"కాల్ బుక్ చేసి కనుక్కుంటాను అయినా యీకేసు డాక్టర్లచేతికి యివ్వటం నించి విజ్ఞాన శాస్త్రానికి క్రొత్త సంగతులు ఏమయివా తెలుస్తాయేమోకాని మిస్ మార్లిన్ కి రవ్వంతకూడా ప్రయోజనం ఉండదనుకుంటాను." అన్నాను. ఈమాటలలో నిజం ఉన్నదని రంగారావు గారికి అనిపించింది కాబోలు "అవును అవును" అన్నారు. వెంటనే మిస్ మార్లిన్ తల్లిదండ్రులకి కేబుల్ యిద్దామని అడిగాను.
"యీ కేసు విషయంలో ఖర్చు గురించి యింకా అడగవలసిన పనిలేదు. మీ యిష్టం" అన్నారు రాజమాత.
"యింతవరకూ జరిగింది బాగానేఉంది. యికముందు కూడా మిస్ మార్లిన్ ఆ కధని కంటిన్యూ చెయ్యగలదన్న నమ్మకం ఏమిటి?" అని అడిగారు రంగారావుగారు.
"ఆ కధని కంటిన్యూ చెయ్యగలదనటానికి రీజన్సు నేను వివరించి చెప్పలేను. కాని ఆ నమ్మకం నాకుంది" అన్నాను.
"మీకు నమ్మకముంటే సరే!" అన్నాడాయన.
"అంతే కాదు మరొక సంగతి కూడా ఉంది"
"ఏమిటది -?"
"ఆమెకు మళ్ళీ ఫ్రాన్సు వెళ్ళాలన్న ఆలోచన ఉన్నట్టులేదు"
"లేకుండా ఎలా -?"
"ఆమెలో మల్లమ్మ మనోగత మంతా ఉంది కాబట్టి యిక్కడే ఉండాలని కోరుకోవటంలో అసహజం ఏమీలేదు"
"అవునను కోండి. కాని అది ఎలాసాధ్యం" రంగారావుగారు అడుగుతున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర సిద్దంగానే వుంది. యిప్పుడు చెప్పే సమయం కాదు.
రాజమాత వంకచూచాను ఆమె నన్నే చూస్తున్నారు.
నా వాదం వెనుక ఉన్న అర్ధాన్ని వెతుకుతున్నారామె.
"సమర్ధించుకో గలిగిన శక్తి ఉన్నప్పుడు ఏదయినా సాధ్యం కాకుండా ఎలా ఉంటుంది. యీ సృష్టిలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆమె యిక్కడ ఉండి పోవడం అంత అద్భుతం కూడా కానప్పుడు ఎందుకు సాధ్యంకాదు. వెతికే ఓపిక ఉంటే దారులు దొరక్కపోతాయా" అంటూ రాజమాత వంక చూచాను.
అప్పటికి ఆమె నా ఆంతర్యం గ్రహించారు.
"బాబూ! మిస్ మార్లిన్ మల్లమ్మదేవి మరొకజన్మ అయితే ఆమె ఉండాలని కోరుకోవటం కాదు, ఆమెను యిక్కడే ఉండమని నేను అడుగుతాను. అలా అడగటం మన విధికాదంటావా?" అని కొడుకు వంక చూచి అడిగారు రాజమాత. తల్లి అలా అంటున్నప్పుడు ఎదురు చెప్పటం ఎన్నడూ లేదు.
"మా కుటుంబం గౌరవానికి లోటురాకుండా మీరు ఏమయినా చెయ్యండి" అంటూ రంగారావుగారు అక్కడ నించి లేచిపోయారు.
ఆ మాటతో బరువు అంతా నానెత్తినవేసి చేతులు దులుపుకున్నారాయన ఆమెను పంపేద్దామని నేను ఒక మాట అంటే ఆపని చెయ్యటానికి అందరూ సిద్దంగానే వున్నారు కాని నాకు మనస్కరించలేదు.
రాత్రి జరిగిన కధ నిన్న తరువాత రాజమాతకుకూడా నాకు కలిగిన అభిపరయమే కలిగింది ఆమెను యిక్కడే ఉంచాలని.
మా ఇద్దరిదీ ఏకాభిప్రాయం అయిపోవటంతో రంగారావుగారు ఒప్పుకోవటం తప్పనిసరి అయింది. ఖర్చు అవుతుందని కాని మరొకవిధంగాకాని ఆయన వెనుకంజవెయ్యరు. ఆ సంగతి నాకు అనుభవంలో తెలుసు.
కాని, ఆమె పెళ్ళికాని పిల్ల. దూరదేశం నించి వచ్చింది. ఒక దృష్టితో ఆలోచిస్తే మనస్థిమితం సరిగాలేని మనిషి. విద్యావంతురాలు అయినా పరాయిచోట ఎక్కువ కాలం ఉండదగిన మనిషి అని రంగారావుగారికి అనిపించలేదు.
అందునించి ఆమెను పంపివెయ్యాలని ఆయన ఆలోచన!
ఆమె మల్లమ్మదేవి కనుక అయితే ఆమెకు తను యింటిలో స్థానం యివ్వటం మంచిదేనని రాజమాత గాయత్రీదేవి ఆలోచన.
కాని, ఆమెకు ఆ యింటిలో ఎటువంటి స్థానంయివ్వాలి. ఆ యిచ్చిన స్థానాన్ని ఆమె గౌరవ ప్రదంగా నిలబెట్టుకో గలుగుతుందా! లేదా? అని నేను ఆలోచిస్తున్నాను. యీ ప్రశ్నలకు బదులు కొంతకాలం పోయాకకాని దొరకదు.
అంతవరకూ ఆమె యిక్కడ ఉండటం తప్పనిసరి అని నాకు అన్పించింది;. అందుకు అందరూ ఒప్పుకున్నారు అదిచాలు.
"ఆమె యీ వాతావరణంలో ఉండగలదని మీరుకూడా అనుకుంటే.... ...." అన్నాను.
"మిస్ మార్లిన్ మల్లమ్మదేవికి మరొకజన్మ అయితే ఉండగలదు. అది నిజం కానప్పుడు ఆమె యిక్కడనించి వెళ్ళిపోతుంది. అందువల్ల మనం బాధపడేది ఉండదు" అని రాజమాత బదులు చెప్పారు.
"ఉండి పోతుంది. కాని యిక్కడ నాస్థానం ఏమిటి అని ఆమెకు ఎప్పుడయినా అనిపిస్తే... ...." అంటూ ఒకక్రొత్త సమస్యను ఎత్తి విడిచాను.
ఆ మాటకు బదులుయిస్తే రాజమాత ఆంతర్యం బైటపడుతుందని నాకు తెలుసు. అందుకే ఆ సమయానికి తల ఎత్తని సమస్యని ఎత్తి విడిచాను.
"వెలమ వారి యింత ఆడపడుచులా వెలమ వారింటికి వచ్చే కోడళ్ళూ వారి స్థానం వారుభద్రం చేసుకోగలరు. దాని గురించి మరొకరు బెంగ పడటంలో అర్ధంలేదు" అన్నారు రాజమాత గాయత్రీదేవి.
చాలు నాకు కావలసిన మాట ఆమెనోటి వెంట వచ్చింది.
ఒక పనికుర్రాడిని పిలచి మిస్ మార్లిన్ లేచిందేమో చూచి రమ్మన్నాను. వాడు బాణంలా దూసుకుపోయి మరు నిమిషంలో వచ్చాడు.
"లేచారండి చదువుకుంటున్నారు" అన్నాడు. రాజమాతతో ఆమె గదికివెళ్ళాను. కుర్చీలో కూర్చుని ఏదో పుస్తకం చదువుతోంది మిస్ మార్లిన్ ఆమె చేతిలో ఉన్నది తెలుగు పుస్తకమే!
"తెలుగుబాగా చదవగలరా?" అని అడిగాను.
"కొంచెం కొంచెం నడుస్తుంది"