"అయ్యో! మర్చిపోయాను లామేశ్వాలి.....సాలి....సాలి.....సలేనా?" అన్నాడు సత్తిపండు 'ర' బదులు 'ల' పలుకుతూ.
"ఆ.....ఇపుడు సలే....." అంది సంతోషంగా రామేశ్వరి.
"ఏమిటి! నాకోసం ఏదో తెచ్చినట్టున్నావ్?" అన్నాడు కేరేజి వైపు చూస్తూ.
"అవును పండూ! ఈరోజు లవ్వలడ్డూలు చేశాను. నువ్వు తింటావేమోనని తెచ్చాను" అంది మూతతెరుస్తూ.
మొదట అర్ధం కాలేదు. సత్తిపండుకు. కాసేపటికి అర్ధమైంది. రవ్వలడ్డులకి వచ్చిన తిప్పలా ఇవి అనుకుని .....సరో....తర్వాత తింటాలే.....అక్కడ పెట్టు....." అన్నాడు.
"సినిమాకి వెళ్దామా పండూ....."అంది రామేశ్వరి.
"ఏం మీ నాన్న వూళ్ళో లేడా...." అంత ధైర్యంగా అడుగుతొంటే ఆశ్చర్యపోయాడు సత్తిపండు.
"ఉన్నాడ్లే. అయినా ఎన్నాళ్ళని భయపడతాం చెప్పు. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా."
"ఓహొ.....నువ్వు మరో సమీరవైపోయావా" అనుకున్నాడు మనసులో.
"ఇంతకీ ఏం సినిమాకి? నీ దగ్గర డబ్బులున్నాయా మలి?" అడిగాడు ఆమె స్టయిల్లో.
"పాత సినిమాకి వెళ్దాం. హాయిగా ఎవలూ ఉండరు" అంది.
"ఏం సినిమా ఏంటి?" డిసైడయిపోయాక ఇక తనని అడగడం ఎందుకన్నట్టు చూశాడామె వైపు సత్తిపండు.
"లంగేళ లాజా.....నటలాజ్ లో ఆడుతోంది వెళ్దామా! నా దగ్గలున్నాయిలే డబ్బులు...." అంది రామేశ్వరి ఉత్సాహంగా.
ఓ పట్టాన అర్ధం కాలేదు సత్తిపండుకు. ఐదు సెకన్ల తర్వాత ప్లాష్ లా తెలిసింది. ఆ ఒరిజినల్ సినిమా పేరు "రంగేళి రాజా" ......నటరాజ్ లోనా? బాబాయ్ ఒక్క అక్షరం పలకడం రాకపోతేనే అర్దాలిలా మారిపోతున్నాయి. ఇంకా నయం, దీనికి మరో నాలుగక్షరాలు పలకడం రాకుండే ఈ భాష అర్ధం కాక జీవితాంతం తన్నుకు చచ్చేవాడు తను. బతికిపోయాను అనుకున్నాడు.
"ఏంటి పండూ! మాట్లాడవెంటమ్మా? వెళ్దామా?" గోముగా అడిగింది రామేశ్వరి.
"ఆ!....పద....పద.....నువ్వడిగాక కాదంటానా?" అన్నాడు చెప్పులు తొడుక్కుంటూ. ఏమూలో సత్తిపండుకు భయంగా కూడా ఉంది. ఇంటి ఓనర్ కనిపిస్తే మక్కేలిరగదిసి, గది ఖాళి చేయించి జైల్లో పడేసినా పడే ఇస్తాడని.....కానీ చూస్తూ....చూస్తూ రామేశ్వారిని డిసప్పాయింట్ చేయాలని లేదు.
"ఇలా పొట్టి లాగూతోనే వచ్చేస్తావా?" అంది రామేశ్వరి అదోలా ముఖం పెట్టి.
"మరి?" అన్నాడు ఆగిపోయి ఆశ్చర్యంగా ఎక్స్ ప్రేషనిస్తూ. "ఇక నుంచి నువ్వు నా లవ్వల్ వి. చూడ్డానికి అందంగా, హీరోలా ఉండాలి. అందుకే నీకు లొండు ప్లాంట్లు కుట్టిచ్చా. చూడు నీకు నచ్చాయో లేదో?" అంది అంతవరకూ చేతిలో దాచిపెట్టుకున్న కవర్ లో నుంచి బట్టలు తీస్తూ.
అందులో రెండు ప్యాంట్స్ కుట్టించి ఉన్నాయి. మురిపెంగా వాటివంక చూసుకుంటూ చేత్తో రాస్తూ "ఇక నుండి నువ్వు నిక్కర్లు మానెయ్యాలి పండూ, నాకోసం అయినా సలే ఇలా ప్యాంట్లు వేసుకో. అప్పుడెంత అందంగా ఉంటావో తెలుసా?" తన్మయత్వంతో అంది రామేశ్వరి.
సత్తిపండు కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
"నేనంటే నీకెంత ప్రేమ లామేశ్వరి! నీలాంటి అమ్మాయి దొలకడం నిజంగా నా అదృష్టం తెల్సా!" అన్నాడు హీరో లెవల్లో బిల్డప్ యిస్తూ.
సత్తిపండూ, రామేశ్వరి అలా అలా ట్విన్ సిటీస్ మొత్తం తిరిగేస్తున్నారు హాయిగా, జాలిగా.
* * *
త్రిలోకం స్నేహితుడు గోపాలం చూసిపోదామని వచ్చాడు. అతడు డాక్టర్. చిల్డ్రన్ స్పెషలిస్ట్ అతనికి చాలా మంచి పేరుంది ఉళ్ళో. ఓసారి త్రిలోకాన్ని చూసి వెళదామని వచ్చాడు. పిచ్చాపాటి మాట్లాడక వెళ్తానని లేచాడు గోపాలం. గుమ్మం వరకూ సాగనంపి వచ్చాడు కూడా త్రిలోకం.
సోఫాలో గోపాలం మరిచిపోయి వెళ్ళిన మెడికల్ కిట్ కనిపించింది త్రిలోకానికి. దాని వైపే దీక్షగా చూస్తూ కూర్చున్నాడు త్రిలోకం. అంతే. అరగంట తర్వాత జూలూ విదిల్చిన సింహంలా సోఫాలో నుంచి లేచాడు త్రిలోకం.
ఆ మెడికల్ కిట్ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేశాడు. అతనిప్పుడు అతని వుహాల్లోకి వెళ్లిపోయాడు. ఇప్పుడతను పెద్ద డాక్టర్. అంతే. అదే అతనికి గుర్తుంది.
తను డాక్టర్.
అర్జంట్ గా ఆపరేషన్ కేసోకటి అటెండ్ చేయాలి తప్పదు. అనుకుంటూ సోఫాలో నుంచి లేచాడు స్థిరనిశ్చయంతో త్రిలోకం.
* * *
ఫ్రిజ్ తెరిచింది భువన.
ఆరు ధమ్స్ ఆఫ్ బాటిల్స్ తీసి, ఓపెనర్ తో ఓపెన్ చేసింది.
మొత్తం అన్నీ బాటిల్స్ బేసిన్ లోకి ఓంపింది. ధమ్స్ ఆఫ్ షేకయి బుసబుస పొంగింది. పొంగి పొర్లుతున్న ధమ్స్ ప్ వైపు ఆనందంగా చూస్తూ....."ఆహా! ఇన్నాళ్లూ నిన్ను కేవలం గొంతు తడుపుకోవదానికే ఉపయోగించే వారు కదే! ఇప్పుడు చూడు, ఈరోజు నేను పతివ్రతా వ్రతంలో భాగంగా నిన్ను మావారి పాదాలకు అభిషేకంగా అర్పిస్తున్నాను. చూశావా! నా టాలెంట్. నా పతివ్రతా వ్రతం నిర్విఘ్నంగా సాగానియి....." అనుకుంటూ హల్లో ఉన్న భర్త దగ్గరికి బేసిన్ పట్టుకుని రాసాగింది.
ఎదురుగా వస్తున్న భువన త్రిలోకం కళ్ళకి పేషంట్ లాగానే కనిపించింది.
"హమ్మ! దొరికావు కదే నా పేషంట్ మా తల్లి." అంటూ దోరకపుచ్చుకున్నాడు భువనని.
"పద...పద....ఆపరేషన్ టైం అయింది. నికివాళ ఆపరేషన్ చేసేసి నేను ప్లయిట్ లో చెన్నయ్ వెళ్లిపోవాలి. ఆలిండియా డాక్టర్స్ కాన్ఫరెన్స్ ఉందివాళ. నడు...నడు....' టేబుల్ మీద పడుకో. .....నీ వాళ్ళంతా ఏరి? ప్చ్! బతుకుతావో లేదో.....ఆఖరి చూపుగా! నీ వాళ్లతో మాట్లాడితే మాట్లాడిరా....." అన్నాడు కిట్ లో వున్న సిరెంజ్, కత్తి సిజర్స్ కూడా అర్ధం కాలేదు.
భువనకి ఒక్క పిసరు కూడా అర్ధం కాలేదు.
వెర్రి ముఖం వేసుకుని చూస్తోంది.
"పద...పద....అనస్థిషియా ఇవ్వాలి....." అన్నాడు సిరెంజ్ రెడి చేసుకుంటూ.
భువన అతని పాదాల వద్ద కూలబడి, బేసిన్ లో ఉన్న ధమ్స్ ప్ ని మొత్తం అతని పాదాల మీద గుమ్మరించింది.
"చీ..చీ.... నా కాళ్ళు మొక్కడం దేనికి? అయిష్షుంటే మీరే తప్పక బతుకుతారు. లేదా నా చేతిలో చస్తారు. మరేం పర్లేదు....భయపడకండి" అన్నాడు తనని కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడే పేషెంట్ అనుకుని.
"నేను మీ భార్యనండి! ఏమిటా పిచ్చివాగుడు. ఆపరేషనేంటి?" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది ఆమె.
"అరెరే....ఏడవకండి. మిమ్మల్ని నా శాయశక్తుల బ్రతికించడానికి ట్రై చేస్తాను" అతని ధోరణిలో అతను అంటున్నాడు.
ఇంతలో సమీర వచ్చింది.
అభిషేకం పూజలో మునిగిన తల్లిని, ఆపరేషన్ అంటూ మొదలెట్టిన తండ్రిని చూసి నవ్వాలో ఏడవాలో తెలిలేదు ఆమెకు.
