"శశికళా .... మన ట్రావెలర్స్ ని దేశంలోని మిగతా ముఖ్య పట్టణాల్లో ఏర్పాటుచేశామన్న ఆలోచన వుంది. విదేశాల్లో కూడా ఓపెన్ చేయొచ్చు. నీలో టాలెంట్ ఉంది. నేను మిగతా విషయాలు చూసుకోగలను. మనిద్దరం వ్యాపారంలోనే కాదు, జీవితంలో కూడా ఎందుకు పార్ట్ నర్స్ మీ కాకూడదు.
కేవలం జీతంతో ఆఫీసులో ఎంప్లాయిగానే వుంటావో.... నా లైఫ్ లో, బిజినెస్ లో పార్టనర్ గ వుండి..... ఈ లగ్జరీస్ ని ఎంజాయ్ చేస్తావో నీ ఇష్టం...." అన్నాడు కృష్ణమూర్తి.
వ్యాపారం అనే చదరంగంలో ఏ పామును ఎప్పుడు, ఎక్కడ, ఎలా కదపాలో తెలిసిన వ్యక్తి అతను.
శశికళ మరో థాట్ కు తావివ్వలేదు. ఆమె తన అవసరానికి అనుగుణంగా అభిప్రాయాలను ఈజీగా మార్చేసుకోగలదు. శ్రీచరణ్ ని, కృష్ణమూర్తిని పక్కపక్కన ఊహించుకుంది."
పెద్ద గీత ముందు మరో పెద్ద గీతలా కనిపించాడు కృష్ణమూర్తి.
ఆ క్షణమే శ్రీచరణ్ ని తన మనసులో నుంచి తుడిచేసి, కృష్ణమూర్తిని ఫిక్స్ చేసుకుంది.
* * *
శ్రీచరణ్ డీప్ షాక్ లో ఉండిపోయాడు.
శశికళలో మోడ్రన్ థాట్స్ వుంటాయని తెలుసు. డబ్బు పిచ్చి ఆవిడకు ఉందని తెలుసు. కానీ, ఆ థాట్స్, ఆ పిచ్చి కాబోయే భర్తనే మార్చేసేంత ఉందని తెలీదు.
కేవలం ఎక్కువ శాలరీ కోసం కృష్ణమూర్తి ట్రావెలర్స్ జాయినయిందనుకున్నాడు. అతను పార్ట్ నర్ షిప్ ప్రపోజల్ తో తన ప్రేమకే తిలోదకాలిస్తుందని ఊహించలేదు.
మానవ సంబంధాలన్నీ, ఇలా ఆర్ధిక సంబంధాలతో ముడిపడి వున్నాయని, వుంటాయని మరోసారి రుజువైంది. కానీ పెళ్లిని కూడా వ్యాపార దృష్టితో ఆలోచించే శశికళా, కృష్ణమూర్తిలను చూసి అతను అయోమయంలో పడిపోయాడు. ఒక మనిషి ఆలోచనలు మోడ్రన్ గా వుంటే సరిపోదని, మనస్సు కూడా బావుండాలని అర్దమైంది.
తన తప్పేమిటో తెలుసుకోవడానికి అతనికి పట్టిన సమయం సంవత్సర కాలం.
అతనికి ప్రనూష గుర్తొచ్చింది.
తనతో ఎప్పుడు గొడవ పడ్డా అల్లరిపడ్డా, ఎక్కడా తనని మోసం చేసినట్టు అనిపించేది కాదు, కానీ, తనే.... తనే పొరపాటు చేసేడేమో..."
ఆఫీసులో ఉండాలనిపించలేదు.
ఇంటికి వెళ్ళామని బయల్దేరాడు.
స్కూటర్ రోడ్డు దగ్గర టర్న్ చేస్తుండగా, ఓ బంగ్లా ముందు వాచ్ మెన్ తో మాట్లాడుతూ కనిపించింది ప్రనూష.
వెంటనే స్కూటర్ ని ఓ పక్కన ఆపి, ప్రనూషవైపు నడిచాడు, కనీసం ప్రనూష లైఫ్ అయినా చక్కగా సెటిల్ అయితే చాలు.
* * *
"సార్ లోపల ఉన్నారా?" అడిగింది ఆటో డిగిన ప్రనూష వాచ్ మెన్ ని.
"ఉన్నారు మేడమ్. కానీ ఒక్క మాట..." తటపటాయిస్తూ అన్నాడు. అతనికి వయస్సు యాభైకి పైగానే ఉంటుంది.
ఏంటన్నట్టు చూసింది ప్రనూష. "ఈ ఇంటి వాచ్ మెన్ గా ఐదారేళ్ళుగా పనిచేస్తున్నాను. ఈ ఇంటికి అమ్మాయిలు నవ్వుతూ వచ్చి, డబ్బుతో నవ్వుతూ వెళ్తారు. కానీ, నిన్న మీరు బాధతో వెళ్ళిపోయారు. మీరు ఆ బాపతికాదని అనిపించింది. ఈ ఇంటి యజమాని గురించి, ఆయన ఉప్పు తినే నేను చెప్పకూడదు. కానీ, కూతురు లాంటి దానివి. ప్రభాత్ బాబుగారి లాంటివాడి వలల్లో నువ్వు పడటం నాకు బాధగా ఉందమ్మా అతను తన మాటలతో, డబ్బుందనే అహంతో ఎందరో అమ్మాయిలను లొంగదీసుకుంటాడు. "అని ఆగాడు.
ఒక్క క్షణం విభ్రాంతిగా చూస్తుండిపోయింది.
నమ్మలేని నిజం. ఆమె నవనాడులనూ కృంగదీసింది.
గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టింది.
* * *
"వెల్డన్ ప్రభాత్ నీ టాలెంట్ చూపించి మొత్తం మీద ప్రనూషను ట్రాప్ లోకి లాగాలన్న మాట...." విస్కీ గ్లాసును నోటికి ఆన్చుకుని అంటున్నాడు వేదాచలం.
"లేకపోతే....నేనెవర్ని....ప్రభాత్ ని.... ది గ్రేట్ ప్రభాత్....ఓ రెండొందలు పెట్టి.... భావకవిత్వాల పుస్తకాలు తెచ్చాను. బట్టీ పట్టాను. వర్కవుట్ అయింది....పిచ్చిది.....పూర్ గాళ్....నిన్ననే వర్కవుట్ అవ్వాల్సింది. పెళ్ళని..... అదని.....ఇదని.....లైన్ లో పెడతానుగా...." అది ప్రభాత్ గొంతు.
"నాకా నమ్మకం ఉంది ప్రభాత్. దాన్ని స్పాయిల్ చేయాలి. నా మాట వినకపోవడమే గాక, నన్ను ఘోరంగా అవమానించింది."
"డోంట్ వర్రీ గురు చండాలపు పనులు చేయడంలో కూడా నేను మీ శిష్యుడినే... మీరే గనుక ప్రనూషకు సంబంధించిన డిటైల్స్ ఇవ్వకపోతే నాకు కష్టమైపోయేది."
"అది నా డ్యూటీ..."
"డ్యూటీ కాదు....మీరు షాలా.....ఛ......ఛ....మందెక్కువైంది. చాలా మంచివాళ్ళు.... దానికి పెళ్ళయిందని తెలుసుకుని చెప్పారు. నేనింకా తనని పెళ్ళి చేసుకుంతాననుకుంటోంది." మాటలు ముద్దముద్దగా వినిపిస్తున్నాయి..... తడబడుతున్నాయి.
వింటున్న ప్రనూషకు తల తిరిగిపోయింది.
ఇది నిజమా? వేదాచలం, ప్రభాత్ కలిసి.....
అంటే.....ప్రభాత్ మాటలు, చేతలూ....అంతా ట్రాష్....
ఇక అక్కడ ఉండలేకపోయింది.
నిశ్శబ్దంగా అక్కడ్నుంచి వెనక్కి వచ్చేసింది. గేటు దాటగానే ఆ దారిన వెళ్తోన్న ఆటోని పిలిచి కూచుంది.
శ్రీచరణ్ పిలవబోయేంత.లోనే ఆటో ముందుకు కదిలింది.
* * *
ఏడుపొచ్చేస్తోంది ప్రనూషకు.
ఇంకా.....ఇంకా....ఏడ్వాలి. తన తప్పుకు పరిహాసంగా ఏడ్వాలి....తన మూర్ఖత్వానికి గుర్తుగా ఏడ్వాలి.... కన్నీళ్ళ సముద్రాలయ్యేలా ఏడ్వాలి. ఒక్కసారిగా శ్రీచరణ్ గుర్తొచ్చాడు. అతను తనని అల్లరి పట్టించినా ఏనాడూ అల్లరి పాలు చేయాలనుకోలేదు. తన అభిప్రాయాల్ని ముక్కు సూటిగా చెప్పాడు.
తనని ఏదైనా చేసే అవకాశమున్నా, మాటకు కట్టుబడి వున్నాడు. కేవలం పూరిష్ అభిప్రాయాలతో తనెంత తప్పు చేసింది?
ఈ తప్పును ఎలా సరిదిద్దుకోవాలి?
* * *
తాళం తీసి లోపలికి అడుగుపెట్టింది. తను ఉదయం ప్యాక్ చేసుకున్న సామాను తనను వెక్కిరిస్తూ కనిపించింది. కోపంగా ఆ ప్యాక్ ని విప్పేసి అందులోని సామాన్లు గిరాటేసింది.
ఎదురుగా ఆల్బం....అందులో పెళ్ళినాటి పోటో తను శ్రీచరణ్.....ఆ ఫోటోని అపురూపంగా చేతిలోకి తీసుకుని గుండెలకు ఆన్చుకుంది.
కన్నీళ్ళు ఆమె బుగ్గల మీద చారికలు కట్టాయి.
