Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 53


    తను ప్రభాత్ ను ఎంత వరకు నమ్మొచ్చు... తనకు పెళ్ళయ్యిందన్న విషయం దాచింది తను. ఈ విషయం చెప్పాక ప్రభాత్ రియాక్షన్ ఎలా వుంటుంది?
    తనూ, ప్రభాత్ కలిపి తిరిగింది శ్రీచరణ్ చాలా సార్లు గమనించాడు. "కానీ, ఏనాడూ ప్రశ్నించలేదు. గమనించనట్టే వుండిపోయాడు.
    ఎందుకో శ్రీచరణ్ గుర్తొచ్చేసరికి రిలీఫ్ లా అనిపించింది. మరోసారి శ్రీచరణ్ ని, ప్రభాత్ ని పక్కపక్కనే పోల్చి చూసుకుంది.
    శ్రీచరణ్ ఎప్పుడూ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదు. అతనికి తన మీద, తన శరీరం మీద హక్కుంది. అతను తనని ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు.
    ఎలాగూ... తాము విడిపోతున్నామని. అందుబాటులో వున్న తనని అనుభవించినా, అనుభవించొచ్చు. కానీ, ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు, అలాంటి శ్రీచరణ్ ని కాదని, తను తప్పు చేస్తోందా?
    తలగిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. ఏదైనా తింటే బావుండును అనిపించింది నీరసంవల్ల, గోడమీద వున్న చార్ట్ చూపింది.
    మూడువందల అరవై నాలుగు గదులు నిండిపోయాయి. ఎంత తొందరగా గడిచిపోయాయి.
    ఇంకా ఒకే ఒక రోజు.
    తనకూ, శ్రీచరణ్ కు మధ్య వున్న అనుబంధానికి "ఆయుష్షు" కు చివరి రోజు రేపే....
    రేపట్నుంచి తను.....శ్రీచరణూ....భార్యాభర్తలు కాదు...
    శ్రీచరణ్ తన భర్త కాడు.
    ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది ప్రనూషకు.
    తనకూ, శ్రీచరణ్ కూ మధ్య శారీరక సంబంధం లేదు. అతని భార్యగా, అతని మనసెరిగి ఎప్పుడూ ప్రవర్తించలేదు.
    అయినా ఏదో అటాచ్ మెంట్....ఏదో అనుబంధం అతను తన వాడే కదా...." తల పట్టుకుంది ప్రనూష.
    
                                                          * * *
    
    శ్రీచరణ్ ఇంట్లోకి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా వుంది.
    లైటువేసి ప్రనూష గదిలోకి తొంగి చూశాడు. ముసుగుతన్ని వుంది. ఉదయమే అనీజీగా వుందంది ప్రనూష.
    తను మామూలు అనీజీ కాబోలు అనుకున్నాడు.
    ఆఫీసుకు కూడా వెళ్ళలేదంటే....?
    ప్రనూష గదిలోకి వెళ్ళాడు.
    తలమీద వున్న దుప్పటి తొలగించాడు.
    నుదుటి మీద చేయివేశాడు. నుదురు కాలిపోతోంది. మైగాడ్ జ్వరం. "ఎలా వుంది ప్రనూషా! మందు వేసుకున్నావా? జ్వరం బాగా వుంది" అన్నాడు.
    ప్రనూష ఏం మాట్లాడలేదు. కదిలింది గాని కలుక్కుమంది శ్రీచరణ్ మనస్సు. కిచెన్ లోకి వెళ్ళిచూశాడు. గిన్నెలు ఖాళీగా వున్నాయి బోర్లేసి అంటే ఉదయం నుండీ అలాగే పదివుందా? ఏం మనిషి తను.
    మనస్సు చివుక్కుమంది. తను హాయిగా చికెన్ బిర్యానీ తినొచ్చాడు.
    వెంటనే టీ గిన్నె స్టవ్ మీద పెట్టాడు. గబగబా టీ తయారుచేశాడు. టీ కప్పు తీసుకొని ప్రనూష గదిలోకి వెళ్ళాడు.
    "ప్రనూషా లే! కాస్త వేడి టీ తాగు. కనీసం నాకు ఆఫీసుకు ఫోన్ చేయాలనీ తెలీదా ఇలా వుంటే.....ఒక్కర్తినే జ్వరంతో అలా పడివున్నావా? నేను చచ్చాననుకున్నావా?" కోపంగా అంటున్న శ్రీచరణ్ వైపు బలవంతంగా కళ్ళు తెరుచుకొని చూడసాగింది.
    మెల్లిగా లేపి టీ తాగించసాగాడు.
    వేడివేడి టీ గొంతు దిగుతూంటే కాస్త ప్రాణం లేచొచ్చినట్టయింది ప్రనూషకు.
    చన్నీళ్ళు పట్టించి కర్చీఫ్ తో మూతి తుడిచాడు తాగాక.
    కృతజ్ఞతగా చూసింది అతనివైపు.
    దిండు మీద తలపెట్టి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి ఓ గిన్నెతో నీళ్ళు తెచ్చి అందులో కర్చీఫ్ ని తడిపి ప్రనూష నుదిట మీద వేశాడు.
    "తగ్గిపోతుందిలే....కాసేపాగి టాబ్లెట్ వేస్తాను. భయం లేదు నేనున్నాగా...." అతని మాటలు మంత్రాక్షరాల్లా ప్రనూష చెవులను తాకుతూంటే హాయిగా వుంది ఆమెకు. ఉదయం నుండి పడిన బాధ తీరిపోయినట్టనిపించింది.
    భూమిని చీల్చుకొని....సముద్రాల్ని ఛేదించుకొని. కనుకొలకులను దాటి వచ్చినట్టు. కన్నీళ్ళు ఆమె బుగ్గలపై వచ్చి చేరాయి.
    "దేవుడా....నన్నీ క్షణమే ఇలాగే చనిపోనివ్వు....." ఆమె మనస్సు ఆర్ద్రంగా దేవుడ్ని వేడుకుంది.
    శ్రీచరణ్ ఆమె బుగ్గలమీద కారుతున్న కన్నీళ్ళని తుడిచేస్తు....
    "ఛ.....ఈ మాత్రానికే ఏడుస్తారా? టాబ్లెట్ వేసుకుంటే గంటలో తగ్గుతుంది..... నేను లేనూ ఇక్కడ. ఏం భయపడకు. పోనీ మీ అమ్మని రమ్మని ఫోన్ చేయనా..." ఆప్యాయంగా తల నిమురుతూ అన్నాడు.
    "ఉహూ! వద్దు" అన్నట్టు తలవూపింది. ఆమె రెండు చేతులతో శ్రీచరణ్ చేతిని అలాగే పట్టుకుని కళ్ళుమూసుకుంది.
    "ఉండు వెళ్ళి క్రోసిన్ మాత్ర తెస్తాను" అంటూ లేవబోయాడు.
    కదిలితే అతనెక్కడ దూరమైపోతాడో అన్నట్టు అలాగే చేయి పట్టుకొని "వద్దు వెళ్ళొద్దు నన్నొదలి" అంది కలవరింతగా!
    శ్రీచరణ్ అలాగే కూర్చుండిపోయాడు.
    మరో గంట తర్వాత మాత్రం బలవంతంగా మింగించాడు ప్రనూష చేత.
    రాత్రంతా పక్కన కూచుని నుదుటి మీద కర్చీఫ్ ని తడిపి వేస్తూనే ఉన్నాడు. మధ్య మధ్య టెంపరేచర్ చూస్తున్నాడు.
    ప్రనూష మగతగా నిద్రలోకి జారిపోయింది. అతని చేయి మాత్రం విడవకుండా పట్టుకునే ఉంది.
    "పిచ్చిపిల్ల....అల్లరెక్కువ చేస్తుంది కానీ..... ఒట్టి పిరికి...." అనుకున్నాడు శ్రీచరణ్ మనస్సులో.
    
                                                                * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS