Previous Page Next Page 
ఎలమావి తోట! పేజి 52

 

    ఆగి ఆగి నిదానంగా ఆచితూచి చెప్పేడతను.
    స్వప్న తన చెవుల్ని తను నమ్మలేకపోయింది.
    "స్వప్న గారూ! వింటున్నారా! ఇక మిగిలింది మీరూ. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని చంపెయ్యకున్నా హక్కుగా ఆస్తీ వస్తుందనుకొండి. అయినా అడ్డంకి కదా! తను ప్రేమించిన అమ్మాయి ఎక్కడో ఏడుస్తోవుంది కదా? ఆ కాస్త మీరూ అడ్డు తొలగిపొతే ఆస్తికి - అందానికి అందం వున్న మనిషి తన దౌతుంది. ఆఫ్ కోర్స్ - మీరెంత అందంగా వున్నా మనస్సు అక్కడ కదా వుండేది--"
    నరనరానికి కాల్షియం ఇంజక్టు చేసినట్టుగా వెచ్చటి ఆఫర్లు ఒళ్ళంతా కమ్ముకున్నట్టుగా అయింది.
    "రవికి --------" ఆ తర్వాత పూర్తీ చేయలేక పోయింది.
    "ఆఫ్ కోర్స్ రావిగారిని భూతంలా చూపుతున్నాననుకోకండి. జరిగిన సంఘటనలన్నీ అతని చుట్టూ కేంద్రం చేయండి మీకే తెలుస్తుంది" చప్పున ఫోన్ పెట్టేశాడు.
    "హలో! హలో" ఆదుర్దాగా పిలిచింది స్వప్న. అప్పటికే ఆవ్యక్తి ఫోన్ క్రెడిల్ చేసింది విన్నా వ్యర్ధ ప్రయత్నం చేసి హతాశురాలై ఫోన్ పెట్టేసింది.
    ఆమెకి ఏమి పాలుపోలేదు. ఇందాకా ఆ వ్యక్తీ చెప్పిన మాటలే చెవుల్లో గింగురు మంటున్నాయి. భయంతో ఏకాకితనంతో అలాగే కూర్చుండి పోయింది. మనస్సు నిండా ఆలోచనలు.
    "స్వప్నా!"
    ఉలికి పడిందా పిలుపుకి.
    హటాత్తుగా రవిని చూసేసరికి ఒక్కసారిగా ఆమటలన్నీ గుర్తుకి వచ్చి వెన్నుముక గుండా భయం జరజరా పాకింది -- ముఖం పాలిపోయింది.
    దగ్గరగా వచ్చి సోఫాలో కూర్చుంటూ "అలా వున్నావేం? ఇక్కడున్నావేం? ఎవరు ఫోన్ చేశారు?" అని అడిగాడు నవ్వుతూ.
    కానీ ఆ నవ్వు తెరలు తెరలుగా మేఘాలుగా మారి కమ్ముకుంటున్నట్టుగా అనిపించిందామెకి. అ ఆదుర్దాలో భయంలో తనకి ఫోన్ లో అతను చెప్పినదంతా గబగబా చెప్పేసింది.అంతా వినగానే రవి ముఖం గంభీరంగా మారిపోయింది. అతనేం సమాధానం యివ్వలేదు.
    వెంటనే ఎక్స్ చేంజ్ కి ఫోన్ చేసి అంతకు పూర్వం తమకి ఫోన్ ఎక్కడినుంచి వచ్చిందో కనుక్కున్నాడు. పబ్లిక్ కాల్ ఆఫీసు నుంచి అని తెలుసుకోగానే హతాశుడయ్యాడు. తిరిగి ఫోన్ పెట్టేశాడు.
    అదంతా ఊరకే గమనిస్తోంది స్వప్న.
    ఏం మాట్టాడటానికీ తోచలేదు ఇద్దరికీ.
    అంతలో ఆయా భోజనం సిద్దం చేశానని వచ్చింది. స్వప్న కేసి చూశాడతను. రవి చూపుల వెంటే లేచిందామె.
    డైనింగ్ హల్లో ఇద్దరూ తప్ప ఎవరూ లేరు. టేబుల్ పై అన్నీ సిద్దం చేసి అలవాటు ప్రకారం వంటింట్లోకి వెళ్ళింది ఆయా.
    స్వప్న కి భోజనం రుచించటం లేదు. రవికీ అలాగే వుంది.
    "స్వాతితో సినిమాకి వెళదామన్నవట కదా!"
    ఎందుకో అతని గొంతు అతనికే పొడిగా అనిపించింది. ఆ ప్రశ్న కృతకంగా తోచింది. లేని ఆప్యాయత నటించి నట్టయింది.
    స్వప్న సమాధానం యివ్వలేదు.
    "రేపు ఈవినింగ్ షోకి మనకి టికెట్స్ రిజర్వ్ చేయించాను -- చాలా కష్టం మీద దొరికాయి. రెండే టికెట్లు స్వాతి మళ్ళీ వెళుతుందిలే! రేపు మనం వెళదాం!"
    "ఊహూ! నేను రాను" చప్పున అనేసింది.
    తెల్లబోయాడు రవి. "అదేం!"
    తల అడ్డంగా ఆడించింది స్వప్న.
    "ఏమైంది?"
    "రేపు మీరు వెళ్ళిరండి. నేనే మరోసారి నా ఫ్రెండ్స్ తో వెళతాను."
    తుపాకీ దెబ్బతిన్న లేడి పిల్లలా బెదురూ చూపులతో చూస్తూ జవాబు చెపుతోన్న స్వప్నని చూడగానే రవికి విపరీతమైన జాలి వేసింది. ఆ ఫోన్ విషయాలు ఆమె నంతగా బాధ పెడుతున్నాయో అర్ధమయింది. ఇప్పుడిక రెట్టిస్తే అదింకా అపార్ధాలకే దారి తీస్తుందని "అల్ రైట్! స్వాతిని పంపుదాం అయాని తోడిచ్చి, మనం మళ్ళీ వెళదాం" అన్నాడు చెయ్యి కడిగేసుకుంటూ.
    స్వప్న యింకేం అన్లేదు. తనూ లేచింది.
    "టేక్ రెస్ట్! రేపు నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి."
    "ఏమిటి?"
    "అదే ఎలమావి తోటలో మనకోసం గది కట్టించమన్నావుగా ఇంజనీరుతో డిజైన్ చేయించాను, బ్లూ ప్రింట్ యిచ్చాడు. స్వప్నా! ఈరోజు నీతో ఎన్నో విషయాలు చెప్పాలని వచ్చాను. నేను ఓ బిజినెస్ చేశానీ రోజే. అది నా స్వంతానికి . దాన్లో అనికోకుండా విపరీతమైన లాభం వచ్చింది. ఎందుకో ఉదయం ఓ మూడు వందల తులాల బంగారం కొన్నాను. ఈరోజు సాయంకాలానికి దాని రేటు ఒక్కసారిగా వేయి రూపాయలకు పెరిగింది. వెంటనే అమ్మేశాను. లక్షరూపాయలు ఆదాయం వచ్చింది. కేవలం ఫోన్ ద్వారా అంత సంపాదించాను. ఆ డబ్బుతో నీకు ఆ రూం కట్టించాలనుకున్నాను. నువ్వు కోరినట్టుగా నీవు కోరుకున్న ఎలమావి తోటలో కోనేటి బావి గట్టున నా స్వంతం డబ్బుతో కట్టిస్తాను. రేపే కంట్రాక్టర్ ని మాటడాలని అనుకున్నాను. కానీ నా సంతోషం అంతా మాయమయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS