Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 53

 

    కెవ్వున కేకేసి ఎదురుగా వున్న పూలకుండిని ఎత్తి 'ఫట్' మని కిందకి విసిరింది .


    దాంతో ఈ లోకంలోకి వచ్చారు ఇద్దరూ.


    
                                                 * * *


    "ఏమిటి నారదా....ఏమైనది?" యమధర్మారాజు ఆశ్చర్యంగా అడిగాడు.


    "ఏమైనదేమిటి యమధర్మరాజా....ఆ బ్రహ్మదేవుడు కూడా రంగంలోకి దిగాడు" చెప్పాడు నారదుడు.


    అదే సమయంలో బ్రహ్మదేవుడు చిర్నవ్వును చిందిస్తూ శ్రీచంద్ర వైపు చూసి....." శతాయుష్మాన్ భవ" అన్నాడు.

 

                                               * * *


    "నాధా....ఏమా చిరునగవు" అడిగింది సరస్వతి దేవి భూలోకం వైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తోన్న బ్రహ్మదేవుడ్ని చూసి.


    "ఆ యముడు పరుషమునకు పోయి, నాతొ పందెమునకు సిద్దపదినాడు. తన ఆధిక్యతను నేను గుర్తించవలెనట.....తన అభిజాత్యమును నేను తలవొగ్గవలెననుకున్నాడో ఏమో...." అన్నడు బ్రహ్మదేవుడు.


    "అవునవును....తమరేప్పుడు సృష్టి......సృష్టి.....యనచూ, ఈవల ఒక సతి యున్నదని మరిచి ,ఊ 'తలరాత' ల కార్యక్రమములో తలమునకలవుదురు. మీకు ఇది జరగవలసినదే" అక్కసుగా అంది.


    బ్రహ్మదేవుడు సరస్వతి దేవితో వాదం పెంచుకోవడం ప్రమాదకరమని భావించి , చిర్నవ్వుతో మిన్నకుండిపోయాడు.


    సరస్వతిదేవి వీణ కోపంగా మీటింది.


    తధాస్తు దేవతలు "ఔరా" అనుకుని ముక్కున వేలేసుకున్నారు.

 

                                                                    * * *


    "బ్రహ్మదేవుడు ఇంతటి పని చేసినాడా? ఇప్పుడు మనకేది దారి నారదమునిండ్రా?" యమధర్మరాజు అడిగాడు నారదుడ్ని.


    "ఏమున్నది? భయమున కాకున్న, నయమున ఆ మానవుడ్ని అనునయించి అభ్యర్దించుము.'


    "అభ్యర్ధనమా.....అవమానం. నేను ఎవరనుకుంటిరి మునింద్రా?" దర్పంగా మీసం పై చేయివేసి అన్నాడు యమధర్మరాజు.


    "అవునవును. తమరు యమధర్మరాజు అని, నరకలోకమునకు అధిపతి అని తెలుసును. కానీ తమరికే ఒక విషయం బోధపడటం లేదు.'


    "ఏమది?"


    "మీరా మానవుడ్ని అభ్యర్ధించకున్నచో....ఆ మానవుడు చచ్చుట కల్ల. మీ యమపాశము నిరర్ధకమై, మీ ప్రతిజ్ఞ వ్యర్ధమై పోవుట తధ్యం."


    "అకటా....ఏమి ఈ యిక్కట....కట....కటా.."


    "అందుకే తొందరపడుము, ఆ మానవుడ్ని బుజ్జగింపుడు. ఏదో ఒకటి ఆశ చూపి, చచ్చునటుల చేయుము"


    "తప్పదా?"


    "తమరు ఈ పంతములో పరాజయులు కావాలనినచో తప్పును."


    "అయ్యారే....ఎంతటి సంకట స్థితి. కానిండు....ఆ మానవుడ్ని ఎలా బుజ్జగించవలెనో కూడా తమరే సెలవిచ్చి పుణ్యం మూటకట్టుకోనుడు" బాధగా అన్నాడు యమధర్మరాజు.


    "తమరి చెవి ఇటు యిమ్ము" అంటూ యముడి చెవిలో ఏదో గుసగుసలాడేడు నారదుడు.

 

                                                               * * *


    శ్రీచంద్ర ఒక్కడే కూచున్నాడు.


    వేకువ ఝామునే వచ్చాడక్కడికి.


    చుట్టూ కొండలు, పచ్చిక బయళ్ళు....పకృతికి కొత్త వన్నె వచ్చినట్టుంది.


    ఎప్పుడైనా మనసు బాగోకపోతే సిటికి దూరంగా ఈ కొండల మధ్య పచ్చిక బయళ్ళ మధ్య గడపడానికి వస్తాడు శ్రీచంద్ర.


    ఆరోజంతా అతని మనసు బాగా లేదు. దానిక్కారణాలు చాలా వున్నాయి.


    తనకి ఉద్యోగం దొరక్కపోవడం.


    సమీర తనకోసం ఎదుర్చుసి , చూసి, విసుగేసి ఏదో క్షణాన ఎవరో ఒకర్ని చేసుకుంటుందన్న భయం కలగడం.....


    తనకు 'చచ్చిపోయే' జబ్బు వుందని చెప్పమని డాక్టర్ కి ఎవరో చెప్పడం. ఆ ఎవరో తెలియకపోవడం.....


    నిన్నటికి నిన్న .....తన తండ్రి తనని చావమని అనడం....తాను పౌరషంతో చావబోవడం....అదృశ్యంగా తనని ఆ ఆత్మహత్య నుంచి ఎవరో కాపాడ్డం. తండ్రి తనలా అనలేదని అనడం.....


    అంతా అయోమయంగా వుంది.


    అంతకు మించి ఆతనికి తన బ్రతుకు దుర్బరంగా అనిపిస్తోంది.


    ఓ సమస్య చుట్టిముట్టినప్పుడు, అదే సమయంలో మరో సమస్య, ఇంకో సమస్య, ఎదురైనప్పుడు మిగతా ప్రతి విషయం, భూతద్దంలో పెద్దదిగా కనిపిస్తుంది. తను ఒంటరి నన్న ఫీలింగ్, తనకి ప్రపంచంలో ఎవరూ లేరనే భావం. మనసు శూన్యమవడం....


    ప్రస్తుతం అలాంటి స్థితిలో వున్నాడు శ్రీచంద్ర.


    సరిగ్గా అప్పుడే....


    కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుగు....


    ఆ వెలుగులో నుంచి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. శ్రీచంద్ర షాకింగ్ గా అలానే చూస్తుండిపోయాడు.


    ఎక్కడో సినిమాల్లో జరిగేది.....


    కధల్లో చదివించేది......


    కళ్ళముందు కనిపించడం.....


    "మానవా......ఆశ్చర్యపోతున్నావా?.....నేను....సమవర్తిని, నరకలోకమునకు అధిపతిని, యమధర్మరాజుని......" యముడు చెప్పాడు.


    "అప్రయత్నంగా చేతులు జోడించాడు శ్రీచంద్ర.


    "ఆయుష్మాన్ భవ...." అని అనాలనుకున్నా, అది తన పంతానికే భంగమని తమాయించుకుని,  "సుఖీభవ" అని మాత్రం అన్నాడు.


    "మీరు...మీరు నిజంగా...."


    "నమ్మకం లేదా మానవా?"


    "ఏమో ప్రభూ.....నాకు మనుష్యుల మీదే నమ్మకం పోయింది. ఇక దేవుళ్ళ మీదేం ఉంటుంది గానీ, తమరు ఒరిజనల్ యమధర్మరాజా? డుప్లికేటా?"


    "మానవా?"


    "అబ్బ! అరవొద్దు స్వామీ! గుండెపోటు రాగల్దు మీకు..."


    "మానవా.....ఎందుకు చెబుతున్నానో అర్ధం చేసుకో. నీకేం కావాలన్నా యిస్తాను.....అదియును 'ఆత్మహత్య చేసుకోను అన్న మాట తప్ప."


    "అబ్బ.....ఆప్పుడేప్పుడో సతిసావిత్రి నీ వెంటపడితే 'అదియును నీ పతి ప్రాణంబు తప్ప....అదియును నీ పతిప్రాణంబు తప్ప" అని ఆఖరికి తొక్కలో కాలేసి పడ్డారు.....మళ్ళీ అలాంటి ఫిట్టింగెందుకు యమధర్మరాజా?"


    "మానవా! నువ్వు మాట్లాడిన దాంట్లో, యిసుమంతయినా బోధపడలేదు.బాగా ఆలోచించుకొనుడు....నీ నిర్ణయం విభాత సంధ్యవేళ చెప్పుడు...." అంటూ మాయమయ్యాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS