"ఏంటీ ఆశ్చర్యంగా చూస్తున్నావా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా. అమాంతం నిన్నెత్తుకొని, ఈ బెడ్ మీద వేసి, నీ పక్కన చేరి, నిన్ను గట్టిగా నా గుండెలకు హత్తుకొని ఏమేమో చేయాలనేంత....
"ప్లీజ్ ప్రభాత్....అలాంటి మాటలొద్దు...." అంది ఎందుకో ఆ సమయంలో, ఆ మాటలను ఎంటర్ టెయిన్ చేయలేకపోతోంది.
"అదేంటి.....వయసులో వున్నాం...అందులో పెళ్ళి చేసుకోవాలను కుంటున్నా ...ఇప్పుడు రొమాన్స్ గురించి మాట్లాడుకోక..... వైరాగ్యం టాపిక్ తీసుకోమంటావా?"
"ముందు ఇక్కడ్నుంచి వెళ్దాం పదండీ...." అంది ఎందుకో ఆ సిట్యుయేషన్ ఎంబర్రాసింగ్ గా వుంది.
ప్రభాత్ ధోరణి అపసవ్యంగా అనిపించింది.
"ప్రనూ...ఈ సమయం కోసం నేను ఎంతగా ఎదురుచూసావో తెలుసా... నా ఒంటరితనం. నీ సాన్నిహిత్యంలో మరిచిపోవాలని. నీ కౌగిలిలో నన్ను నేను మరిచిపోవాలని.... బిలీవ్ మీ ప్రనూ....ప్లీజ్....బిలీవ్ మీ ప్లీజ్... ఐ లవ్ యు..." అంటూ వెనకనుంచి భుజాల కిందుగా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు హత్తుకున్నాడు.
ఒక్కసారిగా భీతహరిణి అయింది.
చిగురుటాకులా వణికింది.
వేటగాడు బాణాన్ని చూసి పరుగుతీసిన లేడిలా శరీరం బెదిరి, మనస్సు చెదిరి... ఒక్క ఉదుటున అక్కడ్నుంచి ముందుకు కదిలింది. ప్రభాత్ అన్ బ్యాలెన్స్ అయి, కింద పడబోయి నిలదొక్కుకున్నాడు.
"అదేంటి ప్రనూ...నేనంటే ఇష్టం లేదా?"
"వుంది కానీ, ఆ యిష్టాన్ని, పెళ్ళికి ముందే శరీరం అర్పించడం ద్వారా వ్యక్తం చేయడం ఇష్టం లేదు.
"అంటే మనమనస్సులు కలిసినా, శరీరం కలిస్తే తప్పంటావు?"
శరీరాలు కలవకపోయినా, మన మనసులో ప్రేమ పెళ్ళయ్యే వరకూ వుండాలంటాను."
"కానీ, నేనిప్పుడు నీకుదూరంగా వుండలేకపోతున్నాను. ప్లీజ్ ఈ ఒక్కోసారి..." అంటూ ప్రనూష దగ్గరికి వచ్చి దగ్గరికి లాక్కోబోయాడు.
"ప్లీజ్ ప్రభాత్ మన మీద మనకు వున్న నమ్మకాలు వమ్ముకావు" కాకూడదు.
"నువ్వు నా భార్యవే..."
"కానీ.... ఇంకా కాలేదుగా..."
"నా మీద నమ్మకం లేదా?"
"నమ్మకం కాదూ ఇష్టం లేని కలయిక" వేరు.... పెళ్ళయ్యాక....నన్ను నేను పూర్తిగా మీకు అర్పించుకోవడం వేరు...."
"నన్ను డిసప్పాయింట్ చేస్తావా?"
"నన్ను అర్ధం చేసుకోమంటున్నాను" అంది స్థిరంగా.
"ప్రనూ...ఎందుకు చెబుతున్నావో అర్ధం చేసుకో.....ఈ కలయిక మన పెళ్ళికి పునాది అనుకో పెళ్ళయ్యాక ఈ కలయికవల్ల నేను నీకు కృతజ్ఞుడిగా వుంటాను."
"ప్లీజ్ నన్ను బలవంత పెట్టొద్దు.....మన మధ్యవున్న ప్రేమ "ఆకర్షణ" మాత్రమే అన్న నా భ్రమకు ప్రాణంపోసి, భ్రమను వాస్తవంగా చేయొద్దు."
"ప్లీజ్.....ప్రనూ..." అంటూ ప్రనూష దగ్గరికి వచ్చి....దగ్గరగా తీసుకున్నాడు.
ప్రనూష పెనుగులాడసాగింది.
ప్రభాత్ ప్రనూషను మంచమ్మీదికి తోసిపాడు.
ఆమె మీద సింహంలా లంఘించబోయాడు.
అప్పటికే ప్రనూష నుదిటి బొట్టు చెదిరింది.
ఆ పెనుగులాటలో బ్లౌజ్ కొద్దిగా చిరిగింది.
బలంగా ప్రభాత్ ను నెట్టేసి, పడగ్గదిలో నుంచి బయటకు పరుగెత్తింది.
ఏడుపు తన్నుకొస్తోంది ప్రనూషకు.
పడగ్గదిలో నుంచి పెద్ద శబ్దం భయంగా లోపలికి అడుగుపెట్టింది.
ప్రభాత్ తన చేతిని డ్రెస్సింగ్ మిర్రర్ కేసి కొట్టుకుంటున్నాడు.
"ప్రభాత్ గారూ.... ఏమిటిది....కంగారుగా అడిగింది అతడ్ని ఆ ప్రయత్నం నుంచి వారింపచేయడానికి ప్రయత్నిస్తూ "నాకీ పనిష్మెంట్ కావాల్సిందే ప్రనూషా.... నేను ఫూల్ ని.
ఇడియట్ ని. డర్టీ ఫెలోని ఏదో నేను మనసుపడ్డానని....ఈ ఒంటరితనం భరించలేక... టెంప్ట్ య్యాను నిన్ను బాధపెట్టిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే." అంటూ రెండు చేతుల్లో మొహం పెట్టుకున్నాడు. అప్పటివరకూ అతని మీద వున్న కోపం ఎగిరిపోయింది. "పోనీలెండి" అంది ఓదారుస్తున్నట్టుగా.
"లేదు ప్రనూషా, మీకు నా మీద కోపం వచ్చింది. నేన్నీకు విలన్ లా కనిపిస్తున్నాను. నన్ను నువ్వు జీవితంలో క్షమించవు. నాకు తెలుసు. నా పాపానికి నిష్కృతి లేదు...." అంటూ తలని గోడకేసి బాదుకోసాగాడు.
"ప్లీజ్.....వూర్కోండి.....మీమీద నాకేం కోపం లేదు." "ప్రామిస్..."
"ప్రామిస్...." అంది ప్రనూష. "థాంక్యూ థాంక్యూ ప్రనూషా. ఇంకెప్పుడూ నీకు బాధ కలిగే పన్జేయను..." అన్నాడు.
* * *
"నేను ఇంటికి వెళ్తాను. అనీజీగా వుంది. జ్వరం వచ్చినట్టుంది" అంది ప్రనూష.
"అప్పుడే ఇంటికి వెళ్తావా?"
"ప్లీజ్..." అంది.
"సరే" అని ముభావంగా కారులో తన ఇంటికి కాస్త దూరంలో డ్రాప్ చేసి వెళ్ళాడు.
తను ప్రభాత్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు. పాత మేనేజర్ వేదా చలం స్కూటర్ ప్రభాత్ ఇంట్లోకి వెళ్ళింది. ఆ స్కూటర్ మీద వున్నది వేదాచలం.
వేదాచలానికి, ప్రభాత్ మధ్య ఏం పరిచయం? ఎలాంటి పరిచయం? ఒకటే టెన్షన్, తలనొప్పి.
* * *
ఇంటికొచ్చాక అనీజీనెస్ పెరిగింది.
మనసు ఎప్పుడైతే బావుండదో ఆటోమేటిగ్గా శరీరం మీద ఏదో ఒక దుష్ఫలితం చూపిస్తుంది. తలుచుకుంటే ప్రభాత్ ప్రవర్తన ఆమెను కృంగదీయసాగింది. అతను కేవలం "తొందరపాటు మాత్రమే పడ్డాడా? తొందరపాటు నటించి..... తన ని ట్రాప్ లోకి లాగాలనుకున్నడా?" ప్రసూనాంబ మాటలు గుర్తొచ్చాయి.
