Previous Page Next Page 
విశిష్ట పేజి 53

    "దెయ్యం! నా నుండి  ఎన్నాళ్ళు తప్పించుకుంటావో చూస్తాను. రేపు మరో పొగ పెడతాను. వూపిరాడక గిలగిల్లాడిపోవాలి, నా దగ్గరికి పరిగెత్తుకురావడం తప్ప నీకున్న అన్ని దారులూ మూసివేస్తాను" అనుకుంటూ వెనుదిరిగాను.

     కాంతం మరో గదిలోంచి ఆయనకంటే ముందే పకక మీదికి చేరి నిద్ర నటించసాగింది.

     ఆమె గుండెల్లో మాత్రం దావానలం చెలరేగింది.

     దేవుడిలాంటి భర్తను వదిలేసి ఈయనతో లేచిపోయి వచ్చినందుకు తనకీ శాస్తి కావలసిందే!
   
    "మనం ఇకనుండి పాము ముంగిసల్లా పోట్లాడుకోవద్దు. మనకి పడ్డ వివాహబందాన్ని గౌరవించి మనం భార్యభర్తల్లా జీవిద్దాం. ప్రేమ అమృతాన్ని పంచితే ద్వేషం విషం చిమ్ముతుంది.  దానివల్ల అంతా సర్వనాశనమే కదా! మీ వుద్యోగం పోయింది. అందం పోయింది.

     గౌరవం పోయింది. ప్రస్తుతం మీరు బయట తలెత్తుకోలేని పరిస్తితిలో వున్నారు. ఆడదాన్నని నన్ను చూలకన చేసి మీరేం సాధించారని. నష్టపోయిందంతా మీరే! వివాహంతో వసంత రుతువు కావలసిన మీ జీవితాన్నీ శిశిర రుతువుగా మార్చుకున్నారు.

     అవిటి వారుగా మంచంమీద పడ్డారు. ఇంకా నన్ను సాదించాలని చూస్తే మీ జీవితం శాశ్వతంగా మ్రోడైపోతుంది. ముప్పయ్యేళ్ళలో తొంబయ్ ఏళ్లు చూడాల్సి వస్తుంది.  మీవల్ల ఎంతో టార్చర్ చేయబడ్డ నేనే జరిగిందంతా  మరిచిపోయి కొత్త జీవితం ప్రారంభించాలని ఆశపడుతూంటే మీకేమైంది?"

    "నిజమే! తనకేమైంది?"

    ఒక విధంగా బయటి ప్రపంచానికి దూరమయ్యాడు పృద్వి.

     అందవికారమైన ముఖంతో బయట తిరగలేడు. ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే పడివుండాల్సిన పరిస్థితిలో తనకొక తోడు, తన కష్టం, సుఖం పంచుకునే తోడు ఇప్పుడెంతో అవసరం. తను పడగ విప్పినప్పుడల్లా ఆమె తెలివిగా తన పడగ చితక్కొడుతూనే వుంది.

     ఆ దెబ్బలతో తను మానసికంగా కూడా అశక్తుడైపోయాడు .ఈ నిస్సహాయస్థితిలో ఆమెతో చెలిమి కోరడమే తనకు వూరట. ఇదివరలో ఆమె తనకు శత్రువేమోగాని ఇప్పుడు భార్య. అన్నీ మరిచి తనతో కలిసిపోతానంటోంది. ఇప్పుడామె చెయ్యందుకోకపోతే జీవితంలో తను చాలా కోల్పోవాల్సివస్తుంది.

     అతడి అంతర్మధనంలో ప్రేమ మొగ్గ తొడగసాగింది.

     స్నేహభావంతో పృద్వీ చెయ్యి చాచి ఆమె చెయ్యందుకున్నాడు. "నీ పట్ల నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను విశిష్టా! నన్ను క్షమించు "అతడి గొంతులో బాదతో కూడిన జీర.

    "నా అహంకారం అణిగింది ఆడది ఆడది కాదు. ఆమె విశ్వ స్వరూపం నీలో చూశాను. ఆడది తలుచుకోవాలేగాని ఎలాంటి మగవాడి నైనా పడగొట్టగలదు. ఇక నీతో నాకు వైరం లేదు. ఈ క్షణం ముండి నేనుకూడా అంతా మరిచిపోవడానికే ప్రయత్నిస్తాను."

    అతడి చేతిమీద తన మరో చేతిని వుంచి అదిమింది విశిష్ట. ఆ అదమడంలో తన ప్రేమను వ్యక్తం చేస్తూ 'నేనొక మాట చెబుతాను. మీరు నిదానంగా ఆలోచించాలి.'   

    "ఏమిటి?"

    "మనం వేరే వెళ్లిపోదాం.  ఈ ఇంట్లో నేనుండలేను."

    "అదేమిటి? ఏమైంది ఈ ఇంట్లో?"

     "ఈ ఇంటిలో మగవాళ్ళకి ఆడవాళ్లంటే గౌరవం లేనట్లే  వావివరుసలు తెలియవు. నా మద మణుస్తానంటూ ఆంబోతులా నా వెంట పడుతున్నాడు మీ నాన్న.

    "మా నాన్న నీ  వెంట పడడమేమిటి? మరింతగా తెల్లబోయాడు పృద్వీ.

     "రాత్రికి వస్తాను. గడియ తీసి వుంచు అన్నారు. గడియతీసి ఆయనకి స్వాగతం చెప్పలేదన్న కసితో ఆయనకి నా చేత్తో ఇచ్చినపాలల్లో  ఆయనే విషం కలిపి పిల్లికి తాగించి, ఆ విషం నేనే కలిపానని, పోలీసులకి పట్టిస్తానని గొడవ చేశాడు.
 
     అత్తయ్య అడ్డుపడడంతో. బెదిరించింది  ఇప్పటికి చాలనుకున్నాడో ఏమో పోలీసులను పిలవలేదు. మళ్లీ ఈ రోజు దొంగతనం నేరం మోపబోయాడు. పనిపిల్లతో నా పడక క్రింద డబ్బు పెట్టించాడు. ఆయన నన్ను కబళించే ప్రయత్నం మానడు. ఈ పరిస్థితిలో ఈ ఇంటిలో నేనెలా వుండను చెప్పండి."

    పృ-ద్వీ ఆమెకేసి అపనమ్మకంగా చూస్తూ "మా కుటుంబంలో ఏదో ముసలం పుట్టించడానికి ఈ కథ అల్లలేదు కదా! లేకపోతే మా నాన్న ఏమిటి - నీ వెంటపడడం ఏమిటి? ఆయన అంత నీచుడంటే నమ్మలేకపోతున్నాను" అన్నాడు.

     "ఇది నేనల్లిన కథ కాదు. నిజమని తెలిస్తే ఏం చేస్తారు?"   

    "ఇది నిజమే అయితే అలాంటి  మనిషి ఈ భూమ్మీద వుండతగడు కాబట్టి చంపిపడేస్తాను"

    "మరీ అంత ఆవేశం వద్దు. అనవసరంగా నీరు పితృహంతకులు  కావడం నాకిష్టంలేదు. మనం ఈ ఇంటినుండి వెళ్లిపోయి మన బతుకులు మనం బతుకుదాం."

    "ఇదేదో తేల్చుకోకుండా ఎలా వెళ్లిపోతాను? నీతో వేరు కాపురం ఎలా పెడతాను? అసలు నిన్ను ఎలా నమ్మాలి?సముద్రంలా లోతు తెలియని మనిషివి. నీ మనసులో ఏ కుట్ర వుందో తెలియదు. నువ్వెంత జాణవి కాకపోతే నా కౌగిలిలోకి వచ్చినట్లే  వచ్చి నా ముఖంమీద ఏసిడ్ పోసిపోతావా?"

    "ప్లీజ్! నన్ను నమ్మండి! ఇప్పుడు నా మనసులో ఏ కుట్రలూ లేవు. నిర్మలమైన మనసుతో మీకు అంకితమవడానికే నిశ్చయించుకున్నాను.

     మీరూ అంతే నిర్మలంగా నన్ను స్వీకరించాలి. అనుమానాలు, గతం తవ్వకాలు ఏవీ వద్దు. మన జీవితాలు అనురాగ సంగమం కావాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను."

    "మా నాన్నమీద నువ్వు చెప్పింది ముందు నిజం కావాలికదా?" "అవుతుంది ఈ రాత్రికే."

    ఆ రాత్రి గడియ తీసి వుంచింది  విశిష్ట.

     అందరూ గాఢనిద్రలో వున్నారని తేల్చుకున్నాక మెల్లిగా వెళ్లి కోడలి గది తలుపు తట్టాడు మాధవరావు. కొద్దిగా నెట్టగానే తలుపులు తెరుచుకున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS