Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 52


                  
    
    "ఏవండీ! మీరిక్కడ వుండి చేస్తున్న పని ఇదా?" ని అడిగాను.
    "నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారు? నేనిక్కడున్నానని నీకెవరు చెప్పారు?".
    "మీరే చెప్పారు. ఉదయం నుండి కాల్ షీట్ జరుగుతోంది. ఒక్కసారి అక్కడున్న వాళ్ళకి ముఖమయినా చూపించకుంటే బాగుంటుందా? పగలంతా పనిచేసి రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత తాగకూడదూ? పట్టపగలు ఎవరండీ మీకిచ్చారు?" అనడిగాను.
    "అబ్బ! అరవకు సరోజా! ఇంటికి పోదాంపద. రేపు ఈ పాట పూర్తి చేస్తాలే" అన్నారు.
    "నేను రానండి. ఈ రోజే సంగతి తేల్చుకొని, మీకీ విధంగా మహోపకారం చేస్తున్న ఆ పుణ్యాత్ముడ్ని చూస్తేకానీ ఇక్కడ్నుంచి కదలను" అని మొండికేశాను.
    ఇంతలో ప్రొడ్యూసర్ వచ్చారు.
    "నమస్కారమండీ!" అన్నాను.
    ఆయన నాకు బాగా తెలుసు. బోర్డ్ తీసేద్దామా? అనుకొనే స్థితిలో వుండిన ఆ కంపెనీ, శ్రీశ్రీగారి ధర్మమా అని మళ్ళీ బతికింది.
    "నమస్కారం బాగున్నావా అమ్మాయీ?" అనడిగారు.
    "శ్రీశ్రీగారు ఇలాంటిపనులు చేస్తూంటే మా బాగుకేం లోటు సార్?" అన్నాను.
    అతను వెంటనే మాట మార్చేసి, "ఏవండీ శ్రీశ్రీగారూ! పాట పూర్తి చేసేస్తారా? మీకు బ్రహ్మాండమయిన విస్కీ ప్రజంట్ చేస్తాను. ఈ పాటకి మీకిచ్చే పారితోషికం ఇదే" అన్నారు.
    ఆ మాట అనేసరికి, నాకు అరికాలిమంట నెత్తికెక్కింది. ఎంత ప్రయత్నించినా నన్ను నేను నిలదొక్కుకోలేకపోయాను.
    వెంటనే ఆ ప్రొడ్యూసర్ని చూసి - "అలా చెప్పండి ఇదంతా మీరు కట్టుకున్న పుణ్యమేనన్న మాట. ఇంకా ఎవరిదో అనుకున్నాను. చూడండి. సార్! బాటిల్ ఇచ్చి శ్రీశ్రీగారి చేత ఇంతకాలం చాలామంది పాటలు రాయించుకున్నారని విన్నాను. నాకు తెలీదు. కానీ ఆ మాట నిజమేనని ఇప్పుడు మీరు స్వయంగా రుజువు చేశారు.
    వారికి భార్యా పిల్లా వున్నారన్న విషయం మీకు తెలీదా? పాట రాయించుకొని సీసా చేతికిస్తే వాళ్ళనెలా పోషిస్తారనుకున్నారు? ఇవ్వదలచుకున్నది  అయిదు రూపాయలైనా ఫరవాలేదు, క్యాష్ గా ఇవ్వండి. కానీ సీసా ఇచ్చి పాట రాయించుకొనే వ్యాపారం కొంపకూలుస్తుందే కానీ నిలబెట్టదు.
    నిజానికి శ్రీశ్రీగారు చాలా మంచి వారని ఇప్పుడు ఎలుగెత్తి చాటుతాను. వారిని చెడగొడుతున్న....ఈ తాగుడుని అలవాటుకింద మార్చి, దానికి లొంగిపోయేలా చేస్తున్నది......శ్రీశ్రీ తాగుబోతన్న పేరుని చెక్కుచెదరకుండా కాపాడుతున్నది.....మీ వంటి డబ్బుగల గొప్పవాళ్ళే కానీ మరెవ్వరూ కారు" అని కసితీరా అనేసి, "రండి పోదాం" అని శ్రీశ్రీగారిని వారి స్వంత కారులో కూర్చోపెట్టాను.
