మూడు పలకల సీసా ఒకటి చేత్తో పట్టుకొని రామనాథబాబు వచ్చి సీట్లో కూర్చున్నాడు.
"నాయర్! ఏమిటి? అప్పుడే వడ్డనా? ఆ సోడాలూ ఐసూ పట్టుకురా!" అన్నాడు రామనాథబాబు.
"ఆ సీసా చాలా అందంగా వుందే?" అన్నది సీసా కేసి కళ్ళార్పకుండా చూస్తూ వరూధిని.
"ఇందులోది ఇంకా బాగుంటుంది. ఫారెన్ ది మరి!"
"ఛీ! పాడూ!" అంది వరూధిని వాంతి చేసుకోబోతున్నదానిలా ముఖంపెట్టి.
"అవునండీ! ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. దేశవాళీ సరుకు కాదు. విదేశాల్నుంచి వచ్చింది. అక్కడయితే ఆడవాళ్ళుకూడా ఇదే పుచ్చుకుంటారు."
"ఎంతవుతుందీ సీసా?" అడిగాడు వెంకటపతి.
"నూటయాభై."
"నూటయాభై రూపాయలా?" నోరెళ్ళబెట్టాడు వెంకటపతి. "ఆ కాస్త సీసా నూటయాభయ్యా?" దిమ్మరపోయి మళ్ళీ సీసాకేసి చూస్తూ అన్నాడు వెంకటపతి.
రామనాథబాబు రెండు గ్లాసుల్లో పోసి, సోడా అయిసూ కలిపి ఓ గ్లాసు వెంకటపతి ముందు పెట్టాడు.
"నాకు అలవాటు లేదే!" ఇష్టమో అయిష్టమో వెంకటపతి ముఖం చూసి చెప్పడం కష్టమే!
"ఫరవాలేదు. ఏమీ చెయ్యదు. ఫారెన్ ది కదా?"
"మీరు భలేవారండోయ్! మీరు చెడిపోయిందికాక మావార్ని కూడా-?" అంటూ రామనాథబాబు ముఖంలోకి ముద్దుగానో, మురిపెంగానో చూస్తూ ఆగిపోయింది.
"అంటే నేను చెడిపోయినవాడ్ని అన్నమాటేనా?" వరూధిని కళ్ళలోకి చూస్తూ అడిగాడు రామనాథబాబు. ఆయన మాటల్లో చేదుకంటే తీపే ఎక్కువ విన్పించింది.
"ఛ! ఛ! నేను అలా అన్లేదు. అలవాటు లేనిదీ ఆయనగారికి ఎందుకని?" అన్నది వరూధిని.
"కానీయండి వెంకటపతిగారూ! వరూధిని మాటలకేం? ఆడవాళ్ళు అలాగే అంటారు. మొగవాళ్ళు తాగి చెడిపోయారంటారు. తాగకుండా చెడిపోయిన ఆడవాళ్ళు లేరా?" అన్నాడు రామనాథబాబు ఆ మాటలు ఆయన భార్యను ఉద్దేశించి అన్నాడనుకొన్నాడు.'అవును పాపం, రామనాథబాబు కేం తక్కువ? అట్లాంటి భర్తతో కాపురం చేయడానికి ఇష్టంలేని ఆడది ఎంత ఛండాలురాలై వుండాలి?'
"ఏమిటాలోచిస్తున్నారూ? ఊ!" రామనాథబాబు వెంకటపతి చేతిలోవున్న గ్లాసుకు గ్లాసు ఆనించి "టు యువర్ హెల్త్" అని గ్లాసు పెదవుల కందించాడు.
"అది మీ ఆరోగ్యం కోసమేనట!" విరగబడి నవ్వుతూ అంది వరూధిని.
వెంకటపతికి రామనాథబాబు టోస్ట్ ప్రొపోజ్ చేయడంలోని ఆనందంగానీ, భార్య నవ్వుకు అర్ధంగానే బోధపడలేదు. రామనాథబాబు రెండు గుటకలేసి గ్లాసు కిందపెట్టి వెంకటపతికేసి చూశాడు. వెంకటపతి నోటిదగ్గిర పెట్టాల్సిన గ్లాసు బల్లమీద పెట్టాడు.
"ఒకసారి తాగితే అలవాటు అవుతుందంటారు. ఎందుకంటా నాకిది? మీలాంటివాళ్ళు -" వెంకటపతి మాటకు అడ్డొచ్చి రామనాథబాబు "గ్లాసు కలిపి, టోస్టు చెప్పాక అది ఖాళీ చెయ్యకుండా వుండకూడదు. ఈరోజు ముఖ్య అతిథి మీరే. మీరు తీసుకోకపోతే నాకు మనకు బాగుండదు. నేనూ మానెయ్యాల్సి వుంటుంది. ఈ సీసాలోది పారేయమంటారా? నాయర్! ఇలారా" అన్నాడు. గ్లాసు ఎత్తి పారబోయటానికి సిద్దం అయ్యాడు.
"పారబోస్తారా? సీసా నూటయాభైకి కొని? అంత ఖరీదయింది?" వెంకటపతి గాబరా పడిపోతూ అన్నాడు.
"ఎంతయితేనేమండీ వెంకటపతిగారూ! మీరు వద్దంటే విసిరిపుచ్చుకొని సైడ్ కాలవలో పారబోస్తాను." రెండు గుతకలకే రామనాథబాబు ఉద్రేకంలో పడినట్లు మాట్లాడసాగాడు.
"పోనియ్! పాపం వారంతగా అంటున్నారుగా, ఆ గ్లాసన్నా తీసుకోండి." రాజీ మార్గంగా భర్తను ప్రాధేయపడుతూ అన్నది వరూధిని.
గ్లాసు ఎత్తి పెదవుల దగ్గర పెడుతుంటే వెంకటపతికి చేతులు వణికాయి. ముక్కుకు వాసన ఘాటుగా తగిలింది. శ్వాస బిగించి గ్లాసు సగం ఖాళీచేసి కింద పెట్టాడు. గొంతు తిమ్మిరి తిమ్మిరి అయిపోయింది. చేదు విషం. అయినా, అమృతం కూడా ఇవ్వలేని ఏదో ఆనందం కలిగింది వెంకటపతికి. రామనాథబాబు ఉషారుగా బల్లమీద చిటికలు వేశాడు.
కోడి వేపుడు ప్లేటు వెంకటపతి ముందుకు తోసి "ఈ ముక్క తినండి!" అన్నాడు రామనాథబాబు తను ఓ జాయింట్ తీసుకుని పళ్ళ కింద పెట్టికొరకటం మొదలుపెట్టాడు.
మరో పది నిమిషాల్లో వెంకటపతి కోడివేపుడు ప్లేటూ, గ్లాసూ ఖాళీ చేశాడు. రామనాథ బాబు గ్లాసు సగం మాత్రమే ఖాళీ అయింది.
"అబ్బే ఏం లేదు. మా మా....మ్మూలుగానే ఉంది. మీ....మ్మీరు ఇంకా అట్టాగే వుంచారేం?" అన్నాడు.
రామనాథబాబు తన గ్లాసు బలవంతాన ఖాళీ చేశాడు. సీసా మూత తీసి రెండు గ్లాసులూ ముందు పెట్టుకొని మళ్ళీ పోశాడు. రామనాథబాబు చేతిలో నుంచి గ్లాసు తీసుకొని సగం తాగేసి, గ్లాసు టేబిల్ మీద పెట్టాడు వెంకటపతి.
భార్యవంక చూసి "నువ్వెందుకే ఇక్కడ!" అన్నాడు వెంకటపతి.
వరూధిని లేచి బయటకు వెళ్ళింది. తోటలోకి వెళ్ళి వెన్నెల్లో కాసేపు తిరిగింది. ఓ గులాబి పువ్వు కోసి తల్లో తురుముకుంది. సన్నజాజి పందిరికిందా, నైట్ క్వీన్ గుబురుదగ్గర పచార్లు చేసింది. అర్ధగంట గడిచాక లోపలకు వచ్చింది.
"ఇంకా అసలా? ఇంకా ఎంత తాగుతారేంటి?" అంటూ వరూధిని డైనింగ్ రూంలోకి వచ్చింది.
అప్పటికి వెంకటపతి ముఖం నిగనిగలాడి పోతూంది. కళ్ళు ఎరుపులు తిరిగాయి. టేబిల్ మీద ఖాళీసీసా వుంది. ఎదురుగా నిలబడ్డ వరూధిని వెంకటపతికి కొత్తగానూ వింతగానూ కన్పించింది. ఆమె అన్నమాటలేవో అస్పష్టంగా వినబడ్డాయి. రామనాథబాబు లేచి పడకగదిలోకి వెళ్ళి మరోసీసాతెచ్చి మూత తీశాడు.
"ఆ సీసా ఈ సీసా మాది - సీసా మాదిరిగా-సీసాలేదే?" అన్నాడు వెంకటపతి.
"సీసా మారిందిలే లోపల్ది ఇంకా మంచిది. నిఖార్సయిందే!" అంటూ రామనాథబాబు వెంకటపతి గ్లాసు నింపుతూ వొలక పోశాడు.
వరూధిని సీసా రామనాథబాబు చేతుల్లో తీసుకొని భర్త గ్లాసు సగానికి పైగా నింపింది.
"అంత స్ట్రాంగా! పడిపోతాడు, పడిపోతాడు" అన్నాడు రామనాథబాబు.
"ఏం! ఏంపడ్ను! చూ-చూడు" అంటూ వెంకటపతి సోడా కలపకుండానే అమాంతం గ్లాసు ఎత్తి తాగేశాడు. ఖాళీగ్లాసు టేబిల్ మీద పెట్టబోతూ కింద వదిలేశాడు. కింద పడ్డ గ్లాసును వంగి తీయబోతూ, కుర్చీమీదనుంచి తూలి, డైనింగ్ టేబిల్ కింద పడ్తాడు వెంకటపతి. రామనాథబాబు నాయర్నుకేక వేశాడు. నాయరు వచ్చాడు. నయరూ రామనాథబాబూ ఇద్దరూ కలిసి వెంకటపతిని లేవదీసి మళ్ళీ కుర్చీలో కూర్చోపెడుతుండగా బొళుక్కున నాయర్ మీదా, రామనాథబాబు చొక్కా, చేతులమీదా కక్కేశాడు.
నాయర్ బకెట్ తో నీళ్ళు తెస్తానని వంటగదిలోకి వెళ్ళాడు.
"ఛీ! ఛీ! ఏం మనిషి?" అన్నది వరూధిని ముక్కుకి పవిఁట అడ్డం పెట్టుకొని. కుర్చీలోనుంచి వెంకటపతి మళ్ళీ జారి కిందకు తూలాడు.
"ఇహ లాభంలేదు. మనిషి ఈ ప్రపంచంలో లేడు ఆ గదిలో పడుకో పెడ్తే సరి! రా! వరూధినీ!" అంటూ రామనాథబాబు వరూధిని చెయ్యిపట్టుకున్నాడు.
"ఇక్కడెందుకూ న్యూసెన్సు?" అంది వరూధిని, రామనాథబాబు మీదగా వంగి, కిందపడ్డ భర్త ముఖంలోకి చూస్తూ.
"అయితే ఏం చేద్దాం?" అడిగాడు రామనాథబాబు.
"కార్లోవేసి ఇంట్లో పారేసిరండి!" అంది ముక్తసరిగా వరూధిని.
నాయరూ, డ్రైవరూ వచ్చి వెంకటపతిని భుజాలమీద వేసుకొని కార్లోకి చేర్చారు. వెనక సీట్లో పడుకోబెట్టి నాయర్ వెళ్ళి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. డ్రైవర్ కారు స్టార్టు చేశాడు.
"నాయర్! అమ్మగారొచ్చేదాకా అక్కడే వుండు. వాళ్ళను దించి నువ్వొచ్చేయ్!"డ్రైవర్ ను చూసి అన్నాడు రామనాథబాబు. త్రాగిన మైకంలో వళ్ళు తెలియక పడివున్న వెంకటపతిని సాగనంపి రామనాథబాబు తిరిగి ఇంట్లోకి వచ్చాడు.

