"ఎటూ చచ్చిపోయేవాడివేగా ........చెట్లు చేమలు దట్టంగా పెరిగి వుంటే మాత్రం నీకేం.....ఎన్ని బండరాళ్ళు వుంటే మాత్రం నీ కెందుకు? కళ్ళు మూసుకుని దూకెయ్" రెట్టించాడు ఫకీర్ బాబా!
"ఊహూ" అన్నట్టు విష్ణు ఒక్క అడుగు వెనక్కు వేశాడు.
చిత్రం...
క్షణం క్రితం వరకూ చనిపోవాలని ఎంతో ఆరాటపడిన తన మనసు ఇప్పుడు అందుకు సహకరించడం లేదు.
"చూశావా......ప్రాణం తీసుకుందామని ఎంతో ఆశతో వచ్చినవాడివి ప్రాణం మీద తీపితో వెనకడుగు వేస్తున్నావు జీవితం అంటే అదే......పుట్టిన ప్రతిజీవి గిట్టక తప్పదు. కానీ ఆ చావు అనేది మన చేతిలో లేదు. ఆ సర్వేశ్వరుని దయ కలిగితే తప్ప నువ్వు కోరుతున్న మృత్యువు నీ దరి చేరదు" వేదాంతిలా చెప్పాడు ఫకీర్ బాబా.
"స్వామీ........జీవితం మీద విరక్తితో తనువును చాలించాలనుకోవడం తప్పంటారా?"
"తప్పేనయనా......బలవస్మరణం దుఃఖ హేతువు. నీలో ఇంక ఆశలు, కోరికలు చావలేదు. అవి తీరకుండా చనిపోవాలను కోవడం కేవలం నీ భ్రమ"
"నాకు ఎలాంటి ఆశలూ, ........కోరికలూ లేవు స్వామీ"
"నువ్వు అంటున్నది పచ్చి అబద్దం. నీ వాళ్ళు ఎవరూ లేరనే విషాదంలో నువ్వు మునిగి వున్నావు. ఈ ప్రపంచం వైపు ఒకసారి నీ దృష్టి సారించి చూడు. ఎందరో తల్లులు, అక్కచెల్లెళ్ళు కనిపిస్తారు. వళ్ళంతా నీ ఆత్మ బంధువులు కాదా? ఆలోచించు......ఆ పరమాత్ముడు మనకు మానవ జన్మ యిచ్చింది సార్ధకం చేసుకోవడానికి తప్ప స్వార్ధంతో మన చావడానికి కాదు......
"నీవల్ల పదిమందికి మేలు జరగాలి. నావాళ్ళు అనే మొహం నుంచి బయటపడి నీకు ఉత్తమైన మానవ జన్మను ప్రసాదించినా దేవదేవుని ఆజ్ఞను శిరసావహించు, కర్తవ్యం నీకే బోధపడుతుంది. ఆశలు లేని మనిషి ఉండడు. కోరికలు లేనివాడు కనిపించడు.......నీకు నువ్వు ఆత్మ ద్రోహం చేసుకుంటున్నావే తప్ప నీలోనూ ఆశలు, కోరికలు ఇంకిపోలేదు........"
"లేదు స్వామీ........"
"చనిపోవాలనుకోవడం కోరిక కాదంటావా? ఆ చనిపోవడంలో కూడా శరీరానికి ఏ బాధ లేకుండా సుఖంగా చనిపోవాలనుకోవడం కూడా ఆశే......కాదంటావా చెప్పు...."
అయన వాగ్ధాటికి విష్ణు సంమోహితుడైనట్టు పెదవి విప్పలేక పోయాడు. తన జీవితానికి చరమాంకం చావు ఒక్కటే నని నిర్ణయించుకొన్న తన మనసు ఇప్పుడు అందుకు ఉవ్విళ్ళురడం లేదు.
ఏదో చేయాలని......ఏదో సాధించాలనే తపన........ఏమిటో అది? విష్ణు పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు.
విష్ణు ........నా అవసానదశలో కంటపడిన నువ్వు అదృష్టవంతుడివి. ఆ విధాత ఈ సమయంలో నిన్ను నా దగ్గరకు పంపినట్టు భావిస్తున్నాను. నీకు ఇంకా చనిపోవాలనే వుంటే కళ్ళు మూసుకుని దూకెయ్....అందువలన ఏ ఫలం సిద్దిస్తుందో నేను చెప్పలేను.
"అలా కాదు..........నాలో ఇంకా జీవితేచ్చ మిగిలి వున్నది.......నా శేష జీవితం అముష్మిక చింతనతో పరులకు ఉపయోగపడే సన్మార్గంలో పయనించాలని ఉందంటావా ......నన్ను అనుసరించి......నా మార్గంలో అడుగు పెడితే మాత్రం కైవల్యం సిద్దిస్తుందని మాత్రం చెప్పగలను, నువ్వే అలోచించి నిర్ణయం తీసుకో" అని చెప్పి ఫకీర్ బాబా వెనుదిరిగాడు.
అతని మాటలకు విష్ణు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు.
ఇప్పుడు తను ఏం చేయాలి?
ప్రాణాలను తీసుకోవదమా.......ఫకీర్ బాబాను అనుసరించాడమా?
తక్కువ వయసులోనే ఎన్నో ఆటుపోటులను చవి చూసి విచలిత మైపోయింది తన మనసు. ఇప్పుడు ఈ మహనీయుని రాకతో విచిత్రంగా స్పందిస్తుంది.
అతని మార్గాన్ని అనుసరించినంత మాత్రానా తను ప్రత్యేకంగా నష్టపోయేది ఏమీ లేదు. తను ఏమయినా తన కోసం చింతించేవాళ్ళు లేనప్పుడు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా ఒకటే!
కాని అది సన్మార్గమే అయినప్పుడు ఇంకా ఆలోచించడం ఎందుకు?
అందుకే వడివడిగా నడుచుకుంటూ ఫకీర్ బాబాను అనుసరించి అయన గుహలోకి అడుగుపెట్టాడు విష్ణు.
"విష్ణూ.......నువ్వొస్తావని నాకు ముందే తెలుసు. ఆ దేవదేవుని ఆదేశం పొల్లు పోదని నా నమ్మకం. అందుకే నా అవశానదశలో నీ రాక కోసం రోజూ ఎదురు చూస్తూనే వున్నాను...."
ఫకీర్ బాబా మాటలు అర్ధమై విష్ణు ఆశ్చర్యపోయాడు.
అంటే.....తను ఆత్మహత్య చేసుకోవడానికి ఈ కొండ పైకి వస్తానని ఈయనకు యెప్పుడో తెలుసన్నమాట. అసలు ఎలా సాధ్యం అది!
'అది వేలుసుకోబోయే ముందు నీకు నువ్వు ఆత్మ ప్రక్షాళనం చేసుకోవాలి. నేను, నాది, నా వాళ్ళు అనే దుఃఖ సాగరం నుంచి బయటపడు. అప్పుడు ఈ విశ్వమంతా నీకు ఆనందమయంగా కనిపిస్తుంది. నీలానే సిద్దార్ధుడు కూడా భవ బంధాల మీద రోత పుట్టి గమ్యం తెలియకుండా తిరిగాడు. అతనిలోని ఆత్మజ్యోతి ప్రభోదించడంతో తనేమిటో తెలుసుకుని .......తన వాళ్ళ ఈ లోకానికి జరగవలసిన మేలు ఏమిటో తెలియ జెప్పడానికి గౌతమ బుద్దుడైనాడు.......ఒక్కసారి ఆ బుద్ధ భగవానుని మాటలు గుర్తు తెచ్చుకో.'
ఫకీర్ బాబా మాటలు పవిత్రమైన మంత్రోచ్చాటనలా విష్ణుకు హోతబోధ చేస్తున్నాయి.
తనకు తెలియకుండానే పంచేంద్రియాలను కేంద్రీకరించి శ్రద్దగా వింటుండిపోయాడు.
ఈ ప్రపంచంలో మనిషి దుఖానికి అంతం లేదు. మనిషి కన్నీటిని అంచనా వేయగలిగితే అవి సప్త సముద్రాలను మించి ఉండొచ్చు!
"స్వామీ......నా కళ్ళు తెరిపించారు. నా శేషజీవితం మీ పాదాల చెంతనే గడపాలని నిశ్చయించుకున్నాను...."
