మాకు నలుగు ముళ్ళు కర్రల దూరంలో రెండు నీడలు అవుపించినాయి. పరిశీలించి చూచాను మనుషుల ఆకారాలే!
"ఎవరు వాళ్ళు!" అని అడిగాను గొంతులో ధైర్యాన్ని పలికిస్తూ.
"మేమండి ఆచార్లయ్యా!" అన్నాడు అందులో ఒకడు.
తలుపులు బిగించుకుని లోపల కూర్చుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి తలుపు తట్టుతారు. ఎవరు వాళ్ళని అడిగితే నేనేలే తలుపు తియ్యండి అంటారు నేనేలే అన్నంత మాత్రాన వాళ్ళ ముఖం మనకి కన్పించదు. కాని గొంతు మరొకసారి విన్పిస్తుంది. ఎరిగున్న వాళ్ళనే అని ధ్వనిస్తుంది.
దాన్ని బట్టి వాళ్ళని గుర్తిస్తాం. వెళ్ళి తలుపు తీస్తాం.
మేమండి ఆచార్ల య్యా అంటున్న గొంతుని గుర్తించాను. రంగా రావుగారి ఇంటలో పనివాళ్ళు. చేతుల్లో పట్టుడ కర్రలున్నాయి. రంగారావుగారు పంపగా మమ్మల్ని వెతుకుతూ వచ్చారు వాళ్ళు.
వచ్చి చాల సేపు అయిందిట. మాట్లాడుకుంటూ వుండటం చూచి పలకరించటం బాగుండదని దూరంగా నిలబడ్డారు.
"మిస్ మార్లిన్ థాంక్యూ" అన్నాను ఆమె ముఖంలోకి చూస్తూ.
ఆ ముఖంలో కనిపించిన భావావేశం రవ్వంత తగ్గినట్లు అనిపించింది. అప్పటికి తెల్లవారు ఝాము అయింది.
"మిస్ మార్లిన్ ఎంతో బాగుంది కధ" అన్నాను.
"నిజంగా జరిగిన సంగతి కధ ఎలా అవుతుంది?"
"చరిత్ర అవుతుందా?"
"అవుతుందేమో!" అంటూ నవ్వింది మిస్ మార్లిన్.
"ఇప్పుడు టైము ఎంత అయివుంటుంది?" అని అడిగాను. నా చేతికి వాచీఉంది.
"మూడుదాటింది. యీ పాడుపడిన పాటిదిబ్బల మీద చాలాసేపు వున్నాం కదూ!" అని బదులు యిచ్చిందామె.
ఫరవాలేదు. యీమె మళ్ళీ మిస్. మార్లిన్ అయింది అనుకున్నాను.
ఫ్రాన్సులో ఉన్న పిఠాపురం రాణి సీతాదేవి గురించి అడిగి ఆమె చెప్పింది వింటూ మధ్య మధ్య ఆమె చదువు గురించీ, పారా సైకాలజీ మీద రీసెర్చి గురించి చెప్తూవుంటే అర్ధం చేసుకుంటూ నడుస్తున్నాను.
రంగారావుగారి బంగాళాలోకి వచ్చాం. వరండాలో కుర్చీ వేయించుకుని శాలువ కప్పుకుని మా కోసం ఎదురు చూస్తూ కన్పించింది రాజమాత గాయత్రీదేవి. మమ్మల్ని చూస్తూనే ఆమెముఖం వికసించింది.
రంగారావుగారు కొంచెం సేపటిక్రితమే వెళ్ళి నిద్రపోయారు. రాజమాత కుర్చీలోంచి లేచివచ్చి మిస్ మార్లిన్ ని లోపల గదుల్లోకి తీసుకుపోయింది. చేయిపుచ్చుకొని మహాదేవి మల్లమ్మను అంతఃపురంలోకి కమలక్క నడిపిస్తూ ఉండిన దృశ్యం గుర్తొచ్చింది నాకు.
నా గదికి వెళ్ళి సిద్దంగా ఉన్న మజ్జిగ నీళ్ళు పొట్టనిండా దట్టించి పడుకున్నాను. ఇక ఎటువంటి ఆలోచనలూ లేకుండా నిద్రపట్టింది. నాలుగు అయిదు గంటలసేపు గాఢమయిన నిద్రపోయాను. మరొక అరగంటలో మెలుకువ వస్తుందనగా చిన్నకల ఒకటి వచ్చింది.
ఆ కలలో పెళ్ళి జరుగుతోంది మిస్ మార్లిన్ చీరకట్టుకుని బొట్టుపెట్టుకుని చిత్రంగా జడవేసికుని తల వొంచుకుని పెళ్ళి పీటల మీద కూర్చుంది. పెళ్ళిలో బంధువులు అంతా బొబ్బిలివారే! రాజమాత మిస్. మార్లిన్ వెనుకగా నిలబడి వుంది. సువర్ణ భూషితాం ఇమాం కన్యాం అని మంత్రం చదువుతున్నాడు బ్రాహ్మడు రాగాలుతీస్తూ.
అయితే పెళ్ళి కొడుకు పీటమీద ఉన్నవ్యక్తి ముఖం నాకు కన్పించలేదు. ఎందువల్లనో ఆ ఆకారం అలుక్కుపోయి కన్పిస్తోంది. గుర్తించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా మెలుకువ వచ్చింది కళ్ళుతెరిచి చూస్తే ఎదురుగా పనివాడొకడు కన్పించాడు. కాఫీ కప్పుతో వచ్చాడు.
చివాలున లేచి పదినిమిషాల తర్వాత కాఫీ అందుకున్నాను.
స్నానం అదీ అయ్యాక ఆ గదిలోంచి ఆఫీసు గదిలోకి వచ్చాను. నా గదిలో నా కోసం ఎదురుచూస్తూ రంగారావుగారూ, రాజమాతా కన్పించారు.
నేను సరాసరి వెళ్ళి నా కుర్చీలో కూర్చుని ఫోనులో డాక్టర్ని పిలచాను. అవతల ప్రక్కనించి ఆయన "ఏమండీ నేను రావాలా?" అని అడుగుతున్నాడు.
"అక్కర్లేదని చెప్పటానికే పిల్చానండీ! బహుశామత్తు యింజక్షన్లు కూడా యిక అవసరం రాదను కుంటాను" అని బదులు యిచ్చాను.
"కేసులో కొంచెం ప్రోగ్రెస్ కన్పించిందా?"
"పునర్జన్మ కేసుకదండీ! మీ అవుసరం రావచ్చునన్న అనుమానంతో మీ సహాయం అర్ధించాను. ఇహ అటువంటి అవుసరం రాదు. మల్లమ్మలా కలిగే అనుభూతి నించి తనను తాను విడమర్చి మిస్ మార్లిన్ అని తెలుసుకోగల స్థాయిలోకి వచ్చిందామె. మల్లమ్మకీ మిస్. మార్లిన్ కీ స్పష్టమయిన సరిహద్దు రేఖని ఆమె అర్ధం చేసుకుంటోంది. ఆమెకు కలిగే అస్పష్టమయిన ఆలోచనలు యిది వరకటిలా యిప్పుడామెను తికమక పెట్టవనుకుంటాను" అని విడమర్చిచెప్పాను.
ఫోను పెట్టేసి రంగారావుగారి వంక చూచినవ్వాను.
"ఏమిటండీ గొడవ? రాత్రంతా ఏమయిపోయారు?"అని అడిగాడాయన.
జరిగింది యావత్తు వివరించి చెప్పాను. రాజమాత రంగారావు గారూ ఆశ్చర్యపడి పోయినారు. వాళ్ళకి సంతోషం అయింది. అయినా.....
"ఈ జిట్ పాసిబుల్?" అని రంగారావుగారు ఆశ్చర్యంతో అడిగితేనే చెప్పాను.
"రంగారావుగారూ! పేపర్లలో ఎన్ని వార్తలు యిటు వంటివి వింటున్నాము కామండీ! యిది అంతకన్నా విచిత్రమూ కాదు. అసత్యం అసలేకాదు. యీ జీవితమంటే యుగాంతరాల ఆత్మయానంలోని ఒక చిన్న పేలిక మాత్రమే! ఏది ఏమయినా మిస్ మార్లిన్ నించి మిగిలిన కధ అంతా వినేవరకూ నాకు నిద్రపట్టదు" అన్నాను. రంగారావుగారు నవ్వారు.
"విశాఖనించి డాక్టర్లు ఎప్పుడు వస్తారు?" అని అడిగారు రాజమాత గాయత్రీదేవి.