Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 54

 

    "నా అజ్ఞానాన్ని మన్నించండి స్వామీ......!"
    ఆమె నోటివెంట వచ్చిన తొలిమాట అది. విష్ణు చిరునవ్వాడు.
    ఆ నవ్వులో ఎలాంటి భావనవ్యక్తం కావడం లేదు.
    విష్ణు ఆమె మనోగతాన్ని వీక్షించాడు......
    ఇప్పుడు ఆమెలో మునుపటి అహంభావం లేదు......తిరస్కారం లేదు........డబ్బుతో దేనినయినా కొనగాలననే దర్పం లేదు....జీవితంలో సుఖ సంతోషాలు డబ్బు వల్ల చేకూరవని ...ఆత్మీయులయిన వాళ్ళ లలనలోనే అనురాగం లభిస్తుందని నిజాన్ని గ్రహించిన తరువాతనే పూర్తిగా మారిపోయింది నందిని.
    నందిని కట్టు, బొట్టు మునుపటికి ఇప్పటికీ పూర్తిగా బిన్నంగా వున్నాయి.
    అసలు సిసలయిన భారతీయ సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నట్టు తెల్లని చీరలో ముగ్ధమనోహరంగా వున్నది. నుదుట కుంకుమ బొట్టు స్వచ్చతకు ప్రతీకలా వున్నది.
    ఆదర్శ గృహిణిలా వున్నది ఆమె అలంకరణ.......
    "స్వామీ నేను పూర్తిగా మారిపోయాను . మిమ్మల్ని చూడకుండా వుండబట్టలేక వచ్చానే తప్ప నన్ను స్వేకరించమని కోరడానికి రాలేదు. ఒకప్పుడు మీరు చేరువయినా నేనే మొండితనం వలన దూరం చేసుకున్నాను. ఇప్పుడు నేను తప్పు తెలుసుకుని వచ్చినా మీరు నాకు అందనంత మహోన్నత స్థానంలో వున్నారు.
    "నాలాంటి పాపాత్మురాలికి మీలాంటి మహనీయుని పాదస్పర్శ కూడా అమృతమయమే! , కానీ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం కొద్దీ మీకు భార్యగా మిగిలిపోయే అదృష్టాన్ని పొందగలిగాను. సనాతన హిందూ ధర్మం ప్రకారం నా మెడలో కట్టిన ఈ తాళి వల్లనే నేనెంత అమానుషంగా ప్రవర్తించినా మీకు భార్యగా నిలిచిపోగలిగాను.
    "సర్వమూ గ్రహించగల సమర్ధులు మీరు.......అయినా నా హృదయ వేదన మీతో తప్ప ఎవరికీ నివేదించుకొమంటారు చెప్పండి. నా తండ్రి చనిపోయాక ఆస్తి పంపకాల కోసం అమెరికాలో వున్న నా ముగ్గురు అన్నలు వచ్చారు.
    "నా వల్లనే తండ్రి చనిపోయాడని......ఆస్తిని చేజిక్కించుకుని ముగ్గురు మగబిడ్డల తరువాత పుట్టిన ఆడపిల్ల వల్లనే కొంపకు అరిష్టం వాటిల్లిందని నన్ను ఇంటి నుంచి గెంటివేశారు. నేనిప్పుడు అనాధను స్వామీ నేనిప్పుడు అనాధను.'
    నందిని కళ్ళలో నీరు నిండింది.
    విష్ణు అప్పటికీ మౌనాన్నీ వీడలేదు.
    'అందుకే స్వామీ......మీ పట్ల నేనాచరించిన తీరుకు నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను. ఒక సన్యాసినిగా జీవితాన్ని ప్రారంభిస్తాను. మీ మార్గాన్ని అనుసరిస్తాను. దయచేసి నాకు మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి........" అంటూ వేడుకున్నదామె.
    "అంతా దైవేచ్ఛ........"
    విష్ణు గంభీరంగా చెప్పాడు.
    ఆ మాత్రం డానికే పులకించిపోయింది నందిని.
    కళ్ళత్తుకుని వెళ్ళిపోయింది.
    నందిని రాకతో విష్ణులో ఎటువంటి ప్రకంపనలు పుట్టలేదు.....
    అతను తన మనసునే కాదు వయసుని కూడా జయించిన మహా తపస్వి!
    
                                                           *    *    *    *

    కలెక్టర్ ఛాంబర్......
    ధీరజ బయటకు వెళ్ళడానికి లేచి నిలుచున్నదో లేదో ఫోన్ రింగయ్యింది.
    "హల్లో......."
    "కలెక్టర్ గారేనా?" ఎవరో ఆడగొంతు అడుతుతోంది.
    "ఎస్.....నేనే ధీరజను"
    "నమస్తే మేడమ్.....నేను చెప్పేది పూర్తిగా వినేటంత వరకూ ఫోన్ పెట్టేయ్యవద్దు ప్లీజ్" అంటూ చెప్పడం మొదలు పెట్టింది ఆమె.
    ఫోన్ లో వినిపించే ప్రతి మాట ధీరజకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేస్తున్నది.
    దాదాపు ఐదు నిముషాలు మాట్టాడిన తరువాత......
    "ఇట్స్ ఒకే....అడ్రసు చెప్పు.......నేనే అక్కడకు వస్తాను"
    "మీరా మేడమ్"
    "అవును.......నిన్ను చూడాలని వుంది"
    "మీరు.......నన్ను చూడడానికి వస్తారా?"
    "ఎస్.....నేనే వస్తాను"
    ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతూ చిరునామా చెప్పిందామె.
    ధీరజ రిసీవర్ పెట్టి బయలుదేరింది.
    ఇప్పుడు ఆమె మనసు ఎంతో ఉద్యేగంతో నిండి వున్నది. ఫోన్ లో వినిపించిన మాటలను బట్టి ఇంతవరకు తనకు తెలియని మరొక చేదు నిజం తెలియడంతో ఆమె ఆవేదనకు అంతు లేకుండా పోతున్నది.
    కారును ధీరజే స్వయంగా డ్రయివ్ చేసుకుంటూ బయలుదేరింది.
    ఆ ఆశ్రమం ముందు అతిధి కోసం ఎదురుచూస్తున్న ఒక మధ్య వయస్కురాలు చిరునవ్వుతో కలెక్టరుకు ఎదురెళ్ళి ఆహ్వానించింది.
    "నమస్తే కలెక్టర్ గారూ....మీలాంటి గొప్ప వ్యక్తీ మా ఆశ్రమంలో అడుగు పెట్టడమే అదృష్టంగా భావిస్తున్నాం....అంటూ ఆమెను లిప్టులో తీసుకువెళ్ళి ఒక గది ముందు ఆగిపోయిందామె.
    ఆమె వైపు పరిశీలనగా చూసింది ధీరజ.
    "మీకు కావలసిన వ్యక్తీ ఈ గదిలోనే ఉన్నది వెళ్ళండి మేడమ్....." అని వెనుతిరిగి వెళ్ళిపోయిందామే.
    ధీరజ తలుపు తెరచుకుని లోనికి వెళ్ళింది.
    "మిస్ భవానీ......." అంటూ అనుమానంతో ఆగిపోయింది ధీరజ.
    "వెల్ కమ్ మేడమ్......నేనే భవానిని.......రండి" గది మధ్యలో వున్న బెడ్ పై ఉన్నదామే.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS