Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 53

 

    అల్ రైట్! దాన్ని గురించి ఇప్పుడు తర్కమెందుకులే! వెళ్ళి రెస్ట్ తీసుకో----"
    స్వప్న నిర్లిప్తంగా "గుడ్ నైట్!" చెప్పి వెళ్ళి పోయింది.
    ఆమెనే అలాగే చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు రవి.


                                       41

    పారిజాతం దేన్నయితే శంకించిందో అదే జరిగిపోయింది. ఆమె అనుకున్నంతా అయింది. అమాయకురాలూ, లోకం తెలియనిదీ అనుకుంటున్న అమ్మాజీ కృష్ణ తోటే లేచిపోయింది.
    "అమ్మా! నే వెళ్ళిపోతున్నాను. నాకోసం వెతక్కండి నేను నాదారి చూసుకున్నాను."
    మూడు ముక్కలు ఉత్తరంగా రాసిపెట్టి వెళ్ళి పోయింది. ఉదయం నిద్దర్లేవగానే దిండు కింద కనిపించిన ఆ చీటీ చూడగానే పారిజాతానికి లోకమంతా అయోమయంగా కనిపించింది.
    "ఏం చేయాలి? ఏం చేయాలి?" అనుకుంది.
    ఆమెకి మహా దుఃఖంగా వుంది. మనసారా ఎడ్వాలనుకుంటోంది. తన దుఃఖం ఆత్మీయులతో పంచుకోవాలని వుంది.
    కానీ అక్కడేవరున్నారు?
    ఉన్న ఒక్కతీ గుడిసె మీద దెబ్బ తీసి వెళ్ళిపోయింది.
    "భగవాన్!" అనుకుంది పారిజాతం.
    దుఖం తీరే అవకాశం లేకపోయే సరికి ఆమెలో కసి పుట్టుకొచ్చింది. ఆ కసి అంతా లోకం మీదే! కానీ లోకం మీద ఎలా తీర్చుకోగలదు? అందుచేత ఆ కోపం , ఆ దుఃఖం ఆ కసి ముప్పేటలుగా మారి వెంకట్రామయ్యా మెడకి చుట్టుకున్నాయ్.
    "వెంకట్రామయ్యా!" కసిగా పళ్ళు కొరుక్కుంది పారిజాతం.
    సుడిగాలిలా అతనింటికీ పరిగెత్తింది.
    ఉదయం పూట - అదీ ఎప్పుడూ తనింటికి రాని పారిజాతం వచ్చేసరికి ఏం కొంప మునిగిందోనని భయపడ్డాడతను. అతనికీ పారిజాతానికీ ఉన్న సంబంధం గురించి పారిజాతం యింటి పరిసరాల్లో తెలుసు కానీ ఆతనుంటున్న పేటలో ఎవరికీ తెలియదు.
    అందుకే అతను మరీ భయపడ్డాడు. రేగిన జుట్టుతో, ముఖమైన కడుక్కోకుండా వాడిన ముఖంతో , నలిగిన చీరతో వచ్చిన పారిజాతాన్ని అతను రిసీవ్ చేసుకోలేక పోయాడు సరిగ్గా.
    "ఏం జరిగింది?"
    ఆ కాంపౌండ్ లో ఉంటున్న ఇతర కుటుంబాల వాళ్ళు తనెక్కడ తక్కువ స్థాయిలో చూస్తారో అనే జంకులో అటూ ఇటూ చూస్తూ మెల్లిగా అడిగాడు. అది రెండున్నర గదుల చిన్ని కొంప! అందులో గట్టిగా ఊపిరి పీల్చినా , ఎక్కువగా పౌడరు రాసుకున్నా పక్కిళ్ళ వాళ్ళకి తెలిసి పోతుంది.
    అతని ప్రశ్నకి సమాధానంగా ఆ చీటీ చేతిలో వుంచేసి అతనంత దాకా పడుకున్న మంచం పై వాలిపోయింది.
    "లే! లే!" అన్నాడు గాబరాగా అతను. ఇంకా స్సేపటికి కూరగాయల వాళ్ళు, పాలవాళ్ళూ వస్తారు. ఈమెనీ స్థితిలో చూస్తే యింకేముంది? అదీ అతని భయం.
    ఆశ్చర్యపోయి కూర్చుందామె.
    అప్పుడు ఆ చీటీ చదివాడాయన. చదవగానే మతిపోయి నట్టయింది. క్షణ కాలం లోకమంతా అంధకార మయంగా అనిపించింది.
    "ఎంత పని చేసింది!"
    "చెపితే విన్నావా? నేను హెచ్చరించినపుడే జాగ్రత్త పడి వుంటే యిలా జరిగెదా? ఊహూ నీకేం పట్టింది? అది కన్నకూతురనే దృష్టి వుంటేగా? కొడుకు మీద వున్న వ్యామోహం నిన్ను గుడ్డివాడిని చేసింది! ఉంచుకున్నదాని బిడ్డ వుంటేనేం ఊరేగితేనేం అనుకున్నావు."
    "పారూ!" కంగారుగా పిలిచాడు.
    "ఇక మరిచిపో నన్ను! నా కూతురిని నాకు అప్పగిస్తేనే నేను నీ మనిషిని. లేదా పిచ్చికుక్కలా ఏం చేస్తానో నాకే తెలియదు."
    "ఊరికే అరవక!" కసురుకున్నాడు తొలిసారిగా.
    గది బయట ఎవరివో అడుగుల చప్పుడు వినిపించింది.
    "ఆ అంతవరకూ వచ్చిందా! నేను నీ యింటికి వస్తే, పరువు నష్టంగా వుందా? నువ్వు నా యింటి చుట్టూ తిరిగి బ్రతిమాలి, బామాలి నన్ను ముగ్గులోకి దించిన రోజు ఏమయింది నీ మర్యాద! కొడుకు జైలుకి వెళ్ళిన రోజున ఎక్కడేడ్చింది నీ మరియాద?"
    ఇంకేదో అనబోయింది పారిజాతం. చెళ్ళున చెంప కేసి కొట్టేడు అయన. తొలిసారిగా ఆడదాని మీద చేయి చేసుకున్నాడు.
    నిర్ఘాంతపోయింది పారిజాతం.
    "ధూం------"
    ఆమె నోరు మూశాడు అయన. "ఇదిగో! మర్యాదగా వెళ్ళు. నేను వెతికి అమ్మాయి విషయం కనుక్కుంటాను. లేదా! నువ్వు ఎంత యాగీ చేస్తావో చెయ్. నీకూ నాకూ ఇంతటితో సరి!" కటినంగా చెప్పాడు.
    పారిజాతానికి నోటి మాట రాలేదు.
    "లే! వెళ్ళిపో మరియాదగా!"
    యాంత్రికంగా లేచి నుంచుంది.
    "వెళ్ళు! నే మళ్ళీ వస్తా!"
    దయ్యం పట్టిన దానిలా తలుపు తీసుకుని అటూ యిటూ చూడకుండా గబగబా వెళ్ళిపోయింది.
    అందరి చూపులూ ఆమె చుట్టే తిరిగాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS