Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 54


    సాంబయ్య నాగేంద్రుని దిబ్బదాటి, విసురుగా గనెం మీద అడుగులు వేస్తూ తూలిపడ్డాడు. మాగాటి బురదలోనుంచి కాళ్ళు పెకలించుకొని మళ్ళీ గట్టుమీదకు రావటానికి ప్రయత్నించాడు. కుడికాలి పాదం పోటు పెట్టింది. పాదం మడతపడి చీలమడం దగ్గిర బెణికినట్టుంది. గట్టుమీద నాలుగడుగులువేసి, నడవలేక గట్టుమీదే చతికిలబడ్డాడు. మునివేళ్ళతో చీలమండదగ్గిర తడిమి చూసుకొన్నాడు. అప్పటికప్పుడే వాచినట్టుంది.
    తలగుడ్డతీసి, పాదం చుట్టూ మెలిచుట్టి కట్టి, సాంబయ్య మళ్ళీ గట్టుమీద లేచి నిలబడ్డాడు. కట్టుబిగువుకు కాలు భూమికి అంటీ అంటనట్టు వేస్తూ, కుంటుకుంటూ సాంబయ్య ఊళ్ళోకి వచ్చాడు.
    రచ్చలవీధి దాటి తన ఇంటిముందు కొచ్చిన సాంబయ్య ఇంటి ముందాగిన కారును చూసి, కాలునొప్పి మర్చిపోయి నిలబడిపోయాడు!
    వచ్చాడు! మళ్ళీ వచ్చాడు! వీడి బతుక్కు వీడికి మాట్లాడితే చిన్నకారు! వీడిబాబుగాడి సొమ్ముందిక్కడ - వేసుకుపోవటానికి? ఈ రోజు వీడి అంతు తేల్చుకుంటా! సాంబయ్య గుండెలు పొగలు శెగలు చిమ్మాయి.
    కాళ్ళీడ్చుకుంటూ కారు దగ్గిరకొచ్చిన సాంబయ్యకు డ్రైవరూ, వాడి పక్కన మరో కుర్రాడూ కన్పించారు.
    "ఏడ్రా వాడు?"
    వాళ్ళు మాట్లాడలేదు.
    "మా వాడు రాలేదా? ఎక్కడ వాడు?"
    "ఆసుపత్రిలో వున్నారయ్యా!" కుర్రది గొంతు విచారంగా ధ్వనించింది.
    "ఆసుపత్రేమిటి?"
    "అవునండీ, వెంకటపతిగారికి జబ్బుగా వుంది." డ్రైవర్ అందుకుని చెప్పాడు.
    లోయలో నిలబడ్డ  మనిషిమీద కొండమీదనుంచి గుండురాయి దొర్లినట్టయిపోయింది సాంబయ్యకు. కొన్నిక్షణాలు నోటమాట రాలేదు.
    "ఏమిట్రా మీరు చెప్పేది? మా అబ్బాయి వెంకటపతి గురించేనా?" అన్నాడు సాంబయ్య.
    "అవునండీ! వెంకటపతిగారికి బాగా జబ్బుగా వుంది. మూడు రోజుల్నాడు ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు నమ్మకం చెప్పలేకపోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నంనుంచి మన స్పృహలోనే లేరు. అమ్మగారు కార్లో మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. త్వరగా బయలుదేరితే మంచిది."
    సాంబయ్య గుండెలు విచ్చిపోయినై. తల వెయ్యివక్కలైపోతున్నట్టు పోటు పెట్టసాగింది. ఇంట్లోకన్నా వెళ్ళకుండా సాంబయ్య కాళ్ళీడ్చుకుంటూ వచ్చి కార్లో కూర్చున్నాడు. కారు స్టార్టయింది.
    కారు వూరు పొలిమేరదాటి కంకర రోడ్డెక్కింది. సాంబయ్య మనసు పరిపరి విధాలుగా పోయింది.
    వశికర్రలా ఉండే వెంకటపతికి జబ్బేమిటి? వాడు పుట్టి బుద్దెరిగాక పడక వేసి ఎరగడు. వాడు తలనొప్పి అన్నట్టు కూడా గుర్తులేదు. రాయిలాంటి మనిషి, వాడికేమయింది ఇంత వుట్టివుడియంగా?
    ఆలోచనలు ముందుకు సాగలేదు. సాంబయ్య గుండెలు కలుక్కుమన్నాయి.
    "మా వెంకటపతి కేమయిందయ్యా? ఇప్పుడెలా వున్నాడు?" సాంబయ్య కంఠం పూడిపోయింది.
    "మాట్లాడరేం! వాడింకా.....?" ఇహమాట పెగల్లేదు.
    "అధైర్యపడకండి సాంబయ్యగారూ? వెంకటపతిగారికి ఈపాటికి స్పృహ వచ్చి వుంటుంది.  పెద్ద పెద్ద డాక్టర్లు చూస్తున్నారు." సాంబయ్యకు ధైర్యం చెప్పటానికన్నట్టుగా చెప్పాడు డ్రైవర్.
    కాని, అతని మాటలు సాంబయ్య అనుమానాల్నీ, భయాల్నీ రెండింతలు చేశాయి.
    హారి భగవంతుడా! వెంకటపతికి చివరికి ఏం గతి పట్టింది? తల్లిలేని బిడ్డను పసిగుడ్డును తన గుండెలమీదే పెంచాడు. కంటికి రెప్పలా కాపాడుకొచ్చాడు. నెత్తురుగుడ్డును పెంచి పెద్దచేసి ఇంతవాడ్ని చేశాడు. మొక్క మానైంది. ఆ చెట్టు నీడన కూర్చొని విశ్రాంతి తీసుకొనేవేళకు చెట్టే నరకబడుతోందా?
    సాంబయ్య హృదయం ఆక్రోశించింది. కొడుకు-ఒక్కగాను ఒక్క కొడుకు - తన రక్తం లోని రక్తం - తన సర్వస్వం అయిన వెంకటపతిని తను ప్రాణాలతో చూడగలడా? తను వెళ్ళేసరికి ఆసుపత్రినుంచి వెంకటపతి శవాన్ని తెల్లగుడ్డలో చుట్టి - సాంబయ్య గుండెలు కొట్టుకులాడాయి. కృష్ణ వరదకు పెద్దచెరువు గట్టు తెగి వూరిమీద పడిన గాలివాన రాత్రిలా అయింది సాంబయ్య మనసు.
    సాంబయ్య మనసు వశం తప్పిపోతోంది. కాళ్ళూ చేతులూ వణికిపోతున్నాయి.
    వెంకటపతి లేని తన బ్రతుక్కు అర్ధం ఏమిటి? ఎవరికోసం బతకాలి? ఎవర్ని చూసుకొని వూరట చెందాలి?
    తండ్రి వెంకయ్య పొలాన గడ్డిగూటిలో బిగిసిపోవడం తను చూశాడు. తల్లి మరణ వేదన చూశాడు. భార్య దుర్గమ్మకు విషం పోసిననాటిరాత్రి ఆమె పొందిన బాధను తను చూశాడు. పిడకల గూటి దగ్గర ముసలమ్మ పక్షవాతంతో కాలూ చెయ్యీ పడి కూలిపోవడం తను చూశాడు. కాని, ఇలా అనిపించలేదు. తల్లీ, తండ్రీ, భార్యా అంతా తనవాళ్ళే. కాని, వెంకటపతి వేరు. వాడు  తనలోని భాగం. తన వెంకటపతి ఇహ తనకు లేడా?
    సాంబయ్య ఎర్రటి కనిగుంటల్లో నీళ్ళు తిరిగాయి. కన్నీరంటే ఏమిటో తెలియని సాంబయ్య కళ్ళమీద నీటిపొరలు గమ్మాయి.
    "తొందరగా పోనియ్ నాయనా! చూసైనా..." సాంబయ్య నోట్లో పైపంచ కుక్కుకొని కుమిలిపోయాడు. కారు పట్నం చేరేసరికి బాగా పొద్దుపోయింది. మరో పావుగంటకు పెద్దబజారు దాటి, రెండు సందులు తిరిగి గుడిశెలువున్న ప్రాంతంకూడా దాటి, జనం రద్దీ అంతగాలేని కంకరరోడ్డుమీద కారు పోసాగింది. సాంబయ్య ఆత్రుతగా కార్లోనుంచి బయటకు చూస్తూ "ఏమిటయ్యా, ఇంకా పోతున్నావ్? ఆసుపత్రి రాలేదా?" అని డ్రైవర్ని అడిగాడు.
    "వచ్చేశాం ఇది అడ్డదారి త్వరగా వద్దామని ఇటు వస్తున్నా, అంతే!" అంటూ డ్రైవర్, మధ్య మధ్య విరిగి పడివున్న ఎత్తైన ప్రహరీగోడ ప్రక్కగా కారాపి, లోపలకు తోవ ఎటా అన్నట్లు పరిశీలనగా చూశాడు.
    డ్రైవర్ రసూల్ కారు రివర్స్ చేసి, ఎడం పక్కకు కోసి కొంత దూరం వచ్చాక ప్రహరీగేటులోపలకు వేగంగా కారు నడిపాడు.
    ఓ పాడుపడ్డ ఇంటిముందుకొచ్చి కారు ఆగింది.
    కారు ఆగీ ఆగటంతోటే, మెట్లమీద నిలబడివున్న ఇద్దరు వ్యక్తులు కారు దగ్గిరకొచ్చి దొర పక్కని నిలబడ్డారు.
    "దిగండయ్యా! ఇక్కడే" అన్నాడు రసూల్, చీకట్లో సాంబయ్య ముఖం చూడ్డానికి ప్రయత్నిస్తూ.
    "ఇదా ఆసుపత్రి? ఇదెందుకయిందీ?"
    "ఇది ప్రయివేటుది. ఇక్కడే మీ అబ్బాయి గారుంది!"
    "ఇక్కడా మా వెంకటపతిని పెట్టింది? దెయ్యాల కొంపల్లే వుందిగదయ్యా! ఈ పాడుపడ్డ కొంపలో మా వెంకటపతి నుంచారా?" సాంబయ్య ఆవేశంతో అన్నాడు.
    "అంటే......వాడూ....." ఆపైన మాట పెగల్లేదు. కార్లోనుంచి దిగలేకా అందులో వుండలేకా వుండిపోయాడు.
    రసూల్ డోర్ తీసి పట్టుకోగా, అంతవరకూ కారుపక్కన నిలబడ్డ ఇద్దరూ సాంబయ్యను చెరో రెక్కా పట్టుకుని కిందకు దించారు. వెనక్కు గుంజుకుంటున్న సాంబయ్యను చెరో రెక్కా పట్టుకుని కిందకు దించారు. వెనక్కు గుంజుకుంటున్న సాంబయ్యను భుజాలమీద వేసుకుని ఆ వస్తాదులిద్దరూ నాలుగు అంగాలలో ఇంట్లో చేరవేశారు.
    "ఇటు! ఇటు! యీ గదిలోకి తీసుకురండి!" ఆ కంఠం ఎక్కడో విన్నట్టే అనిపించింది సాంబయ్యకు. లాంతరు వెలుగులో అతనికేసి గుచ్చిగుచ్చి చూశాడు. ఆయన్ను ఎక్కడో చూసినట్లే వుంది!
    అతని పేరూ?.... ఏదో..... బాబో! ప్రసాదో!
    సాంబయ్య గుర్తుచేసుకునేలోపునే కండపుష్టిగల వాళ్ళిద్దరూ సాంబయ్యను ఓ గదిలోకి మోసుకొచ్చి పాతర్లో విసిరిన వడ్ల బస్తాలా మంచంమీదకు విసిరారు.
    "ఒరేయ్ పశువుల్లారా? ఏవిట్రా ఆ పెద్దాయన్ను అలా పడేశారు? మెల్లగా దించలేరూ? ఊఁ చాల్లే! ఇకపోయి బయట నిలబడండి!" రామనాథబాబు వాళ్ళిద్దర్నీ కసిరి, గదిలోనుంచి బయటకు పంపించాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS