Previous Page Next Page 
తుపాన్ పేజి 53

    మేము  లక్ష్మణఝాలా వంతెన  దాటకుండానే  గంగానది  పడమటి  ఒడ్డునే  మొటారుమీద  వచ్చాము. నాకై  ఐదువేల రూపాయలు  మాత్రం ఉంచుకొన్నాను. తక్కిన రూపాయలు   హరిద్వారంలో  బ్యాంకులో  వేసి  తెనాలికి  మా  అమ్మగారి  పేర  హుండీ  ఇచ్చాను. ఆ  అయిదువేలలో  మూడువేల  రూపాయలు  నా పేర  బ్యాంకిలో  వేసుకోమని  స్వామీజీ  సలహా ఇచ్చారు.  కైలాసం  వెళ్ళేదారిలోనూ, నేపాలులోనూ  బ్రిటీషు వెండి  రూపాయలు  బాగా  చలామణీ ఉంది. నేపాలులో నేపాలూ  ప్రబుత్వం బ్యాంకులో  మన  నోట్లకు  వారి  డబ్బు  మార్చుకోవచ్చునట.  తిబెత్తులో  మాత్రం  మన  సోమ్ముకే  ఎక్కువ విలువట.

    నాతో ఉన్న  రెండువేల  రూపాయలకు,  వేయిరూపాయలు  వెండి  నాణేలు ఉంచి,  ఆ రూపాయలు  ఒక  ట్రంకులో  పెట్టి,  ట్రంకుకు  దిట్టమైన  ఆగ్రా  తాళాలు వేశాను.  తక్కిన  వేయి  రూపాయలలో, 20 రూపాయలు  కాసులక్రింద  మార్చి  ఉంచాను.  నూరురూపాయలనోట్లు   అయిదు  ఉంచుకొన్నాను.  వెండి  చిల్లరగా  యాభై రూపాయలుంచుకొన్నాను.  తక్కిన  నాలుగు వందల  ముఫ్పై  రూపాయలు   కూలీలకు,  కూలీల  ఏజన్సీ వారికిచ్చాను. ఈ  అయిదువేలు  కాక   మందులకని,  భోజనసామగ్రులకని,  పెద్దగూడారానికని, స్టవ్ కని,  విద్యుచ్ఛక్తిటార్చీలకని,  కిరసనాయిలుకని, మూడు  చలికోట్లకు, రగ్గులకు, బనీనులకు, చేతితొడుగులకు, విద్యుత్  బాటరీలు  రెండింటికి,  సూదులకు, దారానికి, తళుకు  గాజుపూసలకు,  తళుకు నగలకు,  వెండినగలు  చిన్న చిన్న  వానికి  రెండువేల రూపాయలు  ఖర్చుచేశాను. ఇందులో కొన్ని  స్వామీజీకి  కొనమన్నవి,  తక్కినది  నా  ఆలోచన. నేను  కొన్న  మందులతో  ఓ  చిన్న  ఆస్పత్రి  పెట్టవచ్చును.

    హేమా, ఇవన్నీ   ఎందుకు  ఇంత  విపులంగా  రాస్తున్నానో  విను.  నాలో   ఉన్న  ఏదో  తీవ్రవేదన, గాఢాందోళనము  అణుచుకోడానికే  ఇవన్నీ  కొన్నాను. మందులజాబితా  ఇస్తే మరీ నవ్వుకుంటావు.  ఇవి  కొనేటప్పుడు   నా  తెలివితేటలు చుపించాలనే  అహంకారం  కూడా   ఉంది.  లేకపోతే  రకరకాల  ఇంజక్షన్లు,  మూడువిధాలైన ఇంజక్షన్ గొట్టాల  పెట్టెలూ,  ఆ  గొట్టాలకు  తగిన  అరడజను   సూదులు  కొనడం  ఏమిటి?  మాత్రలు, అరిష్టాలు, అసవాలు, లేహ్యాలు, తైలాలు-ఒకటేమిటి! ఒక చిన్న  ఆంగ్లవైద్యశాల   నాతో వచ్చింది. ఇలా  ఏ  మహారాజూ  ప్రయాణం   చేయరని  మా  స్వామీజీ   అంటూ  నవ్వుకొనేవారు.

    బయలుదేరేముందు   హరిద్వారంలో  ఒక  డాక్టరుగారి  స్నేహమూ, ఒక  ప్రసిద్ధ ఆయుర్వేద  వైద్యుని  స్నేహమూ  చేశాను. ఆయుర్వేదవైద్యులు,  హిమాలయాలలో  ఆయుర్వేద వైద్యం  బాగా  పనిచేస్తుందని  ముఫ్పై రకాల  కుప్పెలు  ఇచ్చారు. మా  స్వామీజీకి  ఆంగ్లవైద్యమూ, ఆయుర్వేదవైద్యము కూడా  బాగా  వచ్చును.  ఆయన  ఒక్కమాటు  నన్ను   చూచి  చిరనవ్వు  నవ్వి '' బాబా! భగవంతుని  నమ్మినవారికి  మందు  లెందుకయ్యా? ''అన్నారు.  నేను  వెంటనే '' భగవంతుని  నమ్మినవారికి  మందులు  కావాలికదండీ!'' అన్నాను. స్వాములవారు  పకపక  నవ్వారు.
   
                                      34

    ప్రతి  మకాములో  స్నానంచేస్తూనే ఉన్నా, నేను  గంగలో  మాత్రం  స్నానం  చేయటం  లేదు. ఇన్ని నీళ్ళు  కాచుకొని  స్నానం  చేసేవాణ్ణి. మాతో  వచ్చే  రాజపుత్రజమీందారు, ఆయన  వర్గమూ  నన్ను చూచి  ఆశ్చర్యం పొందారు. '' ఎందుకీ  జంతువు మనతో? '' అనే  ప్రశ్న వారందరూ  లోపల  వైచుకొన్నారు  కాబోలు, మా  స్వామీజీ  బిల్వకేదారం  దగ్గర  వారిని చూచి  '' ఈ  అబ్బాయిని  ఆరోగ్యంకోసం  నాతో  తీసుకొని  వెడుతున్నాను''అన్నారు.

    జమీం : గంగాస్నానంకంటె   వేరే  ఆరోగ్యకరమైన   విషయం  ఉందాండి?

    స్వామి : ఆరోగ్యం  కుదిరినకొలదీ  గంగాస్నానం   ప్రారంభిస్తాడీ బాలుడు.

    జమీం  : చాలా  ఆరోగ్యంగా  కనబడుతాడు.

    స్వామి  : దేహారోగ్యం    రెండుమూడుసారులు    చెడిపోయింది. ఇప్పుడాతనికి నరాల జబ్బు.

    జమీందారుడు, కారణంలేక  స్వామీజీ   నా  తరపున  వాదించరని  ఎంచి  కాబోలు  అంతటితో  ప్రశ్నలు మానేశాడు. అవసరం  అవుతుందని  నేను కొన్న పన్నెండు  కప్పుల  ధర్మాస్ ప్లాస్క్ లో ప్రతి   ఉదయ  మకాములోనూ   టీ   చేయించి  పోసి   ఉంచేవాడిని. నాలుగు కప్పుల  ప్లాస్క్ లో,  నా  కోసం  కాఫీ స్వయంగా  తయారుచేసుకొని  పోసి  ఉంచేవాడిని.

    కైలాసానంద  స్వామీజీ  ఆ   దారిలో  అందరికి  పరిచయయే  అందరు  ఆయన్ను  గౌరవించేవారు. మా  నడకలో  ఎన్ని  మకాములవరకో  స్వామీజీ  ఇంకా కొందరు  సన్యాసులూ,  జమీందారుగారి జట్టులో కొందరూ  ముందుపోతూ  ఉండేవారు.  నేను  నెమ్మదిగా  నా  ఆలోచన  లేమిటో  ఇప్పటికీ  నాకు  జ్ఞాపకం  లేవు.

    మలాస్ చట్టీ, రాణీబాగ్, కొల్టా, రామాపురం,  బిల్వకేదార్ మకాములు గడిచి శ్రీనగరం  చేరుకున్నాము.  శ్రీనగరంలో  కాలాకంబళీ  వాలా  సత్రంలో  మకాము చేశాము. కలాకంబళీవాలా   ఒక  సన్యాసి.  ఈయన  హిమాలయ  యాత్రలు  చేసేటప్పుడు  పడేభాదల్ని గమనించి, అక్కడినుంచి  దేశమంతా తిరిగి  చందాలు  వసూలుచేసి, హరిద్వారంలో, హృషీకేశంలో,  దేవప్రయాగలో, శ్రీనగరంలో, ఇతర  మకాములలో  ధర్మశాల లేర్పాటు చేశాడు. ఈయన పెట్టించిన  సత్రాలలో  బీదలకు, సన్యాసులకు  సదావర్తులిస్తారు. వైద్యానికీ  ఏర్పాటులు  చేయబడినాయి.   నల్లటి  కంబళీ  కప్పుకుని  ఉండేవాడు  గనుక  ఈ  సన్యాసికి  కాలాకంబళీవాలా అని పేరు వచ్చింది. ఈయన  బ్రహ్మసాయుజ్యం  పొందిన  తరువాత, ఈ  మహామహుని  ఉత్తమకార్యం కొందరు  పుణ్యవంతులగు  సన్యాసులు కొనసాగించారు.

    శ్రీనగరంనుంచి  బయలుదేరి  సుకృత, భట్టినేర, కంకార, వార్కోట, గులాటిరాలులు మకాములు  చేసుకుంటూ  హృషీకేశంలో  బయలుదేరిన  నాల్గవరోజు  ఉదయానికి  రుద్రప్రయాగచేరాం. రుద్రప్రయాగలో  మందాకిని అలకనందలో కలుస్తుంది. గంగోత్రి  పోదలుచుకున్నవారు  దేవప్రయోగ దగ్గరనుండి  భాగీరధి నది  ఒడ్డునే  ప్రయాణం  చేసుకుంటూ  పోవలసి  ఉన్నది. యమునోత్రి  పోదల్చుకున్నవారు గంగోత్రి  దారిలో  విడిపోవాలి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS