తెల్లవారింది.
రాత్రంతా నిద్రలేక శ్రీచరణ్ కళ్ళు ఎర్రగా అయ్యాయి. లేచే ఓపిక లేక అలా పడుకునే ఉంది ప్రనూష.
"ఈ రోజు నేను ఆఫీసుకు త్వరగా వెళ్ళాలి ప్రనూషా ఓపిక ఉంటే ఆఫీసుకు వెళ్ళు.....లేదంటే ప్లాస్క్ లో కాఫీ ఉంది. హాట్ ప్యాకర్ లో ఇడ్లీలున్నాయి. తిను. నా అకౌంట్ లోదేలే భయపడకు..." అంటూ ఆఫీసుకు బయల్దేరాడు శ్రీచరణ్.
"ఈ ఒక్కపూట నాతో ఉంటే ఏమైంది!?" కోపంగా అనుకుంది మనస్సులో. ఆ వెంటనే అతను తమకేమవుతాడు ఈ రోజునుండి అనుకుంది.
"ఇదిగో ప్రనూ...నిన్నే.....ఇవ్వాళ్టితో మన అగ్రిమెంట్ పూర్తవుతుంది. ఈ సాయంత్రమే ఎవరి దారి వారిది. ఈ సాయంత్రానికి మీ హజ్బెండ్ ను తెచ్చుకుంటావో.....వేరే ఇల్లు చూసుకుని మారిపోతావో నీ ఇష్టం. సామానంతా ప్యాక్ చేసి ఉంచు. కావాలంటే సాయపడతాలే. అన్నట్టు నేను కూడా సామాను ప్యాక్ చేసుకోవాలి కదూ..."
గదిలో నుండి శ్రీచరణ్ మాటలన్నీ వినిపిస్తూనే వున్నాయి ప్రనూషకు.
"ఛీ....ఏం మనిషి....రాత్రంతా అంతచేసి, ఉదయాన్నే ఇలా అంటాడా? నీకసలు బుద్ది ఉందా? నువ్వెక్కడికీ వెళ్ళద్దు. ఇంట్లోనే పడిచావు. నీ మొగుణ్ణి. నిన్నేమన్న అనే అధికారం నాకే ఉంది అని అనొచ్చుగా. పెళ్ళాం మీద ఆ మాత్రం అధికారం చూపించలేడా?" మనస్సులోనే కోపంగా అనుకుంది ప్రనూష.
శ్రీచరణ్ వెళ్ళిపోయాడు.
ఒంటరితనం చుట్టు ముట్టి నట్లయింది ప్రనూషకు. కొద్దిగా రిలీఫ్ గా వుంది. ఒంటరిగా ఇంట్లో ఉంటే మరింత పిచ్చెక్కేలా వుంది. ఆఫీసుకు వెళ్తే తప్ప తనకు రిలాక్స్ గా ఉండదు అనుకుంది. వెంటనే లేచి ఓపిక తెచ్చుకుని లేచింది.
గబగబా తయారవసాగింది. శ్రీచరణ్ ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అప్పుడే మూడువందల అరవై ఐదు రోజులయ్యాయా? తన దగ్గరికి వచ్చి వెళ్ళినప్పటి నుంచి నాన్న ఉత్తరాలు రాయలేదు. తను రాయాలంటే, అక్కడ్నుంచి ఏం సమాధానం వస్తుందోనని భయం. బామ్మకూడా ఈ మధ్య రాలేదు. అప్పుడప్పుడు శ్రీచరణే వెళ్ళి చూసి వస్తున్నాడు శ్రీచరణ్ కూడా వస్తానని బామ్మ అన్నా ఏదో ఒకటి తప్పిస్తూ వస్తున్నాడు శ్రీచరణ్.
ఈ రోజుతో తనకూ, ఈ ఇంటికీ అనుబంధం తెగిపోనుందా?
ఈ రోజుతో తనకూ, శ్రీచరణ్ కూ ఉన్న బంధం విచ్చిన్న మవ్వనుందా?
ఆ ఆలోచన తననెందుకంత బాధపెడుతోంది, తనకు తెలియకుండానే తన మనసు శ్రీచరణ్ మీదికి మళ్లిందా?
అయినా, ఈ ఫీలింగ్ తనకేనా? శ్రీచరణ్ కు లేదా? ఎంత ఈజీగా తనకు చెప్పెళ్ళాడు...ఇల్లు ఖాళీ చేయమని. ఎంత సిగ్గులేనిది తను. పెళ్ళికి, తాలికి ఇంకా ఏమూలో తనకు సెంటిమెంట్ ఉండటం వలన ఇలా ఫీలవుతోంది. అతన్ని చూస్తే కేవలం తనంటే ఓ స్నేహితురాలిగా తప్ప వేరే ఉద్దేశ్యం లేనట్లుంది. అయినా, తన పిచ్చిగానీ, నిజంగా తనంటే ఇష్టముంటే ఇలా సంవత్సరం పాటు తనని పవితరంగా ఉంచేవాడా?
ఛ.....తను కూడా ఈ బంధాన్ని ఈజీగానే తీసుకోవాలి.
గట్టిగా నిర్ణయించుకుంది ప్రనూష.
* * *
తన సామానంతా నీట్ గా ప్యాక్ చేయాలనుకుంది. చాలా కొద్దిపాటి సామానే ఉంది. కొన్ని ప్యాక్ చేసింది కూడా. ఎదురుగా టేబుల్ మీద సగం తాజ్ మహల్.
ఒక్క క్షణం గుండె బరువెక్కింది.
మరొక్క క్షణం గొంతు మూగబోయింది.
ఇంకో క్షణం శరీరం సమస్తం నిస్తేజమైన ఫీలింగ్ కలిగింది. ఆరోజు శ్రీచరణ్ ఎండి అన్న మాటలు గుర్తొచ్చాయి.
తల విదిల్చింది.
ఈ సమయంలో సెంటిమెంట్లు అవసరం. తెగిపోయి సంబంధం గురించి, అన్నింటికీ తెగించిన తను ఆలోచించకూడదు.
ఆలోచించే దశ దాటిపోయింది.
తన "దిశ ఎటువైపు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
ప్రభాత్ గుర్తొచ్చాడు. నిన్నటి విషయంలో అతను రియలైజ్ కూడా అయ్యాడు. ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలన్న నిశ్చయానికి వచ్చింది ప్రనూష.
ఆఫీసుకు బయల్దేరింది.
టైం పదిన్నర అయింది.
* * *
ఆఫీసుకు వెళ్ళేసరికి ప్రభాత్ రాలేదు.
కామాక్షి కూడా రాలేదు. ప్రసూనాంబ చెప్పింది.
"కామాక్షి ఇవాళ సాయంత్రం బిర్లా మందిర్ లో మ్యారేజి చేసుకుంటోంది." అని.
"అదేమిటి? ఇంత సడన్ గా?"
"కామాక్షి క్లాస్ మేట్ ఒకతను చాలా నెలలుగా ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటూ ఉన్నాడు. కామాక్షి వాళ్ళ బావను పెళ్ళి చేసుకోవాలనుకుంటోందన్న విషయం తెలిసి, అతడు "డ్రాప్" అయ్యాడు.
కానీ, కామాక్షి మ్యారేజ్ ప్రపోజల్ క్యాన్సిల్ అవ్వడంతో తను ముందుకొచ్చాడు. కామాక్షి కూడా ఒప్పుకుంది.
అందుబాటులో లేనిదాని గురించి ఆర్రులు చాచడం కన్నా, అందుబాటులో ఉన్న తనని ప్రేమించిన వ్యక్తిని చేసుకోవడమే బెటర్..... నా దృష్టిలో కామాక్షి సరైన పనే చేసింది. మేమంతా సాయంత్రం ఆ పెళ్ళికి వెళ్తున్నాం...." ప్రసూనాంబ చెప్పింది.
ప్రనూష డోలాయమానంలో పడింది. కామాక్షి చేసిన పని సరైనదే. మరి తను తప్పు చేస్తున్నది.....వ్యవధి లేదు. ఏదో ఒక నిర్ణయానికి రావాలి.
బహుశా ప్రబాత్ నిన్నటి ఇష్యూలో ఫీలయి ఆఫీసుకు రాలేదేమో.... ఇంటికి వెళ్ళాలి. ప్రభాత్ ఇంటికి వెళ్ళి. తన పెళ్ళి సంగతి అడగాలి. ఒప్పుకుంటాడు.... ప్రభాత్ తప్పకుండా ఒప్పుకుంటాడు. ప్రభాత్ ఒప్పుకోగానే రేపే రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి చేసుకోవాలి. చిత్రంగా ఆ ఆలోచన ఆమెను ఎలాంటి మధురోహలనూ వికసింపచేయలేదు. మెకానికల్ ఫీలింగ్ లో అనిపించింది. వెంటనే ఆఫీసు బయటకు వచ్చి ఆటో ఎక్కి ప్రభాత్ ఇంటి అడ్రస్ చెప్పింది. ఆటో కదిలింది.
* * *
కొందరు కొన్ని అభిప్రాయలకు కట్టుబడతారు.
మరికొందరు అనవసరానికి అనుగుణంగా అభిప్రాయం ఎలా మార్చుకోవాలనే అభిప్రాయానికి మాత్రమే కట్టుబడతారు.
రెండో రకానికి చెందిన శశికళ, తన అభిప్రాయాన్ని చాలా సడెన్ గా మార్చేసుకుంది.
కృష్ణమూర్తి ప్రారంభించిన ట్రావెలర్స్ లో జాయినయింది. అది శ్రీచరణ్ కోసం కేటాయించిన జాబ్ లో.
శశికళ చాలా షార్ప్ ఎదుటి మనుష్యులను తన మాటలతో అట్రాక్ట్ చేయగలదు. ఆమె తన బిజినెస్ కు ఎలా ప్లస్సవుతుందో తెలిసిన వ్యక్తి కృష్ణమూర్తి.
అందుకే అతనికో థాట్ వచ్చింది.
దాని లాభనష్టాలు, సాధ్యాసాధ్యాలు అతనికి అనవసరం. దాని పర్యవస్థానమే.
* * *
