ఎదురుగా సగం తాజ్ మహల్. కిటికీ దగ్గర పోస్టు మాన్ వేసినట్టున్నాడు.
హాలులోకి వెళ్ళింది. ఉత్తరం కనిపించింది. ఆ చేతి వ్రాతను బట్టి అది తండ్రి రాసిందని అర్ధమైంది.
వణుకుతున్న చేతులతో ఉత్తరం చించి చదివింది.
చిరంజీవి సౌభాగ్యవతి ప్రనూషకూ, చిరంజీవి శ్రీచరణ్ కు...
ఏమని దీవించను. ఇవ్వాళ్టితో హాయిగా విడిపోయిందని దీవించనా? నేను చేసిన తప్పుకు నువ్వు విధించిన శిక్ష సబబే తల్లీ.... నీ ఇష్టా యిష్టాల్ని కాలరాచి నీకు ఇష్టం లేని పెళ్ళి చేసిన ఈ తండ్రిని వెంటనే గుండె ఆగి చచ్చిపొమ్మని శపించమ్మ...
కళ్ళజోడు మరిచిపోయాను. బహుశా ఆ అవసరం నాకిక రాదేమో....కళ్ళున్న గుడ్డివాడినే అయ్యాను. మీరు మీ కిష్టమైన పెళ్ళిళ్ళు చేసుకోండి. ఇంతకన్నా ఏమీ రాయలేని నిర్భాగ్యుడ్ని....గుండె నొప్పి ప్రాణాలను హరిస్తుందంటారు....ఇప్పుడు నాకు వచ్చింది మనస్సు నొప్పి. అది నాలోని మరో మనిషిని ఎప్పుడో చంపేసింది.
---మీనాన్న
స్థాణువై కూలబడింది.
అంతా శూన్యంగా అనిపిస్తోంది.
శ్రీచరణ్ గదిలోకి వెళ్ళింది. అక్కడ టేబుల్ మీద అవిచ్చిన సగం తాజ్ మహల్ వుంది. దాన్ని తీసుకువచ్చి తన దగ్గరున్న తాజ్ మహల్లో "ఇన్ సెట్" చేసింది.
అందమైన తాజ్ మహల్ రూపం వచ్చింది. అంతేకాదు. రెంటినీ ఇన్ సెట్ చేయగానే బ్యాటరీ పన్జేయడం మొదలై....తాజ్ మహల్ లైట్స్ తో వెలిగిపోవడం.
గోడకు ఉన్న చార్ట్ ని చింపేసింది ముక్కలుగా. తన బెడ్రూంలో వున్న సింగిల్ కాట్ ని, శ్రీచరణ్ గదిలోకి జరిపి అతని కాట్ పక్కనే వేసింది. కిచెన్ లోని సామానంతా శ్రీచరణ్ కిచెన్ లోకి షిఫ్ట్ చేసింది.
తను పెళ్ళినాటి ఫోటోని గోడకు తగిలించింది.
అన్ని పనులూ చేస్తున్నా కన్నీళ్ళు మాత్రం కారుతూనే ఉన్నాయి. మోకాళ్ళ మీద కూలబడిపోయింది. మోకాళ్ళ మధ్యతలపెట్టి....వెక్కి వెక్కి ఏడవసాగింది.
సరిగ్గా అప్పుడే. అడుగుల శబ్దం.....ఎదురుగా శ్రీచరణ్ తలెత్తి శ్రీచరణ్ ని చూసింది లేచి నిలబడింది.
"ప్రనూ..." పిలిచాడు శ్రీచరణ్ మృదుమధురంగా.
"ఏవండీ....ఆమె గొంతు పెగల్లేదు. స్వరపేటిక సహకరించలేదు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. అయినా, మనస్సు పిలిచింది.
ఆమె వేగంగా అతడ్ని చేరుకుందో, అతడే వేగంగా ఆమెను చేరుకున్నాడో...
అక్కడ అమృత వర్షిణి ఆలాపన వినిపిస్తోంది.
అక్కడ కోయిల కూజితం వేలవేల గొంతులతో ప్రతిధ్వనిస్తోంది.
ప్రేమ పల్లవిస్తోంది. మనసు చరణమై....వాళ్ళ ప్రేమ చర్విత చర్విణమేనని చెబుతోంది.
అప్పుడు వినిపించాయి చప్పట్లు.
ఇద్దరూ విడిపడ్డారు. ఎదురుగా బామ్మ.
"బామ్మ! నువ్విప్పుడు ఇలా..." ఆశ్చర్యంగా అన్నాడు శ్రీచరణ్.
"అవున్రా.....నేనే మీ తలతిక్కవేషాలు ఈ బామ్మకు తెలియవను కున్నార్రా బడవలూ....ఈ సంవత్సర కాలం బామ్మ మూలకు కూచుంది అనుకున్నారా....రామస్వామిని ఎప్పటికప్పుడు మీ గురించి కూపీలు లాగమని చెబుతూనే వున్నా, మీ మామవచ్చి, మీ అగ్రిమెంట్ గురించి చెప్పి బాధపడి మీకు ఉత్తరం రాయగానే, అతనికి ధైర్యం చెప్పి ఇక్కడికి తీసుకువచ్చా....
కొన్ని నిజాలు.....స్వానుభవంతో తేలాలి...
కొన్ని అనుభవాలు.....గుణపాఠాలుగా నిలవాలి..... ప్రేమించుకొని పెళ్ళి చేసుకోవడం గొప్పా? పెళ్ళి చేసుకొని ప్రేమించడం మంచిదా? నాగరికత అంటే ప్యాంటూ, చొక్కాలు వేసుకోవడం, నడుమ్మీద చేయేసి కూచొని షికారు చేయడమా? లాంటి మీ మాటలు వద్దు. ప్రేమ ఇద్దరిలో వుండాలి. ఒకరికి ఆసరాగా మరొకరు అవ్వాలి. ఒకరికి మరొకరు శ్వాస కావాలి.
పాతకాలం దాన్నే అయినా కొత్త తరంలో కొత్త విషయాలు తెలుసుకున్న బామ్మగా చెబుతున్నాను.
ఇప్పటికైనా ఒక్కటయ్యారా సంతోషం. "బామ్మ ఆనందంతో చెబుతూంటే విస్మయంగా, దిగ్భ్రాంతిగా, సంబరంగా చూస్తుండిపోయారు.
బామ్మ వెనకే తండ్రి, తల్లీ, చెల్లెలు అందరి కళ్ళలోనూ కన్నీటి మెరుపు.
చెమ్మగిల్లిన మనసా....చూసావా ఈ ఉద్విగ్నభరిత సన్నివేశం...
శ్రీచరణ్, ప్రనూష వెళ్ళి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు.
"అక్కా....ఆశీర్వాదాల సీన్ చాలుగానీ....లోపలికెళ్ళి ఇరగదీసే ప్రోగ్రామ్ మొదలెట్టండి" ప్రియ అనేసరికి ప్రనూషా, శ్రీచరణ్ మొహమొహాలు చూసుకున్నారు.
మిగతా వాళ్ళునవ్వారు.
"మేము ఈరోజుకి హోటల్లో వుంటాం. రేపొచ్చేసరికి...
మనవరాలా....నువ్వు వాంతులు చేసుకోవాలి. ఓకే...మనవడూ...నువ్వు నీ పెళ్ళానికి చింతకాయలు తినిపిస్తూ కనిపించాలి....లేదంటే....రామస్వామిని నీ ఇంటి చూరుకు ఉరేసి చంపుతా..." అంది.
రామస్వామి బిక్కచచ్చిపోయాడు....ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు....ఈవిడ నన్ను అంటుందేమిటీ! అని.
* * *
"ఏవండీ ఈసారి నిజంగా సారీ..." అంది ప్రనూష
"ఎందుకే..." ఏడుపు మొహంతో అన్నాడు శ్రీచరణ్.
"అదిగో....నన్ను "వే" అంటున్నారు.
"అనన్లేగానీ చెప్పి చావండి....నాకసలే టెన్షన్ తో నరాలు మెంట లెక్కిపోతున్నాయి."
"ప్చ్.....ఈ ప్రాబ్లెమ్..." దిండు కింద వున్న కేర్ ఫ్రీ తీసి చూపించింది.
"చంపేస్తా....దీనమ్మ ప్రాబ్లెమ్ వచ్చినా మార్గమనేది లేదిప్పుడు...." అంటూ స్విచ్చాన్ చేశాడు.
ప్రనూష కిలకిలా నవ్వుతూ కేర్ ఫ్రీని బయటకు గిరాటేసింది.
"హు! మరీ తొమ్మిది నెలల వరకూ దాని అవసరం నీకుండదు." అన్నాడు శ్రీచరణ్.
"అంత టాలెంటా?" అంది వెక్కిరిస్తూ.
"నీకే మన్నా డౌటా...? ఇరగదీస్తా....కాస్కో...." అంటూ రెచ్చిపోయాడు.
ముద్దుకే ముద్దొచ్చేలా ఉంది ఆ తర్వాత సీను.
* * *
కట్ చేస్తే...
తెల్లారి బామ్మ, శర్మ, సత్యవతి, ప్రియ, రామస్వామి వచ్చేసరికి...
శ్రీచరణ్ వాంతులు చేసుకుంటున్నాడు.
ప్రనూష అతనితో చింతకాయలు తినిపిస్తోంది.
* ఓ పనైపోయింది *
