అంతే విష్ణు వేడికోలును ఫకీర్ బాబా చిరునవ్వుతో స్వీకరించాడు.
* * * *
కాలగమనంతో పాటు ఋతువులు మారిపోయాయి.
ఉత్తరాయణం కాలం ప్రవేశించింది.
ఫకీర్ బాబా జవసత్వాలుడిగిపోయినట్టు ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు.
అది చూసిన విష్ణు చలించిపోయాడు......
"స్వామీ .......ఏమిటి మీకీ దుస్థితి?"
"నాకు పిలుపు వచ్చింది నాయనా......ఈ పుణ్యకాలం కోసమే నా మరణాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చాను. సంకల్ప మాత్రంతో ఏ క్షణాన కావాలంటే ఆ క్షణానే మృత్యుదూత నా ప్రాణాలను హరించగల గొప్ప వరాన్ని ఆ పరమేశ్వరుని కృపా కటాక్షవీక్షణాల వలన నాకు లభించినా నేను సాధించిన తపఫలాన్ని నాతోనే అంతరించిపోతుందేమోననే స్వార్ధంతో ఇంతకాలం నుంచి జీవిస్తూ వచ్చాను.'
"ఏమిటి స్వామీ........మీలోనూ స్వార్ధం వుందా?"
"ఆ స్వార్ధమే లేకుంటే మృత్యువును సయితం జయించి వుండేవాడిని. జీవితకాలం ఆర్జించిన తపఫలము , దివ్య శక్తులు నాతోనే అంతరించిపోకూడదని నాకు తగిన శిష్యుడు లభిస్తే అతనిని కూడా నా అంతవాడిని చేయాలనే స్వార్ధాన్ని నేను జయించలేకపోయాను. అందుకే మృత్యుదూత చేతిలో ఓడిపోక తపప్డం లేదు.
"కనీసం నువ్వయినా నా బలహీనతను జయించు. నాలా స్వార్ధానికి చోటు ఇవ్వకు......నీ విద్యలన్నీ పరోపకారానికే ఉపయోగించు. పది మందికి మార్గదర్శకుడివై ఆ త్రిమూర్తులను ఆరాధించు.......ఇక నుంచి నీకు ఇచ్చ కలిగిన క్షణాన నీ ప్రాణ వాయువులు నీ కట్టెను వదిలి శివసాయిజ్యాన్ని పొందుతాయి. నువ్వు మృత్యుంజయుడవు కావాలనే నా కోరిక. నా బౌతిక దేహాన్ని ఈ గుహలోనే సమాధి చేయి. ఈ క్షణం నుంచీ నేను నీలోనే వుంటాను.'
విష్ణు యాంత్రికంగా వింటుండిపోయాడు.
ఫకీర్ బాబా పెదవులు కదలడం ఆగిపోయాయి.
ఉన్నట్టుండి తెల్లని ప్రకాశం బాబా చుట్టూ అలుముకున్నది.
ఆ వెలుగును చూడలేక ఆ ప్రయత్నంగానే కళ్ళకు రెండు చేతులు అడ్డువుంచుకున్నాడు విష్ణు.
క్రమీపీ ఆ వెలుగు తీక్షణత తగ్గి కుదించుకుపోసాగింది......చిన్న జ్యోతిలా మారి ఫకీర్ బాబా నుదుటి దగ్గర కొన్ని లిప్తాల పాటు ఆగింది......
ఆ దృశ్యాన్ని అబ్బురంగా చూస్తున్నాడు విష్ణు.
ఆ జ్యోతి కదిలి.......విష్ణు నుదుటిని చుంబించినట్టు అతనిలో ఐక్యమై పోయింది.
ఆకాశంలో విద్యుల్లత తటిల్లున మెరిసినట్టు విష్ణు శరీరం ఒక్కసారిగా ఉలికిపాటుతో ఎగిరి పడింది.
ఇప్పుడు విష్ణు వదనం ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతున్నది.
బాబా తన జీవితకాలమంతా యోగ నిష్టతో సాధించిన అపూర్వ శక్తులన్నీ విష్ణుకు ధారపోసి అతను విష్ణు సాయిజ్యాన్ని పొందారు.
ఇప్పుడు విష్ణు సామాన్యుడు కాదు....
భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన అమోఘ శక్తి సంపన్నుడు.
గురు శుశ్రూషల వలన కానీ, అయన త్యాగ నిరతి వలన కానీ కొన్ని సంవత్సరాల పాటు సాధన వలన కానీ అలవడని అద్భుత శక్తులన్నీ అతి పిన్నవయసులోనే అతనికి సంక్రమించాయి.
అయినప్పటికీ విష్ణుకు గురుదేవుని చివరి మాటలు అనుక్షణమూ గుర్తుకొస్తూనే వున్నాయి.
అందుకే మాన్యుడయినప్పటికీ ఒక సామాన్యుడిలానే జీవించడానికి తన శక్తులను ప్రదర్శించడానికి ఇచ్చగించక సర్వసంగ పరిత్యాగి అయిన ఒక యోగి పుంగవునిలా జీవితాన్ని ప్రారంభించాడు.
ఆ కొండ చరియల నుంచి నగర జీవనానికి వచ్చాడు.
స్వామీజీలకు భక్తులకు కోదువలేని అ పుణ్య గడ్డపై అత్యంత సహజంగానే విష్ణుకు భక్తకోటి మొదలయింది.
ఫలితంగా విష్ణు ఆశ్రమం.......
కానీ ఆ రోజూ విష్ణు తన శక్తులను స్వార్ధానికి ఉపయోగించలేదు భక్తుల దృష్టిలో అతీంద్రియశక్తులు వున్న మహానుభావునిలా దివ్య శక్తులను ప్రదర్శించలేదు. నమ్మి తనకోసం వచ్చే భక్తుల కోరికలను తీర్చడమే తన పరమావధిగా ఎంచడం వలన విరివిగా వచ్చిన విరాళాలను తిరిగి ప్రజలకే వెచ్చించాలనే నిర్ణయం తీసుకోవడానికి అదే కారణం.......
కాలం ఎప్పుడూ ఒకలా వుండదు.
కాల భ్రమణంలో ఎగుడుదిగుడులకు ఎంత వారయినా తల క్రిందులు కాక తప్పదు అనేది పురాణ కాలం నుంచీ జరుగుతూనే వస్తున్నది.\
ఎందరో మహానీయులు ఎన్నో సందర్భాలలో దివ్యతపమాచరించిన సందర్భాలు ఎన్నో వున్నాయి. ప్రతీసారి ఆ దివ్య పురుషుల తపోభంగాన్ని చేయాలని ఉవ్విళ్ళురే వారు........చివరకు తపోభంగమే జరిగినా అది లోక కల్యాణానికే దారితీసేది........
ఇప్పుడు .......
విష్ణు మనసు కూడా కల్లోలం కావడానికి కర్మఫలమే కారణం కావచ్చు!
గత జ్ఞాపకాల పొరలలో నుంచి బయటకు వచ్చాడు విష్ణు.
ప్రస్తుతం తన మనసు నిండా అశాంతి పేరుకుపోయి వుందని స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి తనకు తనే తర్కించుకుంటున్నాడు.
ఇన్నాళ్ళ తన ఏకాగ్రత ఏమయింది?
ఎలాంటి ప్రలోభాలకు చలించని తన మనసులో ప్రకంపనలా?
నిశ్చల తపమాచరించినా వీసమెత్తుకూడా నిగ్రహం సడలని తన తపస్సుకు భంగం వాటిల్లబోతున్నది.
అలా జరగడానికి వీల్లేదు! తనలోని నిగ్రహశక్తికి గ్రహణం పట్టడానికి వీల్లేదు, తనకు ఓటమి లేదు. తపోభంగం జరగదు. జరగడానికి వీలు లేదు.
తన మందిరం బయట సుపరిచితమైన పద సవ్వడిని పసిగట్టిన విష్ణు భ్రుకుటి ముడిపడింది. ఆ వస్తున్నది ఎవరో అతనికి బోధపడింది......ఆమె నందిని!
