Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 55

 

    "మీ అమ్మగారిని చూడొద్దా?" హటాత్తుగా అడిగింది.
    చప్పున సమాధానం యివ్వలేదు రవి. అది - అది - : అంటూ నాన్చేడు.
    స్వప్నం ముఖం గంబీరంగా మారిపోయింది. "చూడు రవీ! నేను గజపతి నగరం వస్తే అత్తగారిని చూడకుండా రాను. తెలిసిందా? వీలయితే మనం అక్కడే ఒక్కరోజో, రెండు రోజులో వుండి తిరిగొద్దాం. వీలయితే వచ్చేప్పుడు అత్తగారిని మనతో పాటే తీసుకుని వద్దాం."
    రవి సమాధానం యివ్వలేదు. చేతిలో ఫోన్ అలాగే పట్టుకుని ఆలోచిస్తూ వుండిపోయాడు. అతని మస్తిష్కం ఆలోచనలతో బ్రద్దలవుతోందా అనిపించింది. "స్వప్న తత్త్వం తనకి తెలుసు. అమ్మ మనస్తత్వం, పట్టుదల మరీ బాగా తెలుసు. తాత్కాలికంగా అమ్మా రాజీ పడ్డట్టుగా ప్రవర్తిస్తే సరి! లేకపోతే? మైగాడ్. ఎంత అవమానం మాములు మనుషుల్లాగా అవమాన పరిస్తే! స్వప్న మనస్సు గాయపడుతుంది. తమ మధ్య అగాధం ఏర్పడుతుంది!"
    "హలో!" పిలిచింది స్వప్న.
    ఆలోచనల నుంచి బయట పడ్డాడు రవి. అప్రయత్నంగా "చూద్దాం. అలాగే నీ యిష్ట ప్రకారమే కానివ్వు!" అన్నాడు.
    నవ్వుకుంది స్వప్న.
    అవతల రవి ఫోన్ పెట్టేశాడు. క్రెడిల్ అయిన శబ్దం విని తను స్టాండ్ పై వుంచింది.
    మళ్ళీ ఆలోచనలు.
    ఈ పర్యాయం రవి చుట్టూ.
    అయితే ఆలోచనలు అల్లిబిల్లిగా అల్లుకోక ముందే మళ్ళీ ఫోన్ మ్రోగింది. ఉలిక్కి పడింది స్వప్న. ఈ పర్యాయం ఫోనెత్తటానికే జంకింది. ఫోన్ ఆగి ఆగి మొగసాగింది.
    భయం భయంగా ఫోనెత్తింది స్వప్న.
    "హలో!"
    అదే గొంతు! గరగరలాడినట్టు, కంకరరాళ్ళపై ఎడ్లబండి వేగంగా సాగినట్లు నవ్వు -----
    "ఊ ఎక్కడికి వెళ్ళేవు. ఫోన్ చేస్తానని చెప్పాగా నిన్న. సరిగ్గా చెప్పిన టయానికే చేశాను. అయితే ఎంగేజ్ డ్ సౌండ్ వచ్చింది. ఎవరితోనో మాటాడుతున్నవనుకున్నాను. అవునా? ఎవరు ఫోన్ చేశారు?"
    "రవి" చప్పున సమాధానం చెప్పింది అప్రయత్నంగా.
    "ఏమిటి విశేషాలు!"
    "మేం అరగంటలో ప్రయాణమవుతున్నాం. నువ్వెందుకు ఫోన్ చేశావో చెప్పు------" గబగబా అడిగింది.
    "అది సరేలే! ఎక్కడికి ప్రయాణం!"
    "గజపతి నగరం!"
    అవతల నుంఛి మళ్ళీ గలగలా డబ్బాలో రాళ్ళు వేసి గరగర లాడించినట్టు నవ్వు.
    "ఎందుకలా నవ్వుతావ్! అబ్బ! ఎంత భయంకరంగా నవ్వుతున్నావ్?" కోపంగా అసహ్యంగా అంది.
    "పిచ్చిదానా! రవి నిన్ను గజపతి నగరం తీసికెళితే మళ్ళీ నువ్వు హైదరాబాద్ వస్తావా! భాగ్యనగరం చూసే అవకాశం వుంటుందా? ఫినిష్. తిరిగొచ్చేప్పుడో- వెళ్ళేప్పుడో - వెళ్ళేవో - ఏదో యాక్సిడెంటు లో సఫా! పాపం రెండు లక్షలకి యిన్సూర్ చేశావూ కదూ- ఈ మధ్యే------"
    ఒక్కో మాట విషం గుప్పించినట్టుగా ----వినలేకపోయింది చప్పున ఫోన్ పెట్టేసింది.
    ఒళ్ళంతా చెమటలు పట్టేయి. ... భయం ....విభ్రాంతి .......ఎటైనా పారిపోదామా అన్నంత తెగింపుపు------
    మళ్ళీ ఫోన్ మోగింది.
    అదో కాల స్పర్పంలా అనిపించింది ఫోనెత్తింది కసిగా "హలో!" అని అవతలి గొంతు వినిపించగానే క్రెడిల్ చేసి మళ్ళీ ఫోన్ చేసే అవకాశం లేకుండా ఫోన్ క్రింద పెట్టేసింది.
    పగిలిపోతున్న ఆలోచనా భారంతో తల విదిలించి లేచింది.


                                          43

    స్వప్న మేడ దిగి వచ్చేసరికి క్రింది హల్లో వెంకట్రామయ్య కనిపించాడు. అతడూ అప్పుడే వచ్చాడు. ఆమెని చూడగానే చేతులు కట్టుకుని నుంచున్నాడు.
    ఇప్పుడు వెంకట్రామయ్య రూపమే మారిపోయింది. గడ్డం మాసింది. గుడ్డలు కూడా మాశాయి. తల తైల సంస్కారం లేక రేగి వుంది. ముఖంలో మునుపటి ఉత్సాహం గానీ, అనందం కానీ లేవు. కాగా వాటి స్థానంలో నిరాశా నిస్పృహలు చోటు చేసుకున్నాయి.
    ఆమెని చూసి పలుకరించబోయాడు.
    అంతలో తోటమాలి వచ్చాడు. అతని వెంట అయిదారు కుక్క పిల్లలు వచ్చాయి. వాటిని స్వప్న పెంచుతోంది. ఆమెకీ అవంటే ప్రాణం. అవీ ఆమెని చూడగానే తోకాడిస్తూ సంతోషంగా వస్తాయి.
    ఒక్కో పిల్లకి బిస్కెట్లు, కాఫీ, పాలు అందించసాగింది స్వప్న. ఆమె దృష్టంతా ఆ కుక్క పిల్లలకి ఆహారం పెట్టటం పైనే వుంది. చుట్టూ వున్నా వాటిని గమనించటం లేదు-----
    వెంకట్రామయ్య కి చచ్చినా చావుగా వుంది. ఆ కుక్కలకీ ఖరీదైన బిస్కెట్లు, కాఫీ పాలు అందిస్తుంటే అతని కెంతో అసూయగా వుంది. అతని ఉనికి నయినా గమనించకుండా, అతన్ని కూర్చోమని అననయినా అనకుండా ఆఖరికి కాపీ అయినా యివ్వకుండా వుండటం ఎంతో అవమానకరంగా వుంది.
    తన ఉనికినే గమనించని ఆ స్థితికి అతనెంతో విచారించాడు. నిన్న మొన్నటి దాకా ఈ యింట్లో అధికారాన్ని పెత్తనాన్ని చెలాయించిన తను హీనంగా కుక్క కంటే నీచాతి నీచంగా చూడబడటంతో ఎంతో బాధగా వుంది. అయినా తనేం చేయగలడు. అవమానాన్ని మౌనంగా భరించటం కంటే యిప్పుడు చేయగలిగిందే వుంది!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS