వేదాంతికి ఈ సబబులు నచ్చాయి. దీనికి ఫలితంగా వేదాంతీ, దీనబంధువుడూ బట్టలు మార్చుకున్నారు. (ఈదుస్తులమార్పు పరిస్థితుల మినహాయింపుతో కేవలంహోమరుకాలపు నాయకుల కవచాలమార్పులాగే ఉన్నది) ట్రాస్టానో ఇక తనమనస్సులో పీకుతున్న ఊహను పైకి కక్కబోయాడు.
'ఇక మీరు దర్జాగా చచ్చిపోవచ్చును. చూడండీ! డబ్బు చిక్కులచేత చచ్చిపోతున్నారని మిమ్మల్ని ఇపుడు ఎవ్వరూ అనలేరు'
'ఔను నిజమే ఆ సంగతి నాకే తట్టవలసింది. ఇప్పుడు తెలిసిందా ఇక నేనెందుకు... పోవాలో?' అని నదివైపు చెయ్యి ఊపాడు. 'లేకపోతే మర్యాదకాదు చూడూ!'
'సరీగా మార్టినెజ్ అభిప్రాయమూ అంతే' అనుకున్నాడు ట్రిస్టానో, కాని పైకేమి అనలేదు.
"....నాది చాలా విషాదగాధ విను. నేను అందరికీ కానివాడినైపోయాను. డైరెక్టరు తలుపు బిడాయించి తనసంస్థకు నేను తలవంపులు తెచ్చానని తగిలేశాడు. మంత్రివర్గం నాకు తాహతులు చాలవని తోసేశారు. ఏమీ తోచక నా కూతుర్ని చూడడానికి వెళ్ళాను. ఔను మనకో కూతురు. నాకు నలభైదాటుతాయి కాని ఇరవైయేళ్ళ కూతురున్నాది. అయితే ఆమె వివాహం వల్ల పుట్టింది కాదు. వేదాంతులకు సామాన్య సంఘ నిబంధనలలో నమ్మకం ఉండదు. అయినా ఆమె నాకూతురే. నా పనిలో నేను మునిగిఉండి ఆమెను గూర్చి అట్టే తెలిసికోలేకపోయేవాడిని. నిజానికి రెండేళ్ళనుండి ఆమెను చూడనేలేదు. అంచేత పోనీ, చూదామని వెళ్లాను.....వెళ్తే దానికో మొగుడు!'
'ఏమిటీ? అంత చిన్న తనంలోనే?'
'ఎవడనుకున్నావు వాడు? ఓ మాంసం అమ్ముకునే వేదవ్ మామూలు కసాయి. నాకూతురు మా కుటుంబగౌరవం నాశనం చేసింది. వీడున్నాడే ఈ కసాయివెధవ. నన్నింట్లోకి రాకుండా వెళ్ళగొట్టాడు. వెధవ ఇల్లు! మాంసంకంపు! అప్పుడు నా కూతురు కూడా ఉందికాని తండ్రిని కదా నా పక్షం ఒక్కమాటన్నా అనలేదు....
ఈ తుదిముక్కలు మాత్రం వేదాంతి నిజమైన వేదనతో అన్నాడు. అతని కథ అంతటిలోకి దీనిలోనే రుజుత్వం ధ్వనించింది. ట్రిస్టానో హృదయాన్ని కూడా ఇది కధల్చింది.
'అయ్యో, పాపం!'
'అందువల్ల, చూశావా, మనకి ఆత్మహత్య చేసుకోవడానికి తగిన కారణాలున్నాయి. అంచేతనే నేనీ సుప్రసిద్ధమైన నదిని ఎంచుకున్నాను. దీనిలోంచి నేను సముద్రానికి కొట్టుకుపోవచ్చును. అప్పుడు ప్రజలు నేను చచ్చిపోలేదని, కేవలం 'సముద్రపుమార్పు'తో ఇంకో ఉన్నత అద్భుత జీవితం పొందాననీ తెలుసుకుంటారు.'
ట్రిస్టానో అతన్ని ప్రశంసాదృష్టులతో చూశాడు. కాని తనభాగంపని ముగిసిందనీ, వేదాంతి చెయ్యవలసిన పని మిగిలిందనీ గ్రహించాడు. చనిపోయేవాడు చెప్పదలచినదానికంటే ఎక్కువే చెప్పాడు ఈ వేదాంతి. ఇక వీడ్కోలు చెప్పితే బాగుండును. క్షణం ఆగి ట్రిస్టానో.
'ఇక మీ సెలవు తీసుకుంటున్నాను. బహుశా నేనుకూడా ఒకరోజు మీ వెనకనే నీళ్ళలోకి వచ్చి నాకథ నివేదించుకుంటాను.'
సెలవు అని వేదాంతి నదివైపు ఉపక్రమించాడు.
ఈ వేదాంతి నీళ్ళలో పడేదాకా అక్కడ ఆగాలో లేక చావంటే తనకు సహజమైన భయంచేత చూడడం మానేయాలో ట్రిస్టానో కు నిశ్చయం కాలేదు. వెనక్కి ఒకటి రెండడుగులు వేసి వేదాంతిగారి అమూల్యమైనకోటును ఎగాదిగా చూశాడు. తర్వాత కళ్ళు మూసుకున్నాడు.
కాని వేదాంతి తిరిగివచ్చి గంభీరంగా అన్నాడు.
'చూడూ! షర్టుతో ఎందుకు దిగాలో నాకు బోధపడలేదు. ఎలాగైనా చచ్చినతర్వాత నేను మర్యాదగా కనపడాలి కాదూ? నీ వేస్టుకోటూ. కోటుకూడా ఇచ్చేస్తావా?'
ట్రిస్టానో కొంచెం కళవళపడ్డాడు. కాని అందరూ షర్టుతోనే నీళ్ళలో పడడం మామూలు వేదాంతికి నచ్చజెప్పి లాభంలేదని తోచింది. ఇంతలో తనకు మరోమంచి ఊహ తట్టింది. ఇతని శరీరం బైటికి తీసినప్పుడు (అంచనా లెక్కల ప్రకారం శరీరాలన్నీ దొరికి తీరినట్లు తెలుస్తున్నది) వొంటిమీదనే తనకోటూ, పత్రాలూ ఉంటే ట్రిస్టాన్ మార్టినెజ్ చావు స్థిరపడుతుంది. కటకటాలమీద కోటుదొరకడంకంటే ఇదేమంచిది. అందువల్ల పూర్తిగా బట్టలు మార్చుకోవడానికి అతడు అంగీకరించాడు. మొగాలుకూడా మార్చుకోగలిగితే మరీ సంతోషించి ఉండును. వేదాంతి మొగానికి అంత చెప్పుకోదగ్గ అందం లేకపోయినా కాని ఈ ఉపకారం నదీజలం చేసిపెట్టవచ్చు నని ఆశించాడు. నీళ్ళలో వీడిశవం కుళ్ళిపోయి పొలితిపట్టడానికి వీలులేకుండా అవుతుంది. నది నిండుగా ప్రవహిస్తున్నది కాబట్టి ఆలస్యంగా శవం దొరికి బాగా కుళ్ళడానికి అవకాశం ఉంటుంది.
బట్టలు మారుస్తున్నప్పుడు ట్రిస్టానో కొంచెం జాగ్రత్తపడి తనకోటుజేబులో ఉన్న బంగారు నాణాలు తీసుకున్నాడు. కాదూమరీ! డబ్బును కూడా వేదాంతితో బాటు నీళ్ళలో పారవెయ్యడం అవివేకమే! వేదాంతిమాత్రం నిశ్శబ్దంగా బట్టలు వేసుకుంటున్నవాడల్లా ఇటు తిరిగితే తన వెకిలికళ్ళకి నాణాలు కనబడ్డాయి. వాటివైపు వెర్రిగా చూస్తూ అమాయకంగా అన్నాడు:
'దానిలో కొంత నాకియ్యవలసి ఉంటుంది. అప్పుడు తప్పకుండా ప్రజలు లేమివల్ల నే నిదిచెయ్యలేదని గ్రహిస్తారు.'
ట్రిస్టానోకు ఈ విషయమై కొంత చర్చించాలని తోచింది కాని అప్పుడే తెల్లవారిపోతున్నందున ఒప్పుకున్నాడు.
'తీసుకోండి. ఇవిగో రెండు నెపోలియన్లు.'
'మీ యిష్టం.....రెండో, మూడో...
'సరే.' మూడే తీసుకోండి.'
వేదాంతి తీసుకుని వాటిని నిర్లక్ష్యంగా చూస్తూ అడిగాడు:
'ఏది మంచిజేబు? అంటే.....మళ్ళీ ఇవి పడిపోతే మనం అనుకున్నదంతా పాడైపోతుంది'
'ఏది మంచిజేబు? అంటే.....మళ్ళీ ఇవి పడిపోతే మనం అనుకున్నదంతా పాడైపోతుంది.
'ఎడమప్రక్కను లోపలిజేబు ఉంది. బొత్తాయి కూడా పడుతుంది దానికి.'
'థాంక్స్! ఇక కోటు తొడుక్కుంటాను. ఈ బట్టలు వేస్తే బాగున్నాను కానూ?- ఏదీ ఆ హేటుకూడా!'
'అయ్యో ఇదివ్వడమెందుకండీ? ఇదేం ఉపయోగం మీకు!'
'ఔనౌను నిజమే.....ఇక మీరు కొంచెం దూరంగా నిలబడుతారూ? మళ్ళీ ఆఖరుకు నన్ను లాగేస్తారేమో!'
'లేదు ఖరారు చేస్తున్నా.'
'అయితే సెలవు.'
'సెలవు.'
ట్రిస్టానో కటకటాలు దాటిపోయి వీధినిగడచి అవతలదారిమీద ఆగాడు. ఇంకా పోయి ఉండునుకాని ఏదో చిన్న అనుమానం-నిరాధారమైనదే అనుకోవచ్చు - వెనక్కి నిలిపింది. అబ్బే! వీడు పిచ్చివాడనే కడదాం. కాని మాటనిలబెట్టుకోవలసినవాడే. కాబట్టి ట్రిస్టానో మళ్ళీ కళ్ళుమూసుకుని నీళ్ళలోని చప్పుడుకోసం వేదాంతి తన అప్పులన్నీ తీర్చడం కోసం వేచుకున్నాడు.
అప్పటి తన మనఃస్థితినీ, ఆ రాత్రి చలిగాలినీ బట్టి చూస్తే చాలాసేపు వేచిఉన్నట్లు అనిపించడం సహజమే. కాని నిజంగా అవి కొన్ని క్షణాలు మాత్రమే. ఈ అల్పక్షణాలలోనే ఏదో భయంకరమైన ఊహలు పుడుతున్నాయి. ఏదీ, ఇంకొక్కక్షణం..... పోనీ మరొక్కటి.......ఇంకొక్కటిమాత్రం వెనుకటి అన్నిటికంటే భయంకరమైనది.....ఇక వీలులేదు. దుర్భరం. మరణవేదనను మించిపోతున్నది ఈ నిరీక్షాయాతన! వాడు నీళ్ళలోకి గెంతడం కనబడితే కనబడనీ, భయమైనా కళ్ళు విప్పి తీరాలి.
అప్పుడే కళ్ళు విప్పేశాడా? అక్కడ ఎవ్వరూ లేరు. అయినా తనకేమీ వినిపించడం లేదేం. నీటిహోరువల్ల పడిపోయిన చప్పుడు వినిపించడం లేదేమో ఇక్కడికే ఆదూరంనుండి సన్నని హోరు వినబడుతోంది. మీదకు వెళ్లిచూస్తే? కాని వెళ్ళడానికి ముందు అతడు ఎదురుగుండా వీధివైపు చూశాడు. ఇరవై గజాలుముందు గోడ ప్రక్క నీడలో ఒక నల్లటి రూపం ప్రాకిపోతున్నట్లు కనిపించింది. ఆరూపంలో చాలాభాగం వేదాంతిని, కొంతభాగం తన్నూ ట్రిస్టానో పోల్చుకున్నాడు.
'ఏయ్! ఎక్కడకు పోతున్నావు?' అని అరిచాడు.
వేదాంతి చకితుడైనాడు. నేరంచేసిన పిల్లిలాగు వెంటనే కాలి కందినట్టు దౌడుతీశాడు. ట్రిస్టానో గభీమని అతన్ని వెంటబెట్టాడు. కాని వేదాంతిజేబులో మూడు నెపోలియన్లు పడగానే అతగాడికాళ్ళకు రెక్కలు వచ్చినట్లయింది. వీధి మలుపు తిరిగిపోయి అతడు మాయమైనాడు.
ఇక లాభంలేదని ట్రిస్టానో పరుగుతగ్గించాడు. మలుపు తిరగకుండానే ఆగిపోయి జరిగిందేదో జరిగిందని నిస్పృహ చేసుకున్నాడు. తాను ధరించిన పాతకోటులో వాడి చిరునామా దొరికితే మాత్రం ఏనాటి ఉపయోగం అవుతుందో అతనికి తెలియలేదు.
చివరికి ట్రిస్టానో ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకునే లోపుగా చిరిగిపోయిన పాతకోటూ, అనుమానాస్పదమైన ముఖలక్షణాలు చూసి అతన్ని ఒక తిరుగుబోతుగా కట్టి ఎరస్టుచేశారు.
---౦౦౦---