    "నేను గంటలో వచ్చేస్తాను, భయపడక"ని మా అమ్మతో చెప్పి, మేము వచ్చిన కారులోనే మా అమ్మని యింటికి పంపించేశాను.
    శ్రీశ్రీగారు నన్ను కారులో కూర్చోమన్నారు. కానీ నేను కారు ఎక్కలేదు. ముందు నడుస్తున్నాను. నా వెనకాల కారు వస్తోంది.
    అలాగే నడిచాను కానీ, కారు మాత్రం ఎక్కలేదు. నన్ను వదలి శ్రీశ్రీగారు కూడా వెళ్ళలేదు.
    చీకటి పడిపోయింది. ఇంటికి చేరుకొనేసరికి ఏడున్నర అయ్యింది. శ్రీశ్రీగారి మత్తుకూడా బాగా వదిలిపోయింది.
    మా అమ్మ గుమ్మంలోనే నా కోసం ఎదురుచూస్తోంది. వెంటనే శ్రీశ్రీగారు నన్ను చూసి, "ఏమిటి సరోజా! నీ పట్టుదల? కంపెనీలో అంత గొడవ చేశావు. నా పరువేం కాను? రేపు మళ్ళీ నన్ను పాటకి పిలుస్తారా? నీ గురించి వాళ్ళు ఏమనుకుంటారు? ఆడదానివి కదా, అపార్ధం చేసుకోరూ? ఇక నన్ను పిలవరు. ఈ పాటతో సరి" అన్నారు.
    "పిలవకపోతే పోనీండి. వాళ్ళకి సీసా మిగులు. మీకు ఆరోగ్యం మిగులు. నా సంగతంటారా? ముందే చెప్పానుగా, మీ విషయంలో నేను అన్నింటికీ తెగించానని. ఇక పాటల సంగతా? అలాంటి కంపెనీలో రాసినా ఒకటే - రాయకపోయినా ఒకటే.
    చూడండి. మీ విషయంలో కొంచెం చొరవ తీసుకొని ప్రవర్తిస్తున్న మాట నిజమే. కానీ వేరే దారిలేదు. చూస్తూ వుండలేకపోతున్నాను. క్షమించాలి. మిమ్మల్ని తాగొద్దని అనలేదు. పాట రాసి, డబ్బు తీసుకోండి ఆ డబ్బుతో మీరే కొనుక్కొని చక్కగా రాత్రి యింట్లో తాగండి. అంతేగానీ పట్ట పగలు కంపెనీలో తాగితే, మీరు తగారనే అంటారు. కానీ, మీ చేత వాళ్ళే తాగించారని ఛస్తే అనరు. నేను కళ్ళారా చూశాను కనుక తెలిసింది.
    అక్కడ డబ్బింగులతో ఊపిరాడడం లేదు. మధ్యలో స్ట్రయిట్ సాంగ్స్ రాయడం మంచిదే. కాదనలేదు. కానీ మీరిలాగే వుంటాను. తాగుతాను అంటే, నేను నిజంగా మీ దగ్గర పనిచెయ్యనండి.
    ఇదంతా చాలక మీ ఆవిడ గొడవ వేరే! ఉదయం నుండి మనిద్దరం కాల్ షీట్ లోనే వున్నామని అనుకుంటురావిడ. ఈ గొడవలన్నీ ఆవిడకేం తెలుసు? అంత కావాలనుకున్న మనిషయితే మీ మంచి చెడ్డలు చూసుకోవచ్చుగా" - అని వాగేశాను.
    "అనదలచుకున్నదంతా అనేశావా! ఇంకా ఏమైనా వుందా? ఎందుకంత కోపం సరోజా! సరే - ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు చెప్పు నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను. పని మానేస్తానని మాత్రం అనకు" అన్నారాయన.
    "నేను చెప్పడం ఏమిటండీ. చేతినిండా పనిపెట్టుకొని ఏంచెయ్యాలో మీకు తెలీదా? నన్నడుగుతారేమిటి?".
    "సరే నిన్నడగను. నేనే చెప్తాలే. ఈ రోజు నుండి కంపెనీల్లో మాత్రమే కాదు. పై చోట్ల కూడా ఎక్కడా త్రాగను. ప్రామిస్ చేస్తున్నా సరేనా?".
    "అలాగని రాసివ్వండి"
    ఆ మాటకి వారికెంత చిరాకేసిందో చెప్పడానికి లేదు.
    "ఇదిగో చూడు సరోజా! నాకు ఈ రాత కోతలమీద అసలు నమ్మకం లేదు. శ్రీశ్రీ మాటంటే మాటే. అది ఒక అగ్రిమెంట్ తో సమానం. నా మీద నమ్మకం వుంటే నమ్ము లేకుంటే పో. నీ ఇష్టం" అన్నారు.
    "సరే నమ్ముతాను. కానీ మరోమాట కూడా ఇవ్వాలి".
    "ఏమిటి చెప్పు".
    "మీరు పాటలు రాయడానికి ఏం కంపెనీకి వెళ్ళినా సరే ఆ కంపెనీ అడ్రస్ నాకు ఇవ్వాలి. పాట రాయడానికి వెళ్ళేముందు డబ్బింగ్ కాల్ షీట్ జరుగుతూ వుంటే మాత్రం, ఒకసారొచ్చి మీ ముఖం చూపించి వెళ్ళాలి".
    "సరే. నీ కండిషన్స్ అంతేనా? ఇంకా ఉన్నాయా? అయినా నువ్వేమిటి నన్నిలా జలగలా పట్టుకొని పీడిస్తున్నావు".
    "ఏఁమీ కంత కష్టంగా వుందా? మరి నేనంత ముద్దుగా పెరిగానో"
    "చెప్తాను విను మా నాన్న నా నోటంట 'అమ్మా' అనే మాట రానివ్వకుండా అతి గారాబంగా పెంచాడు. తల్లి లేదన్న మాటేకానీ తల్లీ తండ్రీ తానే అయి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. నాకు పద్దెనిమిదేళ్ళు వచ్చేదాకా సిగరెట్ కాల్చడం తెలీదు. నేను ఇంటర్మీడియేట్ పాసయినందుకు బహుమతిగా మా నాన్నే స్వయంగా నా చేత సిగరెట్ కాల్పించాడు.
    తర్వాత అనేక రకల సిగరెట్టుకాల్చినా, అప్పటికీ ఇప్పటికీ సిజర్సంటేనే నాకు ఇష్టం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని బట్టే నేనూ మా నాన్న ఎలా వుండేవాళ్ళమో, మా అనుబంధం ఎటువంటిదో ఆలోచించు. అవకాశం దొరికినప్పుడల్లా నా జీవిత విశేషాలు నీకు చెపుతూ వుండాలి" - అన్నారు.
    "ఏవండీ మీకు మంచిపేరు వుంది కానీ, డబ్బు విషయంలో మీరు చాలా కష్టాలుపడ్డారని ఒక వదంతి కూడా వుందికదా? అది ఎంత వరకు నిజమండీ" నడిగేను.
    "కొంతవరకూ నిజమే అనుకో! 1910 నుండి 30 వరకూ నేను అఖండ ఐశ్వర్యం అనుభవించాను సరోజా! మా ఇంటి పునాహ్డులు తీస్తున్నప్పుడు బంగారు బిందె దొరికిందని మా నాన్న అన్నాడు. అప్పుడు మా అమ్మ కూడా వుందిట. ఏన్నార్దం అప్పుడే మా అమ్మ చనిపోయింది.
    నాకు అన్నలూ, అక్కలూ, తమ్ముళ్ళూ, చెల్లెళ్ళూ ఎవ్వరూ లేరు. నా వొంటినిండా బంగారు నగలేనట. నా పసితనమంతా అష్టయిశ్వర్యాలతో గడచింది.
    మా నాన్న పేకాటలో మా ఆస్తి అంతా కరిగించేశాడు. 1930 నుండి 50 వరకూ భయంకర దారిద్ర్యం పీడించింది. అదంతా పెద్ద కథ. చెప్పానుగా - తాపీగా చెప్పుకుందాం. నేను స్వేచ్చాజీవిని. నువ్వొచ్చి అధుపుల్లోపెట్టి హడలుగొట్టేస్తున్నావు" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS