"ఆ పిల్ల ఎలాంటిదో తెలియకముందు అన్నాను. ఇప్పుడు నా తప్పును దిద్దుకొంటున్నాను. మీక్కూడా ఆ పిల్లమీద ఏదైనా దురభిప్రాయం వుంటే చెరిపేసుకోండి. పృద్వీని సన్మార్గంలోకి త్రిప్పగల శక్తి ఆ పిల్లకి వుంది. వాడిని దిద్దే అవకాశం మనం ఆ పిల్లకి యిద్దాం."
"ఈ సారికి అత్తగారి సిఫార్స్ ను కాదనలేక నిన్ను పోలీసులకి హాండోవర్ చేయలేదు. మరోసారి తోక ఝాడించావా, ఆ తోక కత్తిరించడమేకాదు, కొడుకు పెళ్లానివని కూడా చూడకుండా నిన్నేం చేస్తానో నాకే తెలియదు!" విశిష్ట ముఖంలోకి గుర్రుగా చూసి చరచరా వెళ్లిపోయాడు మాధవరావు.
"కొడుకు పెళ్లానివని కూడా చూడకుండా నిన్నేం చేస్తానో - అంటే ఆయన మనసులో ఉద్దేశ్యం ఏమిటో అర్దమైందా అత్తయ్యా?"
"ఇలాగే అబద్దాలు అల్లి నిన్నింకా సతాయిస్తారు కాబోలు!"
"కాదులే, అత్తయ్యా! ఆయన మనసులో మీ ఊహకు అందనిదే వుంది."
"ఏముందని నీ అభిప్రాయం?"
"కొడుకును సంసారానికి పనికిరాకుండా చేశానన్న కోపంతోపాటు ఆయనకి నా యవ్వనంమీద కూడా కన్ను పడింది. 'రాత్రి గడియతీసి వుంచు. నీ మద మణుస్తాను' అన్నారు. ఆయన చెప్పినట్లు నేను చేయలేదని కోపం. ఇలా నన్నల్లరిపెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారు."
"రామ! రామ!"ఆమె గాబరాగా చెంపలు తట్టుకొంది. "ఆయన మంచివాడు కాకపోవచ్చునేమోగాని, మరీ వావివరసలు చూడని మనిషని నేనుకోవడంలేదు. నువ్వు చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను."
"నేనబద్దం చెబుతున్నాననుకొంటానురా?నా మాట నమ్మండి. కావాలంటే రాత్రికి కొంచెం మెలుకువగా వుండి ఆయన్ని కనిపెట్టి చూడండి. నిజం మీకే తెలుస్తుంది."
ఆమె తల ఊపిందేగాని కోడలి మాట నమ్మినట్టుగా లేదు.
* * * * *
"ఇందాకా ఈ గదిలోకి ఎవరు వచ్చారు? బీరువా ఎవరు తెరిచారు? డబ్బు పోయింది. నిన్ననే బ్యాంక్ నుండి తెచ్చి పెట్టాను" ఇంట్లో దుమారం రేపుతున్నట్టుగా అరవసాగాడు మాధవరావు.
"ఎందుకు అరుస్తారు? డబ్బు ఇందాకానేనే తీశాను" అంటూ నోట్లకట్టలతో వచ్చింది కాంతం.
"నువ్వా? నువ్వెందుకు తీశావు?"
"అయ్యో! డబ్బుతో పని ఎవరికుండదు? కోడలికి పెళ్లిలో చీరలేవీ తీసుకోలేదు. ఈరోజు బజారుక తీసుకెళ్లి రెండు మూడు పట్టుచీరలిప్పిద్దామని నేనే తీశాను. ఈ డబ్బుతో మీకు అవసరముందా? కోడలికి పట్టుచీర లిప్పించనా?"
"కోడలు! కోడలు! కోడలు! కోడలిమీద ప్రేమ పొంగిపొరలు తుందేం?" మాధవరావు చిటపటలాడుతూ డబ్బు లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. ఈ నోట్లకట్ట రెండు గంటలక్రితం పనిపిల్లతో విశిష్ట గదిలో పడక క్రింద పెట్టించాడు.
మూడో కంటికి తెలియని ఆ నోట్లకట్ట కాంతం చేతిలోకి ఎలా వచ్చింది?పని పిల్ల కాంతానికి చెప్పేసిందా తన ప్లాను? నోట్లకట్ట విశిష్ట గదిలో పెట్టడానికి దానికి వందరూపాలు లంచమిచ్చాడే!ఏం జరిగిందో తెలియక జుట్టు పీక్కున్నాడు మాధవరావు.
గంట తరువాత గది వూడ్వడానికి వచ్చింది పనిపిల్ల.
"నోట్లకట్ట విశిష్ట గదిలో పెట్టమంటే ఏం చేశావే?"
"మీరు చెప్పినట్టే చేశానండయ్యగారూ! కోడలమ్మ గదిలసో పడక క్రింద పెట్టొచ్చాను."
"పడక క్రింద పెట్టింది పెద్దమ్మ చేతిలోకి ఎలా వచ్చిందే?"
"సత్యప్రమాణంగా ఆ నోట్లకట్ట కోడలమ్మ పడక క్రిందే పెట్టాను అయ్యగారూ!"
"నువ్వు పెడుతున్నప్పుడు విశిష్ట ఎక్కడుంది?"
"బాత్ రూమ్ లో స్నానం చేస్తోందయ్యగారూ!"
పనిపిల్ల అమాయకురాలు దాని మాట నమ్మతగ్గదే!
మరి పడక క్రింద నోట్లకట్ట కాంతం చేతికి ఎలావచ్చింది?
ఎలా వచ్చిందో కాంతాన్ని అడిగితే చెబుతుంది. కాని అడగలేడు. దొంగకి తేలుకుట్టిన పరిస్థితి ఇది.
పనిపిల్ల అనుమానాస్పదంగా తన గదిలో తచ్చాడడం గమనించిన విశిష్ట బాత్ రూమ్ లోకి వెళ్లి తలుపు కన్నంలోంచి గమనించసాగింది. పని పిల్ల నోట్లకట్ట తన పడకక్రింద దాయడం చూసింది. అది అలా వెళ్లగానే నోట్లకట్ట తీసికెళ్ళి కాంతం చేతికిచ్చి చెప్పింది.
"మామగారు నా మీద దొంగతనం నేరం మోపి అల్లరిపెట్టడానికి ఈ పని చేశారు. కాస్సేపట్లో ఆయన డబ్బు పోయిందని అరుస్తారు. ఈ నోట్లకట్ట బీరువాలోంచి మీరే తీశానని చెప్పండి. అప్పుడు దొంగకి తేలు కుట్టినట్లవుతుంది ఆయనకు."
కాంతం కోడలు చెప్పినట్లే చేసింది.
మాధవరావు మింగలేక, కక్కలేక గదిలోకి వెళ్లిపోయాడు.
ఎలా దాన్ని దెబ్బతీయడం?ఎలా దారికి తేవడం?
* * * *
ఆ రోజు రాత్రి పదకొండు గంటలవుతోంది.
కాంతం గాఢనిద్రలో వున్నట్టుగా పడుకొంది.
మాధవరావు మెల్లిగా లేచి కోడలి గదివైపు సాగిపోయాడు.
కాంతం లేచి మెల్లిగా అనుసరించింది ఆన కంట పడకుండా.
ఆయన విశిష్ట గది తలుపు దగ్గరికి వచ్చి ఆగాడు. పరిసరాలు గమనిస్తున్నట్టుగా అటూ ఇటూ చూసి తలుపు తట్టాడు. లోపల గడియ వేసి నట్టుగా గమనిస్తూనే పళ్లు పటపట కొరికాడు.
