Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 53


    "ముందా బట్టలు మార్చి స్నానం చేసిరండి!" రామనాథబాబు పడక గదిలో మంచం మీద కూర్చొని, బీరువా నిలువుటద్దంలో ప్రతిబింబాన్ని చూసుకొంటున్న వరూధిని అన్నది.
    రామనాథబాబు స్నానం చేసి, బట్టలు మార్చుకొనేలోపున, వరూధిని పడకగదిలోనే టీపాయ్ తెచ్చి పెట్టింది. రెండు గ్లాసులు శుభ్రంగా కడిగి స్కాచ్ విస్కీ బాటిల్ మూత తెరిచి గ్లాసుల పక్కనే పెట్టింది. రెండు ప్లేట్లలో నాయర్ చేసిన వంటకాలన్నింటినీ పెట్టి, టీపాయ్ మీద విస్కీ బాటిల్ పక్కగా పెట్టింది. రామనాథబాబు స్నానం చేసి, సిల్కు లుంగీ కట్టుకొని, మెడమీదా, ఛాతీమీదా ఉరుకులాం రుద్దుకుంటూ గదిలోకి వచ్చాడు.
    వరూధిని సోడా కలిపి విస్కీగ్లాసు రామనాథబాబు పెదవులకు అందించింది. అతను సిప్ చేసి వరూధిని పెదవులకు గ్లాసు అందించాడు.
    "భలేదానివి వరూధినీ! ఒక్కసారిగా అంతపోశావ్? మనిషి తల్లకిందులుగా పడిపోయాడు పాపం!"
    "మీలా మెత్తగా మెల్లమెల్లగా గొయ్యి తవ్వటం నాచేతనవుతుందేమిటి?"
    "ఆఁ! హా! మాటల్నేర్చావ్! నువ్వు పోసిన సీసాలోది ఏమిటో తెలుసా?"
    "ఇంకా తెలిసేదేమిటి? కళ్ళారా దాని ఫలితంకూడా చూస్తే! అది మా ఆయనకోసమే తెచ్చి పెట్టి ఉంచారుకదూ? మీరెంత.... అబ్బ..... వదలండీ!" వరూధిని ముఖం పక్కకు తిప్పుకొని రామనాథబాబు చేతుల్లోంచి తప్పుకోవటానికి ప్రయత్నించింది.
    "అదేమిటి? మావారిలాగే గ్లాసు గ్లాసే ఎత్తి నీతిగా గూటే - ఏ - గూటేస్తున్నారూ?" వరూధిని ఎక్కిళ్ళు మొదలయి మాటలు తడబడసాగినై.
    "మొగుడి చేత్తా-తా-గించిన దానివి-న-నన్ను మాత్రం."
    "ఛ! ఛ! ఏం-ఏం-మాటలవి?" వరూధిని రామనాథబాబు మెడచుట్టూ చేతులువేసి అతన్ని మళ్ళీ మాట్లాడనివ్వలేదు.
    
                        *    *    *
    సినిమాహాలు నిర్మాణానికి ప్లాన్లు అన్నీ రడీ అయినై. ఓమంచి రోజు చూసి హాలుకు పునాదులు వెయ్యాలనే ఆలోచనలో వున్న వరూధిని గోతిలో పడిపోయింది! వరూధిని కొన్న స్థలం లిటిగేషన్ లో వున్న దత్తుడి ఆస్తి. రాజబాబు దత్తు చెల్లనేరదని హరిప్రసాద్ దావా తెచ్చాడు.
    హరిప్రసాదు తాతకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడి కొడుకు హరిప్రసాదు. చిన్నవాడికి పిల్లలు లేరు. భార్య బలవంతంమీద మరదలు కొడుకుని తెచ్చుకొని పెంచుకొన్నారు. అసలు పేరు రాజబాబు అయినా అప్పట్నుంచి దత్తుడిపేరే స్థిరపడిపోయింది. హరిప్రసాదు తండ్రి బ్రతికున్నంతకాలం పినతండ్రి  ఆస్తిమీదకు పోలేదు ఆయన హరీ అనగానే పినతండ్రి దత్తపుత్రుడిమీద దావా తెచ్చాడు. దత్తుడు తన దత్తతను కోర్టులో రుజువు చేసుకోలేకపోయాడు. హరి దావాగెలిచి ముత్తాత ఆస్థికి ఏకైక వారసుడయాడు. దత్తుడు పాపరయి వీధిలో పడ్డాడు. వరూధినికి గుండెదడ ప్రారంభం అయింది.
    మనోవ్యాధితో మంచమెక్కే స్థితిలోవున్న వరూథిన్ని గుండెలకు హత్తుకొనీ, చేతిలో చెయ్యివేసి, వరూధినిమీద వొట్టేసి చెప్పాడు రామనాథబాబు.
    "అందులోనే థియేటర్ కట్తాం. మళ్ళీ ఆ స్థలం హరిప్రసాదు నుంచి కొంటాను. ఎంతయినా సరే, థియేటర్ నిర్మాణం అనుకొన్నట్టు సాగిపోవాల్సిందే. ఆగతానికి వీల్లేదు. ఆరు నూరయినా నూరు ఆరయినా నువ్వనుకున్న రోజున పునాదులు తీయిస్తాను. ఊరుకో, పిచ్చిదానా! ఇంతమాత్రందానికే తల్లకిందులైపోతే ఇంక మనమేం చేస్తాం?"
    "నా కేమిటో భయంగా వుంది" అన్నది వరూధిని.
    "దిగులుపడకు. ఊఁ - చెప్పు! ఎప్పుడు పునాదులు తవ్వించమంటావ్? ఆ లోపల స్థలం కొనకపోతే నన్ను పేరుపెట్టి పిలవద్దు."
    "ఇప్పుడు పేరుపెట్టి పిలుస్తున్నావా ఏం?" వరూధిని నవ్వింది.
    "ఈ నవ్వు చూట్టానికే నేను వంద జన్మలైనా ఎత్తుతాను." రామనాథబాబు వరూతిన్ని దగ్గిరకు లాక్కుంటూ అన్నాడు. ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె కళ్ళు మెరిసిపోతున్నాయి.
    "నీ చూపుల్లోని వెలుగును చూడటానికే వెయ్యి జన్మలెత్తుతాను" అన్నాడు రామనాథబాబు వరూధిన్ని గాఢంగా గుండెలకు హత్తుకొంటూ.
    
                             22
    
    సాంబయ్య కొత్తకాలవ కింద పొలంలో, వరికోత కోయించి పొద్దుగూకి ఇంటికి బయలుదేరాడు. ఆ ఏడు కొత్త కాలవకింద సాంబయ్య పొలం కంకికి గిద్దెడు గింజలు రాల్తాయా అన్నట్టుగా విరగపడింది.
    ఎట్లా లేదన్నా ఈ ఏడు కొత్త కాలవ పొలంలోనే పదిపుట్లధాన్యం అదనంగా రాలుబడి అవుతుంది. ఉత్తరప్పొలమూ ఫర్వాలేదు. నాలుగైదు  పుట్లదాకా ఎక్కువ పండినట్టే! మెరకపొలం కూడా ఈ ఏటితో అక్కరకొచ్చినట్టే. వేరుశనగ బాగానే అయింది. మిరప ఖర్చులు కూడా గిట్టవేమోనని తను భయపడ్డాడు. కాని ఖర్చులు పోను వందో, యాభయ్యో మిగిలేట్టేవున్నాయి. మనిషి అండలేక మిరపచేను అట్టా అయిపోయింది. పురుగు పట్టిన తరుణంలో మందుకొట్టి వుంటే, ఐదుపుట్లకు తక్కువ కాకుండా పండివుండేది.
    తూరుప్పొలం మాత్రం అట్లా అయేదా? కొత్త కాలవ పొలంకంటే నిజానికి గనిగడ్డ. మొనగాడైన గడ్డకదూ అది? చేసేవాడు లేక అట్లా అయిపోయింది. తను ఒక్కడూ ఎంతని చూస్తాడు? ఎంతకాలమని చూస్తాడు? తనకూ వెనకటిలా ఓపిక లేదు. వయసు పులిలా మీదపడి నమిలేస్తోంది. తనకు పోషణమాత్రం యేం జరుగుతుంది? తన రెక్కల కష్టం మీద ఇంత ఆస్తి సంపాదించాడు. కాని ఇప్పుడు తమ అనుభవిస్తుందేమిటి? కొడుక్కు వ్యవసాయం అప్పగించి, కాలుమీద కాలు వేసుకుని పిల్లజమీందారులా అనుభవించాల్సిన రోజులివి!  ఏ పొలాన ఏమవుతుందో, యే పంట ఎలా వుందో అన్న యావతో రాత్రింబవళ్ళు ఒకటే దిగులైపోయింది. సరిగా కునుకుకూడా పట్టటంలేదు.
    గాడ్దికొడుకు! పట్నవాసం మరిగి, పెళ్ళాం కొంగు పట్టుకుని, కొంపాగోడూ, పొలం పుట్రాకూడా మరిచిపోయాడు. అట్టాంటి కొడుకు తనకే పుట్టాలా? తన కొడుకే అలాంటివాడు కావాలా? అది చచ్చి సుఖంగానే వుంది. ఇట్టాంటి కొడుకుని కని, తన యదాన కొట్టి నిశ్చింతగా తన దారిని తను పోయింది!
    యేనాడో పోయిన భార్య దుర్గమ్మా - ఉండీలేనివాడైపోయిన కొడుకు వేంకటపతీ - గుర్తొచ్చి సాంబయ్య కలవరపాటు చెందాడు. తలచుకున్నకొద్దీ గుండెలు నీరయిపోతున్నాయి.
    తన కడుపుకోత... రంపపు కోత.... ఆ వెంకటపతిగాడికేం అర్ధం అవుతుంది? ఇంతకీ ఒకళ్ళననేం ప్రయోజనం? బుద్ది తక్కువ తనదే! ఆ షావుకారు భద్రయ్యగారి బలరామయ్యతో వియ్యమందాలనే ఉబలాటమే తన కొంప నిలువునా తీసింది. బలరామయ్య కూతురు మెళ్ళో తాళి కట్టిన క్షణమే తన కొడుకు తనకు కాకుండా పోయాడు. ఆ క్షణం మంచి వాడు సమబయ్య కొడుకు కాదు. బలరామయ్య అల్లుడు. దుర్గమ్మ కొడుకుకాదు. వరూధిని మొగుడు. ఆ బుర్రిపాలెం పిల్లను చేసినా బాగుండేదేమో! ఎన్ని మంచి సంబంధాలు రాలేదు? కాని, తన మోజు ఆ బలరామయ్యతో వియ్యమందాలనీ, ఊళ్ళో షావుకారుచేత తన కొడుకు కాళ్ళు కడిగించాలనీ, అందరి తలలమీదగా నడవాలనీ, తను ఆశించటం వల్లనే ఇలా జరిగింది. భగవంతుడు తనకు తగిన శాస్తి చేశాడు.
    దేముడ్ని అనేం ప్రయోజనం? దేముడు తనను చల్లగానే చూశాడు. గాలిలో దీపం పెట్టి "దేముడా, నీ మహిమ" అని తను ఎప్పుడూ అనలేదు. చమటోడ్చి భూమిని తడిపాడు. కండలు కరిగించి భూమిని పండించాడు. తను భూమిని నమ్మాడు. భూమాత తనను ఆదరించింది. బీళ్ళు మాగాణి చేశాడు. భూమాత తన కడుపు పండించి, ఇల్లు బంగారం చేసింది.
    ఈ భూమీ, ఈ పంటలూ, యీ సిరి సంపదలూ - తన తర్వాత ఎవరు చూస్తారు? కంటిపాపను రెప్పలుకాపాడకపోతే వెలుగారిపోతుంది. భూమీ అంతే! భూమిని నమ్మినవాడూ, భూమిని కాపాడేవాడూ, తన వారసుడూ, వంశోద్దారకుడూ అవాల్సిన తన కొడుకు వెంకటపతి వట్టి వెంగళాయీ, బడుద్దాయీ అయాడు గాడ్దికొడుకు. యీ జన్మలో వాడి ముఖం చూడకూడదు! పుండాకోర్! వాడు తనకు అసలు కొడుకే కాడు. వాడిముఖం చూసినవాడికి పంచమహాపాపాలు చుట్టుకుంటాయి. ఈసారి వాడ్ని రానియ్, వాడి పని చెప్తాను! అట్లాటి కొడుకు వుంటేనెం చస్తేనేం? 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS