కనుచీకటి పడుతున్నవేళ మల్లమ్మదేవి ఆలయానికి వచ్చింది ఆమె దూరంనించే మరిదిగారు వీణతో పడుతున్న అవస్థను గమనించి నవ్వుకుంది.
పరిచారికలు పళ్ళాలు తీసుకుని ఆలయంలోకి వెళ్ళారు. ఆమె వెంగళరాయుడు దగ్గరకు పోయింది. రత్నమంజీరాల మోత విన్న వెంకటరాయుడు ఆ పాదాలవంక చూచాడు. వచ్చింది వదినగారని తెలిసింది.
వెంగళరాయుడికి ముఖం ఎత్తే ధైర్యం లేకపోయింది.
"మరిదిగారు మాకు కన్పించకూడదనుకున్నారా?" అని పలకరించింది మల్లమ్మ.
ఆ కుటుంబాలలో యిది ఆచార విరుద్దం. పెద్ద కుటుంబంలోని ఆడవాళ్ళు చొరవచేసి మాటలు సాగించటం చెయ్యరు. అందునించి వెంగళరాయుడికి యిది అనూహ్యమయిన సంఘటన.
"వీణ సాధనచేద్దామని...." అన్నాడు తల వొంచుకునే!
"సంగతులు పలుకుతున్నాయా?"
వెంగళరాయుడు తలవంచుకుని నవ్వాడు. తెగిపోయిన తీగను చేతిలో లాగి చూపించాడు. మల్లమ్మదేవి వంగి వీణను చేతిలోకి తీసుకుంది.
ఆమె తీగనులాగి మళ్ళీ బిగించి శృతిచేసింది.
"యిక సాగించండి మీ సాధన" అంది నవ్వుతూ.
"మళ్ళీ తెగుతుందేమో!"
"అవును యీ వీణకుకూడా జగ్గమ్మ పెంకితనమే వచ్చి వుంటుంది అన్నది. జగ్గమ్మ వెంగళరాయుడికి వీణ బహూకరించిన వార్త ఆమెకు చేరింది. వొదినగారికి యీ సంగతి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోతున్నాడు వెంగళరాయడు.
"మరదిగారి మాటలు వినే అదృష్టం మాకు లేదు కాబోలు "అంది వెంగళరాయడు ఆ చొరవకు ఆశ్చర్యంనించి తేరుకోలేదు. మాటలకోసం వెతుకుతున్నాడు.
"అవును జగ్గమ్మే యిచ్చింది కాని యీ విషయం మీకు....." అంటూ అర్దోక్తిలో ఆగి పోయినాడు.
"అవునయ్యా! తెలియకుండా ఎట్లా ఉంటుంది? నా దేశంలోనూ, నా ప్రజలతోనూ జరుగుతున్న ప్రతి కదలికా నాకు తెలియాలి. లేకపోతే నా రాజీ తనానికి అర్ధం ఎలా నిలుస్తుంది?" అన్నదామె.
వెంగళరాయుడు ఆశ్చర్యపడిపోయినాడు. ఆమె తనకు వదినగారే కాక తనకు ఏలిక అన్న విషయం గుర్తుకివచ్చింది.
వీణను ప్రక్కనపెట్టి లేచి నిలబడ్డాడు. తల ఎత్తాడు.
ఆమె చిరునవ్వు, ఆ చిరునవ్వు వెనుక ఉన్న ఠీవి, ఆ ఠీవి ఆమె కిచ్చిన రాణి తనమూ యివన్నీ అతనికి వినమ్ర భావాన్ని కలిగించినాయి.
"మీరు తెల్లమచ్చల నల్ల గుర్రాన్ని కొని దానికి జగ్గు అని పేరు పెట్టటంకూడా మాకు తెలిసింది మరదిగారూ!" అన్నది రాణి మల్లమ్మ.
యిహనించీ బొబ్బిలి రాజ్యంలో చీమ చిటుకుమన్నా ఆమెకు తెలుస్తుందనీ ఆమె పరిపాలనలో బొబ్బిలిరాజ్యం పటిష్టం అవుతుందని అతనికి అర్ధమయింది. యిటువంటి వొదినగారు దొరకటం నిజంగా ఎంత అదృష్టం!?
"వొదినగారూ : మీరు కాలుపెట్టిన యీ చోటు చాల పవిత్రమయింది శౌర్యపరాక్రమాలకు పేరు పొందిన బొబ్బిలి రాజ్యం మేధావులకు కూడా నెలవు అన్న నిజం మీనించి దేశదేశాలకు తెలుస్తుంది" అన్నాడు ఆ మాట అంటూ ఎదురుగాఉన్న వ్యక్తి మరొకరు అయితే రవ్వమీసం దువ్వేవాడు.
"మరిదిగారూ పొగడ్తలు ఆపండి మనం వెంటనే చెయ్యవలసిన పనులు కొన్ని ఉన్నాయి" అన్నది మల్లమ్మదేవి.
"ఆజ్ఞాపించండి" అన్నాడు వెంగళరాయుడు.
"ముందు మన రాజ్యంలోని ప్రతి ఊరూ, ప్రతి యిల్లూ నేను చూడాలి. ప్రతివ్యక్తి నన్ను చూచి ఉండాలి. ప్రతి వ్యక్తినీ నేను చూచి ఉండాలి" అన్నదామె.
వెంగళరాయుడు యీ కోరిక ఎందుకో అర్ధంకాక చూస్తున్నాడు.
"ఇందులో మీరు ఆశ్చర్యపడవలసింది ఏమీలేదు. నాకు తోడు ధర్మారాయడు బాబాయివస్తారు. మీరుకూడా ఉండాలి. ప్రయాణం ఎప్పుడయ్యేదీ నేను మీ అన్నయ్యగారిని అడిగి నిర్ణయించుకుని మీకు తెలియ చేస్తాను.
"అలాగే" అంటూ తన అంగీకారాన్ని తెలియచేశాడు.
"మనల్ని నమ్ముకుని మనకి అధికారాన్ని అప్పగించిన బొబ్బిలి ప్రజల్లో ప్రతి ఒక్కరిగురించి మనకు తెలియాలి. వాళ్ళ కష్టసుఖాలలో మనం భాగస్వాములం కావాలి. కానప్పుడు యీ అధికారానికి అర్ధమే లేదు" అన్నదామె.
"ఒకరోజు ముందుగా నాకు కబురు పంపండి. ప్రయాణంకి అన్ని ఏర్పాట్లు చేస్తాను." వెంగళరాయడు వీలుని చేతిలోకి తీసుకున్నాడు.
అక్కడనించి కదలి ముందుకు పోయిందామె. ఆమెకు యిష్టదైవం అయిన గోపాలస్వామికి తన మ్రొక్కుబడులు చెల్లించుకుంది దైవానికి నమస్కరిస్తూ మనసులో యిలాగని మ్రొక్కుకుంది.
"స్వామీ! నా దేశం, నా ప్రజల యోగక్షేమాలకై జీవితంలో ప్రతిక్షణాన్ని ఖర్చుచెయ్యగల మనోధైర్యం నాకు ప్రసాదించు" అనుకుంటూ చేతులు ముకుళించి శిరసు వంచి నిలిచిందామె. ప్రార్ధనచేస్తోంది.
13
ప్రార్ధనా శ్లోకాల్ని శ్రావ్యమయిన స్వరంతో పాడుతోంది మిస్ మార్లిన్. నా కళ్ళముందు కనపడుతున్న దృశ్యం అదృశ్యం అయింది. ప్రక్కన పాడుతున్న ఆమె మల్లమ్మదేవి కాదని మిస్. మార్లిన్ అన్న తెలివి వచ్చింది. కళ్ళు విప్పి చూచాను. ఆమె పాడుతోంది యింకా.
"మిస్ మార్లిన్!" అని పిల్చాను. ఆమె పలుకలేదు. చేయిపట్టి ఊపాను. ఆమెకు కొంత తెలివివచ్చింది. పాడుతున్న శ్లోకాన్ని సగంలో ఆపి కళ్ళు విప్పి చూచింది. లేచినిలబడి గౌనుకి అంటిన మట్టి దులుపుకుంటోంది.
