"ఫరవాలేదు. ఈ పిక్చర్లో నీపని చాలావుంది" అని చెప్తూండగా, శ్రీశ్రీగారు "సరోజా!" అంటూ వచ్చారు.
"వచ్చేశారా? ఏమిటి సంగతి?" అనడిగాను.
నా చేతిలో ఓ కవరు పెడుతూ "ఏమిటి మళ్ళీ ఆ అమ్మాయితో గొడవా" అనడిగారు.
"భలేవారే! నేనేమైనా మూర్ఖురాలైననుకున్నారా ఆర్టిస్టుల మూడ్ పాడు చెయ్యడనికి? అదీకాకుండా ఎక్కడివక్కడే మరచిపోవాలండీ" అన్నాను.
"వెరీగుడ్! అలావుండాలి. ఫరవాలేదు పనికొస్తావులే! ఆ కవరు విప్పి చూడు" అన్నారు.
"మీరు చెపుదురూ" అన్నాను.
"అబ్బా! చూడు సరోజా!".
కవరు విప్పాను. అందులో ఏడువందల ఏభయి రూపాయలున్నాయి. నా ఆనందానికి అవధుల్లేవు.
లూప్ రావడ్నైకి ఇంకా అయిదునిముషాలు పడుతుంది. ఇద్దరం కుర్చీల్లో కూర్చున్నాం. మాకు దగ్గరగా ఎవరూ లేరు స్క్రీన్ కి దగ్గరగా మా టేబిలూ, కుర్చీలూ ఉన్నాయన్నమాట. మావేనక కాస్తదూరంలో ఆర్టిస్టులంతా కూర్చున్నారు.
నేను వెంటనే వారితో "చూశారా! మనం ఇప్పుడు వేలమీద సంపాదిస్తున్నాం. ఈ ఏడువందల యాభై చూసి ఆశ్చర్యపోవడం కాదు. ముఫ్ఫయి రూపాయల చొప్పున (ఆరోజుల్లో) ఎన్ని సీసాలు వస్తాయి? మీకు కావాలనుకుంటే ఈ మొత్తం డబ్బుతో కావలసినన్ని బాటిల్స్ కొనుక్కొని, పగలంతా పనిచేసి, రాత్రి ఇంటికి వెళ్ళి తాగారనుకోండి! మిమ్మల్ని అడిగేవారు ఎవ్వరూ ఉండరు. ఇది గౌరవమా? అది గౌరవమా?"
"సరేకానీ- ఇందలో నీక్కావలసినంత డబ్బు తీసుకో సరోజా!" అన్నారు. నేను ఆశ్చర్యంతో "నాకెందుకు? చూడండి మీరన్న ఆ మాటొక్కటే నాకు చాలండి. ఇది మీ కష్టార్జితం. ఇందులో నా కష్టం ఏమీలేదు. భాగం అంతకన్నా లేదు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళి మీ ఆవిడ చేతికివ్వండి. సంతోషిస్తారు" అని చెప్పాను.
"నువ్వు గొడవచేశావు కాబట్టే, నాకు సీసాకు బదులుగా ఈ డబ్బు వచ్చింది. కాబట్టి నీక్కావలసినంత తీసుకో" అన్నారు.
"అంటే ఇలా ప్రతి కంపెనీకి వచ్చి గొడవచేసి వచ్చిన డబ్బులో కమీషన్ తీసుకోమంటారా?" అని నవ్వాను.
"నిన్న జరిగింది రాత్రికి రాత్రే ఫీల్డంతా పాకిపోయింది. ఆ అమ్మాయిని ఎక్కడ పట్టావని అడుగుతున్నారు. ఇది సినిమా ప్రపంచం అని మరచిపోకు సరోజా!" అన్నారు.
ఇంతలో లంచ్ బ్రేక్ వచ్చింది.
"మనిద్దరం పార్క్ లేండ్స్ హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం రా" అన్నారు. (ఆ హోటల్ ఇప్పటికీ పానగల్ పార్క్ దగ్గరుంది. మా పెళ్ళయ్యాక మేము రోజూ అక్కడే తినేవాళ్ళం.)
"వద్దండి. మీరు ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నం తిని త్వరగా వచ్చెయ్యండి. నేనిక్కడే భోంచేస్తాను.
అలాగే ఈ డబ్బు కూడా ఇంట్లో ఇచ్చెయ్యండి" అన్నాను.
"ఇందులో నీకేమీ వద్దన్నమాట".
"వద్దు".
"సరే-నేను వెంటనే వచ్చేస్తాన"ని ఇంటికి వెళ్ళిపోయారు.
కానీ - మూడు గంటలయినా రాలేదు.
నా గుండెలో రాయి పడింది.
ఫినిషింగ్ కాల్ షీట్ పెట్టుకొని తాగుతారన్న భయం లేదుకానీ, ఏమో, ఎలా, ఏం చేయాలోనన్న ఆలోచనలో పని మందగించే ప్రమాదం లేకుండా మెయిన్ టెయిన్ చేస్తున్నాను. శ్రీశ్రీగారు నాలుగ్గంటలకు వచ్చారు. కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి. వారినలా చూడగానే కోపంతోపాటూ ఏడుపొచ్చినంత పని అయ్యింది. అయినా సంభాళించుకుంటూ -
"ఏవండీ! ఇంత ఆలస్యం ఎందుకయింది? కళ్ళు అంత ఎర్రగా వున్నాఏమిటి?" అనడిగాను.
"నీ అనుమానంతో చస్తున్నాం సరోజా! చూడు - ఆఁ" అంటూ నోరు తెరచి, నా ముక్కు దగ్గరగా పెట్టి "తాగేనా!" అని అడిగారు.
"లేదండి. మరయితే ఆలస్యం ఎందుకయ్యింది" అనడిగాను.
"నేను ఇంటికి వెళ్ళనంటే బలవంతాన గెంటావు. నా ప్రాణం మీదికి ఆవిడో రాక్షసి! వచ్చిన డబ్బులో నీకెంత ఇచ్చానో చెప్పమని గొడవ. దమ్మిడీ ఇవ్వలేదంటే నమ్మదే! చూశావా, నీ నిజాయితీ ఏమయిందని అడిగేరు.
నిజంగానే నాకు బాధ వేసింది. కానీ అవన్నీ మనసులో పెట్టుకుంటే పని అవదనుకొని ఓ నిట్టూర్పు విడిచాను.
ఆరోజు రాత్రి పిక్చర్ పూర్తయ్యేసరికి ఒంటి గంట. ఇళ్ళకి చేరుకునేసరికి రెండు గంటలయింది.
* * *
మాలో గొడవలెలాగున్నా, పిక్చర్లు వరుసగా వస్తూనే వున్నాయి. మేం నిరాఘాటంగా చేస్తూనే వున్నాం.
కానీ ఇంతలో మరో కొత్త గొడవ వచ్చి పడింది. గిట్టనివాళ్ళు చాలా మంది తయారయ్యారు. శ్రీశ్రీ గారి కొచ్చే డబ్బింగ్ పిక్చర్ల ప్రవాహానికి ఆనకట్ట కట్టాలని ప్రయత్నాలు ప్రారంభించారు వారంతా.
ఫిల్మ్ సెంటర్ (నేడు అది వాసూ స్టూడియో) ప్రొప్రయిటర్ మజీద్గారు చాలా మంచివారు. బొంబాయి వాడియా పిక్చర్స్ తో తాను చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ పిక్చర్లన్నీ తనే మూడు భాషల్లో డబ్బింగ్ చెయ్యాలి (హిందీకి అనువాదం).
మొత్తం తెలుగు డబ్బింగ్ పిక్చర్లన్నిటికీ శ్రీశ్రీగారినే ఫిక్స్ చేసి పెర్మనెంట్ అగ్రిమెంట్ చేసేసుకున్నారు.
నేటి మేటి డబ్బింగ్ ఆర్టిస్టు పి.జె. శర్మగారికి శ్రీశ్రీగారు ఆ స్టూడియో లోనే 'రామభకత హనుమాన్' పిక్చర్ కి మొట్టమొదటిసారిగా డబ్బింగ్ ఛాన్స్ యిచ్చి, ఫిల్డుకి పరిచయం చేశారు.
ఫిల్మ్ సెంటర్ పుట్టిల్లులాగయింది నాకు. శ్రీశ్రీగారు నా గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం ప్రారంభించారు. అప్పుడప్పుడు నైట్ కాల్ షీట్లో పని చేస్తూండగా సడన్ గా వచ్చి, తను వచ్చినట్టు నాకు తెలియనివ్వకుండా, నన్నూ, నా ప్రవర్తనని పరీక్షించేవారు. సాధారణంగా నైట్ కాల్ షీట్లు వస్తే, తొమ్మిది గంటల తర్వాత రెస్ట్ తీసుకుంటారని ఇంటికి పంపించేదాన్ని పగలంతా పనిచేసి, రాత్రిళ్ళు పని నాకు వదిలేసి ఇంటికి వెళ్ళి డ్రింక్ తీసుకొని హాయిగా నిద్రపోయేవారు.
అదనుకోసం ఎదురుచూసే కొందరు దీన్ని అవకాశంగా తీసుకొని మామీద ప్రాపగందా ప్రారంభించారు.
* * *
పెద్ద దుమారం
"శ్రీశ్రీ చిత్తుగా తాగి స్టూడియోకి వస్తున్నాడు. వచ్చినా పని చెయ్యడు. పడుకుంటాడు. ఈ మధ్య అయితే అసలు ర్వడమే మానేశాడు. డైలాగ్స్ ఆయన రాయడు. ఆవిడే రాస్తుంది. పెత్తనం అంతా ఆవిడదే! చాలా స్ట్రిక్టుగా వుంటుంది. ఆవిడ కాల్ షీట్లో వుంటే, ఎవ్వరికీ ఫ్రీడం వుండదు. వీరవిహారం చేస్తుంది....." అని ఒకటేమిటి పెద్ద దుమారం లేవగొట్టేశారు గిట్టనివాళ్ళు.
వాళ్ళ మాటలు విన్న ప్రొడ్యూసర్లు తిన్నగా వచ్చి, వాళ్ళు చెప్పిన మాటలన్నీ మాతోనే చెప్పి వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకొనేవారు.
ఆ విధంగా మాకోచ్చే పిక్చర్లని పూర్తిగా అరికట్టలేకపోయినా, రెండో మూడో పోయేవి. అలా పిక్చర్లని చెడగొట్టడం తప్పితే మమ్మల్నేవీ చెయ్యలేకపోయేవారు.
'ఆడదాన్ని అందలం ఎక్కించి, దానికి డబ్బింగ్ ట్రయినింగ్ యిచ్చి, డైలాగ్ డైరెక్టర్ని చేసి, డబ్బింగ్ డైరెక్టర్ పేరు కూడా పిక్చర్స్ లో శ్రీశ్రీ వేయిస్తున్నాడే" అని చాలామందికి కడుపుమంట మమ్మల్ని పడగొట్టడానికి పెద్ద గ్యాంగే పని చేసింది.
శ్రీశ్రీగారు డబ్బింగ్ కంటూ ఓ చరిత్రనే సృష్టించారు. వారు రాసిన పిక్చర్లలో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్టులంతా ఆ రోజుల్లోనే స్వంత ఇల్లు కట్టుకున్నారు. అది డబ్బింగ్ ఆర్టిస్టుల కాలనీ అనిపించారు. (ఆ కాలనీ ఇప్పటికీ ఉంది.)
ఆ రోజుల్లో ఒక్కో ఆర్టిస్టుకీ వారిప్పించినంత డబ్బు ఏ రైటరూ ఇప్పించలేదు. అసలు వారికా రోజులల్లో కాంపిటేషనేలేదు. బేనర్లో శ్రీశ్రీగారి పేరుంటే చాలు, కళ్ళు మూసుకొని డిస్ట్రిబ్యూతర్స్ వచ్చేసేవారు. ఇలా 'సినీ ఫీల్డులో శ్రీశ్రీ' అని రాస్తే అదో గ్రంథం తయారవుతోంది. ఆ విషయం అలా వుంచుదాం.
ఓ రోజు నేను వారితో - "చూడండీ మనమీద ఎటువంటి ప్రాపగందా చేస్తున్నారో! మీరు బాగా తాగుతారట. స్క్రిప్ట్ రాయరట. నేనే రాస్తానట. మీరు స్టూడియోకే రారట. వచ్చినా పని చెయ్యరట. నిద్రపోతారట. ఇలా ఎన్నని చెప్పనండి" అని బాధపడ్డాను.
దానికి శ్రీశ్రీగారు - "అనుకోనియ్యి సరోజా! నేను హాగి, రాయకుండానే, స్టూడియోకి రాకుండానే ఇన్ని పిక్చర్లు పూర్తి చేశానా? అదీ కాకుండా ఎవరో ఏదో అంటున్నారని నువ్వు బాధపడిపోతావేమిటి సరోజా!
నీకింకా తెలీదేమో! ఇడ్లీ పొట్లానికి పిక్చర్ రాసేవాళ్ళు బయలుదేరారు. చీరా రవికెల గుడ్డకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు తయారయ్యారు. వాళ్ళకన్నా వెయ్యిరెట్లు నువ్వు గొప్పదానివి. ఇవన్నీ పట్టించుకొని దిగులు పడకు.
