Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 54

 

    "ఈ విభాత సంధ్య వేళంటే ఏంటో" ఇంటికెళ్ళి డిక్షనరీ తిరగేయాలి....అయినా ఈ దేవతలా బాషెంటో, ఆ యముడెంటో అనుకుంటూ వుండగానే నారదుడు ప్రత్యక్షమయ్యాడు "నారాయణ నారాయణా" అంటూ.


    ఉలిక్కిపడి తన పక్కనే స్పెషల్ ఎపెక్ట్ తో ప్రత్యక్షమైన నారదుడ్ని చూసి "మీరు నారదులా?" అని అడిగినాడు.


    "చక్కగా గుర్తించితివి మానవా"


    "ఆ గుర్తించక చస్తానా! మా పాత సినిమాల్లో కాంతారావు, హరనాద్, అక్కినేని, రేలంగి....ఓహ్....బోల్డు మంది మీ క్యారెక్టర్ లో జివించేశారు. కాకపోతే మీరు ఒరిజినల్...వాళ్ళు డూప్లికేట్....."


    "ఆహా.....ఎంత చక్కటి విశ్లేషణ" అన్నాడు మెచ్చుకోలుగా నారదుడు.


    "అవును గానీ స్వామీ....మీరు 'తంపులమారి' అని జగడాలు సృష్టించడంలో నేర్పరి అని.....మా లోకమున సెటైర్లు వున్నవి, ఇందులో నిజమెంత?"


    "యిసుమంతయినను లేదు మానవా, నేను ఏది చేసిననూ లోక కళ్యాణమునాకు....."


    "మరిప్పుడిలా విచ్చేసినారేంటి? ఇందాకే మీ బుర్ర మీసాలాయన వచ్చాడు"


    "అవునవును, యమధర్మరాజు."


    "నన్ను పట్టుకుని చచ్చుము చచ్చుము అంటాడు. ఆ! నాకు ఇప్పుడు గుర్తొస్తున్నది.....నాకు కలలో కనిపించి ఇలాగే వెంటపడ్డాడు."


    "అమాయక మానవా! అవకాశం నీ తలుపు తట్టి, అదృష్టం నీ భుజం తట్టి వచ్చినది. నువ్వు కాలయాపన చేయుచుంటివి."


    "ఏంటో స్వామీ.....ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు. ఏదో ప్రాస కోసం మీరు పడే పాట్లు తప్ప"


    "అమయక మానవా.....యమధర్మరాజు నీతో ఏమని అన్నాడు?"


    "ఏమంటాడు? నన్ను చావమని చెప్పి చక్కాపోయాడు."


    "అందుకు నీకే వరమిచ్చాడు?"


    "ఏం కావాలన్నా యిస్తానన్నాడు. కానీ, నేనే చచ్చాక ఇక నాకు వరలేందుకు స్వామీ, గడ్డం గీసుకోడానికా?" వ్యంగ్యంగా అన్నాడు శ్రీచంద్ర.


    'అయ్యారే......మానవా....నువ్వు తెలివైనవాడివి.....ఈ మాత్రం యోచించలేవా? సావిత్రి సమయస్పూర్తి, మార్కేండేయుని భక్తీ, శ్రీకృష్ణ  పరమాత్ముని యుక్తి.....స్పురణకు తెచ్చుకొనుము. వరము నెపమున నీ కోరికలన్నీ తీర్చుకొనుము. నీ యుక్తి చేత.....నారాయణ....నారాయణ.....అయిననూ నాకెందుకులెమ్ము....అసలే, నాకు తంపులమారి అని సార్ధకనామధేయము" అంటూ మాయమయ్యాడు.


    శ్రీచంద్రకు 'మంచుపొరలా అనుమాన పొరలు కలిగి, ఆలోచనా మేఘాలూ చుట్టుముట్టాయి.


    "యురేకా....యా....హూ!" లాంటి కేకలు వేశాడు.


    సాయంత్రం వరకూ అక్కడనుంచి కదల్లేదు.

 

                                                                     * *


    మళ్ళీ ఓ మెరుపు.


    ఆ మెరుపులో యమధర్మరాజు ప్రత్యక్షం....."మానవా! ఏమాలోచించితివి?"


    "ఉదయం నుంచి చించి, చించి.....ఆలోచించాను స్వామీ! ముందో వెయ్యి రూపాయలు కొట్టించు.....అడిగాను కదానని ఏ కంఠాభరణమో, వడ్డాణమో యిచ్చేవు....దొంగసోమ్మని బొక్కలో తోస్తారు. మా ఇండియన్ కరెన్సీలోనే కావాలి.....అవియును దొంగనోట్లు కాదు."


    "ఆహా! ఏమి వాగ్ధాటి మానవా! వెయ్యి రూపాయలు ఇచ్చినచో చచ్చుదువా?"


    "అప్పుడే....ఏమా తొందర ముందిచ్చు చూడుడు."


    యమధర్మరాజు చేతిలో వందరూపాయల నోట్లు పది ప్రత్యక్షమయ్యాయి.


    "ఇదిగో మానవా...."


    "థాంక్యూ....యమా! నేను ఈ వెయ్యి రూపాయలను పిచ్చిపిచ్చిగా ఖర్చు పెట్టి రేపిపాటికి యిక్కడికి వస్తాను. అప్పటిదాకా సెలవ్....." అన్నాడు శ్రీచంద్ర.


    "సరేగాని......ఒక్క మాట."


    "మళ్ళీ ఏమిటి?"


    "ఈ భూలోకమున ఏమి తోచకున్నది మానవా! కాస్త రిలాక్స్ కావడానికి ఏదైనా మార్గము చెప్పుము" అన్నాడు బ్రతిమిలాడుతున్న ముఖం పెట్టి.


    "ఓహొ! మీకు ఎంటర్ టైన్మెంట్ కావలయునా? అయినచో ఓ మంచి ఇంగ్లీషు సినిమా ఉళ్ళో ఆడుతోంది. 'టైటానిక్' అని లవ్ పిక్చర్. సంగీత్ లో ఆడుతోంది. ఆ సినిమా చూడండి స్వామి! మీకు తప్పక నచ్చును."


    'అటులనే అటులనే థాంక్యూ ఫర్ యువర్ ఏడ్వాయిజ్....." అనేసి 'అరె ఏమి చిత్రము! నాకునూ ఇంగ్లీషు మాట్లాడుట వచ్చి వేయుచున్నది. హౌ గ్రేట్ ఐ యామ్!" అన్నాడు.


    "మరే స్వామీ! తమరు గ్రేటులకే గ్రేటు! సరే! మరి నే వెళ్ళనా?" అన్నాడు శ్రీచంద్ర.


    "ఇప్పుడు వెళ్ళుము. రేపు మాత్రం తప్పక చచ్చుట మానవద్దు" అని హెచ్చరించి మాయమయ్యాడు యమధర్మరాజు.

 

                                                                * * *


    "నారదా! ఆ మానవుడు చచ్చుటకు సమ్మతించినాడు" సంతోషంగా చెప్పాడు యమధర్మరాజు.


    "సంతోషం.....మీరా పనిమీదే వుండండి. మీ గెలుపు తధ్యం" అన్నాడు నారదుడు.


    "ఈ సంతోష సమయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వుయ్ విల్ సెలబ్రేట్ ది హేపీ అకేషన్.....లెటజ్ గో టు సినిమా" అన్నాడు యముడు మహా ఉత్సాహంగా.


    "అమ్మ బాబోయ్! ఇంగ్లీషు దంచేస్తున్నారు స్వామీ! మన లోకమునకు వెళ్లగానే అందరికి నేర్పుడు...." అన్నాడు నారదుడు కూడా హేపిగా ఫీలవుతూ!


    "యా....! యా! వై నాట్?" అన్నాడు స్టయిల్ గా యమధర్మరాజు.

 

                                                                   * * *

    ఇద్దరూ ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి 'సంగీత్ ' లో ఆడుతున్న 'టైటానిక్' సినిమాకి వెళ్లారు.


    సినిమా వచ్చి వందరోజులు అయినా మహా రష్ గా ఉంది.


    నారదుడు క్యూలో వెళ్లి కష్టపడి టిక్కెట్లు పట్టుకొచ్చాడు.


    "ఇది ఏమి జనం నారదా! భూలోకమున 'సినిమా' అనిన ఇంత పిచ్చి యున్నదా?"


    "అవును ప్రభూ! అందరికి సినిమా అనిన మహా ఇష్టం."


    "అయినచో మన లోకమున కూడా థియేటర్లు కట్టి, సినిమాలు తిద్దుమా?" అన్నాడు యముడు.


    "అటులనే ప్రభూ! తర్వాత దాని సంగతి ఆలోచిద్దాము కానీ, ముందు హాలులోనికి వెళ్ళవలయును. టైమగుచున్నది....." అన్నాడు నారదుడు అందరూ లోపలికి వెళ్ళడం చూసి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS