నవారు, కొందరు కేదార యాత్రోన్ముఖులు. కొంచెం పొద్దేక్కునప్పటికీ నంద ప్రయాగ చేరాము. నందప్రయాగలో సాయంకాలం వరకూ ఉండి, ఆ పెద్ద గ్రామం పూర్తిగా దర్శించాను. ఆ పర్వత వాసుల జీవితం కనుగొనడమే నా ఉద్దేశం. నందప్రయాగ దగ్గర నందానది అలకనందలో చేరుతుంది. సాయంకాలానికి కోహాడ్ చేరాము.
