కానీ గమనించే స్థితిలో లేదామే.
ఆమె మనస్సు నిండా కూతురు! కూతురు! అంతే!
ఏమీ తోచని స్థితిలో నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయింది. జరిగినదంతా వివరంగా రిపోర్టు యిచ్చింది. ఆ ఊపులోనే వెంకట్రామయ్య ప్లానూ, మోహన్ మారువేషం విషయం , వాళ్ళ కుతంత్రాలూ అన్నీ చెప్పేసింది.
అంతా చెప్పి సంతకం చేసి యింటి ముఖం పట్టింది.
ఆమె మనస్సు నిండా దుఖం వుంది ఇప్పుడు.
42
భయం, అనుమానం యివి రెండు అక్క చెల్లెళ్ళ లాంటివి. ఒకటి ప్రవేశిస్తే మరొకటి పీఠం వేసుకుంటుంది.
స్వప్న మనసు ఆ ఫోన్ అందుకున్నప్పటి నుంచీ అలాగే వుంది. రవితో దాచుకోకుండా తన మనస్సులోని మాట చెప్పయ్యగానే బరువు తగ్గినట్లు అనిపించినా , తర్వాత ఆలోచించగా అలా చెప్పటం అవివేకం అనిపించిందామెకే!
నిజా నిజాలు తెలుసుకున్నాక అతనితో చెప్పి వుంటే బాగుంటుంది అనిపించింది మళ్ళీ! కానీ, నిజం తెలిసేదెలా? అంత సులభంగా కనుక్కునేందుకువుతుందా?
భగవాన్! ఎందుకీ శిక్ష! ఏమిటి పరీక్ష?
అమ్మమ్మ బ్రతికి వుంటే ఎంత బావుండేది. ఎమ్మే చదివేదో, పెళ్ళి చేసుకునేదో! జీవితం మాత్రం నిష్సూచీగా సాగిపోయేది.
మరిప్పుడు?
ఈ భయం, ఈ ఆందోళన తీరేదెలా?
తల పట్టుక్కుర్చుంది స్వప్న.
చుట్టూ వున్న గది జైలూలా అనిపిస్తోంది ఆమెకి. ఈ ఐశ్వర్యం , దీనిపై వ్యామోహం, దీని రక్షణ, ఈ భోహభాగ్యాలు అన్నీ ఆమెకి నిరాశని నిస్ప్రుహని కలిగిస్తున్నాయి.
ఇవన్నీ లేకుండా ఒక మనోహరమైన జీవితం దక్కితే చాలు అనిపిస్తోంది! ఒకటిన్నర గదుల యిల్లయినా చాలు- యింతా బంగాళా ఎందుకు? కడుపు నింపుకునెంత సంపద చాలదా? ఇంత ఐశ్వర్యం ఎందుకు?
ఎందుకు మనుషుల కింత వ్యామోహం - ఈ ధనంపై - ఏం చేస్తారు దీన్ని? భోగానికి, భోగలాలసతకి, అంతెక్కడ , బంగారం తిని, బంగారం కట్టుకుని, బంగారు భవంతిలో బంగారం పై పడుకుంటే తృప్తి వుంటుందా? గ్యారంటీ వుందా?
ఏ పూటా తిండికి ఆ పూట సంపాదించుకుని హాయిగా తిని నిర్మలాకాశం క్రింద చిరుచాప మీద బొంతపరచుకుని చిరిగిన పంచో, చీరో కప్పుకుని నిద్రించే శ్రామికుల హాయి తమకి వుందా?
వాళ్ళకి రేపటి తిండికోసమై పని కోసం దిగులే తప్ప మరో చీకు చింతా లేదే! అందుకే అంత ఆరోగ్యంగా వుంటారు. ఐశ్వర్యం పెరిగే కొద్దీ మనిషి కీ జబ్బులూ -ఖరీదైన మందులూ పెరుగుతాయి.
ఈ ఐశ్వర్యం వల నుంచి బయట పడితే -------
ఎలా?
అది సాధ్యమా?
దానధర్మాలపై కూడా ప్రభుత్వం అంక్ష విధించింది. ఉన్నదంతా యిచ్చేయ్యటానికి వీల్లెదేమో మరి!
పిచ్చెక్కిపోతోంది తనకి.
డబ్బు కోసం మనుషుల్ని చంపేస్తారా? అంత కావేషం ఎందుకు? మళ్ళీ ఆ వ్యక్తుల్ని మరొకరు చంపరని గ్యారంటీ ఏమిటి?
ఏమిటి యిలా ఒకర్నొకరు చంపుకుంటూ వెళ్ళాలా? రాజదిరాజులు నుంచి సామాన్యుడి వరకూ ఈ విద్వేషాగ్నిలో దగ్ధం కావలసిందేనా?
ఎందరు మతకర్తలు, ఎందరు వేదాంతులు పుట్టారీ దేశంలో! అంతా జగత్తు మిధ్యా అనీ, శాంతా కనకాలూ ప్రతిబంధకాలని చెప్పిన వాళ్ళే!
దాన్ని సభల్లో చెపితే వినటం వరకే అవుతోంది!
ఆచరణలో పెట్టేదెవరు?"
స్వప్న ఆలోచనలని భంగం చేస్తూ టెలిఫోన్ మ్రోగిబంది.
ఆ శబ్దం వినగానే ఉలిక్కి పడిందామె.
ఇంతదాకా ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తోంది తను, మరి ఆ ఫోన్ రాగానే ఎందుకు ఉలికిపాటు.
భయం, ఆందోళన సృష్టించిన మనో వైకల్యం అది.
అడురుతోన్న గుండెలతో ఫోనెత్తింది.
"హలో!"
చిర పరిచితమైన గొంతు వినగానే తేలిగ్గా నిట్టూర్చింది. హమ్మయ్యా అనుకుని "హలో!" అంది నెమ్మదిగా.
"స్వప్నా! నేను మరో అరగంటలో యింటికి వచ్చేస్తాను. నువ్వు తయారై రెడీగా వుండు . కలిసి వెళదాం!"
"ఎక్కడికి?" పొడిగా ప్రశ్నించింది.
"అదే సస్పెన్స్! వెళ్ళాక చుస్తావుగా!"
"ఊహూ ఎక్కడికో చెప్పండి!"
"నువ్వు కోరుకునే చోటుకి - నువ్వు యిష్టపడే స్థలానికి చాలా?" చిలిపిగా అన్నాడు రవి.
"ఊహూ" మొండిగా అంది స్వప్న.
'అయితే విను. మన ఊరువెళ్ళి వద్దాం!"
"అంతేనా?"
"బావి గట్టున మనం కట్టుకోబోయే గది డిజైనింగ్ చూద్దాం. వర్క్ జరుగుతోంది కదా?"
"అంతేనా?" రెట్టించింది .
"అంతే యిప్పటికి సంగతులు -- పోనీ నువ్వు చెప్పు!"
