నారాయణరావుగారు ఉన్నంతకాలం తన కుటుంబం సంపాదన తప్ప ఇంకేమీ ఎరగడు. ఆశ్రమం తీసుకొన్న తర్వాత, సర్వకాలం తపస్సు, పఠనం ఇవి ఆయన పనులు. గురువులు వీరికి కైలాసనంద భారతీ యని నామకణం చేశారు. వీరు ఆశ్రమం పుచ్చుకొని ముందు కైలాస పర్వత సందర్శనమూ, మూడుసారులు ఆ మహాపర్వతానికి ప్రదక్షిణమూ చేసివచ్చారట. ప్రతి సంవత్సరమో, లేకపోతే రెండేళ్ళ కొక పర్యాయమో కైలాసానందులు, కైలాసయాత్ర చేసి వస్తూ వుంటారు. ఒక్కొక్కప్పుడు ఒక ఏడాదంతా కైలాసపర్వతం దగ్గర ఉన్న బౌద్దాశ్రమాలలో నివసిస్తూ తపస్సు చేసుకొంటూ ఉంటారు.
కైలాసానందులు సాంగవేదులై, ప్రస్థానత్రయశాంతి చేశారు. భాష్యత్రయం గళగ్రాహంగా వచ్చును. పాంతజలం మొదలైన యోగగ్రంధాలు క్షుణ్ణంగా వచ్చును. తపస్సువల్లనో ఏమో వారికి ఏకసంధా గ్రాహిత్యం అతి సులభంగా అబ్బింది. షడ్డర్శనాలు, మతేతర దర్శనాలు పూర్తిగా వచ్చును. రామక్రిష్ణ మఠంవారి గ్రంథాలు, సత్సంఘ గ్రంథాలు,శిక్కుమతస్థుల గురు గ్రంథ సాహెబ్జీ ఉపదేశాలు, ఆగమాలు, పాశ్చాత్యుల వేదాంతాలు అన్నీ సర్వకాలం చదువుతూ ఉంటారు. హరిద్వారంలో వీరు మానస సరోవరాశ్రమం ఏర్పాటు చేశారు. ఆ ఆశ్రమంలో గ్రంథాలయం ఉంది. అన్ని భాషలూ నేర్చుకున్నారు. త్రివిష్టపపు వ్రాత గ్రంథాలెన్నో సముపార్జించారు. అనేకమంది సన్యాసులు వీరి ఆశ్రమానికి గ్రంథపఠనంకోసం వస్తారు. వీరి శిష్యులు దేశం అంతా వున్నారు. కోటీశ్వరులు, మహారాజులు, దరిద్రులు యెంతోమంది వీరి శిష్యులు. బీదసన్యాసులకు సర్వసహాయాలు చేస్తూ ఉంటారు. వీరు పూర్తిగా అహింసావాదులు. గాంధీగారు అవతార పురుషులనే వీరి ఉద్దేశ్యం. మూడు నాలుగు సారులు వీరా మహాత్ముని సందర్శించారు.
వాదనలో మా స్వామీజీని జయింపలేము. వాదన అవసరంలేకుండా హృదయానికి అమృతభోజనం ఆరగింపజేస్తారు. వారి ఉపదేశాలల్లో, వీరి మహాత్మ్యం చాలా గొప్పదని హరిద్వార హృషీ కేశాదులలో అనేకులు మాతో చెప్పారు. హాస్యంచేసి నవ్విస్తారు. మోమాటం లేకుండా అన్ని విషయాలు చెప్పుతారు. ఎప్పుడు కునుకుతారో నేను కని పెట్టలేకపోయాను. ఎప్పుడూ చదువుతూనో, జపం చేసుకుంటూనో కనబడుతారు. స్వామీజీ మంచి గాయకులు, సైగల్ గొంతును మించిన తీపి మందిరం గొంతుతో జపాదులు లేనికాలాల్లో, ప్రయాణం చేసేటప్పుడు, రాత్రిళ్ళు యెప్పుడూ తత్త్వాలు పాడుకుంటూ ఉంటారు.
హృషీకేశం నుంచి దేవప్రయాగ వెళ్ళాము. మోటారు బస్సుపై పదిహేను గురు స్వాములు, మా స్వామీజీ, నేనూ ఒక రాజపుత్ర జమీందాడుడూ, సిబ్బందీ, అందరము అరవై నలుగురము. ఒక జట్టయి హిమాలయ యాత్ర ప్రారంభించాము. ఇంతవరకు స్వామి నాకేమి బోధించ ప్రయత్నించలేదు. నేను ఆయన్ను ప్రశ్నలూ వేయదలచుకోలేదు. మా అమ్మగారి దగ్గిరా, మా సుబ్బులు దగ్గిరా సెలవు పుచ్చుకొని, బస్సుమీద దేవప్రయాగ చేరాము. మా అమ్మగారు ఎంతో ఉత్సాహంతో అత్తవారింటికి కొడుకు వెల్లేటప్పుడుండే సంతోషంతో'' సుఖంగా వెళ్ళి, కైలాసేశ్వరుని దయచేత కులాసాగా తిరిగిరా నాన్నా'' అని ఆశీర్వదించింది.
ప్రయాగ అంటే నదీ సంగమ క్షేత్రం. అలహాబాదు మనుష్య ప్రయాగ, అలకనందా భాగీరధీ సంగమం దేవప్రయాగ. కర్ణ, నంద, రుద్ర, విష్ణు ప్రయాగలున్నాయి. అసలు గంగానది భాగీరథి. భగీరథుడు గంగోత్రి కని పెట్టినాడు. కాబట్టి భాగీరథి అని పేరు వచ్చింది. ఉన్న ప్రయాగలన్నీ అలకనందానదికే ఉన్నాయి. భాగీరథిలో చాలా నదులు కలుస్తున్నా వాటికి ప్రయాగలనే పేర్లు లేవు. అలకనందలో మందాకిని నది కలిసేచోటు రుద్రప్రయాగ. అలకనందలో పిండారీగంగ కలిసేచోటు కర్ణప్రయాగ; నందప్రయాగలో నందానది అలకనందలో సంగమించే పుణ్యస్థలం. విష్ణుప్రయాగలో విష్ణుపాదజ అయిన విష్ణుగంగ లేక ధౌళీగంగ అలకనందలో కలుస్తుంది.
మందాకిని ఆకాశనది, కేదారనాథ క్షేత్రం దగ్గర ఈ నది పుట్టిన స్థలము. అలకనంద అలకాపురం దగ్గర పుట్టింది. అది మానవులు దర్శింపలేని హిమాచల శృంగస్థలము. బదరీ నారాయణానికి యెగువగా పన్నెండు పదమూడు మైళ్ళదూరంలో ఈ అలకాపుర ప్రదేశం ఉంది. ఒకప్పుడు యక్షజాతి మనుష్యులు (ఈనాడూ దారి పొడుగునా వారు కనిపిస్తారు) పొట్టి మంగోలీ జాతివారు, టిబెట్టు జాతికి చుట్టాలు, అక్కడ ఉండేవారనీ, హిమాలయాలలో ఎప్పుడూ సంభవించే హిమపాతాలవల్ల ఆ పట్టణం పూడిపోయిందనీ నా ఉద్దేశం. కాళిదాసుని మేఘసందేశయాత్ర కూడా ఇక్కడికే వస్తుంది. ఇక్కడినుంచే కైలాసపర్వతానికి దారి ఉంది.
33
హృషీకేశంగాని, ఆ తర్వాత మా ప్రయాణంలో మకాములుగాని నన్ను కప్పిన మంచుతెరలను చీల్చలేకపోయాయి. నాగుర్రాన్ని నేను ఎక్కదలచుకోలేదు. కూడ ఉండడం మంచిదని ఎంచాను. మురికిరేతి, లక్ష్మణ ఝాలా, గరూర్హ చట్టీ, పూల్ వారీ, గులార్ చట్టీ, నయీమోహన్, చహోటీ బిజానీ, బర్హిబిజానీ, కుండు చట్టీ, బందర్ ఖేల్, మహదేవ్, నెమాల్ చట్టీ, కండీ చట్టీ, వ్యాసఘట్టం, ఉంరాసు ప్రదేశాలన్నీ మోటారు బస్సుమీద వెడుతూ చూశాను. బస్సు ప్రయానంలేని రోజుల్లో, ఈ మజిలీలన్నీ మకాములు చేసుకుంటూ, దేవప్రయాగ చేరుతారు. మా జట్టులోని వారొకరు నాకీ ప్రదేశాలన్నీ చూపిస్తే, 'ఉహూ' అంటూ చుచానేగాని నా మానస ఫలకం మీద ఇవేవీ చిత్రితం కాలేదు.
దేవప్రయాగలో ఒక దినం ఆగి, అక్కడ మా కూలీలనూ, గుర్రాలనూ కలుసుకొని మర్నాడు తెల్లవారగట్ల లేచి విశాలబదరీనాథ్ కి జై య్ కైలాసేశ్వర్ స్వామీజీకి జై అని మా ప్రయాణం సాగించాము. తెల్లవారగట్లకే వెలుగు బాగా వచ్చింది. చలిలేనేలేదు. కొద్దికొద్ది దూరాలే ప్రయాణం సాగంచవలసి ఉన్నది. నీరు కాచి త్రాగుచుంటిమి. ఒక సన్యాసి వంట బాగా తెలిసినాయన మా కందరకూ వంట చేస్తున్నాడు. ఆ రాజపుత్ర జమీందారు జట్టుకు వారి వంటమహరాజ్ ఉన్నారు.
