Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 53


    
    "నేను మిమ్మల్ని అధుపుల్లో పెడుతున్నానా? ఏదీ ఆ మాట నా ముఖం చూసి చెప్పండి నిజంగా తప్పు ఎవరిదంటారు?".
    "సరే! ఇక ఆ సంగతులు మరచిపో, ఉదయం ఆరు గంటలకి సిద్దంగా వుండు. రేపు 'వణంగా ముడి' (తలవంచని వీరుడు) ఆకహరి కాల్ షీట్ కదూ?".
    "అని అందరం అనుకుంటున్నాం. మీ చేతిలో వుంది. పిక్చర్ పూర్తవాలంటే మీరుండాలి. మీరు లేకుండా నేను పూర్తిచెయ్యను. మీ ఇష్టం ఆలోచించుకోండి" అన్నాను.
    "నేనెక్కడికి పోతాను సరోజా! నీతోనే వుంటాను. రేపు పిక్చర్ పూర్తి చేసేద్దాం. నీ కోపం పూర్తిగా పోయినట్టేనా?" - అని మళ్ళీ అడిగారు.
    "మన జాతకమే అంతండి. మనిద్దరం పోట్లాడుకోకుండా వుండలేం. నేను ఊరుకుందామన్నా మీరు చేసే పనులు, నన్ను వూరికే వుండనివ్వవు" - అని అంటూంటే, గట్టిగా దమ్ములాగుతూ ఓ నవ్వు నవ్వారు.
    "మీరున్నారే దేవాంతకులు! ఎందుకలా మురిసిపోతున్నార"ని ఉండబట్టలేక అడిగేశాను.
    "అది కూడా తప్పేనా?".
    "తప్పనడంలేదు. కారణం లేకుండా ఎందుకు అలా మురిసిపోతున్నారూ అని" అడిగాను.
    "నిన్ను చూసే" అన్నారు.
    "ఇది మరీ బాగుంది. నన్ను చూసి మీరు మురిసిపోవడం ఏమిటి?" అన్నాను.
    "నిజంగా నువ్వు బ్రహ్మరాక్షసివి సరోజా! నువ్వనుకున్న పని సాధించే దాకా పట్టువదలవు. మా ఆవిడ గయ్యాళయితే నువ్వు పరమ గయ్యాళివి. దానికి ధైర్యం లేదు. దాని చిందులూ - చిటపటలూ అన్నీ ఇంట్లోనే. మీ ఇద్దరినీ కంపేర్ చేసి చూస్తూంటే నవ్వొస్తోంది" అన్నారు.
    "తప్పండీ అలాంటిపని ఎప్పుడూ చెయ్యకండి. కంపేరింగ్ లు కొంపలు ముంచుతాయి" అన్నాను.
    "ఒక్కొక్కరిలో ఒక్కో లోపం వుంటుంది. దానికి మనమేం చేస్తాం?" అన్నారు.
    "అదిగో - మీరామాట అంటే నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. నాకిచ్చిన మాట మాత్రం మరచిపోకండి. బయట మీరెక్కడా తాగకూడదు. అందహ్రూ మీలో కొన్ని బలహీనతలున్నాయంటున్నారు. అందులో ముఖ్యంగా ఈ తాగుడికి మీరు దాసులని అంటూంటే నాకు ఒళ్ళుమండిపోతోంది" అన్నాను.
    "బలహీనతలు లేనివారెవరు సరోజా! నా లిమిట్ నాకు తెలుసు. నువ్వేం భయపడకు. నీకిచ్చిన మాట  నిలుపుకొంటాలే" అన్నారు.
    మా అమ్మ మళ్ళీ కాఫీలు అందించింది.
    "ఇక్కడే సెటిల్ అయిపోయారేమిటి? ఇంటికి వెళ్ళరా" అనడిగాను.
    "వెళతాలే! ఏం తరిమేస్తున్నావు? నేనిక్కడ వుండడం నీకిష్టంలేదా?" - అని అడిగారు.
    కాఫీలు తాగాం.
    కాసేపయ్యాక "మరేమిటి సంగతులు?" అని అడిగారు.
    "ఇంకా ఏ సంగతులు కావాలండీ. ఈ రోజు జరిగింది చాలదా?"
    "అబ్బా! పట్టుకుంటే బంకలా వదలవుకదా! వేరే ఏమైనా మాట్లాడు సరోజా!"
    "ఏమున్నాయండీ...." అంటూ వుండగా -
    "నమస్కారం శ్రీశ్రీగారూ! ...." అన్న ఓ స్త్రీ గొంతు వినిపించింది.
    ఆశ్చర్యంతో ఇద్దరం వెనక్కి తిరిగి చూశాం.
    
                            *    *    *
    
                                   సీసాకు బదులు డబ్బు
    
    మొదట్లో నన్ను ఈర్ష్యించుకున్న అమ్మాయి, మరో అమ్మాయితో వచ్చింది. నిజంగానే ఇద్దరం ఆశ్చర్యపోయాం. నాకు ఒళ్ళుమండి "ఇదేమిటి, ఈ టైమప్పుడు వచ్చారేమిటి?" - అని అడిగాను.
    శ్రీశ్రీగారికి నిజంగానే మతిపోయినంత పనయింది.
    "రాత్రిపూట మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? అసలు వేళాపాళా లేకుండా ఇళ్ళకొచ్చే అలవాటేమిటి? ఇటువంటి పనులు నాకసలు ఇష్టం లేదు. ఈసారి మళ్ళీ మా యిళ్ళలో కానీ కన్పించారంటే నేను రాసే పిక్చర్స్ లో మీకు ఛాన్స్ ఇవ్వను. తెలిసిందా?" అన్నారు.
    అందుకా అమ్మాయి వెకిలిగా నవ్వుతూ. "అదికాదండీ మీతో అర్జంటుగా మాట్లాడాలి. అందుకనే వచ్చాను. ఒక్కసారి గుమ్మంలోకి వస్తారా? మాట్లాదేసి వెళ్ళిపోతాం" అంది.
    "నాతో నీకు అర్జంటేం వుంది? మాట్లాడదలచుకున్నదేదో ఇక్కడే మాట్లాడు" అన్నారు.
    పాపం... అప్పుడు ఆయన ముఖం చూస్తే జాలివేసింది. ఆ అమ్మాయి మీద చెప్పలేనంత కోపం వచ్చింది.
    "రండి ప్లీజ్! అయిదు నిముషాలే మేం వెళ్ళిపోతాం" అంది.
    "చెప్పానుగా అదేదో ఇక్కడే చెప్పు, మాకు రహస్యాల్లేవు" అన్నారు. ఆ అమ్మాయి ఇబ్బందిగా ముఖంపెట్టి నావైపు చూసింది. ఇక కలగజేసుకుంటేగానీ లాభంలేదు. శృతిమించి రాగన పడేటట్టు ఉందనుకొని "ఏమిటమ్మాయ్ వారితో నీకు సీక్రెట్? ఏం నువ్వు చెప్పదలచుకున్నది ఇక్కడే చెప్పొచ్చుగా? పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యక చెప్పదలచుకున్నది చెప్పేసి వెళ్ళు" అన్నాను.
    నా మాటకి కందగడ్డలా ముఖం చేసుకొని "మీకెందుకండీ అంత కోపం? శ్రీశ్రీగారు అందరికీ కావలసినవారే! మీకెలాగో మాకూ అలాగే!" అంది. "ఏమిటేమిటి? మరోసారి అను. నాకెలాగో నీకూ అలాగేనా? శభాష్! వారు నాకెలాగో నాకు తెలీదు కానీ నీకెలాగో చెప్పమ్మా" అన్నాను.
    "ఆహాహాహా! ఏమీ తెలీకుండానే పనిచేస్తున్నారా" అంది.
    "నోర్ముయ్యి" అన్నారు శ్రీశ్రీగారామెతో.
    నాకు నవ్వాలో ఏడవాలో అర్ధంకాలేదు.
    "మీరూరుకోండి. ఆవిడ సంగతి నేను చూసుకుంటాను" అన్నాను వారితో.
    "నీకు తెలీదు సరోజా! అయ్యోపాపం అని సహాయం చేస్తే ఎంత అసహ్యంగా మాట్లాడుతోందో చూడు" అన్నారు.
    నేను వెంటనే ఆ అమ్మాయిని చూసి, "అమ్మా! రా! ఇంతవరకూ అడిగే వాళ్ళెవరూ రాలేదేమో అనుకున్నాను. వారి మెత్తదనం చూసి అందరూ వేషాలు వేస్తున్నారు. అందరికీ అనువైపోయారు. కష్టసమయాల్లో ఆదుకోవడమే నీపట్ల వారు చేసిన తప్పు మర్యాదగా ముందు బయటకి నడు. లేకుంటే గెంటాల్సి వస్తుందన్నాను".
    ఇంతలో ఆ రెండవ అమ్మాయి "అది కాదండి సరోజమ్మగారూ!....." అని ఏదో అనబోయింది.
    "అమ్మా! నేనింతసేపూ చెప్పింది ఆమె ఒక్కర్తికే కాదు. మీకు కూడా వర్తిస్తుంది. మమ్మల్ని విసిగించకండి. దయచేసి వెళ్ళండి. మీకు అవసరం అనుకుంటే స్టూడియోల్లో చూడండి వారిని. ఇళ్ళకొచ్చే పాడు అలవాట్లు పెట్టుకోకండి" అన్నాను.
    "వచ్చినపని చెప్పేసి వెళతామండీ" అంది.
    "నేనింతసేపూ మీకు అచ్చ తెలుగులోనే చెప్పాను. అర్ధం కాలేదా? దయచేసి వెళతారా లేదా?" అని అరిచాను.
    బెదిరిపోయి ఇద్దరూ వెళ్ళిపోయారు. శ్రీశ్రీగారు పైకి ఏమీ తేలకున్నా నా మాటలకి నవ్వుకున్నారు.
    
                           *    *    *
    
    మర్నాడు ఇద్దరం కాల్ షీట్ కి వెళ్ళాం. పదిగంటలకి శ్రీశ్రీగారు బేలన్స్ పాట పూర్తిచెయ్యడానికి వెళ్ళారు. వెళుతూ "ఒంటిగంటకి ఇక్కడికే వచ్చేస్తాను ఈ రోజు ఫినిషింగ్ కాల్ షీట్ కదా, ఇంటికి వెళ్ళను" అని చెప్పారు. నిన్న రాత్రి నాతో ఘర్షణ పడ్డ అమ్మాయి కూడా ఈ పిక్చర్లో వుంది. మా చెల్లి రామం కూడా మెయిన్ క్యారెక్టర్ కి మాట్లాడుతోంది. నేనూ, మా చెల్లి ఒక్కచోటే కూర్చొని మాట్లాడుకుంటున్నాం.
    ఆ అమ్మాయి చిన్నబోయిన మొహంతో బితుకు బితుకు మంటూ కూర్చుంది. నేనే ఏమీ జరగనట్టు ఆ అమ్మాయివంక చూశాను.
    వెంటనే నా దగ్గరకు వచ్చి "అక్కయ్యగారూ! నా పోరాపతుకి క్షమించండి. నిన్న జరిగింది మనసులో పెట్టుకొని మీ పిక్చర్ లో నాకు వేషం లేకుండా చెయ్యకండి" అని ప్రాధేయపడింది.
    నేను మామూలుగానే మాట్లాడుతూ "అక్కయ్య వరస వేరే కలుపుతున్నావు. మంచి చెల్లెమ్మవే దొరికావు. కానీ చూడమ్మా! నీకు పనిలేకుండా చెయ్యడానికి నాకేమీ అధికారం లేదమ్మా! నేను శ్రీశ్రీగారి అసిస్టెంట్ ని మాత్రమే. ఇంకా చెప్పాలంటే శ్రీశ్రీగారి పేపర్ వెయిట్ నంటే చాలా బాగుంటుంది. నావల్ల నీకేమీ హాని జరగదు.
    పోతే ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఆర్టిస్టులు ఆర్టిస్టులుగా వుండి మసలుకొంటే కొంతకాలంపాటు నిలబడతారు. మంచి ఆర్టిస్టువి. భవిష్యత్తు వుంది. పాడుచేసుకోకు. ఈ ఫీల్డులో నాకన్నా బాగా సీనియర్ వి. అన్ని విషయాల్లో అనుభవం కూడా నాకంటే ఎక్కువగా ఉన్నదానివనుకుంటాను. అంతకన్నా నేను వేరే ఏం చెప్పలేను" అన్నాను.
    "థాంక్సండి" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS